ఇంతలో అతన్ని "బాబూ! బాబూ" అని ఎవరో వెనకనుంచి పిలుస్తున్నట్లు అనిపించింది. ఎవరా అనుకుంటూ ఆగాడు.
ఓ వృద్దుడు - యాభయిఏళ్ళ వయసుంటుంది, మాసిపోయిన బట్టలు కట్టుకుని వున్నాడు. అవి కూడా చిరిగి వున్నాయి. "ఎప్పుడోచ్చావు బాబూ?" అనడిగాడు ఆదరంగా.
"నాలుగైదు రోజులయింది" అన్నాడు సత్యమూర్తి ముక్తసరిగా.
"నాన్నగారికెలా ఉంది?"
"సీరియస్ గానే ఉంది."
ఆ వృద్దుడు ఏదో చెబుదామని ప్రయత్నిస్తున్నాడు. కాని తటపటాయిస్తూ మళ్ళీ ఆగిపోతున్నాడు. మనిషి బాగా అభిమానవంతుడేమో అనిపిస్తుంది. "చూడు బాబూ! ఆ డబ్బు.." అన్నాడు చివరకు ఎలాగో గొణుగుతున్నట్లుగా.
"ఫర్వాలేదు లెండి తొందరేమీలేదు" అన్నాడు సత్యమూర్తి సానునయంగా.
ఆయన పేరు వెంకట్రామయ్యగారు. రామక్రిష్ణయ్యగారికి దూరపు బంధువు. ఒకప్పుడు బాగా బ్రతికినవాడే. ఆనాటికి పరిస్థితిచెడి ఒకరి దయను అర్దించే దశకు వచ్చాడు. ఒక సందర్భంలో విపరీతమైన చిక్కులోపడి, విడదీసుకోలేక సగం ప్రాణం చచ్చి బలరామయ్యగారిని రెండువందలు అప్పు అడిగాడు. ఆయన నిస్సంకోచంగా తిరస్కరించాడు. ఆ సమయానికి సత్య మూర్తి కాకినాడలోనే వుండటం తటస్థించినది. తండ్రికి తెలియకుండా ఎలాగో తిప్పలుపడి రెండువందలూ సర్ధాడు.
వెంకట్రామయ్యగారిది దగ్గర్లోనే ఉన్న ఓ కుగ్రామం. పనిమీద అప్పుడప్పుడూ కాకినాడ వస్తుంటాడు.
"దయవుంచి అన్యధా భావించకు బాబూ! నాకు కొంత పైకం రావలి నుండి ఎదురుచూస్తున్నాను. రాగానే నీ బాకీ తీర్చివేస్తాను" అంటున్నాడాయన దీనంగా.
"ఫర్వాలేదు లెండి...యింటికి వెళ్ళుతున్నారా?"
"అవును. నాన్నగార్ని చూద్దామని వెడుతున్నాను."
"సరే నేనట్లా పోస్టాఫీసుదాకా పోయివస్తాను" అని సత్యమూర్తి అక్కడ్నుండి కదిలాడు.
ఆ వృద్దుడంటే అతనికి అపారమైన సానుభూతి వుంది. అసలు మీరు తిరిగి యివ్వనవసరం లేదనే చెబుదామనుకుంటాడు. కాని ఆయనేమైనా నొచ్చుకుంటాడేమోనని మళ్ళీ సందిగ్ధం.
అతను యింటికి తిరిగి వచ్చేసరికి కంగారుగా వున్నట్లు, కొద్దిగా కలకలం పొడగట్టింది.
గేటు తీసుకుని లోపలకు వెడుతూండగా చంద్రయ్య గాభరాగా ఎదురువచ్చి "అయ్యగారికి చాలా ఎక్కువగా వుంది బాబూ. డాక్టరుగారికి కబురు వెళ్ళింది. త్వరగా రండి బాబూ" అన్నాడు.
సత్యమూర్తి గుండె దడదడలాడింది. ఇంచుమించు పరిగెత్తుతున్నట్లు పైకి ఎక్కివెళ్ళాడు.
6
జీవితమంటే చిత్రమైన సన్నివేశాల నిలయం. అనేక పరిణామాల, పరివర్తనల వలయం. ఒకరకం సున్నిత మనస్కులు వుంటారు. బయటకు ఎంత వ్యక్తిత్వం కలవారుగా కనిపిస్తారో, యితరుల ప్రభావం వారిపై అంతబలంగా ప్రసరిస్తూ ఉంటుంది. జీర్ణించుకున్న ఆప్రభావమే చివరకు తాత్కాలికపు వ్యక్తిత్వంగా రూపొంది, నైజగుణంగా భ్రాంతి కలుగజేస్తుంది.
బలరామయ్యగారికి పరిస్థితి విషమించిన ఆ రోజున - రాత్రివేళ ఆయనకు ఉన్నట్లుండి సులక్షణమైన తెలివివచ్చింది. మనిషి ఎప్పటికంటే శుభ్రంగా మాట్లాడగలిగాడు. ఆయన చూపులు గది నాలుగువైపులా వ్యాపించాయి. భార్య, దత్తపుత్రుడూ, యిరుగుపొరుగు, హితైషులూ అంతా కనబడ్డారు. గదిలో వున్న వస్తువులన్నిటినీ కలయజూస్తున్నాడు. ఆయన చూపులు భావగర్భితంగా వున్నాయి. చివరికాయన దృష్టి యినప్పెట్టేమీద పడి, అక్కడ నిలకడగా నిలిచిపోయింది.
కాసేపటికి ఆయన ఒక్క సత్యమూర్తినితప్ప మిగతా వారినందర్నీ గదినుండి బయటకు వెళ్ళమని కోరాడు.
ఒకరివెంట ఒకరు అవతలకు నిష్క్రమించారు. సత్యమూర్తి తండ్రి ముఖంకేసి చూస్తూ కాళ్ళదగ్గర నిలబడ్డాడు.
"ఇటు...రా" అని ఆయన కొడుకుని దగ్గరకు పిలిచాడు. సత్యమూర్తి ఆయన దగ్గరకుపోయి నిలబడ్డాడు.
"కూ...ర్చో" ఆయన కంఠం బలహీనంతో వొణుకుతున్నది.
అతను ఆ మంచం మీదనే పెంపుడు తండ్రి ముఖానికి దగ్గరగా కూర్చుని ఏమి చెబుతాడోనని ఎదురుచూడసాగాడు.
ఆయన తన చేతిని ప్రేమగా కొడుకుమీద ఉంచాడు. ఒక అనురక్తికి. ఆందోళన, తాపత్రయం గోచరిస్తున్నాయి ఆయన ముఖంలో.
అమితంగా ప్రయత్నించి, అవస్థపడి, ఆశక్తితో పోట్లాడి ఆయన చెప్పిన మాటలు సారాంశం యిది.
"నాయనా! నువ్వు అమాయకుడివి. ఈ ప్రపంచపు కఠినపు పోకడల్ని సరిగ్గా అర్ధం చేసుకోలేనటువంటి వాడివి. జీవితాన్ని నిర్మలంగా, తేలిగ్గా భావిస్తున్నటువంటి వాడివి.