Previous Page Next Page 
విషవలయం పేజి 17

    "నీకు డబ్బు విలువ తెలీదు.

    "ఒకప్పుడు నేను అమిత బీదవాడ్ని. నా దగ్గర చిల్లిగవ్వ వుండేది కాదు. తినటానికి తిండి కూడా లేక బాధపడిన రోజులున్నాయి.

    జీవితంలోకి ఎగబడ్డాను చేయరాని పనులు చేశాను. అనేక యిడుములు అనుభవించాను. దమ్మిడీలు కూడబెట్టాను. రూపాయలు చేశాను. రూపాయలు మూటగట్టాను. అభిమానం పడితే డబ్బు సంపాదించలేనని, దాన్ని పారద్రోలి ఆ రూపాయల్ని అనేక విధాల త్రిప్పుకువచ్చాను. అదృష్టంకూడా కలిసివచ్చింది. వందలు వేలయినాయి. వేలులక్షలయినాయి."

    "ఇళ్ళు కొన్నాను, పొలాలుకొన్నాను, చెప్పుకోదగ్గ ఆస్తిగడించాను."

    "ఆస్తితోపాటే అనేక సమస్యలు తలయెత్తుతాయి. మన బంధు వర్గంలో నేను ఒక్కడ్నే పైకి వచ్చినవాడ్ని. నా ఐస్వర్యం చూసి కళ్ళుకుట్టి ఎంతోమంది నన్ను దోచుకుతిందామని ప్రయత్నించారు. ఎన్నో తిప్పలుపడ్డారు. ఆఖరుకు యాచించారు"

    "నాకు డబ్బు విలువ తెలుసు. ఇందులోని ప్రతి దమ్మిడీ నేను సంపాదించింది. ఇతరుల కెందుకు ధారపొయ్యాలి? ఒకళ్ళకి ఒక్క రవ్వకూడా రాల్చలేదు"

    "నామీద కక్ష గట్టారు. ఎన్నో ఎత్తులు వేశారు. కాని వాటినన్నిటినీ తలదన్నగల సమర్ధత నాకుంది. అన్నిటినీ ఎదుర్కున్నాను. ఒక్కడూ నా ముందు నిలవలేకపోయాడు."

    "డబ్బు పాపిష్టిది. అందులో నువ్వు దత్తపుత్రుడివి. నేనింక ఎలాగు బ్రతకను. నువ్వు ఎలా నెగ్గుకొస్తావో తెలీదు."
    "సగం నీ పేరా, సగం మీ అమ్మపేరా రాసి పోతున్నాను. నువ్వు అమాయకుడివి అయితే, అహం అసూయల సమ్మేళనం మీ అమ్మ. ఒకరకంగా యిద్దరూ ప్రమాదకరమైన వ్యక్తులే. మీకు తెలీదు. మీకేమీ తెలీదు."

    "నా కష్టం, నా శ్రమ మీరు నిర్లక్ష్యంచేత వృధాపరిస్తే నా ఆత్మ అశాంతితో అలమటిస్తుంది. నేను జీవితకాలం యాతనపడి సముపార్జించిందంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

    "నీ మనస్సునితప్ప ఎవర్నీ నమ్మకు."

    "డబ్బు! డబ్బు!! డబ్బు!!! అంతకుమించిన జీవిత పరమావధిలేదు. మనం కూడపెట్టిన నిధి తరగటానికి వీల్లేదు."

    "ఎక్కడి వాడివో-తీసుకొచ్చి యింత ఆస్తికి యజమానిని చేశాను. విద్యనిచ్చాను. పరపతిగల మనిషిని చేశాను."

    "నా ఆత్మకు ద్రోహం చెయ్యకు."

    "ఎవర్నీ దగ్గరకు చేరనివ్వకు."

    ఆయన కంఠం దీనంగా, ఆవేశంగా వొణుకుతోంది. ముఖంమీది రక్తనాళాలు పైకి ఉబుకుతున్నాయి.

    "డబ్బు! డబ్బు!! డబ్బు!!!"

    బాధ, ఆరాటం, పిప్పిపీల్చి చేస్తున్న వేదన ముఖంమీద, ఆకళ్ళలో ఆ చూపులో స్పష్టంగా గోచరిస్తున్నాయి.

    "నాకు న్యాయం చెయ్యి. న్యాయం చెయ్యి" అని ఆక్రోసిస్తోంది పెంచుకున్న ఆ తండ్రి హృదయం.

    కన్నులవెంట నీళ్ళు కారుతున్నాయి. ఈ ప్రపంచాన్ని డబ్బునీ' మనుషుల్నీ, కస్టాన్నీ సుఖాన్నీ విడిచి వెళ్ళలేక ప్రాణం కొట్టుకులాడుతోంది.

    సత్యమూర్తి కూడా ఏడుస్తున్నాడు.

    భయంగా వుంది. ఏదో జరుగుతున్నట్లు...పెద్ద పరిణామం విరుచుకుపడ్తున్నట్లు...గుండెని నలిపివేసే అనుభూతి.
   
                                *    *    *

    తెల్లవారుఝాము అవుతూండగా బలరామయ్యగారి ఆత్మ దేహంనుండి నిష్క్రుతిపొంది గాలిలో కలిసిపోయింది.

    కంటికీ, ముంటికీ ఏకధారగా విలపిస్తోన్న రాధమ్మగార్ని తమ్ముడు వీరభద్రం "ఊరుకోవే అక్కా, బావకు వయస్సు చెల్లిపోయింది. ఏం చేస్తాం చెప్పు" అంటూ ఓదారుస్తూన్నాడు.

    వీరభద్రం, భార్య, అతని యిద్దరి పిల్లలూ కూడా వచ్చారు. ఆమె కూడా వదినగార్ని ఊరడించటానికి శాయశక్తులా ప్రయత్నించసాగింది.

    రామక్రిష్ణయ్యగారు తన యిద్దరు పెద్దకొడుకుల్తోనూ తరలివచ్చాడు.

    సత్యమూర్తి అంతకు మునుపు ఎప్పుడూ చూసియైణా వుండని బంధువర్గమంతా బిలబిల మంటూ ఎక్కడెక్కడినుంచో వూడిపడింది క్రమంగా.

   
                                                                                 7



    కర్మకాండ అంతా యధావిధిగా జరిపించటంలో తలమున్కలౌతున్నాడు సత్యమూర్తి. అతనికెంతో కంగారుగా భయంగా వుంది. "నీ కెందుకునువ్వుండు. పెద్దవాడ్ని నేనున్నాగా" అని రామక్రిష్ణయ్యగారు ఆదుకుని వ్యవహార భారమంతా తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు.
   

 Previous Page Next Page