Previous Page Next Page 
విషవలయం పేజి 15

    పూర్తిచేసి రెండు మూడుసార్లు సత్యమూర్తి మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. తను రాసిన విషయాలు ఏమీతృప్తి కలిగించలేదు. ఉషను సొంత విషయాలు గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతూ ఎన్నో ప్రశ్నలు వేయాలని లోపల ఉత్కంఠ. "కాలం ఎట్లా గడుపుతున్నావు? నేనెప్పుదైనా గుర్తుకు వస్తున్నానా?" ఇలాంటి ప్రశ్నలు. "నువ్వు గుర్తుకువస్తావు. మాట్లాడాలని వుంటుంది. నువ్వు నా సమక్షంలో ఎందుకు లేవు?" ఇలా ఎన్నో, స్వరూపం లేని, తనకే సరిగ్గా తెలియని భావనలు గ్రుమ్మరించాలని ఆవేశం. కాని ఎట్లా? తమ ఇద్దరి మధ్యవున్న సంభాషణ తమ నడుమ ఎప్పుడూ జరగలేదు. ఇవి విపరీతంగా భావించి ఆమె అసహ్యించుకుంటే? ప్రసాదరావు ఈ ఉత్తరం చూసి అపార్ధం చేసుకుని ఆగ్రహపడితే?

    తనలో ఏదో తెలియని లోపంవుంది. రాస్తున్నంతసేపూ చెయ్యి వొణకటం అలావుంచి, ఎన్నో మనోహరభావాలు ఆకృతిని సంతరించుకోలేక హృదయంలోనే నిలిచిపోయినయ్.

    అసలు ఉష ప్రకృతి ఓ అంతస్థు పైగా వున్నట్లు, ఈ లోక స్వభావానికి భిన్నం అన్నట్లూ అనిపిస్తుంది. ఒకసారి తాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చాపమీద కూర్చుని ఏదో పుస్తకం చదువుతోంది. ఆమె సాధారణంగా ఏమాత్రం తీరిక చిక్కినా గ్రంధపటనం చేస్తూవుంటుంది.

    "ఏమిటి చదువుతున్నావు?" అని అడిగాడు తను. తమ మధ్య క్రమంగా ఏర్పడ్డ చనువూ, ఆమెను తను "మీరు" అని పిలిస్తే నొచ్చుకోవటం ఆమెను ఏకవచనంలో పిలవటానికి తనని అలవాటు పడేటట్లు చేశాయి.

    "నవల" అంది సమాధానంగా.

    "బాగుందా?"

    ఆమె జవాబు చెప్పటానికి ఆలోచిస్తోంది.

    "బాగా లేదా?"

    "అదే తెలియటల్లేదు."

    "ఎందుకని?"

    "ఎందుకనంటే మీరు నన్ను దీని కథ చెప్పమని అడగండి."

    "అదేమిటి?"

    "అడగండి ముందు."

    "సరే" అని అతను ఆమె అలా ఎందుకంటూంధో అర్ధం గాక పోయినా "ఇందులో కథ ఏమిటి చెప్పు" అని అడిగాడు.

    "చెప్పలేను" అంటూ ఉష నవ్వింది ముసిముసిగా.

    అతను తెల్లబోయి చూశాడు.

    "ఒక మంచి రచన అంటే ఏమిటంటే దాన్ని గురించి ప్రసక్తివచ్చినప్పుడు ఒక అన్నా చెల్లెలుగానీ, తండ్రి కూతురుగానీ, తల్లి కొడుకుగాని, ఇద్దరు స్నేహితులుగాని ఆ ఇతివృత్తం నిస్సంకోచంగా ముచ్చటించుకోవటానికి అనువుగా వుండాలి. ఇతివృత్తంలో ఏదో లోపం ఉంటేనేగాని సంకోచపడటం జరగదు. అలా నలుగురితో చెప్పటానికి బిడియం కలుగజేసే రచన ఉత్తమ సాహిత్యంలోకి రాదు" అంది ఉష ఆత్మవిశ్వాసంతో.

    సత్యమూర్తి కూడా కాలక్షేపానికి పుస్తకాలు అప్పుడప్పుడూ చదువుతాడుగాని వాటిపట్ల ప్రత్యేకమైన అభిలాష, స్పష్టమైన అభిప్రాయాలూలేవు. అయినా ఆమె చెప్పింది సబబుగా తోచక "ఈ నవలలోని ఇతివృత్తం ఆశ్లీలాలతో కూడివుందా?" అని అడిగాడు.

    ఉష కాదన్నట్లు తల ఆడించింది. ఒక నిముషం మౌనంగా ఊరుకున్నారు.

    "అశ్లీలం కాదు. అశ్లీలంతో నిండివున్న రచనలు సరేసరి. ఇందులో ప్రతి సంఘటనలోనూ, ప్రతి పాత్ర వెనుకా, ప్రధాన యితివృత్తంలోనూ జుగుప్స కలిగించే మనస్తత్వం, మితిమీరిన వర్ణనలూ నిండివున్నాయి. కథని ఉన్నది వున్నట్లు మీకు చెప్పాలంటే ఏదో తప్పుచేస్తున్న అనుభూతి కలుగుతోంది. అలాంటప్పుడు ఇది ఉత్తమ రచన ఎలా అవుతుంది?"

    సత్యమూర్తి ఆలోహ్సిన్చాడు. ఏవిధంగా చూసినా ఇతరులకి నిరభ్యంతరంగా చెప్పగలిగే యితివృత్తం సమస్తసాహిత్యానికీ ప్రాతిపదిక కావటం ఎలాగో అతనికి అర్ధం కాలేదు. అలా చూసుకుంటే ఎక్కడికక్కడ పరిమితులూ, పరిధులూ ఏర్పడిపోతాయి. అతను ఉత్తమమని అనుకున్న అనేక కథలు జ్ఞప్తికి వచ్చాయి. ఆ సమయంలో ఉష చెప్పిన లోపం వాటిలో ప్రతి దాంట్లోనూ కనిపిస్తూనే వుంది. ఆ ఒక్క అంశం ఆధారంగా చేసుకుని ఉత్తమమనీ, ఉత్తమం కాదనీ నిర్ణయించటం పొరపాటన్న అభిప్రాయం అతనికి కలిగింది. అయినా ఇలాంటి విషయాలలో అతను వాదించలేడు. మౌనం ధరించి ఊరుకున్నాడు.

    అదీ...! అలాంటి నిశితమైన, నిశ్చలమైన మనస్తత్వం ఉషది. నమ్మితే త్రికరణ శుద్దిగా నమ్ముతుంది.

    ఇంకా ఏదో రాయాలనీ, వెల్లడించాలనీ అస్పష్టంగానూ, ఆరాటం గానూ ఉంది అతనికి మనస్సేమో సంకుచితమవుతోంది. ఇహ అలాగే పంపించేద్దామనుకుని కవరులోపెట్టి అంటించాడు. తనే వెళ్ళి పోస్టు చేద్దామని పించింది. ఇక్కడికి వచ్చాక ఇంతవరకూ బయటకు కదల్లేదేమో పిచ్చెక్కినట్టుగా వుంది. అందుకని బట్టలేసుకుని బయటకు బయల్దేరాడు.

    తమ ఇంటికి పోస్టాఫీసు మూడు ఫర్లాంగులకి పైగా దూరముంది. అతను ఆలోచిస్తూ పరధ్యానంగా నడవసాగాడు.

 Previous Page Next Page