Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 15

    "మనిషికి పెళ్ళిముఖ్యం అన్నమాటను వదిలేసినా జీవితానికి ఒక సఫలత ఉండాలిగా, పాపా? ఆడది ఆర్ధికంగా తనకాళ్ళమీద నిలబడితే నిలబడవచ్చు! సంపాదించుకోవడం, ఆర్ధిక సంబంధమైన అవసరాలను తీర్చుకొంటూ బ్రతకడం-ఇదే జీవితమా? నిజంగా ఇందులో ఆనందముందా? పరిపూర్ణత ఉందా?"

    "నిజంగా పెళ్ళయిన ఆడవాళ్ళు ఆనందం దోసిళ్ళకొద్దీ జుర్రుకొంటున్నారా, ఆంటీ? అయితే ఈ తిరుగుబాటూ, ఈ గగ్గోలు పడడం ఎందుకు? ఈ విరక్తీ, ఈ నిట్టూర్పులూ ఎందుకు? ఒక కన్నెపిల్లనూ, ఒకగృహిణినీ ప్రక్కప్రక్కనే నిలబెట్టి ఎవరెక్కువ ఆనందంగా ఉన్నారో చెప్పమంటే తేలిగ్గా చెప్పేయవచ్చు! రెక్కలు చాచుకొని స్వేచ్చగా ఎగిరిపోయే పక్షి లాంటిది కన్నెపిల్ల! గృహిణి కాగానే ఆ రెక్కల్ని అదృశ్యహస్తాలేవో కట్టిపడేస్తాయి! ఆ ఉత్సాహం, ఆశలు, ఆశయాలు, వాంఛలు, కాంక్షలు-అన్నీ గృహిణీత్వపు బాధ్యత క్రింద క్రుంగిపోతాయి! అప్పుడు కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూస్తుంది! పెళ్ళంటే ఇదా? భర్త అంటే ఇతడా! జీవితమంటే ఇదా? అన్న అయోమయంలో, దిక్కు తోచని స్థితిలో పడిపోతుంది."

    "పాపా! నీలో ఇంత వికృతమైన ఊహలు ఎలా చోటు చేసుకొన్నాయోగాని ఇప్పటి నీ ఆలోచనా దృక్పదానికి విచారించే రోజు తప్పకుండా వస్తుంది!" విచారంగా అంది సువర్చల.

    "ఒక్కోసారి సత్యం వికృతంగానే కనిపిస్తుంది, ఆంటీ!"

    "సరే! ఇప్పుడు నీతో నేను వాదించకు! ఎవరో, ఎప్పుడో నీ గుండె తలుపుల్ని సున్నితంగా తట్టిన రోజు ఈ ఊహాలన్నీ మంత్రించినట్టుగా మాయమౌతాయి! ఇప్పుడు వికృతంగా కనిపించేవెన్నో అప్పుడు సుందరంగా కనిపిస్తాయి! జీవితమంటే ఇదీ అనిపిస్తుంది! ఆ సంగతి వదిలేసి నీ చదువు సంగతికి వద్దాం! ఈ ప్రపంచమనే బడిలో నువ్వు నేర్చుకొనే చదువుకు సర్టిఫికెట్ ఉండదు! కనీసం నీ పొట్టపోసుకొనేందుకైనా  ఒక ఉద్యోగం ఉండాలి! ఆ ఉద్యోగానికి ఒక సర్టిఫికెట్ కావాలి!"

    "ఆరుకల్లా మీటింగ్ కి అటెండ్ కావద్దూ? ఇక లేవండి! మీరు స్నానంచేసి వచ్చేసరికి నేను చీరా, జాకెట్ తీసి ఉంచుతాను!" ప్రేమీ పైకి వెళ్ళిపోయింది!

    సువర్చల వెంటనే లేవలేదు! ప్రేమీ గురించే ఆలోచిస్తూంది!

    తల్లి మరణం ఆ పిల్ల జీవితంలో ఒక పెద్ద విషాదం! నాలుగు సంవత్సరాలైనా ఆ విషాదం నుండి బయట పడలేదనిపిస్తుంది! రాజ్యం జబ్బుపడ్డప్పుడు ప్రేమీ కాలేజీ మానేసింది.

    సుందరయ్య వచ్చి తన ముందు గోలపెట్టాడు. "నెలరోజుల్లో పరీక్షలు! ఈ ఏటితో బి.ఎ. అయిపోయేది!"
    కాలేజీ మానడం బాగా లేదని తను చెప్పింది.

    "అమ్మ లేవలేని స్థితిలో మంచంమీద పడుకొంటే నేను కాలేజీకి వెళ్ళగలనా? వెళ్ళినా ఏ లెక్చరర్ ఏం చెబుతున్నాడో వినే శక్తి నాకుందా?" గుడ్లనీరు త్రిప్పుకొని డగ్గుత్తికతో అడిగింది ప్రేమీ.

    రాజ్యం ఆ పిల్లను అరచేతిలో పెట్టుకొని పెంచినట్టుగా పెంచింది! ఏ తల్లీ పెంచలేనంత అపురూపంగా పెంచింది. అలాంటి రాజ్యం జబ్బుపడింది. వారం రోజుల నుండి జ్వరం వస్తూంటే ఉట్టి జ్వరమే కదాని అశ్రద్ధ చేసింది. జ్వరం ఎంతకీ తగ్గకపోతే డాక్టరు దగ్గరికి వెళ్ళింది. 'పచ్చకామెర్లు' అని చెప్పింది డాక్టరు. జరగాల్సిన వైద్యం జరుగుతూండగానే కామెర్లు ముదిరిపోయాయి. చివరికోరోజు చనిపోయింది రాజ్యం!

    తల్లి బెంగతో ప్రేమీ చదువు మూలపడింది. సుందరయ్య ఉద్యోగం వదులుకొన్నాడు, ఇక ఏ పనీ చేసే శక్తి తనకి లేదని భార్య మరణం అతడిని పూర్తిగా క్రుంగదీసింది! రాజ్యాన్ని ఎంత త్వరగా చేరుకొంటానా అని ఎదురు చూస్తున్న మనిషిలా అగుపిస్తాడు!

    ఇరవై సంవత్సరాలనాడు ప్రియదర్శిని హాస్టల్ లో జరిగిన సంఘటన పేపరుకిచ్చి ప్రేమీకి కావలసిన వ్యక్తులెవరైనా  వచ్చి ఆమె బాధ్యత స్వీకరించాలని కోరడంలో ఎంత పిచ్చితనం కనిపిస్తూందో, ఆ పిల్ల భవిష్యత్తు గురించి ఆరాటం అంతగా కనిపిస్తూంది!

    చదువుకొని, సంపాదించుకొని తన కాళ్ళమీద తను నిలబడిన ఆడపిల్లకైనా నా అంటూ ఎవరూ లేకపోతే ఆ పిల్ల ఎన్ని సమస్యల్నీ, ఎన్ని చిక్కుల్నీ ఎదుర్కోవాల్సి వస్తుందో అతడు ఊహించి ఉంటాడు కాబట్టే పేపరుకి ఆ ప్రకటన ఇచ్చాడనిపిస్తూంది!

    'ఇంటికి వెళ్ళి మీ నాన్నతో పోట్లాడావా' అని అడగాలని ఉన్నా మళ్ళీ ఆ విషయం గుర్తుచేస్తే ప్రేమీ మనిషి కాకుండా పోతుందేమోనని ప్రొద్దుటి విషయం ప్రస్తావనకి తెలేదు సువర్చల.

    "ఆంటీ! మీరింకా లేవలేదా?" ప్రేమీ వచ్చింది చేతిలో దారపుఉండా, మల్లెలూ, మరువం, కనకాంబరాలూ ఉన్న బుట్టతో. సోఫాలో కూర్చొని చకచకా మాలకట్టేస్తూ, "లేవండి, ఆంటీ! మీటింగ్ కి లేటయిపోదూ? మీరింకా స్నానమే చేయలేదు!" అంది.

    "పదినిమిషాల్లో తయారవనూ?"

    "టైమంతా అయ్యాక అప్పుడు ఆదరాబాదరాగా తయారవుతారు! ఆ తొందరలో చీరకట్టినా, మడి చుట్టినా ఓ పిచ్చిదానిలా ఉంటారు! అదే కాస్త ముందుగా అయితే నిదానంగా తయారవ్వచ్చుకదా?"

    "నువ్వున్నావుగా నన్ను పెళ్ళికూతురులా తయారు చెయ్యడానికి?" సువర్చల నవ్వి స్నానానికి వెళ్ళిపోయింది.

    సువర్చల స్నానం ముగించి వచ్చి ప్రేమీ తీసి ఉంచిన చీర కట్టుకొంటూ హఠాత్తుగా నవ్వింది!
    "ఎందుకు నవ్వుతున్నారు?" ఆమె కట్టుకొన్న చీరకు మ్యాచింగ్ గాజులు, నగలు బీరువా నుండి తీస్తూన్న ప్రేమీ ఆశ్చర్యంగా అడిగింది.

    "తొందర తొందరగా చీరకట్టుకొంటే, ముడిచుట్టుకొంటే పిచ్చిదానిలా ఉంటానన్నావే, జ్ఞాపకం వచ్చింది!"

    సువర్చల నగలు మార్చింది ఆమె ఒంటి నుండి తీసిన నగలు జాగ్రత్తగా బీరువాలో ఉంచి తాళం వేసి, తాళం చెవులు సువర్చల హాండ్ బాగ్ లో వేసింది ప్రేమీ. సువర్చల టాయ్ లెట్ ముగిసేసరికి ఖర్చీఫ్ కి సెంటు వ్రాసి, మరికొంత సెంటు సువర్చల చీరకి పూసింది ప్రేమీ.
 

 Previous Page Next Page