"అది కొందరి విషయంలో నిజమే అనుకో. నా సంగతొచ్చేసరికి అలా కాదు. ప్రక్కన నువ్వు వుంటేనే నిషాగా వుంటుంది."
తేజ ఏమీ మాట్లాడలేదు.
"నీ కభ్యంతరం లేకపోతే..." అంటూ శ్రీకాంత్ లేచి ధర్మారావు గదిలోకి వెళ్ళి విస్కీ సీసా, సోడాలు, గ్లాస్ తెచ్చుకున్నాడు. విస్కీ కలుపుకుని కాస్త సేవిస్తూ మాట్లాడుతున్నాడు.
రెండు పెగ్గులు పూర్తయ్యేసరికి అతని శరీరంలో, మనసులో ప్రేరణ కలగసాగింది.
"తేజా!" అన్నాడు ఆమె భుజం మీద చెయ్యివేసి. అతని చెయ్యి కొద్దిగా వొణుకుతోంది.
ఆమె మెదలకుండా కూర్చుంది.
"ఐ...ఐ..." ముందుకు వంగి పెదాలను ఆమె చెంప మీద ఆనించబోయాడు.
అతన్ని మృదువుగా విడిపించుకుని తేజ లేచి నిలబడింది.
"బావా! తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో" అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
6
డాక్టర్ దయాకర్ తన హాస్పిటల్లో రోగుల్ని చూసుకుంటూ చాలా బిజీగా వున్నాడు. అతనిది ఊళ్ళోని పెద్ద నర్శింగ్ హోంలలో ఒకటి. జనరల్ సర్జరీలో ఎమ్.ఎస్ పాసవగానే కొద్దిపాటి పెట్టుబడితో ప్రాక్టీస్ ప్రారంభించాడు. మొదట్లో చిన్న బిల్డింగ్ అద్దెకు తీసుకుని అందులో ప్రాక్టీస్ చేసేవాడు. తొందర్లోనే అతని మంచితనంవల్లా, ప్రావీణ్యతవల్లా, మంచి పేరొచ్చి ప్రాక్టీస్ విపరీతంగా పెరిగింది. రెండు మూడేళ్ళలోనే స్వంత బిల్డింగ్ కొనుక్కొని, దాదాపు ముప్పై బెడ్స్ దాకా వేశాడు. అతని హాస్పిటల్, రూమ్స్, ఆపరేషన్ థియేటర్, నిర్వహించే పద్ధతి చాలా నీట్ గా, క్రమశిక్షణతో వుండేవి. బెడ్స్ అన్నీ నిండిపోయి, చూడడానికి వచ్చేవాళ్ళతో, ఔట్ పేషెంట్స్ తో కిటకిటలాడుతుండేది. అతను కేవలం సర్జికల్ కేసులే కాక మెడికల్ కేసులూ, గైనిక్ కేసులూ కూడా చూస్తూ వుండేవాడు. ఎంత బిజీగా వున్నా, సీరియస్ కేసుల వల్ల టెన్షన్ వున్నా ఎప్పుడూ నవ్వుతూ, పేషెంట్స్ ఎంత విసిగిస్తున్నా ప్రశాంతంగా జవాబులు చెబుతూ కనబడేవాడు.
ఓ.పి. టైమ్ కావడం వల్ల ఒక్కొక్కర్ని లోపలికి పిలిచి ఎగ్జామ్ చేసి, అవసరమైన మందుల్ని రాసి పంపించడమో, ఎడ్మిట్ చేయడమో చేస్తున్నాడు.
ఓ గంట తర్వాత పీలగా, బలహీనంగా, వున్న ఓ నడివయసు మనిషిని తీసుకుని పదహారు, పదిహేడేళ్ళున్న అమ్మాయి లోపలికొచ్చింది.
ఆ మనిషి కడుపు నొప్పితో బాధపడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు.
ఒక్కక్షణం ఆమెవంక ప్రశ్నార్ధకంగా చూసి, తర్వాత ఇంకేమీ ప్రశ్నలు వేయకుండానే, ఆయన్ని టేబుల్ మీద కెక్కించి పరీక్ష చేశాడు.
"ఎపెండిసైటిస్" అన్నాడు తర్వాత ఆమెవంక చూస్తూ.
ఆమె కళ్ళలో బెదురు కనిపించింది. ఏమీ జవాబివ్వకుండా అతని మొఖంలోకి చూసి తల దించుకుంది.
"ఈయనకి సాధ్యమైనంత తొందర్లో _ అంటే ఈవేళ సాయంత్రము లోగా ఆపరేషన్ చెయ్యాలి. మెడిసిన్స్ వల్ల తగ్గే లక్షణాలేమీ కనిపించడం లేదు. బహుశా ఇదివరకు ఒకటి రెండు సార్లు ఈ నొప్పి వచ్చి వుంటుంది _ అవునా?"
ఆమె అవునన్నట్టు తలూపింది.
"వెంటనే ఎడ్మిట్ చెయ్యాలి. మిగతా వివరాలన్నీ సిస్టర్ చెబుతుంది" అని సిస్టర్ని కేకేసి, ఆ కేసుని ఎడ్మిట్ చెయ్యమని చెప్పి, వెంటనే వాడవలసిన మందుల్ని గురించి కొన్ని వివరాలు చెప్పాడు.
ఆ అమ్మాయి తండ్రితో పాటు సిస్టర్ వెంట కదలబోయింది.
"మీ పేరు..." అనడిగాడు దయాకర్ అప్రయత్నంగా.
"ప్రజ్ఞ."
* * *
ప్రజ్ఞ తండ్రి పనిచేస్తున్న ఆఫీసు కెళ్ళి ప్రొప్రయిటర్ని కలుసుకుని, తండ్రి పరిస్థితి చెప్పి డబ్బేమయినా సహాయం చెయ్యమని కోరింది. ఆయన తన నిస్సహాయత వ్యక్తం చేయడమే కాకుండా _ గట్టిగా కేకలు కూడా వేశాడు. ఆయనతో పాటు పనిచేసే ఇద్దరి ముగ్గుర్ని కలిసి వాళ్ళ సాయం కోరింది. వాళ్ళ దగ్గర తండ్రి ఇదివరకు డబ్బు అప్పు తీసుకుంటూ వుండేవాడని ఆమెకు తెలుసు. ఇప్పటికే మాకు చాలా ఇవ్వాలి. కుదరదు అని చెప్పేశారు వాళ్ళు.
అలసటతో, ముఖాన స్వేద బిందువులతో నీరసంగా ఇంటికి వచ్చింది పన్నెండు గంటల వేళ.
"ఏం జరిగింది ? డబ్బు లెవరూ ఇవ్వలేదుకదూ?" అనడిగింది రాఘవమ్మ.