Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 15

    "ప్రపంచం మారిపోయిందని నాకు తెలుసు. ఎంత వేగంగా పరుగులు తీస్తోందో నాకు తెలుసు. కాని మనుషులందరూ మారిపోలేదని కూడా నాకు తెలుసు"

    "మీ నమ్మకం చాలా గొప్పదే. కాని అనుభవం వేరు, నమ్మకం వేరన్న సత్యాన్ని మీరు కొన్నాళ్ళకైనా ఒప్పుకుంటారు" అంది తేజ.

    "భార్యాభర్తల మధ్య బంధాన్ని మీరంగీకరించరా ?" అనడిగింది ప్రజ్ఞ.

    "నా ఉద్దేశంలో సంసార జీవితమంటే ఏమిటో చెప్పమంటారా ?"

    "చెప్పండి."

    "ఒకర్నొకరు ప్రేమించుకుందామనుకుంటూ కొన్నాళ్ళు మోసం చేసుకోవడం, ఆ ప్రేమ చచ్చిపోయిందని తెలుసుకున్నాక కూడా ఆత్మ వంచనని ఎక్కువ చేసుకుంటూ మోసాన్ని కొనసాగించడం...మీకు ఇంకో రహస్యం చెప్పనా? ఈ భూమ్మీద భార్యాభర్తలు చెప్పుకునేటంతటి అబద్దాలు ఇంక ఏ యితరు వ్యక్తులూ చెప్పుకోరు."

    "మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు."

    "కొన్ని నిజాలు కల్పనల  కన్నా దారుణంగా వుంటాయి. మీకు ఇంకో సత్యం కూడా చెబుతాను. ప్రపంచంలో ఒకర్నొకరు ఎక్కువగా ఏవగించుకునేది భార్యాభర్తలే. అయినా నటనతో సంవత్సరాల తరబడి జీవితాలు వెళ్ళదియ్యగల సామర్ధ్యం వాళ్ళకుంటుంది."

    "భార్యా భర్తల మధ్య వుండేది నటనే నంటారా?"

    "నటన అని తెలీని నటన. వాళ్ళిద్దరి మధ్యా నటన కానిదేమన్నా వుంటే అది సెక్స్ మాత్రమే. ఇంకో భయంకరమైన రహస్యం చెప్పనా? ఇక పురుషుడికి తన భార్య మొదటిదీ కాదు, చివరిదీ కాదు. అలాగే స్త్రీ..."

    "అబ్బ ! ఆపండి. మీరు మరీ పెర్ వెర్టేడ్ గా మాట్లాడుతున్నారు."

    తేజ నవ్వింది. ఒకరి ఘోష ఇంకొకరికి పెర్ వెర్టేడ్ గా కనబడుతూ వుంటుంది. ఈ సమాజంలో అత్యంత బలమైనదీ, అతి బలహీనమైందీ ఈ వివాహవ్యవస్థే. చూడండి, సమాజం ఇన్ని మానసిక రుగ్మతలతో కృంగిపోతూ వుండటానికి కారణం ఈ బలహీనతలే. తప్పుల్ని, వ్యామోహాలనూ దాచిపెట్టుకుని లేనిపోని నీతి ప్రదర్శించడానికి ప్రయత్నించటంకన్నా ఈ తప్పులనీ, పొరపాట్లనీ సహజమైన అలవాటుగా స్వీకరించినప్పుడు సమాజం ఇంతకన్నా ఆరోగ్యంగా వుంటుంది."

    "మీరు దేవుడ్ని నమ్మరు _ మనుషుల్లోని మంచితనాన్ని నమ్మరు. అయినా మీరంటే నాకు కోపం రావడం లేదు" అంది ప్రజ్ఞ.

    "...కారణం మీలోని సంస్కారమై వుండవచ్చు. చూడండి ఈ లోకంలో కేవలం భార్యాభర్తలే కాదు, తల్లీ కూతురూ, తండ్రీ కొడుకూ, ఆప్తమిత్రులుగా పేర్కొన్నబడే ఇద్దరూ మిత్రులూ _ అంతా అసహజమైన ప్రవర్తనతోనే తమని తాము భ్రమింప చేసుకుంటూ వుంటారు. ఈ లోకంలో అత్యంత సహజమైన దేమంటే అసహజత్వమే."

    ప్రజ్ఞ లేచి నిల్చుంది. "మీ మాటలు ఎప్పటికైనా అబద్దమని ఋజువు చేస్తాను. ఈ లోకంలో కరుణ వున్నదనీ, ప్రేమ వున్నదనీ, పవిత్రత వున్నదనీ నిరూపించి తీర్తాను."

    "ఇది ప్రజ్ఞ ప్రతిజ్ఞ ?" అంది, తేజ నవ్వుతూ.

    "కాదు, ప్రజ్ఞలో ప్రజ్వరిల్లుతున్న ఆవేదన."


                                    *                     *                    *


    ప్రజ్ఞ వెళ్ళిపోయాక తేజ చాలాసేపు కారిడార్ లో అలా నిలబడే వుంది.

    గేటు దగ్గర చప్పుడయేసరికి తల ఎత్తి చూసింది. గేటు తీసుకుని ఒక ఇరవైఏడు _ ఇరవై ఎనిమిదేళ్ళ మధ్య వయసున్న యువకుడు లోపలకు వస్తున్నాడు. చేతిలో చిన్న బ్రీఫ్ కేసు వుంది.

    "హాయ్! బావా! ఎప్పుడొచ్చావు?" అడిగింది తేజ.   

    ఆ  యువకుడు పేరు శ్రీకాంత్. తేజకు వరుసకు బావ అవుతాడు. మద్రాస్ లో వుండి ఫలానా అని చెప్పడానికి వీల్లేని రకరకాల వ్యాపారాలు చేస్తూ వుంటాడు. ఈ మధ్యనే సింగపూర్, బ్యాంకాక్ మొదలయిన ప్రదేశాలన్నీ చూసి వచ్చాడు.

    "మొన్న మద్రాసులో దిగాను. నిన్న పనులుంటే చక్క బెట్టుకుని నిన్ను చూడాలని పరిగెత్తుకు వచ్చాను" అన్నాడు, 'నిన్ను' అనే పదాన్ని వత్తి పలుకుతూ.

    ఇద్దరూ లోపలికెళ్ళారు.

    "ఇంట్లో ఎవరూ లేరా ఏమిటి?" అనడిగాడు శ్రీకాంత్.

    "లేరు. డాడీ ఆఫీసుకెళ్ళారు. అమ్మ తన యాక్టివిటీస్ గురించి వెళ్ళింది."

    "ఆంటీ చాలా ఫార్వర్డ్ గా వుంటుంది."

    తేజ జావాబివ్వలేదు.

    శ్రీకాంత్ తన విదేశ పర్యటనానుభవాలు కర్ణపేయంగా చెబుతున్నాడు. అందులో ఇంట్లో ఆమె వంటరిగా వుందని తెలిసేసరికి అతని మాటల్లో వీరవిహారం ఎక్కువయింది. అక్కడ తాను ఏమేమి చూశాడో, ఏమేమి చేశాడో... ఆడవాళ్ళు ఎలా మాసాబ్ చేస్తారో, నైట్ క్లబ్స్ లో ప్రదర్శనలు ఇచ్చే విలాసినులు నగ్నంగా వచ్చి వివిధానయవాలతో ఎలాంటి పన్లు చేస్తారో, ఎలాంటి విసుర్లు విసురుతారో అద్భుతంగా వర్ణిస్తున్నాడు.
\
    "అయితే బాగా ఎంజాయ్ చేసి వచ్చావన్నమాట."

    "కాని నువ్వు ప్రక్కన వుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడ్ని."

    "అలాంటి చోట్లకు ఆడవాళ్ళతో వెళ్ళకూడదు బావా! మొగవాళ్ళే కలసి వెళ్ళాలి. అప్పుడే ఎంజాయ్ మెంట్ లో మజా వుంటుంది."  
 

 Previous Page Next Page