Previous Page Next Page 
రెండోమనసు పేజి 16

 

    ఆరోజు ఉదయం నిద్ర లేవడంతో చలపతికి విపరీతమయిన తలనొప్పి పట్టుకుంది. ఆ తలనొప్పి తో ఆఫీస్ పని చేయలేననిపించిందతనికి. కుర్రాడిని పిలిచి అరడజను తలనొప్పి మాత్రలు తెప్పించాడు శ్రీకాంత్. మధ్యాహ్ననికి తలనొప్పి తగ్గినా సాయంత్రం మళ్ళీ మొదలయింది. ఒక కన్ను కూడా ఎర్రబడటం గమనించింది. సావిత్రీ . సాయంత్రం శ్రీకాంత్ వస్తూనే చలపతి దగ్గరకొచ్చాడు.
    "ఎలా వుందోయ్! అరె! ఆ కన్ను బాగా ఎర్రబడిందే!" అన్నాడు ఆదుర్దాగా.
    "బాగా వేడి చేసి వుంటుంది?" అన్నాడు చలపతి నవ్వుతూ.
    "ఇలాంటివి అశ్రద్ధ చేయకూడదు నాయనా! అందులోనూ 'కన్ను' మరింత ముఖ్యం! పద! మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వద్దాం" అన్నాడతను.
    "ఇవాల్టీకి పోనీరా! రేపటికి తగ్గకపోతే రేపు వెళ్దాంలే!" వారిస్తూ అన్నాడు చలపతి.
    "అదేం కుదరదు! ఇవాళే వెళ్ళి తీరాలి!" పట్టుదలతో అన్నాడు శ్రీకాంత్.
    కార్లో ముగ్గురూ డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. డాక్టర్ పరీక్షించి "మామూలు తలనొప్పే ఇది. కంటికి ఈ మందు వాడండి!" అంటూ చీటీ రాసిచ్చాడు. మెడికల్ షాపులో ఆ మందులు తీసుకొని ఇల్లు చేరుకొన్నారు. కంట్లో మందు వేసుకొని పడుకున్నాడు చలపతి.
    తెల్లారేసరికి కంటిలో ఎరుపు దనం పోయింది. తలనొప్పి కూడా తగ్గిపోయింది. మళ్ళీ వారంరోజులు తిరక్కుండానే అలాగే వచ్చింది తలనొప్పి. దాంతో మళ్ళీ అదే కన్ను ఎర్రబడిపోయింది. సావిత్రికి భయం వేసింది.
    "ఎప్పుడూ లేంది ఎందుకిలా వస్తోంది?" అడిగింది.
    "తలనొప్పికి కూడా నీకు కంగారేనా?" నవ్వుతూ అన్నాడు చలపతి.
    "తలనొప్పి ఒకటే అయితే ఫరవాలేదు. కాని మరి ఈ కన్ను కూడా ఎందుకు ఎర్రబడుతోందో అర్ధం కావటం లేదు" అందామె ఆవేదనగా.
    మళ్ళీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు శ్రీకాంత్. మళ్ళీ పరీక్షించి మరోరకం మందులూ రాసిచ్చాడు. డాక్టరు. మర్నాటికి మాములుగానే అయిపొయింది.
    రోజులు గడుస్తున్న కొద్దీ సావిత్రికి భయంగా వుంది చలపతికి మళ్ళీ తలనొప్పి వస్తుందేమోనని . పదిరోజుల్లోనే మళ్ళీ అలాగే తలనొప్పి, కన్ను ఎర్రబడటం జరిగిందతనికి.
    శ్రీకాంత్ కి కూడా భయం వేసింది. ఇలా ఉండుండి ఎందుకొస్తుంది. డాక్టర్ని డబాయించి సరిగ్గా ఎగ్జామిన్ చేయమని చెప్పాలి. దీనికి శాశ్వతమయిన నివారణ కావాలి. ఇలా ఎప్పటికప్పుడు మందులేసి తగ్గిస్తే ఎనాటికయినా ప్రమాదమే అది.
    చలపతిని ఈసారి మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు శ్రీకాంత్. అతను పరీక్షింఛి "ఈసారికి మందులు వాడి చూడండి! అప్పటికీ మళ్ళీ వస్తే అప్పుడు చూద్దాం!" అన్నాడు.
    సావిత్రికి ఆందోళన పెరిగిపోయింది. చలపతికి కూడా ఓ విధమయిన భయం పట్టుకుంది. ఆ మందులు వాడటంతోనే మాములుగానే తగ్గిపోయింది గానీ ఈసారి మరో నాలుగురోజులకే మళ్ళీ ఒచ్చేసింది.
    మళ్ళీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు శ్రీకాంత్. ఈసారి పెద్ద ఎత్తున పరీక్షలు జరిగినాయ్. ఆ డాక్టర్ కాకుండా మరో స్పెషలిస్ట్ కూడా చలపతి కేస్ చూశాడు.
    చివరకు నిర్ధారణ కొచ్చారు. చలపతికి మెదడులో "బ్రెయిన్ ట్యూమర్" ఉందని! మెదడులో ఆపరేషన్ చేసి అది తొలగించాలని!
    "ఆపరేషన్ తెలికేనా డాక్టరుగారూ?" ఖంగారుగా అడిగింది సావిత్రి.
    "అంత తేలికేం కాదమ్మాయ్! ప్రమాదకరమైనదే?"
    ఆ మాటలు వింటున్న చలపతి ముఖం పాలిపోయింది. శ్రీకాంత్ అది గ్రహించి వెంటనే చలపతిని తీసుకుని ఇల్లు చేరుకున్నాడు. సావిత్రిని అతి కష్టం మీద దుఖం దిగమింగుకుని కూర్చుంది ఓ మూల.
    "ఆ వాళ్ళ మొహం! ఆ స్పెషలిస్టు నాకు తెలుసు! ఇలాంటి ఆపరేషన్లు ఎన్నో చేశాడుట అతను! ఒక్క కేస్ కూడా ఫెయిల్ కాలేదుట! మనమేం భయపడాల్సిన పనేమీ లేదు" అన్నాడు ధైర్యం చెప్పటానికి.
    అతని మాటలు వినడానికి బావున్నా ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేకపోయినాయ్ ఆమెకు.
    చలపతి పరిస్థితి మరింత దారుణంగా వుంది. అతనికి తెలిసిపోయింది. డాక్టర్లు "ప్రమాదకరం" అంటే ఏమిటో తనకు బాగా తెలుసు. తన తల్లికి న్యుమోనియా వచ్చినప్పుడు కూడా అలాగే అన్నారు. 'చాలా ప్రమాదంగానే వుంది ' అని చెప్పాడు మర్నాడే చనిపోయింది తల్లి.
    అంటే మరికొద్ది రోజుల్లో - బహుశా ఆపరేషన్ టేబుల్ మీదే తను చనిపోతాడు. సావిత్రి అనే పిల్లను లేవదీసుకుపోయి, ఊళ్ళో ఒక సంచలనం కలిగించిన హీరో చలపతి జీవితం అంతమయిపోతోంది. ఈ విషయం అందరూ చెప్పుకొంటారు. కొన్ని రోజులు పాటు తను చేసిన మంచి చెడు పనులు అందరూ తలచుకుంటారు.
    తన ఆఫీసువాళ్ళు ఓ నిముషం పాటు మౌనం పాటిస్తారు.
    శ్రీరామ్మూర్తి ఓరోజు సినిమాహాల్లో దగ్గర ఈ విషయం ఎవరిద్వారానో , విని సినిమా కెళ్లాకుండా రూమ్ కెళ్ళి దుఃఖం పట్టలేక బాటిల్ కొట్టేస్తాడు. మిగత సన్నాసులు కూడా "పాపం! పూర్ ఫెలో " అని విచారపడతారు.
    శ్రీకాంత్ కది మరింత పెద్ద షాక్ అయిపోతుంది. ఆత్మహత్య చేసుకొన్నా ప్రియురాలినే మరచిపోలేధతను. ఇప్పుడు తన చావు దెబ్బ మీద దెబ్బయిపోతుంది.
    సావిత్రి......
    అవును సావిత్రి!
    తను చచ్చిపోతే సావిత్రి ఏం చేస్తుంది?
    ఏడుస్తుంది! రోజుల తరబడి అన్నం నీళ్ళు లేకుండా కృంగి కృశించిపోతుంది. తనూ ఏదో ఒక రోగం తెచ్చుకుంటుంది. బలవంతంగా ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
    కానీ ఆమెని ఆడుకొనేవారు ఎవరున్నారు? శ్రీకాంత్ ఎన్ని రోజులని కనిపెట్టి ఉండగలడు. పుట్టింటి మీద ఎలాంటి ఆశలూ లేకుండా చేశాడు తను. అత్తిల్లు అసలే లేదు. మరి సావిత్రి సంగతేమిటి? కల్లవేంబడి నీళ్ళు కరిపోతున్నాయ్ చలపతికి!
    శ్రీకాంత్ అతన్ని చూసి కోపగించుకున్నాడు "మరీ అంత పిరికివాడివేరా! నేకేమీ కాదని నేను గ్యారెంటీ ఇస్తున్నాను కదా! అవసరమయితే ఎంత డబ్బయినా ఖర్చు చేస్తాను! సరేనా?"
    చలపతి మాట్లాడలేకపోయాడు. కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
    "నేనేడుస్తోంది నా కోసం బ్రదర్! నన్ను నమ్మి కోరి వచ్చిన సావిత్రి కోసం! సావిత్రి సంగతి నీకు తెలీదు. దానికి విపరీతమైన సెంటిమెంట్లు న్నాయ్! నా చావు వార్త అది తట్టుకోలేదు! అది పడే బాధలు తలుచుకొంటే నాకు దుఖం ఆగటం లేదు........" లోలోపలే అనుకున్నాడతను.
    "ఒరేయ్ చలపతీ! ఏడుపు ఆపుతావా లేదా?" కొంచెం కోపంగా అన్నాడు శ్రీకాంత్.
    "అపెస్తాన్రా! నాకు తెలుసు! నాకోసం ప్రాణం ఇచ్చే స్నేహితుడివి నువ్వున్నావ్! నీ వెనుక బోలెడు డబ్బు వుంది. నీకు మంచి హోదా వుంది! అంచేత శాయశక్తులా నా ప్రాణాన్ని రక్షించడానికి పోరాడతావ్! కానోరేయ్! దురదృష్టవశాత్తూ డబ్బు, స్నేహం, ప్రేమ ఇలాంటివేమీ కూడా ప్రాణాన్ని కొనలేవురా!" చిన్నపిల్లాడిలా విలపిస్తూ అన్నాడు చలపతి.
    "నీకు ఇంకేం చెప్పేది? అంతా అయిపోయినట్లే మాట్లాడేస్తున్నావ్! నీవు వట్టి ఫూల్ విరానువ్వు" కోపం దిగమింగుకుంటూ అన్నాడు శ్రీకాంత్. అలా అంటుంటే అతని గొంతు కూడా బాధతో వణికింది.
    "ఒరే చలపతీ! కనీసం సావిత్రీ ముఖం చూసయినా ఊరుకోరా! ఆ అమ్మాయి బెంబేలు పడిపోతోంది. నిన్ను చూసి! నువ్విలా ఏడుపులు మొదలు పెడితే ఆమె పరిస్థితేమవుతుంది? కనీసం అదయినా ఆలోచించు!"
    చలపతి కన్నీళ్ళు తుడుచుకున్నాడు.

    
                                                               * * *

    కొద్దిసేపటికి గానీ మాములు మనిషి కాలేకపోయాడు.
    "ఏమిటోరా! అన్నీ పిచ్చి ఆలోచనలు! సావిత్రీ ఇలారా! ఈ డాక్టర్ల సంగతి నీకు తెలియందేముంది? గోరంత ఉంటే దాన్ని కొండంత చేస్తారు! దీనికే నువ్వు గాబరా పడిపోతే ఎలా? ఆపరేషన్ అంటే పెద్ద ఇదేముందీ,  ఈ రోజుల్లో? అదంతా మాములే గానీ - నువ్వు పిచ్చిదానిలా దిగులుపడకు! నేను చాలా మొండివాడిని! అందుకే ఎన్ని అవస్థలు మీద పడ్డా బ్రతికాను. అప్ట్రాల్ - ఈ అపరేషనో లెక్కా."
    సావిత్రీ కన్నీళ్ళు తుడుచుకుంది.

 Previous Page Next Page