చలపతి సాయంత్రం ఇల్లు చేరుకునే సరికి తమ పడగ్గదిలో పెద్ద అయిరన్ కాట్ కనిపించింది. దాని మీద పరుపులు, కొత్త దుప్పట్లు, చూసి ఆశ్చర్యపోయాడు చలపతి.
"ఎక్కడివివన్నీ?"
"మీ స్నేహితుడి గదిలో వృధాగా పడి వున్నాయట అతిధుల కోసమని. నేను వద్దంటున్నా వినకుండా వంటవాడు వాటి నిక్కడకు మార్చేశాడు. అలా చేయమని ఆయనే చెప్పారుట."
లోలోపల చలపతికి అనందం కలిగింది. తను కోరుకున్నలాంటి జీవితం కేవలం శ్రీకాంత్ వల్లే దొరుకుతుంది తనకి. సావిత్రి దేవతలాగా గడపాలంటే తనకిలాంటి స్నేహితుడు సహాయం ఉండాల్సిందే!
"నాకిక్కడెం బావుండలేదు బాబూ! ప్రోద్దుట్నుంచి సాయంత్రం వరకు ఊరికే కూర్చోవాల్సి వస్తోంది. ఏ పని చేద్దామన్నా ఆ వంటవాడు "నేను చేస్తానమ్మాగారూ' అంటూ అడ్డం వచ్చేస్తున్నాడు" చిరాగ్గా అంది సావిత్రి.
"పోనీ వాడినే చేయనీ - అయినా నువ్వు వంట పనే చెయ్యాలని ఏముంది? బోలెడు పుస్తకాలు పడి వున్నాయిగా చదువుకుంటూ కూర్చోరాదూ?"
"అది కూడా విసుగ్గలిగిస్తోంది! ఏ పుస్తకాలయినా ఎంతసేపు చదువుతాం?"
"లేకపోతే పడుకొని నిద్రపో! ఈ ఇంటిలోకి మారిందెందుకనుకొంటున్నావు? నీకు ఎలాంటి పనీ వుండకూడదనేగా!"
ఇద్దరూ మాటల్లో ఉండగానే శ్రీకాంత్ కారువచ్చి గేటు ముందాగింది. వంటవాడు పరుగుతో వెళ్ళి గేటు తీశాడు.
"ఎంతసేపయిందిరా వచ్చి?" అడిగాడు శ్రీకాంత్.
"ఇప్పుడే పదినిమిషాలవుతుందేమో!"
ఇద్దరూ బట్టలు మార్చుకుని వచ్చేసరికి సావిత్రీ ఇద్దరికీ రెండు కప్పుల్లో 'టీ' తీసుకొచ్చి ఇచ్చింది.
"మరి .......మీరు తాగారేం?" అడిగాడు శ్రీకాంత్.
"ఇందాకే తాగాను..." నవ్వుతూ అంది సావిత్రి.
"ఫర్వాలేదు మళ్ళీ తాగండి! ఒరేయ్ ఆంజనేయులు ఇంకో కప్పు టీ తేరా ---" అంటూ వంటవాడిని పిలిచాడు. కాదనలేక తనూ అక్కడే కూర్చుని ఆంజనేయులు తెచ్చిన టీ ని అందుకొందామే.
"మీ ఇల్లు తనకి బాగా బోర్ కొట్టేస్తోందటరా!" నవ్వుతూ చెప్పాడు చలపతి.
"ఈజిట్ ! ఎందుకని?"
"పనేమీ వుండటం లేదుట! అన్నీ అంజనేయులే చేసేస్తున్నాడట........."
"పనేమీ లేకుండా వుంటే బావుండునని అందరూ గొడవ చేస్తోంటే , మీరేమిటి పనిలేదని అంటారు? నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. సిగ్గుపడింది సావిత్రి.
* * *
"పోనీ మీకేం చేయాలనుందో చెప్పండి! ఆలోచిద్దాం!"
"వంటపనంతా నేనే చేసుకుంటాను!" అందామె.
"మరి అంజనేయుల్ని ఏం చేద్దాం?"
"అతని బదులు ఎవరినయినా తోటమాలిని పెడితే చక్కని పూలతోట తయారు చేయవచ్చు" నెమ్మదిగా అంది సావిత్రి.
శ్రీకాంత్ ఆలోచనలో పడ్డాడు.
"మీ అయిడియా బాగానే వుంది. అలాగయితే ఇవ్వాళ్ళే వీడికి ఉద్వాసన చెప్పేద్దాం! వీడి కొడుకు ఒకడుండాలి ఉద్యోగం, సద్యోగం లేకుండా! వాడినే తోటమాలిగా పని చేయమంటే సరి ........ఏరా చలపతి!"
"నాకేం తెలీదు! ఇది నీకూ సావిత్రీ కీ సంబందించిన విషయం! మీరే తేల్చుకోండి" నవ్వుతూ అన్నాడు చలపతి.
"సరేనండీ అలాగే చేద్దాం! కానే ఒక విషయం గుర్తుంచుకొండి? నేను మీ ఇద్దరినీ ఇక్కడ కష్ట పెట్టటానికి మిమ్మల్ని బాదించుకొని మమ్మల్ని బాధపెట్టకండి.........."
అతని మాటాడుతుంటే చలపతికి అతని మీద అభిమానం పొంగి పొరలింది.
ఆ రాత్రి భోజనాలయ్యాక నెమ్మదిగా శ్రీకాంత్ ని కదిలించాడతను - "ఏరా నీ పెళ్ళి విషయమేమిటి మరి? ఏమి చెప్పవేం?"
"అదో పెద్ద కధరా బాబూ!" నవ్వేస్తూ అన్నాడతను.
"కధ వరకూ వచ్చిందన్నమాట!"
"వైజాగ్ లో ఎమ్కామ్ చేసేటప్పుడు ఒక అమ్మాయితో స్నేహం కలిసింది. నేనుండే రూమ్ పక్కింట్లో వుండేదిలే! పెళ్ళి చేసుకుందామనే అనుకొన్నాము. ఎగ్జామ్స్ అవగానే ఇంటి కెళ్ళి మా ఫాదర్ కి కూడా బోర్ కొట్టి ఒప్పించాను. ఈ విషయం చెప్పి మిగతా పెళ్ళి వ్యవహారాలూ మాట్లాడదామని మళ్ళీ వైజాగ్ వెళ్ళేసరికి ఘోరం జరిగిపోయింది."
"ఏమయింది?"
"ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది."
"ఎందుకూ?"
"అదే ఇంతవరకూ నాకు అర్ధం కాలేదు."
చలపతి కొద్ది క్షణాలపాటు ఆలోచనలో పడిపోయాడు.
"ఆ సంఘటన నాకు పెద్ద షాక్ కొట్టినట్లయింది. చాలా రోజులు ఆ అమ్మాయే గుర్తుకోస్తూండేది. ఆ అమ్మాయి ఎలా వుండేదో తెలుసా? చాలా అందంగా వుండేదిలే. తెల్లగా, పాలరాతిబొమ్మలా ఉండేది. అంతెందుకూ సావిత్రిగారికీ, ఆ అమ్మాయికీ కొంచెం పోలీకలు కూడా ఉన్నాయి. సావిత్రి గారిని చూడగానే ఒకవేళ ఆ అమ్మాయి కేమయినా దగ్గర బందువేమో అని కూడా అనుకొన్నాను."
"బాడ్ లక్........" బాధగా అన్నాడు చలపతి.
"ఆ రోజునుంచీ పెళ్ళంటే ఎందుకో ఎలర్జీగా ఫీలవుతున్నాను. మా ఫాదరూ, ఒకటే గొడవా పెళ్ళి చేసుకోమని. "ఇప్పుడే కాదు' అని చెప్పి తప్పించుకొంటున్నాను."
"అలా ఎంతకాలం తప్పించుకుంటావురా! ఎప్పటికయినా చేసుకోక తప్పదు కదా! అసలు పెళ్ళి చేసుకుంటేనే అలాంటి విషయాలు త్వరగా మర్చిపోవడానికి అవకాశం వుంటుంది."
"ఊహు ఇప్పట్లో లాభం లేదురా? తరువాత ఆలోచిద్దాం!"
చలపతి తన గదికొచ్చి పడుకున్నాడు. సావిత్రి అప్పటికే నిద్రపోయింది. నైట్ బల్బ్ వెలుగులో ఆమె ముఖం మరింత అందంగా కనబడుతోంది. ఆమె పెదాలను పెదాలతో స్పృశించి వెంటనే దూరంగా జరిగి నిద్రలోకి జారిపోయాడు.
* * *
ఎన్ని రోజులు గడిచినాయో, చలపతికి గుర్తులేదు. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా గడిచిపోతున్నాయ్ . నిన్నకీ, ఇవ్వాల్టీకీ -రేపటికీ ఎలాంటి తేడా తెలీటం లేదు.
రోజు ఉదయం తొమ్మిదన్నకల్లా ముగ్గురూ కలిసి భోజనం చేయడం, శ్రీకాంత్ చలపతిని వాళ్ళాఫీసుదగ్గర కార్లో వదిలి, తనూ ఆఫీసుకెళ్ళిపోవడం, సాయంత్రం ముగ్గురూ మళ్ళీ అందంగా ఎదుగుతోన్న తోటలో కూర్చుని టీ తాగి కబుర్లు చెప్పుకోవడం, ప్రతి శనాదివారాల్లో , సినిమాకో లేక మరేదయినా ప్రోగ్రాం కో వెళ్ళటం - ఇంతే.
సావిత్రికి శ్రీకాంత్ తో కూడా మంచి చనువేర్పడింది. ఏదొక విషయం మీద గంటలతరబడి మాట్లాడటం కూడా జరుగుతూ ఉండేది.
ముఖ్యంగా శ్రీకాంత్ కి నచ్చిన విషయం "వుమన్స్ లిబ్' మూమెంట్. సావిత్రికి, అతనికీ ఆ ఒక్క విషయంలో పూర్తి అభిప్రాయ భేదాలుండేవి. ఎక్కడో తనలాంటి అదృష్టవంతురాళ్ళు తప్పిస్తే ఎక్కువ మంది స్త్రీ ల స్థితిగతులు బావుందలేదని ఆమె నమ్మకం.