"మీ యిద్దర్నీ చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఏమిటో ప్రాణం మీద కొచ్చినట్లే హడలిపోతున్నారు! మిమ్మల్ని బయటకు పంపాక నేను డాక్టర్ తో మాట్లాడాను! పెద్ద అపరేషనే కానీ, ప్రమాదమేమీ కాదన్నాడు. ఇలాంటివి ఎన్నో ఆపరేషన్లు దిగ్విజయంగా చేశారుట. కాకపోతే తరువాత చాలా రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందట! అంతే" మందలింపుగా అన్నాడు శ్రీకాంత్.
ఆ మాటతో సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
* * *
మర్నాడు చలపతిని హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు శ్రీకాంత్. వారం రోజుల తరువాత అడ్మీట్ అవాల్సుంటుందని చెప్పారు డాక్టర్లు. వాళ్ళక్కడుండగానే ఒక శవాన్ని తీసుకుపోతున్నారు బయటకు. వాళ్ళ బంధువులు కాబోలు ఏడుస్తూ వెనుకే వెళుతున్నారు.
ఆ దృశ్యం చూస్తుంటే చలపతికి వళ్ళు జలదరించినట్లయింది. శ్రీకాంత్ అది గమనించి అతన్ని అక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్ళిపోయాడు.
ఆ రాత్రంతా చలపతికి నిద్రపట్టలేదు. కన్నుమూస్తే చాలు ఏవేవో పిచ్చి కలలు!
సావిత్రి ఏడుస్తుంటే ఎవరో ఈడ్చుకుపోతున్నట్లు - ఆమెని హింసిస్తున్నట్లు- అర్ధరాత్రి లేచి కూర్చున్నాడు చలపతి. ప్రక్కనే సావిత్రి నిద్రపోతోంది. నిద్రలో కూడా ఆమె ముఖంలో దిగులు స్పష్టంగా కనబడుతోంది.
సావిత్రి గురించే తనకు దిగులు పట్టుకుంది. తన గురించి ఆలోచించడం మానేశాడు. తన జీవితం ఎలాగూ తన చేతిలో లేదు. డాక్టర్ల చేతిలో కూడా లేదు. అంచేత తన చేతిలో లేనిదాన్ని గురించి ఆలోచనే అవివేకం. జరిగేదేలాగూ జరుగుతుంది.
కానీ సావిత్రి పరిస్థితే దారుణంగా వుంది. తనమాట మీద తననే నమ్ముకొని, కని పెంచిన తండ్రికి కూడా చెప్పకుండా తనతో వచ్చేసింది. తను లేకుండా పొతే ఆమెకి ప్రపంచమే శూన్యమైపోతుంది.
ఈ పరిస్థితుల్లో ఆమె నెవరు ఆదరిస్తారు? పట్టుమని పది రోజులు కూడా సంసార సౌఖ్యాలు అనుభవించకుండానే ఆమెకు వైధవ్యమా? బొట్టు చెరిపేసుకుని , తెల్లచీర కట్టుకొని తిరుగుతుందా?
ఊహో? వీల్లేదు? సావిత్రి అలా అవకూడదు! ఆమెకు మళ్ళీ వివాహం జరగాలి. ఆమె బాధ్యత మరొకరేవరయినా స్వీకరించాలి.
కాని ఎవరు చేసుకొంటారు? ఒకరు తలలో పెట్టుకొన్న పూల దండనీ ఇంకొకరు ఎందుకు కోరుతారు> వాడిపోయిన పూలని ఎవరు ఎన్నుకుంటారు?
సావిత్రి అందమైనదే! సావిత్రి లో ఆకర్షణ ఉంది. అయినా ఆమెను వివాహం చేసుకొనేటంత ఉదారగుణం ఎవరికుంటుంది?
పోనీ సావిత్రీ ఒంటరిగా జీవితం గడుపుతుందనుకొన్నా ఆమె నెవరు పోషిస్తారు. కనీసం తను ఇన్సురెన్స్ అయినా చేయలేదే? సావిత్రి దిక్కులేనిదికాబోతుందని తనకెవరు చెప్పారు? పోనీ సావిత్రీకేమయినా ఆస్తిపాస్తులు మిగిల్చినా ఆమె జీవితానికి రక్షణ ఉండేది.
తెల్లారు జామున సావిత్రికి మెలకువ వచ్చింది. తనవంకే చూస్తూ కూర్చున్న చలపతిని చూసి చటుక్కున లేచి కూర్చుంది.
"ఏమిటి ఎంత సేపట్నుంఛి ఇలా కూర్చున్నారు?" ఆదుర్దాగా అడిగింది.
"ఇప్పుడే మెలకువ వచ్చింది!" అబద్దమాడేశాడు చలపతి.
"ఊరికే ఆలోచించకండి! అంతా సవ్యంగానే జర్రిగిపోతుంది! దేముడు మనకి హాని చెయ్యడు"
"నా గురించి నేను ఆలోచించడం లేదు సావిత్రి! నీ సంగతే నాకు బాధగా వుంది. నువ్వెలా ఉంటావ్?.........." ఆవేదనతో అన్నాడు చలపతి.
"మీకేమీ జరగదు . అంతే ఇంకోసారి అలా మాట్లాడకండి!" బాధ , కోపం మిళీతమయిన గొంతుతో అందామె. చలపతి నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
పొద్దున్న పదింటివరకూ శ్రీకాంత్ అతని దగ్గర కూర్చుని ఏవేవో కబుర్లు చెప్తూ గడిపాడు. అతను చెప్పే కబుర్లన్నీ టికీ ఊ కొడుతున్నా చలపతి మనసు మాత్రం అక్కడ లేదు. అన్నీ సావిత్రి గురించి ఆలోచనలే!
ఏమయినా సరే! సావిత్రి అనాధ అవడానికి వీల్లేదు. తను చనిపోయే లోగా ఆమె రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేయాలి!
కానీ అదెలా సాధ్యమో తెలీటం లేదు. శ్రీకాంత్ ని బ్రతిమాలితే?
అతను వప్పుకోంటాడు ! సావిత్రిని ఇంట్లోనే వుండనిస్తాడు. ఆమెకు ఏ లోటూ రాకుండా చూస్తాడు! తనకా నమ్మకం ఉంది!
కానీ ఎంత కాలం? అతనికీ వివాహం అవుతుంది. అతని భార్య కూడా సావిత్రిని ప్రేమగా చూస్తుందన్న నమ్మకం ఏమిటి? అసలు సావిత్రికి శ్రీకాంత్ కీ గల బందుత్వాన్ని అర్ధం చేసుకొంటుందన్న గారెంటీ ఏముందీ? సావిత్రి బతుకు కాస్తా మళ్ళీ వీధిన పడుతుంది.
ఇంకేమిటీ కర్తవ్యం మరి......?
"నేను ఆఫీసుకెళ్తున్నాను రా!" శ్రీకాంత్ వచ్చి చెప్పాడు.
"సరే!" తలూపాడు చలపతి.
శ్రీకాంత్ వెళ్ళిపోయాడు.
సావిత్రి ఆరోజు పేపరు తీసుకొచ్చి చలపతి కెదురుగా కూర్చుని చదవసాగింది.
"అలా కుర్చోపోతే , అలా తిరిగి వద్దాం రాకూడదు?" అడిగింది సావిత్రి.
"ఎక్కడికెళ్దాం?
"అలా కోఠీ వేపు......"
"సరే......"లేచి బట్టలు మార్చుకున్నాడు చలపతి.
ఇద్దరూ బస్ లో అబిడ్స్ చేరుకున్నారు.
"ఇక్కడ నుంచి నడుద్దాం!" అంది సావిత్రి.
పక్క పక్కనే నడుస్తూ నడవసాగారిద్దరూ.
స్త్రీలూ, పురుషులూ, పిల్లలు హడావుడిగా పోతున్నారు ఎక్కడికో! వాళ్ళందరికీ తనకున్నలాంటి సమస్యల్లేవు. నిశ్చింతగా , త్వరత్వరగా పరిగెడుతున్నారు. వాళ్ళక్కావల్సింది ఒక్కటే.
ప్రస్తుతం ! అంతే! జరుగబోయే దానితో వాళ్ళకు పనిలేదు. జరిగిందాంతోనూ లేదు. వాళ్ళలో ఎవరికీ బ్రెయిన్ ట్యుమర్లూ లేవా? వాళ్ళ కేవ్వరికీ ప్రమాదకరమైన ఆపరేషన్లు జరపాల్సిన అవసరం లేదా? ఇన్ని లక్షల మందిలోనూ దేముడు తననొక్కడినే ఎందుకు సెలెక్టుచేసుకొన్నాడు? తనకే ఆ రోగం ఎందుకు తెచ్చిపెట్టాడు?
స్పష్టంగా తెలుస్తూనే వుంది. తననిక్కడ ఉంచడం దేముడికిష్టం లేదు. అందుకే ఈ గొడవంతా వచ్చింది. "ఏమిటి? మళ్ళీ ఆలోచనా?" నవ్వుతూ అడిగింది సావిత్రి.
చలపతి తేరుకున్నాడు. లేని నవ్వుని బలవంతంగా ముఖం మీదకు తెచ్చుకున్నాడు.
"ఏమి లేదు! చూస్తూ నడుస్తున్నాను........"
"ఏం చూస్తున్నారు?"
"అన్నీ ? షాపులు, బస్సులు, కార్లు, స్కుటర్లూ జనం"
సావిత్రికి నవ్వు వచ్చింది" అబద్దాలు చెపుతున్నాడు కదూ?"
"ఊహు! నీకేపుడయినా అబద్దాలు చెప్పానా?"
"ఇదివరకు చెప్పలేదు మరి.........."
"నేనన్నానా ఏమిటలా అని?"
ఇద్దరకూ నవ్వొచ్చేసింది.