Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 15


    "అవును"
    "నిజంగా నేను కాదుకదా?"
    "కాదు"
    "మరి ఇంకెలా అంటాను?"
    "నీ నోటితో"
    "సరే అంటాననుకో"
    "అంటే ఇంకేముంది? ఆమె నీతో ప్రవాహంలాగా మాట్లాడటం మొదలుపెడుతుంది. ఇద్దరూ బీచికెళ్తారు"
    "బీచ్ కా?"
    "అవును"
    "హైద్రాబాద్ లో బీచ్ లేదుగా?"
    "లేపోయినా సరే- వెళ్తారు. అక్కడ ఆ సముద్రపు కెరటాల వంక చూస్తూ చీకటిపడేవరకూ మాట్లాడుకుంటారు. ఆమెకు నవ్వు కొత్తగా రాయబోతున్న నవల గురించి చెప్తావ్! ఆమె ఉప్పొంగి పోతుంది. ఆ ఆనందంలో ఉండగా డిన్నర్ కెళ్దామని అడుగుతావ్. ఓకే అంటుంది. ఇద్దరూ గ్రీన్ మూన్ లో డిన్నర్ కెళ్తారు"
    "గ్రీన్ మూన్ ఎక్కడుంది?"
    "నాకూ తెలీదులే. మధ్యలో అడ్డురాకు. అక్కడ నువ్వు అయిదు వందలో వెయ్యి రూపాయలో పెట్టి డిన్నర్ ఆర్డర్ చేస్తావ్. ఆ భోజనం చేస్తూండగా ఆ చల్లని వాతావరణంలో, ఆ మసక చీకటిలో నీ గుండె ఆమెకిచ్చేస్తావ్ - అంతే- ఆ తర్వాత డ్రీమ్ సాంగ్-డూయెట్లు"
    సింహాద్రి అనుమానంగా చూశాడు.
    "అయిడియా బాగానే ఉందిరా! కానీ నేను రచయిత ధనుంజయ్ నంటే ఆమె నమ్ముతుందంటావా?"
    "వాళ్ళ గ్రాండ్ మదర్ నమ్ముతుంది"
    "అంతేనంటావ్"
    "ఖచ్చితంగా"
    "కానీ తరువాత ఎప్పటికయినా నిజం తెలుస్తుంది కదా?"
    "అప్పటికే ఆమె నీ సొంతం అయి పోతుంది కదురా?"
    "ప్రస్తుతానికి బాగానే ఉంది మరి"
    "ఎగ్జిక్యూషన్ లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది"
    సింహాద్రి సంతృప్తి పడ్డాడు.
    
                          * * * * *
    
    సాయంత్రం ఏడువుతుండగా గది బయట కారు హారన్ మోగింది. దాని వెనుకే కారు డోర్ గట్టిగా వేసిన చప్పుడు, మళ్ళీ దాని వెనుకే "కుయ్యో" మని ఏడుస్తున్నట్లు శబ్దం చేసుకుంటూ లోపలికోస్తున్న బూట్లు చూసి సింహాద్రి ఉలిక్కిపడ్డాడు.
    "ఇదేనా సింహాద్రి రూమ్?" అంటూ లావుపాటి ఆకారం గడపలో నిలబడి అరచింది- తెలుగుని తమిళంలాగా మాట్లాడుతూ.
    "అవునండీ! ఇదే" అన్నాడు సింహాద్రి.
    ఆ ఆకారం లోపలికొచ్చింది ఫుల్ సూట్ లో!
    "నేనుదా మీ మామయ్య ఫ్రెండ్ భావయ్యను"
    సింహాద్రికి సన్నగా వణుకు ప్రారంభమయింది.
    "రండి సార్! కూర్చోండి" అన్నాడు చిరంజీవి.
    "భావయ్య వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
    "మీ రెండిట్లో సింహాద్రి ఏది?" అడిగాడతను చిరునవ్వుతో.
    "ఇదిగో - ఇదేనండీ సింహాద్రి" సింహాద్రిని చూపుతూ జవాబిచ్చాడు చిరంజీవి.
    "ఓహో - సింహాద్రి ఇదా?"
    "అవునండీ!" అన్నాడు సింహాద్రి.
    "మా అమ్మాయి ఫోటో సూస్తివా?"
    "సూ స్తినండీ"
    "ఎట్లా వుండాది? రొంబ బాగుండాదా?"
    "రొంప బాగుందా అంటారా?" అయోమయంగా అడిగాడు సింహాద్రి.
    "రొంప కాదు. రొంబ- రొంబ అంటే తెలుంగులో ఏమి సెప్తారు! ఆ! బాగా బాగా"
    "ఎక్స్ క్యూజ్ మీ" అన్నాడు చిరంజీవి కల్పించుకుంటూ.
    "యస్" ప్రశ్నార్ధకంగా అతని వంక చూశాడు భావయ్య.
    "మీ అమ్మాయి ఫోటో మీ అమ్మాయిది కాదని- అంటే మీ అమ్మాయిదే కాని అబ్బాయిలా ఉందని- అంటే.. అంటే అని మా సింహాద్రి అభిప్రాయం సార్"
    "వ్వాట్?"
    చిరమ్జెవెఇ మళ్ళీ అంతా రిపీట్ చేశాడు.
    "వ్వాట్?" అన్నాడు మళ్ళీ భావయ్య.
    "మీ అమ్మాయి అబ్బాయి లాగుందని.... సారీ అబ్బాయి లాగున్నాడని... అంటే మగ పోలికలు అంటే అసలు ఒరిజినల్ గా పొరపాటున అబ్బాయి ఫోటో ఇచ్చారేమోనని"
    "ఏమయ్యా నీకేమయినా మెదడు ఉండాదా?" కోపంగా అడిగాడు భావయ్య.
    "ఉండాదండీ"
    "ఉంటే అట్ల మాట్లాడతావేమీ?"
    "అది నా అభిప్రాయం కాదండీ"
    "మరెవరిది?"
    "సింహాద్రిదండీ"
    "ఏవయ్యా సింహాద్రి! గమ్మున ఉంటావేమీ? నీ మనసులో ఏమి ఉండాదో మాట్లాడు"
    సింహాద్రి మాట్లాడేశాడు.
    "సంగతేమిటంటేనండీ! చిరంజీవి చెప్పండి నిజమేనండీ."
    "చిరంజీవా? చిరంజీవి ఎవరు?"
    "నేనేనండీ?" అన్నాడు చిరంజీవి చిరునవ్వుతో..
    "నువ్వు చిరంజీవివా?"
    "అవునండీ"
    "నువ్వు సిమ్మాద్రి వాడికేమి అవుతావు?"
    "ఫ్రెండ్ అవుతానండీ"
    "ఎప్పటినుంచీ అవుతావు?"
    "కాలేజ్ నుంచీ అవుతాను"
    "అదిదా విశేషం"
    "అవున్సార్! ఆదిరా విశేషం"
    "అయితే ఇప్పుడేమి సెప్తావు?"
    "నేనేమీ సెప్పనండీ! సిమ్మాద్రే సెప్తున్నాడు"
    సింహాద్రి చటుక్కున అందుకున్నాడు.
    "అవునండీ! సంగతేమిటంటే నండీ- మీ అమ్మాయి ఫోటోలో ఉన్నది నిజానికి మీ అమ్మాయి కాదేమోనండీ! మగాడిలా అయ్ మీన్ ఫోటోల లేదా సెక్స్ మార్పిడి వగైరాలు..."
    భావయ్యకు కోపం ముంచుకొచ్చింది.
    "ఏమయ్యా! నీకేమయినా బుద్ధి వుండాదా?"
    "ఎందుకండీ?"
    "మా అమ్మాయిని అమ్మాయి కాదని సెప్తావేమి? అదిదా స్పోర్ట్ గాళ్! ఎన్నో స్పోర్ట్స్ సేస్తది. గేమ్స్ సేస్తది. పాంటూ షర్టూ వేస్తంది. జుట్టు కత్తిరిస్తది- ఈ మాత్రానికేమి మగపిల్లాడని సెప్తావు?"

 Previous Page Next Page