Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 15

 

    వందమంది మగవాళ్ళు మధ్య తన సీట్ చూసుకుని , లోలోపల వణికినా పైకి అతి నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఠీవిగా నడిచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది కుసుమ. ఆఫీసులో అందరి కళ్ళూ కుసుమ మీదే వున్నాయి. అది కుసుమకీ తెలుస్తోంది. గుండెలు దడదడలాడాయి క్షణం సేపు. తలవంచుకుని మేకపోతు గంభీర్యంతో తన ఫైల్స్ తను చూసుకోసాగింది. అవసరం లేకపోయినా ,మాములు మాటలే అయినా, ఇంచుమించు అందరూ గొంతులు పెద్దవి చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. మధ్య మధ్య నవ్వుల శృతి కూడా పెరిగింది. బయట మేనేజర్ కారు హారన్ వినిపించడంతో కొంత సద్దుమణిగింది. కుసుమ లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళి జాయినింగ్ రిపోర్టిచ్చి వచ్చి తన సీట్లో కూచుంది. అందరూ తనను గమనిస్తున్నరని అర్ధమవుతున్నా తను మాత్రం ఎవరినీ గమనించకుండా తనపని తాను చేసుకోసాగింది. లంచ్ అవర్ లో అందరూ లేచి ఎక్కడికో బయలుదేరుతున్నారు. క్రొత్తగా ఉద్యోగంలో చేరుతున్న సంభ్రమంలో ఆరోజు ఉదయం కుసుమ సరిగ్గా అన్నం తినలేక పోయింది. తల కూడా భారంగా అనిపించసాగింది. కాస్త కాఫీ అయినా తాగితే బాగుండుననిపించింది. కాని అంతా కొత్త, కాంటిన్ ఎక్కడో తెలీదు. ఎవరినైనా అడగటానికి సంకోచపడి కొంతసేపు అలాగే కూచుంది. తలనొప్పి మరింత ఎక్కువైంది. పదిమంది మధ్య పనిచెయ్యదానికి నిశ్చయించుకున్నాక ఇలాంటి సంకోచాలు పెట్టుకు కూర్చుంటే కాదు. ఒక నిర్ణయానికి వచ్చినదానిలా లేచి నుంచుంది. కుసుమ తన ఎదురుసీట్లో కూర్చున్న యువకుడి నుద్దేశించి "ఎక్స్వ్యుజ్ మీ " అంది.
    అతడి ముఖం వెలిగిపోయింది. ఉత్సాహంగా లేచి, "ఏం కావాలండి ! అన్నాడు. "కాస్త కాఫీ తాగాలి. కాంటీన్ ఎక్కడుందో చూపిస్తారా?"
    "ఓ యస్! రండి. వెడదాం"
    సంతోషంతో ఉప్పొంగిపోతూ దారితీశాడు. కుసుమ అనుసరించింది. ఇద్దరూ కాంటిన్లో కూర్చున్నాక రెండు దోసెలకు అర్దరిచ్చాడతను. కుసుమ తెల్లబోయినా, బాగా ఆకలిగా ఉండటం వలన మాట్లాడకుండా ఊరుకుంది. దోస తిన్నాక కాఫీ కూడా తెప్పించాడు. తనే వెళ్ళి బిల్లు చెల్లించాడు. కుసుమ అభ్యంతర పెట్టింది.
    "పిలిచింది నేను. నేనివ్వాలి బిల్" అంది.
    "మనలో మనం ఎవరిస్తేనేమిటిలెద్దురూ!" ఇకిలించాడు అతడు.
    ఒక్కక్షణం అతని వెకిలి నవ్వు వింతగా చూసింది కుసుమ.
    "థాంక్స్ " చెప్పి తన సీట్లో కొచ్చి కూర్చుంది.
    ఇంక సాయంత్రం వరకూ ఆ యువకుడు అడపాదడపా కుసుమ వంక చూస్తూనే వున్నాడు. కర్మ వశాన కుసుమ చూపులలో చూపులు కలిస్తే ఇకిలిస్తున్నాడు.
    మొదట క్షణ కాలం కుసుమకు ఒళ్ళు మండుకుపోయింది. అంతలో స్థిమితంగా ఆలోచించుకుంది. ప్రకృతి స్త్రీకి కొన్ని వరాలను ప్రసాదించింది. మరికొన్ని శాపాలను విధించింది. ఈ వరాలను చాకచక్యంగా వాడుకుంటూ ఆ శాపాల నుండి విముక్తి పొందాలి. తొందరపడి ప్రయోజనం లేదు.
    ఆ మరునాడు కూడా లంచ్ అవర్ లో ఆ యువకుడు కుసుమ దగ్గరకు వచ్చి "కాఫీ తాగుదామా?" అన్నాడు.
    "తాగుదాం కూచోండి" అంటూ కుసుమ తనతో తెచ్చిన ప్లాస్టిక్ బేగ్ లోంచి ప్లాస్కు బయటకు తీసింది. అతను కొంచెం తెల్లబోయి అంతలో తమాయించుకుని నవ్వుతూ "ఇవాళ మీరు ఇంటి నుంచే తెచ్చారన్నమాట థాంక్స్" అన్నాడు.
    సాయంత్రం పని పూర్తీ చేసుకుని కుసుమ ఇంటికి బయలు దేరబోతుండగా వెనకాలే వచ్చి "చిన్న మనవి" అన్నాడు ఇకిలిస్తూ . కుసుమ ఆగి అతని మొఖంలోకి సూటిగా చూసింది.
    "ఏమిటి?" అంది గంబీరంగా.
    కుసుమ చూపులకు , ఆ గంబీర కంఠస్వరానికి కొద్దిగా జంకినా అంతలో తేలిగ్గా నవ్వేశాడు.
    "ఇవాళ సాయంత్రం మీరు నాతొ "టీ" కి రావా" లన్నాడు స్వతంత్యంగా అజ్ఞాపిస్తున్నట్లు. నిర్ఘాంతపోయింది కుసుమ. అంతలో తేరుకుని క్షణం ఆలోచించుకుని "టీ" కి ఎక్కడికి రమ్మంటారు? మీ ఇంటికా?" అంది.
    "టీ" హోటల్లో తీసుకుందాం. ఆ తరువాత మా యింటికి వెళదాం ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతూ అన్నాడు.
    "సరే! రెపోస్తాను. ఇవాళ కొంచెం పనుంది"
    "అలాగే .....అలాగే.....రేపే వెళదాం " ఇకిలిస్తూ అన్నాడు. కుసుమ నిరసనగా నవ్వి వెళ్ళిపోయింది. మరునాడు కుసుమ ఆఫీసులో అడుగు పెట్టేసరికి అంతవరకు పెద్ద స్వరంతో గడగడ మాట్లాడుతున్న అతని కంఠం టక్కున ఆగిపోయింది.
    "అడగంగానే ఒప్పుకుందిరా , హోటల్ కి రావటానికి ...." అన్న మాటలు కుసుమకి స్పష్టంగా వినిపించాయి. అతను బెంగగా చూశాడు కుసుమ వైపు. కుసుమ మాములుగా నవ్వింది. తన మాటలు వినలేదని నమ్మకం ఏర్పడింది అతనికి. చిలిపిగా నవ్వాననుకుంటూ వెర్రిగా నవ్వాడు. సాయంత్రం కుసుమ ఇంటికి రిక్షా మాట్లాడుకుంటుంటే "నాతో టీ కి వస్తానన్నారు కదూ" అన్నాడు దిగాలుగా. "తప్పకుండా వస్తాను. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని తయారై వస్తాను. మీరు హోటల్ దగ్గరుండండి. అక్కడికే వస్తాను'."
    ఓహో! ఈవిడ సింగారించుకుని వస్తుంది కాబోలు. తనలో తను నవ్వుకున్నాడతను. కుసుమ ఫకాలున నవ్వింది. అంత అకస్మాత్తుగా ఆవిడ ఎందుకంత గట్టిగా నవ్విందో అతనికర్ధం కాకపోయినా అతనూ నవ్వాడూ కుసుమ వెళ్ళిపోయింది రిక్షాలో.
    అతడు ట్రిమ్ గా తయారై హోటల్ గేటు దగ్గర నిల్చున్నాడు.
    "వీళ్ళంతా నేను అద్దె కుంటున్న ఇంటివాళ్ళ పిల్లలు వస్తామని సరదా పడితే తీసుకొచ్చాను. అదేం అలా నిలబడి పోయారు! రండి. లోపలికేడదాం"
    పిల్లలందరితోనూ కలిసి చిరునవ్వుతో లోపలికి నడిచింది కుసుమ. ఊసూరుమంటూ అనుసరించాడు అతడు.
    అతడి మనసు భగ్గుమంది.
    మెదడు వేడెక్కింది. కసితో ఊగిపోయాడు.
    అవమానంతో ఉడికి పోయాడు.
    అయినా చచ్చినట్టు యాంత్రికంగా వెళ్ళి కుర్చీలో కూచున్నాడు.
    పిల్లలంతా రెండేసి సీట్లూ, హాట్లూ అర్దరిచ్చేస్తున్నారు.
    "నాకు టీ చాలండీ, ఏం తినాలని లేదు." అంది మృదువుగా కుసుమ.
    కుసుమను మింగేసేలా చూడడం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు.
    పిల్లలంతా రణగణ ధ్వనిలా మాట్లాడేసుకుంటున్నారు.
    "అబ్బా!" అన్నాడతను విసుగ్గా.
    "ఏమిటీ" ఆశ్చర్యం నటిస్తూ అంది.

 Previous Page Next Page