Previous Page Next Page 
జీవాత్మ పేజి 16


    "మంత్రశక్తులు వున్నాయంటారా?"
    
    "తప్పకుండా"
    
    "మరి చాలామంది వాటిని ఒప్పుకోరు!"
    
    "ఎవరువాళ్ళు? కేవలం గిరి గీసుకున్నట్టు ఒక చట్రంలో బంధింపబడిన వ్యక్తులే అలా అంటారు. నాలా దేశమంతటా తిరిగిన ఏ వ్యక్తినైనా అడగండి, మనదేశంలో లేని విద్య లేదని ఒప్పుకుంటారు" అని అన్నాడు వరప్రసాదం.
    
    "మీరు కలసిన వ్యక్తులూ, ప్రదేశాలూ, మీరు చూపిన అద్భుతాలూ ఏవన్నా వుంటే నాకూ వివరించండి. అటువంటి విషయాలంటే చాల ఇంట్రస్ట్ నాకు" అన్నాడు అభిరాం.    

    "తప్పకుండా" వాళ్ళలా మాట్లాడుకుంటూనే వున్నారు.
    
    ఓ అరగంట తర్వాత "భోజనాలకి రండి" అంది సుమతమ్మ.
    
    అభిరాం, వరప్రసాదం డైనింగ్ టేబుల్ వైపు నడిచారు. అక్కడికి దగ్గరలోనే వున్న వాష్ బేసిన్ లో ముఖం, చేతులూ శుభ్రంగా కడుక్కుని, తుండుతో తుడుచుకున్నాడు వరప్రసాదం.
    
    గుత్తి వంకాయకూర, ఉల్లిపాయలు తరిగి చేసిన పెరుగు చట్నీ, అరటికాయ, శెనగపిండి- బియ్యపుపిండితో కలిపి చేసిన కట్ లెట్స్, పప్పు పులుసు, ఆవకాయలతో డైనింగ్ టేబుల్ మీదున్న వంటకాలు చూస్తేనే నోరూరించేలా వున్నాయి.
    
    "అబ్బా! ఎన్నిరకాలు చేశావక్కా?" కూర్చుంటూ అన్నాడు వర ప్రసాదం.
    
    "ఒక కూరతో తినే అలవాటు లేదు నా మనవడికి. రెండు మూడు రకాలుండాలి" ఇద్దరికీ వడ్డిస్తూ అందామె.
    
    "అబ్బా! గుత్తొంకాయ కూర అద్భుతం" ఓ ముద్దా కలుపుకుని తిని అన్నాడు వరప్రసాదం.
    
    "మా ఇల్లెలా కనిపెట్టావురా?" అడిగిందామె.
    
    "దేశాటనం చేసి ఇంటికెళ్ళగానే అడిగింది ముందు నీ గురించే చిన్నతనంలో నువ్వు నన్నెంత మురిపెంగా చూసుకునేదానివో నాకింకా గుర్తే. అందుకే నిన్ను తప్పకుండా చూడాలనుకున్నాను.
    
    నీకు పెళ్ళయి హైదరాబాద్ వచ్చేశావని తెలిసింది. మీవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారీ అడ్రస్. సరాసరి వచ్చేశాను" అన్నాడతను.
    
    ఇద్దరికీ కొసరి కొసరి వడ్డించిందామె.
    
    "నీ ఆదరణ, ఆప్యాయతల్లో ఏ మార్పు రాలేదక్కా" ఆమెవైపు అభిమానంగా చూస్తూ అన్నాడు.
    
    "నువ్వు పెళ్ళి చేసుకోకుండా అలా వుండిపోవటం ఏమిట్రా? కాలూ, చేయీ బాగున్నంతవరకూ ఫర్వాలేదు. తర్వాతెలా?" అని అన్న దామె.
    
    "అన్నిటికీ షిర్డీసాయే వున్నాడు. మార్చేపోయాను. నువ్వూ భోజనానికి కూర్చో- మేం మాక్కావలసినది వడ్డించుకుంటాంలే"
    
    "అమ్మమ్మకి స్వయంగా తాను వడ్డిస్తూంటే మనం తినటమే ఇష్టం. తను తర్వాత తింటుంది" అన్నాడు అభిరాం.
    
    ఇద్దరూ భోజనాలు ముగించారు.
    
    "అమ్మమ్మా! నేనూ, వీరూ నా గదిలోనే పడుకుంటాం వీరు చాలా ప్రదేశాలు తిరిగారటగా ఆ విషయాలు చెబుతారు నాకు" అన్నాడు అభిరాం.
    
    "సరే" అంది సుమతమ్మ.
    
    అభిరాం, వరప్రసాదంలు అభిరాం బెడ్ రూంలోకి నడిచారు. అభిరాం పల్చటి టీ షర్ట్, షార్ట్ ధరించి మంచంమీద కూర్చున్నాడు.
    
    వరప్రసాదం లుంగీ, బనియన్ లోకి మారిపోయాడు.
    
    "ఇప్పుడు చెప్పండి" అన్నాడు అభిరాం.
    
    "చెబుతాను" అంటూ బెడ్ పక్కనే వున్న కుషన్ చైర్లో కూర్చున్నాడు వరప్రసాదం.
    
    నశ్యం డబ్బాలోంచి కొంత పొడి తీసుకుని పీల్చాడు. వెంట వెంటనే నాలుగయిదుసార్లు తుమ్మాడు. అభిరాం అతన్నే చూస్తూండి పోయాడు.
    
    "మొదలుపెడితే అర్ధరాత్రి దాటిపోవచ్చు. నీ నిద్ర పాడవుద్ది ఫర్వాలేదా?" అడిగాడు వరప్రసాదం.
    
    "తెల్లవార్లూ చెప్పినా నాకభ్యంతరం లేదు" అన్నాడు అభిరాం ఉత్సాహంగా.
    
    "సరే అయితే! ముందుగా హిమాలయాళ దగ్గర్నుంచీ నా అనుభవాలూ నేను చూసిన సంఘటనలూ. విన్న విచిత్రాలూ, కన్న అద్భుతాలూ అన్నీ చెబుతాను..." అన్నాడు.
    
    అభిరాం ఉత్సాహంగా అతనివంక చూడసాగాడు.
    
    "హిమాలయాలు దాదాపు రెండువేల నాలుగు వందల కిలో మీటర్ల పొడవున్న పర్వతాలు-
    
    వీటిలో నేపాల్, టిబెట్ సరిహద్దున ఇరవై తొమ్మిదివేల అడుగుల ఎత్తున్న 'ఎవరెస్ట్' ప్రపంచంలోకెల్లా ఎత్తయిన పర్వతం. హిమాలయం అనేది సంస్కృత పదం. హిమం అంటే మంచు. ఆలయం అంటే నివాసం. హిమాలయం అంటే మంచు యిల్లు అని చెప్పవచ్చు. అది కేవలం మంచు కొండ మాత్రమే కాదు. యోగ విజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకూ పుట్టిల్లు. ఈనాటికి కూడా అతిప్రాచీనమయిన, ఘనమైన సంప్రదాయం వుందక్కడ.
    
    పంజాబ్ హిమాలయాల నుండి కుమాయూన్, ఘర్ వాల్ హిమా లయాల వరకూ, సిక్కిం నుండి భూటాన్, టిబెట్ వరకూ - మామూలు యాత్రీకులు వెళ్ళలేని చోట్లలో తిరిగాను. అలాంటి సమయంలోనే ఒకసారి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనయింది" అంటూ ఆపాడు వరప్రసాదం.
    
    "ఏం జరిగింది?" ఆతృతగా అడిగాడు అభిరాం.
    
    "ఆక్సిజన్ లేకుండా హిమాలయాలలో ఇరవైవేల అడుగుల ఎత్తుకు వెళ్ళకూడదు. ఆ విషయం నాకు తెలియక అంత ఎత్తుకి వెళ్ళాను.
    
    అంతే ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరైపోతూ, కారణం తెహ్లియక అయోమయంలో పడిపోయి ఒడ్డునపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటుండగా ఒక యోగి నన్ను ఆదుకున్నాడు..."
    
    "ఎలా?" అతని మాటలు పూర్తవకముందే అడిగాడు అభిరాం.
    
    "ప్రాణవాయువు అందక నేను నరకయాతన పడుతుంటే అతను మాత్రం అతి మామూలుగా, నేలమీద ఉన్నట్లే ఉచ్చ్వాస నిశ్వాసాలు తీస్తూ, ఏవో మంత్రాలుచ్చరించి, నా తలపై తన చేత్తో నిమిరాడు. అంతే.... కొన్ని క్షణాలు....కేవలం కొన్ని క్షణాల్లోనే మామూలుగా- అయిపోయాన్నేను. దాదాపు మరణం అంచుకు చేరుకున్న నన్ను కాపాడిన ఆ యోగి నాకు స్థిమితం కలగడం చూసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోసాగాడు. నాకతనితో మాట్లాడాలనీ, నాకందని ప్రాణవాయువు అతనికెలా అందిందని అడుగుదామనీ ఆ యోగిని వెంబడించాను.

 Previous Page Next Page