"నువ్వా దెయ్యాలు, భూతాలు, అకల్ద్ సైన్స్ పుస్తకాలు అదేపనిగా చదివి పూర్తిగా పాడయిపోయావ్" మందలింపుగా అన్నాడు మహదేవ్.
అభిరాం ఏం మాట్లాడకుండా మౌనంగా డ్రైవ్ చేస్తూ వుండిపోయాడు.
* * * * *
సమయం రాత్రి ఎనిమిది గంటలు అభిరాం తన గదిలో పడుకుని ఏదో నవల చదువుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది. నవల మంచి ఇంట్రస్టుగా వున్న సమయంలో కలిగిన అంతరాయానికి విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీశాడతను.
బయట సుమారు ఓ అరవై ఏళ్ళ వ్యక్తి నుంచుని వున్నాడు. అతని చేతిలో ఓ బ్రీఫ్ కేసుంది.
"సుమతమ్మగారిల్లు యిదేనా?" అడిగాడతను.
"అవును" బదులిచ్చాడు అభిరాం.
"ఉన్నారా?"
"ఉంది రండి" అంటూ అతన్ని లోపలికి ఆహ్వానించి సోఫా చూపించాడు అభిరాం.
అతను బ్రీఫ్ కేసు ఓ మూల వుంచి సోఫాలో కూర్చున్నాడు.
"అమ్మమ్మా! నీకోసం ఎవరో వచ్చారు"
"నాకోసం ఎవరొస్తార్రా?" అంటూ బయటికి వచ్చిందామె.
ఆమెని చూడగానే ఆ వ్యక్తి చటుక్కున లేచి నిలబడ్డాడు.
"ఎవరూ?" పోల్చుకోలేనట్లు అడిగిందామె.
"నేను.....వరప్రసాదాన్ని బెజవాడలో చిన్నప్పుడు మనిల్లు పక్క పక్కనే వుండేవి అప్పటి నీ వరప్రసాదం తమ్ముడ్ని."
"ఓరి.... ఓరి.... ప్రసాదం నువ్వట్రా? పోల్చుకోలేకపోయాను. ఏమిటలా తయారయావ్?" అతని కెదురుగా సోఫాలో కూర్చుంటూ అడిగింది ఆమె.
"వయసు పై బడుతుందిగా నీ ఆరోగ్యం ఎలా వుంది?" అంటూ అడిగాడతను.
"బాగానే వుందిరా"
"ఈ బాబు..." అభిరాంని చూస్తూ అడిగాడతను.
"మనవడు"
"ఓహో!"
"నా పెళ్ళయి మీ బావగారితో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నాలుగైదుసార్లే బెజవాడ వెళ్ళాను. నీ గురించి అడిగితే నీవు ఇంట్లోంచి పరారయి వెళ్ళిపోయావని చెప్పారు. ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటే మీ వాళ్ళు ఒప్పుకోలేదని అలా చేశావని అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావ్? పెళ్ళీ గట్రా చేసుకున్నావా?"
"లేదక్కా! నేను ప్రేమించిన అమ్మాయిని తప్ప చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అది జరగలేదు. నేనిలా వుండిపోయాను."
"అదేం పనిరా?"
"అదంతా గతం నేనో విషాదవార్త విన్నాను. అదే నీ కూతురూ, అల్లుడూ..." అతని మాట పూర్తవకముందే సుమతమ్మ కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
"మీ బావగారూ పోయారు... ఆయన పోయిన అయిదేళ్ళకు కూతురూ, అల్లుడూ రోడ్డు ప్రమాదంలో పోయారు. నేనింకా బ్రతికున్నానంటే వీడికోసమే" నిర్వేదంగా అందామె.
అభిరాంకి అతనా విషయాలన్నీ అమ్మమ్మకి గుర్తుచేయటం నచ్చలేదు.
"ప్రస్తుతం మీరేం చేస్తున్నారు?" అనడిగాడు వాళ్ళ టాపిక్ ని కట్ చేస్తూ.
"ఇంట్లోంచి పారిపోయి దేశంలోని వూళ్ళన్నీ తిరుగుతూ చేతనైన పని చేసుకుంటూ బ్రతికాను.
ఎంత తెగింపులు చేసుకున్నా రక్త సంబంధం వూరుకోనివ్వదు కదా. ఇంటివైపు మనసు లాగింది. బెజవాడ వెళ్ళాను. అక్కడ మా వాళ్ళంతా బాగానే వున్నారు. అన్నదమ్ములు నా వాటా పొలం వాళ్ళే వుంచేసుకుని దాని బదులు నాకు డబ్బు యిచ్చేశారు. దాన్ని బ్యాంకులో ఫిక్స్ డ్ చేశాను. ఆ వడ్డీతో హాయిగా జీవిస్తూ మళ్ళీ ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేద్దామను కుంటున్నాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా యిష్టం" అని చెప్పాడు వరప్రసాదం.
"ఎక్కడెక్కడ తిరిగారు?" అడిగాడు అభిరాం.
"ఇక్కడక్కడనేముంది? భారతదేశంలో అన్ని ప్రదేశాలూ చూసే శాను. అన్ని సంస్కృతులూ తెలుసుకున్నాను. హిమాలయాలకు కూడా వెళ్ళాను."
"హిమాలయాలకు వెళ్ళారా?"
"అవును"
"ఆకక్డెం విశేషాలుంటాయి?"
"అబ్బో చాలా వుంటాయి. అవునూ నీ చేతిలో వున్న ఆ పుస్తకం ఏమిటి?" అభిరాం చేతిలో వున్న పుస్తకం అట్టమీద ఓ మాంత్రికుడు పూజ చేస్తున్న బొమ్మ వుంది.
'మాంత్రికుడు' అన్న టైటిల్ చూసి ఆసక్తిగా అడిగాడతను.
"ఇది తాంత్రిక ప్రపంచంలోని, తాంత్రికుల జీవనశైలి తంత్రం లోని అద్బుత విషయాలమీద ఓ రచయిత పరిశోధించి రాసిన ఇన్వెస్టి గేటివ్ నవల."
"పూర్తిగా చదివేశావా?"
"మంచి విషయాలు వున్నాయా?"
"పూర్తిగా లేవు సంక్షిప్తంగా వున్నాయి. ముందు ముందు వుంటాయేమో?"
"అది పూర్తిగా చదివి చెప్పు బాబు ఎలా వుందో - నీకిటువంటి సబ్జెక్టంటే ఇంట్రెస్టా?"
"అవును" అన్నాడు అభిరాం.
"నాక్కూడా! ఎందుకంటే నేను వూళ్ళు పట్టి తిరుగుతున్నప్పుడు కాశీలోనూ, హిమాలయాల్లోనూ, మరెన్నో నగరాలలోనూ నాకెందరో మంత్రగాళ్ళూ, తాంత్రికులూ తగిలారు. వారు చెప్పిన విషయాలు, వారు చూపించిన అద్భుతాలు అమోఘమైనవి."
"మీరు మానవాతీత శక్తుల్ని నమ్ముతారా?"
"ముందు నమ్మకముండేది కాదు. నా ప్రయాణాల్లో దేశమంతటా చుట్టబెడుతూన్నప్పుడు నాకు తారసపడిణ గొప్ప గొప్ప వ్యక్తుల మహత్తులు చూశాక నమ్మకం ఏర్పడింది" అన్నాడు ప్రసాదం.