అనంతమూర్తి, రవిబాబు ప్రక్క ప్రక్కన కూర్చుంటే చూసేవారికి యిద్దరూ ఎవరి రంగాలలో వారు సమ ఉజ్జీలుగా, ఒకరికొకరు తీసిపోనట్లు కనబడుతున్నారు. అనంతమూర్తి సంపాదకుడిగానేగాక రచయితగా కూడా వెలిగిపోతున్నాడు అప్పటికే.
అనంతమూర్తి క్లుప్తంగా, శక్తివంతంగా, శ్రోతల గుండెల్లోకి ప్రతిమాట జొరబడేటట్లుగా మాట్లాడతాడు. తర్వాత చకచక సన్మాన కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత రవిబాబు ఉపన్యాసం.
అతను లేచి నిలబడ్డాడు.
ఉద్రేకంగా, జనరంజకంగా మాట్లాడుతూ ఆశక్తికరమైన ఎన్నో విషయాలు చెప్పాడు.
"జీవితంలో ప్రతి కళాకారుడికీ ఎంతోకొంత ప్రతిభ వున్నా, ఆ ప్రతిభ సర్వతోముఖంగా వికసించటానికి ఎక్కన్నుంచో ఓ ప్రభావం కావాలి. అది లేకపోతే అడుగడుక్కీ ఎదురయ్యే అడ్డంకులన్నీ చేధించుకుంటూ పైపైకి వెళ్ళిపోవటం కష్టం. నేను మొదట నాకు నేను అర్ధంగాకుండా యీ కళాసాధన విషయంలో తికమకపడుతూ వుండేవాడిని. ఎన్నోసార్లు దీన్ని వొదిలేసి దూరంగా వుండిపోవాలని వుండేది. ఆ సమయాల్లో నా భార్య నన్ను ఉత్తేజపరిచింది. నాలో నిద్రాణమైవున్న శక్తుల్ని నేనర్ధం చేసుకునేటట్లు చేసింది. ఈనాడు యీ రంగంలో ఇలాంటి ప్రత్యేకమైన స్థానంలో నేనుండటానికి కారణం ఆమే. ఆమె! నన్ను ప్రోత్సహించక పోతే మీరంతా అభినందించే వేణు విద్వాంసుడు పద్మశ్రీ రవిబాబు లేడు."
హాలంతా కరతాళధ్వనులతో నిండిపోయింది.
అనంతమూర్తి లేచి మిసెస్ రవిబాబు ఈ సభలోనే వున్నారనీ, ఆమె వేదికమీదికి రావాలని ఆహ్వానించాడు.
ఓ స్త్రీ మూర్తి స్టేజీమీదకు అవతరించింది.
రాఘవ త్రుళ్ళిపడ్డాడు. అతని శరీరం అణువణువునా వణికిపోయినట్టయింది.
ఆమె హుందాగా, ఎంతో అందంగా చూపరుల్ని ప్రభావితం చేసే చిరునవ్వుతో, వెలిగిపోయే కళ్ళతో, అధునాతనంగా, అయినా ఏమాత్రం ఎబ్బెట్టులేకుండా ఆ ఆధునికత్వం సహజంగా అమరిపోయినట్లుగా, తానే ఓకళాస్వరూపం అయినట్లు, ఓ చిన్న రాజ్యాన్ని పరిపాలించే మహారాణీఅయినట్లు మిరుమిట్లు కొల్పింది.
కాని ఆమె సీత.
ఏదో మాట్లాడుతోంది. రాఘవకు వినబడటం లేదు. అతని కళ్ళలో, కళ్ళ వెనక ఏవేవో దృశ్యాలు. తాను ఏ అమూల్య సంపదను పోగొట్టుకున్నాడో బోదపడుతోంది. మనసు మూలుగుతోంది. రోగగ్రస్తమైనట్లు గూర్జిల్లుతోంది.
అక్కడ వుండలేకపోతున్నాడు.
"పోదాం" అని పిచ్చిగా అరుస్తూ లేచి నిలబడ్డాడు.
లక్ష్మి అతనివంక ఆశ్చర్యంగా చూసింది" అదేమిటండీ ఆవిడంత బాగా మాట్లాడుతోంటే...? కూర్చోండి" అని కసిరింది.
తర్వాత సభ ముగిసేవరకూ, జనంలోంచి బయటపడే వరకూ ముళ్ళమీద ఉన్నట్లే గడిపాడు.
మరునాడు లక్ష్మి "ఏమిటండీ రాత్రి నిద్దట్లో 'కంది పచ్చడి, కందిపచ్చడి' అంటూ కలవరించారు?" అనడిగింది.
అతను తెల్లమొహం వేశాడు. "కలవరించానా? ఏమో తెలీదు" అని గొణిగాడు.
* * *
మూడేరోజులు. పాతజ్ఞాపకాలన్నీ నిర్దాక్షిణ్యంగా అణచివేయబడ్డాయి. మళ్ళీ భార్య, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ఊపిరాడనంత బంధనలు-మళ్ళీ రాఘవ మామూలు మనిషైపోయాడు.
* * *
ఓ రోజు తాసీల్దారుగారి దగ్గర్నుంచి మూర్తికి ఫోన్ వచ్చింది.
"మీతో ఓ ముఖ్యవిషయం చెప్పాలండి" అన్నారాయన.
"చెప్పండి" అన్నాడు మూర్తి.
"మా ఆఫీసులో పనిచేసే రాఘవరావు అనే అతనూ, మీరు చిన్నప్పటినుంచీ ప్రాణస్నేహితులని విన్నాను. అతనిని గురించి మీతో మాట్లాడాలి. నిజానికి ఎంతో పైకి రావాల్సినవాడు. నిజాయితీపరుడు. ఆఫీసుకు వచ్చాడంటే గొడ్డులా పనిచేస్తాడు. కాని ఎవరికీ అతనంటే సదభిప్రాయం లేదు. మీకో విషయం చెప్పమంటారా? నే నతనికంటే రెండేళ్ళు జూనియరుని-నేను తాసీల్దారునయాను. అతనింకా గుమాస్తాగానే వున్నాడు. ఎప్పుడూ సక్రమంగా ఆఫీసుకు రాడు. అతనుపెట్టే శెలవులకు అంతూపొంతూ వుండదు. పిల్లాడికి జ్వరమొచ్చిందంటే ఆఫీసు మానేస్తాడు. పెళ్ళానికి కాలు బెణికిందంటే మానేస్తాడు. పెళ్ళాం తరఫున ఎవరయినా చుట్టం చచ్చిపోతే వారం రోజులు రాడు. తద్దినానికి అందరూ ఒకరోజయితే శేషభుక్తమనీ, వల్లకాడనీ యితనికి రెండురోజులు సెలవు. చెప్పి చెప్పి నా ప్రాణం విసిగిపోయింది. పై అధికార్లు కూడా ఎవరూ యితని ప్రవర్తన లైక్ చెయ్యడం లేదు. హఠాత్తుగా సస్పెన్షన్ ఆర్డరో, డిస్మిసల్ ఆర్డరో వచ్చినా ఆశ్చర్యంలేదు. మీరతనికి ప్రాణాస్నేహితులని తెలిసి మీకు చెప్పాను."
మూర్తి మనసంతా బరువుతో నిండిపోయింది. రాఘవను తరచు కలుసుకోకపోవచ్చుగాని అతనంటే అవాజ్యమైన అనురాగంవుంది. అతని జీవితంలోని ప్రతి అంశాన్ని పరిశీలిస్తూనే వున్నాడు అయితే చాలా సందర్భాలలో ప్రేక్షకుడిగా వుండటంకన్నా ఏమీ చెయ్యలేం.
ఫోన్ వచ్చిన సమయానికి మూర్తి తమ వారపత్రిక కోసమని రాస్తున్న సీరియల్ నవలలోని ఓ అధ్యాయం పూర్తి చేస్తున్నాడు. ఈ మధ్య అతను నవలరాసి చాలా రోజులయింది. పత్రిక నిర్వహణలొ రచనా వ్యాసంగంకొనసాగటం కష్టంగా వుంది. అయినా అది తాత్కాలికమే. జీవితంలొ ఒక అంశాన్ని గురించి మరో అంశాన్ని త్యాగం చెయ్యటం అతనికెప్పుడూ అలవాటులేదు. తను చీఫ్ ఎడిటరయ్యాక అసిస్టెంట్ ఎడిటరుగా సబ్ ఎడిటర్లలోంచి రాజారావు అనే సమర్దుడైన యువకుడిని తీసుకున్నాడు. తన పర్యవేక్షణలొ పత్రిక నిర్వహణ బాధ్యత ఎక్కువగా అతనికి అప్పచెబుతూ వచ్చాడు.
చాలాకాలం తర్వాత అతని కలంనుంచి వెలువడుతూన్న నవల పాఠక లోకంలో గొప్ప సంచలనాన్ని రేపింది. మూర్తి నిజాన్ని ప్రేమిస్తాడు. జీవితంలో ఎన్నో కల్పనలుంటాయి. భ్రమలుంటాయి. అవివేకాన్ని తొలగించుకొనియధార్ధాన్ని చూడగలగటం అంత తేలికైన పనికాదు.
అతన్లో-చుట్టూ పరిభ్రమించే అనేక సమస్యల్ని చూస్తుంటే కలవరపాటు కలుగుతోంది. మనచుట్టూ వున్న సంతోషాన్ని నిజ,మైన సంతోషాలా? సంవత్సరాలతరబడి అన్యోన్యంగా కనబడుతూ, నిజంగానే అన్యోన్యంగా గడిచిన సంసారాల్లో భార్యాభర్తలు ఒకరినొకరు దారుణంగాకొన్ని వందలసార్లయినా మోసంచేసుకుని వుండరా? వారి ప్రేమ నిజమైనది కావచ్చు. వివాహబంధంలోని మైకం నిజమైనది కావచ్చు వారిద్దరి మధ్య జరిగే మోసం కూడా అంతే నిజం.....ప్రాణ స్నేహితులమధ్య కూడా పొరలెందుకుంటాయి? ఒకరినొకరు ఎంతో హర్షించుకుంటూన్నా మనసులో గర్హించుకునేసందర్భాలెందుకుంటాయి? శ్రామికుడుకంటే కూడా ఎక్కువగా కష్టపడి, దానికి మేధస్సు జోడించి, కర్మం కాలి నాలుగుడబ్బులు సంపాదిచుకుంటే-అతనుకూడా బూర్జువానా? సంపాదించే నాలుగు రూపాయల్లో మూడురూపాయలు చిత్తుగా తాగేసి మిగతా రూపాయికూడా పెళ్ళాన్ని తిడుతూ యిచ్చే జీవి ఏ విధంగా అభాగ్యుడు? ఒక మనిషి యింకోమనిషికి విలువ నిస్తున్నాడా? ఒక మనిషిని చూసి యింకో మనిషి మనసారా నవ్వగలుగుతున్నాడా? ఒక మనిషిలోని శక్తి సామర్ధ్యాలు ఇంకో మనిషి గుర్తించి ఒప్పుకోగలుగుతున్నాడా? మంచిమనిషినే అందరూ స్వార్ధానికి వాడుకుందామని చూస్తారెందుకని? భార్యాభర్తలు ప్రేమ ప్రేమ అని బాజాలు వాయించుకుంటారు. భర్త సంపాదన పోయి నెలల తరబడి యింటిలో కూర్చుంటే భార్యలోని రక్షసత్వం విరుచుకు పడకుండా ఆ ప్రేమ నిలబెట్టుకుంటుందా? నిజమైన మానవతావాది అసలు గుర్తించబడుతున్నాడా? పెళ్ళాం, పిల్లలు, చుట్టాలు, స్నేహితులు, ఆఖరికి తల్లీదండ్రి కూడా అలాంటివాడిని అపార్ధం చేసుకుని అపహాస్యం చెయ్యటం లేదా?