ఆపాదమస్తకం కంపించిపోతున్నాడు చౌదరి. మొగలి పొదలా పెంచుకున్న సువిశాల సామ్రాజ్యంలో త్రాచులా బుసకొడుతూ బ్రతికిన చౌదరి ఈ అవమానాన్ని భరించలేక పోతున్నాడు. అనుభవంతో కాకలు తీసిన ఉపాధ్యాయే ఏమీ చేయలేక తలవంచితే మేధస్సుతో పిచ్చుకలాంటి ఓ అమ్మాయి బ్రహ్మాస్త్రాలతో తనను ప్రశ్నించి అల్లరి పెడుతూంది.
ఇరవై నాలుగు గంటల్లో కృషిని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నాడు కాని ఆ సాయంకాలం తెలిసింది.
కృషి ఇప్పటికే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి, ముఖ్యమంత్రికి, హోం సెక్రెటీలకీ లెటర్సు పంపింది.
చౌదరి మూలంగా తనకు ప్రాణహాని ఉందని, తనకేదన్నా జరిగితే చౌదరిగాని, ఆయన మనుషులుగాని కారణమని ఆ లెటర్స్ సారాంశం.
ఆ విషయం తెలియ చెప్పింది సాక్షాత్తు నగర పోలీస్ కమీషనరే.
అప్రతిభుడైపోయాడు చౌదరి.
కృషి ఎత్తుకి పై ఎత్తులు వేయడం లోనే కాదు అసలు ఎత్తు వేయకుండా సైతం అవాంతరాలు సృష్టించగలదు.
అంతే...
ఏ మూలనుంచి దెబ్బతీయాలో నిర్ణయించుకున్నాడు ఆ రాత్రే.
ఎమ్మెల్యే రాజారావ్ ని పిలిచాడు అర్జెంటుగా.
"ఉపాధ్యాయకి నగరంలో ఎన్ని ఫ్యాక్టరీలున్నా అతడికి చాలా లాభాల్ని తెస్తున్న సంస్థ కృషి ఫార్మాస్యూటికల్స్ అందులో రేపు ఉదయానికల్లా కార్మికులు తిరుగుబాటు చేయాలి- నోటీసు అవసరం లేకుండా సమ్మె ప్రారంభించాలి."
"కాని ఎలా" కంగారుగా చూశాడు రాజారావు.
"ఎలాగో నాకు తెలీదు" ఆవేశంగా అన్నాడు చౌదరి. "కానీ జరిగితీరాలి. అక్కడ యూనియన్ ప్రెసిడెంట్ నీ మనిషే కాబట్టి యిదంతా నువ్వు మేనేజ్ చేయాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు."
* * * *
"ఏమిటిదంతా"
హఠాత్తుగా కార్మికులు ప్రారంభించైనా సమ్మె మూలంగా నగరానికి తిరిగివచ్చిన ఉపాధ్యాయ కృషి ఫార్మాస్యూటికల్స్ జనరల్ మేనేజరునీ, పర్సనల్ మేనేజరునీ ఇంటికి పిలిపించాడు. "ఉన్నట్టుండి ఈ సమ్మె ఏమిటి"
"సర్" చెప్పాడు జనరల్ మేనేజరు "సరైన కారణం మాకూ కనిపించడం లేదు. ఉదయం షిఫ్టు ప్రారంభమైన అరగంటకి పేకింగ్ సెక్షనులో పదిమంది ఎంప్లాయిస్ గుంపుగా నిలబడి మాట్లాడుతుంటే సెక్షన్ సూపర్ వైజర్ వర్క్ స్పాట్ కి వెళ్ళమన్నాడట అంతే ఆ పది మందీ అతడ్ని కొట్టారు. యాజమాన్యం జులుం నశించాలి అంటూ యూనియన్ ప్రెసిడెంట్ తో బాటు ఫ్యాక్టరీ బయటికి నడిచారు మొత్తం కార్మికులంతా సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ చేయగానే వచ్చాను. అప్పటికే గేటు ముందు స్లోగన్స్ తో అల్లరి చేస్తుంటే ప్రెసిడెంట్ ని చర్చలకి రమ్మన్నాను. రానన్నాడు. నేనే వెళ్ళాను. సూపర్ వైజరు ఓ కార్మికుడ్ని కొట్టాడు కాబట్టి అతడ్ని ఉద్యోగంలో నుంచి టెర్మినేట్ చేయమని అడిగాడు ప్రెసిడెంట్. అంతవరకూ ఫ్యాక్టరీ లో అడుగుపెట్టమని రభస చేశాడు."
నిశ్శబ్దంగా వింటున్నాడు ఉపాధ్యాయ....చాలా చిన్న కారణం అది.
"అప్పటికే జరిగింది ఎంక్వయిరీ చేసి నిర్ణయించేక సూపర్ వైజర్ నేరస్థుడైతే చర్య తీసుకుంటామన్నా వినడం లేదు. అతడ్ని ఉద్యోగంలో నుంచి ముందు సేక్ చేస్తే తప్ప చర్చలకి అవకాశం లేదన్నారు" పర్సనల్ మేనేజరు చెప్పాడు వివరంగా. "సమ్మెకి నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయడం ఇల్లీగల్ అని స్పష్టం చేశాను కూడా."
"సమస్య అది కాదు" అసహనంగా కణతలు నొక్కుకున్నాడు ఉపాధ్యాయ "రెండు నెలల్లోగా స్టేట్స్ కి పంపాల్సిన పదిహేను కోట్ల విలువచేసే మెటీరియల్ పంపలేకపోవడం ఒక్కటే కాదు. ఈ సమ్మె మూలంగా అన్న టైంకి సప్లయి చేయలేమన్న అపవాదుతో రేపు రాబోతున్న యూరప్ కంట్రీస్ ఆర్డర్సు చేజారిపోయాయి."
జనరల్ మేనేజర్ చెప్పాడు గొణుగుతున్నట్టుగా "ఆ సూపర్వైజర్ పై చర్య తీసుకుందామన్నా మేన్ హేండిలింగ్ జరిగింది. అతడిపైనే తప్ప అతడు ఏ కార్మికుడిపైనా చేయి చేసుకోలేదని ప్రాథమిక దర్యాప్తులో రుజువైంది."
సహనాన్ని కోల్పోతున్నట్టుగా అన్నాడు ఉపాధ్యాయ "లాకౌట్ ప్రకటించండి. లెట్ ది పీపుల్ గో టూ డాగ్స్"
సమావేశాన్ని అర్దాంతరంగా ముగించిన ఉపాధ్యాయకి తెలీదు కృషి వారి చర్చనంతా విందని...
బెడ్ రూం లో బడలికగా కూర్చుని మానసిక గ్లావితో నలిగిపోతున్న గ్రాండ్ పా ని సమీపించింది కృషి "గ్రాండ్ పా"
ఆ సమయంలో అతడు ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడు.
"నిజానికి ఇది సమస్య కాదు - ఓ సవాల్." క్రైసిస్ మేనేజ్ మెంట్ గురించి అవగాహన గల కృషి నెమ్మదిగా అంది. "అసాధారణమైన మీ అనుభవం ముందు నా ఆలోచన శక్తి స్వల్పమని అంగీకరిస్తున్నాను గ్రాండ్ పా - కానీ రిస్క్ తీసుకుని కదలాల్సిన యిష్యూలో రేష్ గా నిర్ణయం తీసుకోవడం మేనేజ్ మెంట్ సైన్స్ అనిపించుకోదు."
అవాక్కయినట్టుగా చూశాడు ఉపాధ్యాయ- ఆయనకి తెలిసీ కృషి తనకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఇలా జోక్యం చేసుకోవడం తొలిసారి. అదికాదు ఆయన ఆలోచిస్తున్నది. కృషి విశ్లేషణ చాలా సృజనాత్మకంగా అనిపించింది.
"నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏమిటి"
"ఫ్యాక్టరీ లాకౌట్ దాకా వెళితే ప్రత్యర్ధి అనుకున్నది సాధించినట్టు అవుతుంది."
ఉపాధ్యాయ భ్రుకుటి ముడిపడింది "ఎవరా ప్రత్యర్ధి"
"రామనాథ చౌదరి"
హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
"నీకు చౌదరి తెలుసా"
"డబ్బుతో సమకూర్చుకున్న ఆయుధాలు గొప్పవనుకునే చౌదరి నాకు తెలుసు గ్రాండ్ పా... కాని ఆలోచనా శక్తి మరింత బలమైన అణ్వాయుధమనే నా గురించి చౌదరి తెలుసుకోవాలి."
"అంటే" సాలోచనగా అన్నారాయన "ఈ సమ్మెకి కారణం ఖచ్చితంగా చౌదరేనంటావ్"
"అనడమే కాదు గ్రాండ్ పా అతడు అనుకున్నది జరగదని నిరూపిస్తాను అదీ మీరు అనుమతిస్తే-"
అర్ధం కాలేదు ఉపాధ్యాయకి.
"కాదనకండి గ్రాండ్ పా - నేర వ్యవస్థ చదరంగపు గళ్ళపై తోచిన పావుల్ని కదిలిస్తూ తాను గ్రాండ్ మాస్టర్ ని అనుకొంటున్న చౌదరికి చెక్ చెప్పాలీ అంటే మీ సహాయం కావాలి - కనీసం ఈ ఒక్క సారికి..."
కృషి గొంతులోని నిజాయితీ ఆయన్ని అమితంగా కదిలించిందేమో "చెప్పు.. ఏం కావాలి"
"అధికారం"
విస్మయంగా చూశాడు.
"యస్ గ్రాండ్ పా... కేవలం ఇరవై నాలుగు గంటలు మీ అధికారాన్ని నాకిచ్చి మీరు విశ్రాంతి తీసుకోండి. అది చాలు"
"కాని-"
"నేను మీ మనవరాల్ని గ్రాండ్ పా..."
ఆ వాక్యం మనసులోని ఏ పొరల్ని తాకిందో ఉదాసీనంగా చూశారాయన.
"కాబట్టే ఇరవై నాలుగు గంటలు మీ అధికారాన్ని నాకిమ్మంటున్నది. మీ శక్తి తక్కువగా అంచనా వేసి కాదు గ్రాండ్ పా. నా శక్తేమిటో చౌదరికి తెలియచెప్పాలని."
ఒక సుదీర్ఘమైన తపస్సు తో నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఆమెకు ధారాదత్తం చేస్తున్నట్టుగా అన్నారాయన "ఓ.కె....ఏక్సెప్టెడ్."
తన దక్షత, కార్యదీక్ష తెలియాల్సింది తాతయ్యకో లేక చౌదరి అనబడే బలమైన ప్రత్యర్ధికో ఖచ్చితంగా కృషికి తెలీదు.
రాత్రి తొమ్మిదిన్నర గంటల కల్లా పర్సనల్ మేనేజరు శరత్ చంద్రని ఇంటికి రప్పించింది కృషి సూటిగా అడిగింది "ఫ్యాక్టరీలోని రూలింగ్ యూనియన్ తో సరిపడని వ్యక్తుల వివరాలు చెప్పగలరా."
చాలా చిన్న పశ్నది - కాని ఆ ప్రశ్నతోనే ఆమె ఆంతర్యం స్పష్టంగా అర్ధమైపోయింది. అదికాదు కృషిలో అతడు గమనించింది. సౌందర్యపు గ్రహాంతరాల లోతులనుంచి మేధస్సు రేడియం అక్షరాలై కనిపించి అతడ్ని క్షణంపాటు వివసుడ్ని చేసి కంగారు పెట్టింది.
ఫ్యాక్టరీ లో కార్మిక సంఘాలను విభజించి పాలించాలనే సంకల్పానికి అనుగుణంగా కార్మికుల్లోని అసంతృపతిని ఆధారం చేసుకుని కొందఱు ఏక్టివ్ మెంబర్లని తయారు చేయడమో లేక తయారైవున్న వాళ్ళని గమనించడమో యాజమాన్యపు బాధ్యతల్లో ఒకటిగా తెలిసిన శరత్ చంద్ర నెమ్మదిగా అన్నాడు...."చాలా కాలం నుంచి యూనియన్ ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళలో సుధీర్ కుమార్ ఒకడు. సుమారు పదిహేనేళ్ళుగా మెషిన్ ఆపరేటర్ గా ఉంటున్న సుదీర్ కుమార్ రెండు సార్లు జనరల్ సెక్రటరీ గా కాంటెస్ట్ చేసి ఓడిపోయాడు...కార్మికుల్లో చాలా మంది అతడికి అనుకూలంగా వుంటున్నా గెలిచే మెజారిటీ మాత్రం సంపాదించలేకపోతున్నాడు.... అతడ్ని కొనేసో లేక బెదిరించో తన మనిషిగా మార్చుకోవాలని రాజారావు రాయబారాలు పంపుతున్నా కొరుకుడు పడనివ్వడంలేదని ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా తెలిసింది."