"ఇది స్పెషల్ ఎలక్ట్రానిక్ కెమెరా మిస్టర్ భవానీశంకర్ ! ఇందులో లోడ్ చేసింది కూడా స్పెషల్ ఫిలిమ్! నెలరోజుల క్రితం జపానులో వచ్చిన లేటెస్ట్ మోడల్ ఇది. లక్ష రూపాయలు దీని ఖరీదు. లైటింగ్, క్లారిటీ, త్రీ డైమెన్షన్ ఎఫెక్ట్స్ డిస్టెన్స్ అన్నీ ఆటోమేటిగ్గా ఎడ్జస్ట్ అయిపోతాయి. ఎటొచ్చి ఆ అమ్మాయి యాభయి అడుగుల కంటే ఎక్కువ దూరంలో వుండకూడదు - ఇందులో రెండే రెండు స్నాప్ లు వున్నాయ్ ఆ అమ్మాయిని రెండు యాంగిల్స్ లో స్నాప్ లూ తీసి రేపు కెమెరా, నెగటివ్ లు మా ఆఫీసుకి తెచ్చివ్వాలి. వెంటనే మిగతా వెయ్యి రూపాయలూ నీకిస్తాం ఈజిట్ ఓ.కే."
"ఓ.కే. కామ్రేడ్! సెంట్ పర్సెంట్ ఓ.కే!"
భవానీశంకర్ కెమెరా అందుకున్నాడు. అంతకుముందు తనెప్పుడూ అలాంటి కెమెరా చూడలేదు.
"ఇదిగో ఈ ఎల్లో బటన్ స్నాప్స్ కి ఉపయోగించాలి. " చూపించాడతను.
"ఇంతకూ ఆమ్మాయి ఎవరు?"
"బసు స్టాప్ పక్క సందులోనే రెండో ఇల్లు - పేరు స్మీతారాణి."
భవానీ శంకర్ ఉలిక్కిపడ్డాడు.
"స్మితారాణి?" నమ్మలేనట్లు అడిగాడు.
"అవును! కావాలంటే అమ్మాయినో సారి చూపిస్తాను - పద --------"
"అవసరం లేదు కామ్రేడ్! స్మితారాణి అయితే మనకు బాగా తెలుసు. వాళ్ళ ఫాదర్ పేరు అగ్ని! అన్నీ తండ్రి పోలిక లోచ్చాయ్. ఆ అమ్మాయికి!"
"అయితే ఇంక నేను వెళ్ళవచ్చునుకుంటాను. తెలిసినమ్మాయే కాబట్టి ఇప్పుడామేని ఫోటో తీయడం నీకేమి కష్టం కాదని నా ఉద్దేశ్యం!" భవానీశంకర్ భుజం మీద తట్టి బయటకు నడిచాడతను.
భవానీ శంకర్ అతనితో పాటు బయటివరకూ నడిచి ఆగిపోయాడు.
"ఓ.కే. -భవానీ శంకర్ ! రేపు మాణింగు ఆ రెండు స్నాప్ లతో మీరు మా ఆఫీసుకొస్తారు - అంతే కదూ?"
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"నో ప్రాబ్లమ్!"
అతను వెళ్ళిపోయాడు. భవానీ శంకర్ గదిలోకొచ్చి హుషారుగా ట్యూన్ నెంబర్ ఫైవ్ పాడటం ప్రారంభించాడు. చేతిలో బాగా డబ్బు ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా ఆ ట్యూన్ అతని పెదాల మీదకు వచ్చేస్తుంది. అదివరకన్నా ఎక్కువమంది ప్రేక్షకులు గుమికూడిన విషయం తెలిసేసరికి ట్యునుని ఆపేశాడతను.
దూరంగా సత్యమ్మ భర్త రాజయ్య చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు.
"కమాన్ మైడియర్ రాజయ్యా కం హియర్! మీ ఆవిడ హాస్పిటల్లో వుంది. రేపో ఎల్లుండో చస్తుంది. మనకేం ఫరావాలేదు. మనం వెళ్ళి మందుకొడదాం. బైదిబై "మందేరా మన జీవితం, మందేరా మన ఊపిరి" అనే పాట వచ్చా నీకు. ఓసారి పాడితే అందరం కలిసి డాన్స్ చేస్తాం. పాడు కామ్రేడ్, కమాన్ , క్విక్ క్విక్."
రాజయ్యా భవానిశంకర్ వైపు కోపంగా చూశాడు.
"వాట్ కామ్రేడ్? నీ ముఖంలో కోపం లాంటిదేదో హండ్రెడ్ కాండిల్స్ బల్బులా వెలిగిపోతోందేమిటి? పాట పాడు. ఓ నీ పిల్లలు మాడుతున్నారని ఆలోచిస్తున్నావా? వాళ్ళు చస్తారు కామ్రేడ్ - మనకెందుకు? నారు పోసినవాడే నీరు పోస్తాడు - లేదా వురివేస్తాడు - కమాన్. "మందేరా జీవితం, మందేరా మన ఊపిరి."
భవానీశంకర్ పాడటం ప్రారంభించేసరికి పిల్లలంతా డాన్సు చేయడం ప్రారంభించారు.
రాజయ్య కోపంగా తన గుడిసెకు వెళ్ళిపోయాడు.
భవానీ శంకర్ నవ్వుతూ అతని వెనుకే అతనింట్లోకి చేరుకున్నాడు.
"హల్లో రాజయ్యా! ఏడుస్తున్నావా? ఎందుకని? మందు దొరకలేదా? ఇదిగో - ఈ వందరూపాయలు తీసుకో! మందుకొట్టెయ్ బ్రదర్ - నీ భార్య సత్యమ్మ, పిల్లలు చస్తే తగలెయ్యటానికి ఇంకో వంద ఇస్తానులే బ్రదర్, డోంట్ వర్రీ - ఎబౌట్ దెమ్-"
"బాబూ- " కోపంగా, అసహనంగా అరిచాడు రాజయ్య.
"అరె! నీకు కోపం కూడా వస్తోందే, వెరీ స్ట్రెంజ్! వెంటనే డాక్టర్లకి చూపించుకో బ్రదర్! కోపం అనేది పశువుల కొస్తుంది గానీ , నీలా భార్యా బిడ్డలకి తిండి పెట్టకుండా తాగేవాడికి రాకూడదు-"
రాజయ్య తల వంచుకుని అక్కడే కూలబడిపోయాడు. భవానీ శంకర్ అతడిని లేపి నుంచోబెట్టాడు.
"ఆ ఏడుపు అపు కామ్రేడ్! ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే గానీ కుదరదు నీకు! ఎప్పుడూ మందుకోసం ఎడిచేవాడు పెళ్ళాం బిడ్డల్ కోసం ఏడిస్తే ఇలాగే అఘోరిస్తుంది! ఇదిగో ఈ వంద తీసుకెళ్ళు! దీంతో మందు కొడతావో, హాస్పిటల్లో చావుబ్రతుకుల మధ్య ఉన్న నీ భార్యను రక్షించుకుంటావో - నీ యిష్టం - పో!"
రాజయ్య వందనోటు అందుకుని భవానీ శంకర్ కి నమస్కరించాడు. తర్వాత కన్నీళ్ళు తుడుచుకుని పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరాడు.
అప్పటికీ సాయంత్రం అయిదవుతోంది.
భవానీశంకర్ కెమెరా భుజాన వేసుకుని, గదికి తాళం వేసి రోడ్ మీద కొచ్చాడు. పిల్లలంతా పరుగుతో వచ్చి అతనిని చుట్టూముట్టారు మళ్ళీ.
"అంకుల్ మమ్మల్ని ఫోటో తీయ్యవూ?"
తీయాలనే అనిపించి కెమెరా చేతిలోకి తీసుకున్నాడు గాని స్నాప్ కొట్టే ముందు గుర్తుకొచ్చిందతనికి ఆ సూటు వాలా చెప్పిన విషయం.
"లోపల వున్నది స్పెషల్ ఫిలిము --రెండే రెండు స్నాప్ లు ఉన్నాయి - ఆ అమ్మాయిని రెండు యాంగిల్స్ లో తీయాలి."
భవానీశంకర్ కెమెరా మళ్ళీ భుజాన వేసేసుకున్నాడు.