Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 17


    "ఆ పిల్ల అంతే డ్యాన్స్ ల కన్నా డబ్బు సంపాదన ముఖ్యం డబ్బు సంపాదనలోనే వుండి వుంటుంది. ఆ గడ్డివాముల వెనక వెతకండి" ఎవరో లోపలినుంచి పురమాయించారు.
    
    మరో అయిదు నిముషాలకి తెరలేచింది.
    
    రాణీ ప్రత్యక్షమైంది. ఆమె రాణీలా లేదు రాణీ కోపానికి గురైన దాసీలా వుంది. జుట్టంతా రేగిపోయింది. ముఖమంతా ఎంగిలిపడడంవల్ల అక్కడక్కడా మేకప్ లేచిపోయి, ముఖాన్ని రెండురకాల చర్మంతో కుట్టినట్లుంది.
    
    ఆమె డబ్బు సంపాదనలో బాగానే కష్టపడినట్లుంది. ఒక హుషారైన పాటకు డాన్స్ చేసింది.
    
    తిరిగి తెర దిగింది.
    
    మధుమతి వస్తున్న ఆవులింతను ఆపుకుంటూ, "నేను వెళ్ళి పడుకుంటాను వదినా నిద్ర వస్తోంది" అని లేచింది. నాకూ వెళ్ళిపోవాలనుంది. కానీ ఇంకా కుంభకర్ణుడి పాత్ర, రాముడి పాత్రా రాలేదు.
    
    "సరే, నువ్వెళ్ళు తరువాత వస్తాను"
    
    మధు వెళ్ళిపోయింది.
    
    రెండో సీన్ లో దినకర్ వచ్చాడు. అతని పర్సనాలిటీకి రాముడి వేషం బాగా నప్పింది. రాముడిలానే వుండి వుంటాడనిపించింది.
    
    పద్యాలు కూడా చక్కగా పాడాడు. నాకు తెలియకుండానే నేను కూడా చప్పట్లు చరిచాను.
    
    కుంభకర్ణుడి పాత్ర కూడా అయిపోయింది. మధ్య మధ్య రాణీ కూడా తన డ్యాన్స్ లతో మగవాళ్ళను బాగానే రెచ్చగొట్టగలిగింది.
    
    ఇక మిగిలింది చివరి సీనే ఇదే పెద్దది. ఇంకా అరగంట వుంటుంది. నాటకం పూర్తయితే జనమంతా మీదపడి, తొక్కిసలాట జరుగుతుందని ముందే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను.
    
    గేటులోంచి బయటపడ్డాను.
    
    ఆకాశంలో చంద్రవంక దేవతల కిరీటంలా వుంది. మల్లెపూల వాసన గాలిలో తేలుతోంది. ఊరంతా మౌనప్రేక్షకురాలిలా నిశ్శబ్దంగా వుంది.
    
    పొలాలకు అడ్డంపడి నడుస్తున్నాను.
    
    వెన్నెల కాలిబాటమీద పడి, భూదేవి పాపటిలా తోస్తోంది. ముందూ వెనకా ఎవరూ లేకపోవడంతో వడివడిగా అడుగులేస్తున్నాను. వెనక ఏదో అలికిడై నట్లనిపించి వెనక్కి తిరిగి చూశాను.
    
    దినకర్.
    
    తలకున్న విగ్ మాత్రం తీశాడు. ఛాతీభాగంలో ఏవో తెల్లటి దండ లున్నాయి.
    
    కింద ఎర్రటిరంగు పట్టుగుడ్డ. వేషం సగం విప్పాక, నాకోసం పరిగెత్తినట్లున్నాడు.
    
    "వెళుతున్నావా?"
    
    "ఆఁ"
    
    నాకోసం ఆకాశం నుంచి దిగివచ్చిన గంధర్వ రాకుమారుడిలా వున్నాడు అతను. అది వేషం అని కానప్పుడు అనిపించలేదు.
    
    "ఈ వెన్నెల్లో ఎలా వున్నావో తెలుసా?" అన్నాడు.
    
    "ఎలా వున్నాను?"
    
    ఏదో చెబుతాడని ఊహించిన నేను పొరబాటు పడ్డాను. రెండు అడుగుల్లో నా దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుని, నుదుటి మీద గాఢంగా పెదవులు ఆన్చాడు.
    
    ఊహించని ఈ పరిణామానికి అలా నిశ్చేష్టురాలై నిలబడిపోయాను నా రక్తాన్నంతా అతను పిడికిట్లో పట్టుకున్నట్లు ముద్దగా అయిపోయాను.
    
    గుండె ఏదో కొత్త అనుభవంతో వింతగా కొట్టుకుంటోంది. నరాలన్నిటినీ ఒక్కసారి లాగి వదిలినట్లు ఝల్లుమన్నాను. చంద్రవంక సరాసరి కిందకు దిగి నా ముఖంలోని సిగ్గును కనపడనీయకుండా ముసుగులా అమరినట్లనిపించింది.
    
    అతను నా నుంచి విడివడి వెళ్ళిపోయాడు.
    
    నేను అలానే నిలబడిపోయాను.
    
    తన మొహాన్నంతా అక్కడే వదిలి వెళ్ళిపోయినట్లు గుండెలు సలుపుతున్నాయి. తన కోరినంతా నా కళ్ళల్లో కూరేసినట్లు జ్వలిస్తున్నాయి. తన ఆవేశాన్నంతా నా నడుముకి చుట్టేసినట్లు అది మరింత సన్నబడి, గాలిలో పెట్టిన దీపంలా ఊగుతోంది. తన ఇష్టాన్నంతా బొడ్డులో దాచినట్లు ఆ ప్రాంతమంతా ప్రకంపనాలమయంగా వుంది.    
    
    ఎలా ఇంటికొచ్చావో తెలియదు.
    
    దొడ్లోని నులకమంచం మీద పడుకున్నాను. దూరంగా మంగళం పాట విన్పిస్తోంది.
    
    నాటకం అయిపోయిందిగానీ, జనం ఇళ్ళకు రావడంగానీ, మా ఆయన వచ్చి రూమ్ లో పడుకున్నట్లుగానీ నాకు తెలియదు.
    
    ఇవన్నీ కూడా నాకు సంబంధించినట్లు అనిపించాలేదు. నా లోకం వేరయిపోయింది.
    
    మరుసటి రోజునుంచి కొత్త మహితనై పోయాను. అంతకు ముందు జీవితాన్నంతా పిల్లలు పలకమీద రాసిన వాటిని ఎంగిలిపూసి చెరిపేసినట్లు దినకర్ తన ఎంగిలితో మాయం చేసినట్లనిపించింది.
    
    అతను కనపడగానే ఏదో తెలియని సంచలనం కళ్ళలో మొదలయి ఎదంతా పాకుతున్నట్లుండేది.
    
    ఇదిలా కొనసాగుతూనే వుంది.
    
    మళ్ళీ మేమిద్దరం తటస్థపడలేదు.
    
    వ్యవసాయం పనులు చివరికొచ్చాయి. నూర్పుళ్ళు అంతా అయ్యేటప్పటికి నెలకు పైనే అయింది.
    
    మళ్ళీ విశ్రాంతి దొరికింది వూరికి.
    
    మాకు రెండు కిలోమీటర్ల దూరంలో వెంకటంపల్లి అనే వూరుంది. అది చిన్న టౌన్. ఓ టూరింగ్ టాకీస్ వుంది. అందులో లవకుశ సినిమా రావడంతో రోజూ మా ఊర్నుంచి జనం విపరీతంగా పోతున్నారు.
    
    మా చుట్టుప్రక్కల ఇళ్ళవాళ్ళు కూడా ఆ సినిమాకు పోవడానికి నిర్ణయించారు.
    
    భోజనం చేసి బయలుదేరడానికి వీలుగా వుంటుందని సెకండ్ షోకి బయలుదేరాం.
    
    వెంకటగిరిలో నాటకం వుందని సుధాకర్ మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు. మధుమతి ఇంటికి దూరం కావడంతో రానంది. మా ఇంట్లోకి నేనొక్కదాన్నే.
    
    పక్కింటి సరస్వతితో కలిసి బయల్దేరాను.
    
    "సినిమా వదిలాక మనకుతోడు?" అని అడిగాను.
    
    "మగవాళ్ళు చాలామందే వెళ్ళారు ఎవరో ఒకరు తోడుంటారులే" అని భరోసా ఇచ్చింది సరస్వతి.
    
    మొత్తం నలుగురు ఆడవాళ్ళం పొలాల వెంబడి అడ్డదారిగుండా నడిచాం.
    
    ఎంత తొందరగా నడిచినా మేం వెళ్ళేటప్పటికి సినిమా మొదలయి పోయింది. కుర్చీ టిక్కెట్లు కొన్నాం.
    
    చీకట్లోనే సీట్లు వెదుక్కుని కూర్చున్నాం.
    
    ఒకటే ప్రొజెక్టర్ కావడంతో రీలు రీలుకి మధ్య కొంతసేపు బ్రేక్ పడుతోంది. లైట్ వెలుగుతోంది.
    
    లైటు వెలిగినప్పుడల్లా తోడుకోసం మా వూరు మగవాళ్ళు ఎవరైనా వున్నారేమోనని చూశాం.

 Previous Page Next Page