కానీ వరి నూర్పుళ్ళు వుండడంతో రాలేకపోతున్నామని నాన్న ఉత్తరం రాశాడు. మా ఇంటికి తప్ప మిగిలిన ఇళ్ళకంతా బంధువులు వొచ్చారు.
అందుకే మా ఊరే అలంకరించిన రంగస్థలంలా వుంది. అటూ ఇటూ కట్టిన రంగు కాగితాల తోరణాల్లా కొత్త కొత్త స్త్రీలు హడావుడిగా తిరుగుతున్నారు. పెట్రోమాక్స్ లైట్లలా అమ్మాయిలు మెరిసిపోతున్నారు.
సాయంకాలానికి గూడూరు నుంచి నిర్మల, రాణి వచ్చారు. వాళ్ళిద్దరిలో ఒకరు సీత వేషము కడుతుంటే, మరొకరు డాన్సర్. డ్రామా మధ్య- మధ్యలో రిలీఫ్ కోసం రికార్డ్ డాన్సులన్న మాట.
వాళ్ళను చూడడానికి జనం క్యూ కట్టారు.
రాత్రి పదిగంటలకి నాటకం మొదలైంది.
ఊరికి కొద్దిదూరంలో పొలాల్లో స్టేజీ వేశారు. చుట్టూ డేరాలు కట్టారు.
నేనూ, మధుమతి భోజనాలు ముగించుకుని బయల్దేరాం, వీధిలో పోకుమా పొలాల వెంబడి వెళ్ళి స్టేజీని చేరుకున్నాం. మా ఆయన ఏడుగంటలకే వెళ్ళిపోయారు. మేం వెళ్ళి కూర్చున్నామోలేదో లైట్లు ఆరిపోయాయి. తెర వెనక మాత్రం వెలుగుంది.
నటీనటులంతా కలిసి పరాబ్రహ్మ, పరావిష్ణు అంటూ తప్పుల తడకలతో, గొంతులు కలవకుండా, గిన్నెలో వేసిన పీతలు కదిలినట్లు ప్రార్ధనలు పాడారు.
తెరపైకి లేచింది. విజిల్స్, చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.
మొదట ఆంజనేయులు వచ్చాడు.
మైక్ ఎక్కడో వెతుక్కుని పద్యం పాడబోయాడు. కానీ నోటికి పెట్టిన రెండు బెండ్లు ఒకదాని కొకటి అతుక్కుపోవడంతో నోరు పెగలడం లేదు. వూఁ వూఁ అంటూ గింజుకున్నాడు గానీ అది వూడిరావడం లేదు.
చివరికి అతను విసిగిపోయి మూతి ముందుకు రావడానికి కట్టిన ఆ బెండులను లాగేశాడు.
జనం ఒకటే హాహాకారాలు ఇవేమీ పట్టించుకోకుండా అతను పద్యం అందుకున్నాడు. పద్యంపాడి చివరగా రాగం అందుకున్నాడు.
నిముషమైంది. రెండు నిముషాలైంది - రాగం నిలపడే, డ్రామా మాస్టారు ఎంతగా వెళ్ళిపొమ్మని చేయి ఊపుతున్నా అతను గమనించడం లేదు ఈ దెబ్బతో షణ్ముఖ ఆంజనేయులో తనో తేల్చుకోవాలన్నట్లు అలా రాగం తీస్తూనే వున్నాడు.
డ్రామా మాస్టారు చేయి వూపడంతో సుగ్రీవుడు లోపలినుంచి వూడిపడ్డాడు. పాపం మేకప్ మ్యాన్ తోక పెట్టడం మరిచిపోయినట్లున్నాడు. తోక లేకుండానే వచ్చేశాను.
"తోక..... తోక....." జనంలోంచి ఎవరో అరిచారు.
"ఈ సుగ్రీవుడికి తోక వెనుకలేదు ముందుంది. అడ్జెస్ట్ చేసుకోండి" రెండోవైపు నుంచి ఎవరో అరిచారు.
సుగ్రీవుడు ఏదో డైలాగ్ చెప్పాడు. అప్పటికి కూడా ఆంజనేయులు రాగం ఆపలేదు. అదలా సాగుతూనే వుంది. మరోసారి అదే డైలాగ్ చెప్పాడు సుగ్రీవుడు.
ఊహూఁ లాభం లేకపోయింది.
సుగ్రీవుడికి కోపం వచ్చింది. రెండు అడుగులు ముందుకేసి ఆంజనేయులు చెంపమీద ఒకటి పెరికాడు.
ఆంజనేయులుకి దిమ్మ తిరిగింది. అలా నిట్రాటలాగా చూస్తుండి పోయాడు.
లేకపోతే ఏమిటోయ్ నేను వచ్చి డైలాగు చెప్పినా రాగం నిలపకుండా ఒళ్ళు కొవ్వెక్కిందా.
మైక్ ముందు వుంచడంతో సుగ్రీవుడు అన్న మాటలన్నీ వినిపించాయి.
ఆంజనేయులు అప్పుడు తిరగబడి, సుగ్రీవుడి మీదకు లంఘించాడు. ఇద్దరు కొట్టుకుంటారని ఊహించడంతో ఆ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు పరుగెత్తి ఇద్దర్నీ లాగేశారు. జనం ఈలలు, కేకలతో చెవులు తూట్లు పడుతున్నాయి.
మైరావణుడు వేషంలో వున్న సిద్దయ్య వచ్చాడు. పద్యం అందుకున్నాడు.
పక్కన ఎవరూ లేకపోవడంతో పద్యం ఎందుకు పాడుతున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు.
పద్యం సగంలో బ్రేక్ పడింది. ఆ తర్వాత పాదం ఏమిటో గుర్తొచ్చి చావడంలేదు.
ప్రాంప్టింగ్ కుర్రాడివైపు చూశాడు. అతను ఎత్తిస్తున్నాడుగానీ ఇతనికి వినిపించటం లేదు.
సిద్దయ్యలో అసహనం పెరిగిపోయింది. "ఇంకొద్దిగా గొంతు పెంచి చెబితే నీ సొమ్మేం పోయిందయ్యా, నాటకం అయిపోయాక అయిదు రూపాయలిస్తా, నా పరువు తీయకు" చిన్నగా అర్దిస్తున్నట్లు అడిగాడు.
తన ముందు మైక్ వుందన్న విషయం అతనూ మరిచిపోయాడు. జనం విరగబడి నవ్వారు.
ఇంకో పాత్ర వచ్చింది. వేషధారణబట్టి రావణాసురుడై వుండాలి.
అతను పద్యం పాడాలి. కానీ దేనికోసమో ఆతృతతో అతను ప్రేక్షకులవైపు చూస్తున్నాడు.
అతను చూస్తున్నది దొరికినట్లు లేదు. నాలుగువైపులా కలయ జూస్తున్నాడు.
డ్రామా మాస్టారు పద్యం అందుకొమ్మని హార్మోనియం మీద వాయిస్తూ సైగ చేస్తున్నాడు కానీ లాభం లేదు. అతను జనంవైపు చూడడం మానలేదు.
"ఏమైంది?" మాస్టారు అరిచారు.
"ఒక్క క్షణం సార్ మా బంధువులు వచ్చారు. పూలమల వేసుకుంటే తప్ప మూడ్ రాదు సార్. వాళ్ళెక్కడో నిద్రపోయినట్లున్నారు కాస్తంత లేపండి"
జనం కూడా తని బంధువుల కోసం చూశారు ఎక్కడా కనపడడం లేదు. టిక్కెట్లు కొనకపోవడం వల్ల వాళ్ళని గేటు దగ్గర ఆపేశారని ఎవరో చెప్పారు.
దాంతో రావణాసురుడికి కోపం వచ్చింది. మా వాళ్ళని ఆపిందెవరు? ఎవడికంత ధైర్యం? ముందు వాళ్ళని లోపలికి పంపిస్తే తప్ప పద్యం పాడను.
ఈలోగా ఆయన బంధువులు లోపలికొచ్చారు. పరుగున స్టేజీమీదకి వెళ్ళి పూలమాలను మెడలో వేశారు. మరుక్షణంలో ఆయన పద్యం అందుకున్నాడు.
ఆయన రాగానికి, హావభావాలకి మురిసిపోయిన బంధువుల్లో ఒకామె పళ్ళెంలో కర్పూరం వెలిగించి దిష్టి తీయడం ప్రారంభించింది.
స్టేజ్ డెకరేషన్ చేసిన వ్యక్తి పరుగున అక్కడికి వచ్చి, ఆమెకు రెండు చేతులూ ఎత్తి నమస్కరించి, "అమ్మా! ఇక దిష్టి ఆపు. బళ్ళారి రాఘవకు కూడా ఇంత దిష్టి తీసుండరు. నీ చేయి మరి కాస్తంత కుడివైపుకు వెళితే స్టేజీ అంటుకుంటుంది" అన్నాడు.
ఆమె విసుక్కుంటూనే దిష్టి ఆపింది. అగ్ని ప్రమాదం అలా తప్పిందన్న మాట.
రంగం మారింది. తెర కిందకు దిగింది. రాణి డ్యాన్స్ అని ప్రకటించారు.
కానీ తెర లేవడం లేదు. రాణీ కనిపించడం లేదని మైక్ లోంచి గుసగుసల వల్ల తెలుస్తోంది.