Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 15


    
    అతనికి చిన్మయిలో యీ రోజు ఓ కొత్తరూపం గోచరించింది. ఆమె యింత అద్భుతంగా పాడగలదనీ, ఆమెలో ఇంత సంగీత తపస్విని వున్నదనీ అతను కలలో కూడా ఊహించలేదు.
    
    అలాగే మధురానుభూతి పొందుతూ కదలకుండా నిలబడిపోయాడు.
    
    ఓ నిముషం గడిచాక చిన్మయి తలత్రిప్పి చూసి హఠాత్తుగా పాట ఆపేసి "అరె! మీరా?" అంది సిగ్గుపడిపోతూ.
    
    "చిన్మయీ!" అన్నాడు అతని కళ్ళలో కొంచెం తడి, గొంతులో చిన్న ఒణుకు చిన్నగా అడుగులు వేస్తూ దగ్గరకు వచ్చాడు.
    
    "నువ్వింత గొప్ప సంగీత కళాకారిణివని నాకెప్పుడూ చెప్పలేదేం?"
    
    "మీరు... ఎప్పుడు లేచారు?"
    
    "నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు?"
    
    "నేనంత విద్వాంసురాలినేమీ కాదు. చిన్నప్పుడు కొంతవరకూ సంగీతం అంటే కృతులూ, కీర్తనలూ నేర్చుకున్నాను"
    
    "మరి యిన్నాళ్ళూ పాడలేదేం?"
    
    ఆమె ఏమీ జవాబు చెప్పకుండా ఓ పక్కకి చూస్తూ నిలబడింది. ఎంత చీకటితో నిద్రలేచిందో ఏమో తలారా స్నానం చేసి జుట్టు విరబోసుకుని వుంది తలారబోసుకున్నట్టు ఎర్రచీరె, ఎర్రని జాకెట్టు.
    
    "చెప్పు"
    
    "ఊ" అంటూ అతనివైపు తిరిగింది.
    
    నుదుట కుంకుమకూడా ఎర్రగా మెరుస్తోంది.
    
    "నేనడిగిన ప్రశ్న?"
    
    "మీరేమైనా అనుకుంటారేమోనని."
    
    "మరి ఈవేళ...?"
    
    "రాత్రంతా నిద్రపట్టలేదు. చీకటితోనే లేచిపోయి స్నానంచేసి, మనసారా అమ్మవారి పూజ చేసుకున్నాను. తర్వాతెంతో ప్రశాంతంగా వున్నట్లనిపించింది. లోపల్నుంచి వుద్వేగమో, సంతోషమో ఏదో పొంగినట్లయింది. పాడకుండా వుండలేకపోయాను."
    
    "సంగీతం గురించి నాకేమీ తెలియదు. మంచిపాట వినిపిస్తే విని అనందించగలగటం తప్ప నువ్వు పాడింది ఏం పాట?"
    
    "అది త్యాగరాజ కృతి పూర్ణషడ్జరాగం, రూపకతాళం."
    
    అతను ఆమెవంక తన్మయంగా చూస్తున్నాడు.
    
    "ఏమిటలా చూస్తున్నారు?" అంది యింకా సిగ్గుపడిపోతూ.
    
    "ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా?"
    
    "ఊ...?"
    
    "పెళ్ళయిన యిన్నాళ్ళకు... ఈ క్షణాన..."
    
    "....చెప్పండి."
    
    "నేను నీకు తగిన భర్తను కానేమోనని..." తన మనసులోని భావం బయటకు చెప్పలేదు.
    
                                                              * * *
    
    ఉదయం ఆఫీసుకు వెళ్ళేతప్పుడు రాజీవ్ చెప్పి వెళ్ళాడు. తన ఆఫీసులో ఒక కొలీగ్ పెళ్లి సాయంత్రం హేమమాలిని కళ్యాణమండపంలో జరుగుతున్నదనీ, అతను తనకి చాలా క్లోజ్ అవటంచేత దగ్గరుండి ఏర్పాట్లూ అవీ చెయ్యాలనీ, రాత్రికి డిన్నర్ కూడా అయ్యాక ఆలస్యంగా వస్తాననీ చెప్పాడు.
    
    చిన్మయి ముఖమంతా ఓ రకం దిగులుతో నిండిపోయింది.
    
    రాజీవ్ వెంటనే అది గమనించాడు. "చిన్మయీ! పోనీ నువ్వుకూడా వస్తావా?" అన్నాడు.
    
    "వద్దులెండి. నాకు వాళ్ళంతా కొత్త వాళ్ళందరి మధ్యా నాకు చాలా మొహమాటంగా వుంటుంది" అంది చిన్మయి.
    
    ఆమె మొహంలోని దిగులు అతనికి చాలాబాధను కలిగించింది. "చిన్మయీ! కోపమొచ్చిందా?" అనడిగాడు చాలా సౌమ్యంగా.
    
    "ఛా! యింత చిన్న పాయింటుకోసం కోపమెందుకండీ? మొగవాడన్నాక అనేక సోషల్ ఏక్టివిటీస్ వుంటాయి. మాకర్ధంకాని అనేక బాధ్యతలుంటాయి. ఆ మాత్రం అర్ధం చేసుకోలేనంత మూఢురాలినేమీ కాదు. మిమ్మల్ని బంగారు పంజరంలో బంధించాలని ఎప్పుడూ అనుకోవటంలేదు. కాకపోతే యింకా కొత్తకదూ, అలవాటు కాలేదు" అంది చిన్మయి.
    
    రాజీవ్ చాలా నిశ్చింతగా ఫీలయి తేలికపడ్డ మనసుతో ఆఫీసుకెళ్ళిపోయాడు.
    
                                                             * * *
    
    మధ్యాహ్నం లంచ్ అవర్ లో తనూజ అతని గదిలోకి వచ్చింది. పుట్టినరోజు నాటి కన్నా ఈవేళ కొంచెం ఎక్కువగా అలంకరించుకుంది. నిజంగా చాలా అందంగా వుంది.
    
    "ఖాళీ వున్నప్పుడు మీరెవరితోనూ కలవరేం? అంత రిజర్వ్ డ్ గా వుండటం దేనికి?" అనడిగింది.
    
    "ఇతరులతో స్నేహం చేసినకొద్దీ కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నట్లుగా వుంటుంది. ఎక్కువ పరిచయాలు ఉపయోగంకన్నా యిబ్బందుల్నే కలగజేస్తూ వుంటాయి."
    
    "మీ ఆర్గ్యుమెంట్ నేనొప్పుకోను."
    
    "నష్టంలేదు" అన్నాడు నవ్వుతూ.
    
    "పోనీ నేను కొంతవరకూ అలవాటు పడ్డాగా నాతో స్నేహంగా వుండవచ్చుగా?"
    
    "ఒక స్త్రీకీ, పురుషుడికీ మామూలు స్నేహం అంతగా సాధ్యంకాదు. ఎక్కడో అక్కడ ఆకర్షణ చోటు చేసుకుంటుంది."
    
    "అయితే మనమధ్య ఆకర్షణ వుందంటారా?"
    
    అతనేమీ మాట్లాడలేదు.
    
    "పోనీ ఆకర్షణ ఉద్భవిస్తుందని అనుమానిస్తున్నారా?"
    
    అతనప్పటికీ ఏమీ మాట్లాడలేదు.
    
    "మాట్లాడరేం?"
    
    "ఒక అందమైన యవ్వనాలు చిలుకుతూన్న ఆడదాన్ని చూస్తే ఆకర్షణ లేదంటే అతిశయోకతి అవుతుంది. ఆకర్షణ వుండటం వేరు దాన్ని నిర్దాక్షిణ్యంగా అదిమేయటం వేరు."
    
    "అయితే మీలో వుండికూడా అదిమేస్తున్నారా?"

 Previous Page Next Page