Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 15


    తనకు తెలిసినవాడా? తనెప్పుడయినా చూసి ఉంటుందా?
    
    ఎవరై ఉంటాడు!
    
    రాఖేష్, మనోజ్- ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరై ఉంటారా?
    
    కళ్ళు మూసుకున్నా తెరిచినా ఏదో ఏదో ఓ సమ్మోహనరూపం, ఆ తియ్యని పదం...
    
    ముద్దు!
    
    పెదిమలు పులకరించినట్లయినాయి.
    
                                              * * *
    
    రాజాచంద్రకు జ్వరం తగ్గటానికి నాలుగయిదు రోజులు పట్టింది. అతనికి ఎంతో తప్పనిసరి అయితేగాని రెస్ట్ తీసుకునే అలవాటు లేదు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండాలి. ఒక నిముషం వృధాగా గడిచినా విలవిల్లాడిపోతాడు. ఇతరులు వృధా చేస్తున్నా చూడటానికి చాలా బాధపడతాడు. కాని బయటకు చెప్పడు.
    
    "విశారదా!" అన్నాడు జ్వరంలో ఉన్నప్పుడు ఆమె పక్కన కూర్చుని పాలు తాగిస్తోంటే."
    
    "జ్వరం ఇంత హాయిగా వుంటుందని తెలీదు"
    
    "అదేమిటి?"
    
    "నువ్వలా నన్ను పడుకోబెట్టి సపర్యలు చేస్తుంటే అంతకంటే గొప్ప అనుభూతి ఏముంది?"
    
    విశారద నవ్వింది. "నాతో సపర్యలు చేయించుకునేందుకు జ్వరమే రావాలా? లేకపోతే చెయ్యకూడదా?"
    
    "అవసరం లేనప్పుడు నిన్ను బాధపెట్టటం నా కిష్టం లేదు."
    
    "ఇది బాధ కాదండీ! మీకు సపర్యలు చెయ్యటం నాకో అద్భుతమైన అనుభూతి."
    
    ఆమె కళ్ళలోకి చూశాడు. అప్పుడతనికి ఓ అందమైన కల వచ్చింది. అలా పగటికలలు కనటమతని కలవాటు.
    
    "చూడూ! నాకే ఉద్యోగధర్మమూ ఉండకూడదు, వ్యాపకం ఉండకూడదు. జీవితంలో ఏ బాదరబందీ ఉండకూడదు. హాయిగా,  ప్రశాంతంగా కూర్చుని, నాకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ, నాకు నచ్చిన సంగీతంవింటూ, నా ఆలనాపాలనా నీకప్పగించేసి, నిశ్చింతగా గడపటం..." ఆ దృశ్యాలు నా కళ్ళముందు కదలాడుతున్నాయి.
    
    అతను గొప్ప భావుకుడు ఏ కళనూ అభ్యసించి ఉండకపోవచ్చుగాని, కళాత్మకమైన హృదయమున్నవాడు.
    
    "యు ఆర్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ అప్పుడే అంత ముసలితనపు కబుర్లు చెప్పకూడదు."
    
    "నాలో మానసిక వృద్దాప్యం రాలేదు. కాని చివరిదశలో అలా ఉండాలని నా కోరిక."
    
    ఆమె గుండెలో ఏదో గుచ్చుకున్నట్లయింది.
    
    "అబ్బ! అలా మాట్లాడకంది. కొన్ని మాటలు వినాలంటే నాకు భయం మీ జీవితానికి చివరిదశ అనేది ఉండకూడదు. ఇది నా స్వార్ధం" అన్నది. ఆమె గొంతు వణికింది.
    
    రాజాచంద్ర ఆరోజు ఆఫీసుకు బయలుదేరాడు. నీరసంగా ఉండడంవల్ల కారు డ్రైవ్ చెయ్యలేక రిక్షా ఎక్కాడు.
    
    రిక్షా అతను చాలా రాష్ గా పోతున్నాడు. సైకిళ్ళకూ, స్కూటర్లకూ, కార్లకూ అడ్డంగా వెడుతూ, పైగా వాళ్ళది తప్పయినట్లు తిడుతున్నాడు.  తొక్కుతున్నంత సేపూ గొణుక్కుంటూనే ఉన్నాడు.
    
    రాజచంద్రకు చాలా ఎలర్జీ అనిపించింది.
    
    "ఎందుకయయా! అలా ఓ చప్పుళ్ళు చేస్తావు! కామ్ గా పోకూడదూ" అన్నాడు.
    
    "కామ్ గానా? ఎందుకు పోవాలి?" అన్నాడు.
    
    "ఎందుకేమిటి? అలా విధీవిరామం లేకుండా ఎదుటివాళ్ళని తప్పు లెంచుతూ, దెబ్బలాడుతూ ఉండడం అసహ్యం కాదూ?"
    
    "నేను అన్యాయాన్ని సహించను. నేను తప్పు చెయ్యను ఇంకోడు చేస్తుంటే చూస్తూ ఊరుకోను. అది నా పాలసీ అంతే" అన్నాడు.
    
    అతనామాట అంటూనే ఉన్నాడు. ఎదురుగా వస్తున్న స్కూటర్ కు చూసుకోకుండా ఠప్ మని డాష్ ఇచ్చాడు.
    
    రాజాచంద్ర జరిగేది చూస్తూనే ఉన్నాడు. "అరె..." అన్నమాట నోట్లోనే ఉండిపోయింది. రిక్షా ఒరిగి కిందకి దొర్లిపోయాడు. "అయ్యో! అన్న ఓ మృదువైన కంఠం వినిపించింది పక్కనుంచి.
    
    తల నెలకి కొట్టుకుని చిట్లిపోయేదే కాని ఎవరో తమ శక్తినంతా ఉపయోగించి అతన్నాపారు.
    
    తన పని అయిపోయిందని నిర్దారణతో ఉన్న అతను, అమృతం కురిసినట్లయి, తనని కాపాడిన వ్యక్తివైపు చూశాడు.
    
    ఒక్కసారిగా త్రుళ్ళిపడ్డాడు.
    
    ఆ అమ్మాయికి ఇరవై రెండేళ్ళో, ఆ పైన కొంచెమో ఉంటాయి.
    
    "ఏమండీ! మీకు దెబ్బ తగిలిందా?" అని ఆప్యాయంగా అడుగుతుంది.
    
    ఆ మాట అతనికి వినిపించటంలేదు. ఆమెవంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
    
    అచ్చు గుద్దినట్లు, ముమ్మూర్తులా విశారదలా ఉంది.
    
                                               5
    
    జనం చుట్టూ గుమిగూడుతున్నా పట్టించుకోకుండా రాజాచంద్ర ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చంద్రబింబంలా నిండుగా, అందంగా, అమాయకంగా...దాన్ని గురించి కాదు. అచ్చం విశారదలా...
    
    మనిషిని పోలిన మనుషులు ఉంటే ఉండొచ్చు. తాను కొంతమంది కవలల్ని కూడా చూశాడు. వాళ్ళలో కూడా ఏదో తేడా కనిపిస్తూ ఉంటుంది. కాని ఈ అమ్మాయి ముమ్మూర్తులా విశారదలా ఉంది. తేడా అల్లా ఒకటే వయసు.
    
    "సార్! దెబ్బ తగిలిందా?" అని పరామర్శిస్తుంది. ఆ గొంతు-విశారద మాట్లాడినట్లే ఉంది.
    
    "లేదు" అన్నాడు కాని శరీరంలోని కండరాలన్నీ చాలా నొప్పిగా ఉన్నట్లనిపించింది.

 Previous Page Next Page