మల్టీ నేషనల్ కంపెనీల మధ్య పోరాటాలు ఈ విధంగానే సాగుతాయి. ఈ పోరాటం కూడా మూడు నెలలపాటు ఈ విధంగానే సాగింది.
చెంచురామయ్య అంచనా ఎక్కడ తప్పిందంటే-ప్రజలు వ్యక్తుల్నీ, సంస్థల్నీ చూడరు. ప్రొడక్టు చూస్తారు. రెలియన్స్ అంటే తెలీదు. 'విమల్' అంటే తెలుస్తుంది. గార్డెన్ కన్నా వెరైటీ అంటే తెలుస్తుంది.
అలాగే రవితేజ ఆర్ధిక సంక్షోభం-తాత్కాలికంగా పురోగతిని ఆటంకపరచినా, ఆర్టీ చీరెలు, ఆప్లిక్ చీరెలు- వీటిని ప్రజలు ఎగబడి కొంటూనే వున్నారు. ఒకవైపు నుంచి మబ్బులు మూసుకుంటున్నాయని, ఏ క్షణమైనా పిడుగు పడవచ్చని అనుకుంటున్న సమయాన, ప్రధానమంత్రికీ, ఆర్ధికమంత్రికీ మధ్య పొరపొచ్చాలు రావటం, కాబినేట్ మార్పుల్లో అతడికి పదవిపోయి, తూర్పు దిక్కుగా తోసివేయబడటం జరిగింది. ఒక్కసారి ముఖ్యమైన మనిషి పదవినుంచి తొలగిపోయాక, చిన్న చిన్న శత్రువుల్ని సరిదిద్దటం తేజా టెక్స్ టైల్స్ లాంటి మల్టీక్రోర్ సంస్థకి పెద్ద సమస్య కాలేదు.
చెంచురామయ్య మీద ఈ విజయంతో రవితేజ పేరు ఒక్కసారిగా పైకి దూసుకుపోయింది.
ఒక స్టేజి వచ్చాక మనం చేసేది ఏమీ వుండదు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు ఇచ్చే సలహాల మీద మన తెలివితేటలు ప్రయోగించి నిర్ణయాలు తీసుకుంటే చాలు. ఈ గొడవల్తో మానసికంగా బెదిరిపోయి, శర్మ షేర్లు అమ్మేసి వుంటే జీవితాంతం విచారించి వుండేవాడు. అలా కాకుండా ఆపింది రవితేజా! షేర్ల అమ్మకంపై ఆర్ధిక నిపుణుల సలహాలు అనుక్షణం అతడు తీసుకుంటూ వచ్చాడు. అది లాభించింది.
ఆ రాత్రి పూర్తిగా తాగేసి, శర్మ ఏడ్చాడు. అంత పెద్దవాడూ రవితేజ చేతులు పట్టుకుని "రవీ! ఎక్కడో గాలిలోంచి వచ్చి ఈ కంపెనీ వ్యవహారాలన్నీ నీ చేతుల్లోకి తీసుకొని నన్ను కట్టి పారేశావని నాకు నీ మీద కోపం ఉన్నమాట నిజమేనయ్యా! కానీ ఈ రోజు అది పోయింది" అన్నాడు.
"ఫర్వాలేదండీ" అనలేదు రవితేజ. ఆశ్చర్యంగా శర్మవైపు చూశాడు. ఈయన ఎమ్.డి.గా ఉన్నప్పుడు ఒక్క నిర్ణయం తీసుకునేవాడు కాడు. ప్రస్తుతం ఎప్పుడూ తాగుతూనే వున్నాడు. ఏ లాభాపేక్ష లేకుండా తను ఇంత భారాన్ని వేసుకుని చేస్తుంటే, ఆయనకి ఇప్పటివరకూ తనమీద కోపంగా వుండేదిట.
ఆ రాత్రి అతడు డైరీలో వ్రాసుకున్నాడు- "నేనిదంతా ఎందుకు చేస్తున్నాను? ఎత్తులు, పైఎత్తులు, ఘర్షణలు వీటి మధ్య ఒకప్పుడు నాలో వుండే భావుకుడు ఏమయ్యాడు? వెన్నెల్లో కూర్చుని భావపు అంచుమీద జరీపాత నేసినవాడు ఏమయ్యాడు? కాలే కడుపుతో నెత్తిక్రింద బట్టలమూట పెట్టుకుని ఫుట్ పాత్ లమీద పడుకున్నప్పుడు లోపల్నుంచి పారిపోయాడా? నాలో ఈ దాహం ఎప్పటికి తీరుతుంది? జీవితాన్ని ఆనందంగా అనుభవించటం పోయి ఇంకా ఇంకా ఏదో సాధించాలన్న తపనే ఎందుకు ఎక్కువ అవుతోంది? కేవలం యింట్లో సంసార సుఖం లేకపోవటం వల్లేనా? ఇంట్లో సుఖంలేని వాళ్ళే బయట రంగాల్లో చాలా పైకి వస్తారన్నది సత్యమేనా? చిన్నతనం నుంచీ ప్రేమ లేకపోవటంవల్ల నేనిలా 'పనిదాహం'తో తయారయ్యానా? సెన్స్ ఆఫ్ అచీవ్ మెంట్ రుచి చూసిన మనిషికి ఇక దేన్లోనూ ఉత్సాహం వుండదా? ఏది ఏమైనా నాక్కొద్దిగా ఆటవిడుపు కావాలి. లేకపోతే ఎక్కువకాలం పని చెయ్యలేను...."
డైరీ మూసేశాడు. బయట వర్షం మొదలైంది కిటికీ తలుపు వేయటానికి వెళ్ళాడు. పైన ఆకాశంలో మబ్బులు ముంచుకొస్తున్నాయి.
అతడి భవిష్యత్తు మీదకి-విధిలా-దట్టంగా.
7
బయట వర్షం ఎక్కువైంది. గట్టిగా ఉరిమిన శబ్దం వినిపించింది. తన గతం తాలూకు ఆలోచన్లనుంచి రవి ఆ రాత్రి బయట పడలేకపోతున్నాడు. ఎందుకో అతడి మనసంతా ఎగోనీతో నిండి పోయింది. ఎందుకీ జీవితం? అనిపిస్తూంది. కొంతకాలం ఏ స్విట్జర్లాండో వెళ్ళిరావాలి. వెళ్ళినా లాభం వుంటుందా? ..... తన మనసులో బాధనంతా ఎవరికయినా చెప్పుకోవాలన్న తపన ఈ మధ్య బాగా పెరుగుతోంది. బాధంటే మళ్ళీ ఏమీ ఉండదు. ఎప్పుడూ ఆహ్లాదంగా నవ్వే చిన్నపిల్లల కంపెనీలో ఎక్కువసేపు గడపాలని వుంటుంది లేకపోతే ప్రకృతి దృశ్యాలని చూడాలని ఉంటుంది. ఇలాటివే చిన్న చిన్న కోర్కెలు.
నేతచీరెల మధ్య భావుకత్వపు అద్దకాన్ని అతడు హృదయం మీద హత్తుకుని పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రొద్దున్నించి సాయంత్రం వరకూ అతడిది చీరెల ప్రపంచమే. ఎంతో అందమైన మోడల్స్ - రకరకాల చీరెల్లో, డిజైన్లలో, మత్తు గొలుపుతూ- 'ఏ వంపు దగ్గిర చీరె ఎలా మడత పడాలి- అన్న విషయం దగ్గిర్నుంచి ఏ పువ్వు అద్దకం ఎక్కడ ఇమడాలి' వరకూ అతడితో చర్చించే అందమైన అసిస్టెంట్లు- అది ఓ రంగుల ప్రపంచం.
-ఇవేమీ అతడిని కదిలించలేదు. వాంఛాపరమైన కోరికలు అతడికి పెద్దగా లేవు. అతడివి చాలా చిన్న కోర్కెలు. విసుగు, కోపం, నిర్లిప్తత ఇలాంటి భావాలు... అవసరమైనప్పుడు తప్ప..... మిగతా సమయమంతా ఒక చిన్న చిరునవ్వు మొహంమీద కదలాడుతూ వుంటే స్త్రీకి చీరెగానీ, నగగానీ అంతకన్నా ఎక్కువ అందం ఇవ్వదని అతడి అభిప్రాయం కొంతమంది ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ వుంటారు. ఇలాంటివారిని ఎక్కువగా జపాన్, థాయ్ లాండ్ దేశాల్లో చూశాడు. నిజానికి అతడి భార్య స్థానంలో వున్న ఏ స్త్రీకయినా- విసుగు కోపం వచ్చే సందర్భాలు చాలా తక్కువగా వుండాలి. అతడికేమీ అలవాట్లు లేవు. ముఖ్యంగా...... అతడికి "వేధించే గుణం" లేదు చాలామంది మొగవారిలాగా- భార్యల పుట్టిళ్ళ గురించే ఎద్దేవా చేస్తూ మాట్లాడటం గానీ, జోకులు వెయ్యటంగానీ చెయ్యడు. ప్రతీ విషయాన్నీ అనలైజ్ చేస్తూ ఆలోచించడంవల్ల అతడికి కోపం, ఉద్వేగం లాటివి కూడా రావు. మాధవి కాకుండా ఇంకే స్త్రీ అయినా- ఆ ఇంట్లో నిశ్చయంగా ఎక్కువ సుఖపడి ఉండేది. ఎప్పుడైతే 'నెగిటివ్ థింకింగ్' వస్తుందో- తాము 'సుఖపడరు' ఎదుటివారిని సుఖపెట్టలేరు. చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కంగారు పడిపోవటం, తమ భయాలతో, అనుమానాలతో అవతలివారిని వేధించటం, అవతలివారి చిన్న తప్పులన్ ఐ కూడా భూతద్దాల్లో ఎత్తి చూపటం, నేను కాబట్టి ఈ సంసారం చేయగలుగుతున్నాను, నేను కాబట్టి మీతో ఉండగలుగుతున్నాను. నేను కాబట్టి, నేను కాబట్టి అనుకోవటం- ఇవన్నీ 'నెగిటివ్ థింకింగ్' వున్నవారి అలవాట్లు. ఎప్పుడైనా అడుగుతాడు- 'ఎందుకు మాధవీ ఎప్పుడూ నవ్వుతూ వుండవు?' 'ఆ... నా మొహానికి ఇక నవ్వుకూడానా' అంటుంది. మొగ్వాడికి అంతకన్నా శూన్యత ఏముంటుంది? ఇంతకాలం అహర్నిశలు పనిధ్యాసలో వుండటంవల్ల మిగతా విషయాల్ని పట్టించుకొనే స్థితిలోలేడు. ఇప్పుడు జీవితంలో ఒక అత్యున్నతమైన స్థానంలో నిలబడి వెనుదిరిగి చూసుకుంటే- సాధించినదాన్ని భార్యే గుర్తించడం లేదు....
బయట వర్షం ఎక్కువైంది. అతడు పక్కమీంచి లేచి బెడ్ రూమ్ కిటికీ వర్షాన్ని చూడబోయేడు. ఎలాగూ ఈ రాత్రికి ఇక నిద్ర రాదు. వర్షానికి బిగుసుకు పోయిన తలుపు ఒక పట్టాన తెరచుకోలేదు అతడి మనసులాగే.
ఈ చప్పుడికి మాధవి నిద్రలోనే అట్నుంచి ఇటు వత్తిగిలి, "అర్దరాత్రి అంకమ్మ శివాలన్నట్టు-పడుకోరు. పడుకోనివ్వరేమితి? మీకేం, రేపు ఎనిమిదింటికి లేస్తారు. తెల్లవార్నే లేచే వాళ్ళకి తెలుస్తుంది బాధ" అంది. అతడు మాట్లాడకుండా కిటికీలోంచి బయటకు చూడటం సాగించాడు. ఆమె తెల్లవారుజామునే లేవకపోయినా కొంప మునిగిపోదు అని అతడికి తెలుసు. ఆమెకి నిద్రాభంగం కలిగించటం తప్పే అదే, ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా, బైట వరండాలోకి వెళ్ళి చాలాసేపు నిలబడితే, నిద్రకళ్ళతో బయటకు వచ్చి, "లోపలికొచ్చి పడుకోకూడదూ, మళ్ళీ జలుబుచేస్తే నేనేం చెయ్యాలి- ఖర్మ" అని సాధిస్తుంది. ఏ పనిచేసినా దాన్ని వ్యతిరేకించటానికి రెడీమేడ్ గా ఒక వాదనని పెట్టుకున్న వాళ్ళకి ఏం చెప్పగలం?
జీవితంలో తనేం కోల్పోయాడు అన్నది అతడికి ఒక విదేశీయానంలో తెలిసింది. రవితేజ టెక్స్ టైల్స్ తరపున ఆర్నెల్లు ట్రైనింగ్ కి వెళ్ళవలసి వచ్చింది. అప్పటికి అతడికి మాధవితో వివాహమై నాలుగు సంవత్సరాలు కావస్తూంది. బయల్దేరుతూంటే మాధవి చెప్పింది- 'మర్చిపోరుగా, నాకో వాచీ- బంగారు చెయిన్ ది" అని. అతడు నవ్వుతూ తలూపాడు. కంపెనీ కారు విమానాశ్రయానికి తీసుకువెళ్ళటం కోసం వచ్చి యింటిముందు ఆగింది. అతడు అన్ని వస్తువులూ సరిగ్గా వున్నాయో లేదో చూసుకుంటున్నాడు.
"ఆర్నెల్లుండాలి. ఆరోగ్యం అదీ జాగ్రత్త, ఎక్కువ తాక్కండి".
అతడు నవ్వుతూ, "నాతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశావు. ఇంకెంత కాలానికి నామీద నమ్మకం ఏర్పర్చుకుంటావు మాధవీ?" అని అడిగాడు.
"కవిత్వం చాలుగానీ, బయల్దేరండి".
ఇద్దరూ కారు దగ్గరకొచ్చారు.
"వాచి సంగతి మర్చిపోకండి. రీకో-"
కారు విమానాశ్రయానికి వచ్చింది. బొంబాయి వెళ్ళే విమానం! విదేశాలకు వెళ్ళే ఎంతోమందిని తనతో తీసుకువెళుతుంది. అతడు రెండు మూడు పుస్తకాలు కొనుక్కొని వచ్చి కూర్చున్నాడు. ఇంకా అరగంటుంది బయల్దేరటానికి. అతడు అప్పుడు చూశాడు ఆ జంటని. ఇద్దరు పిల్లలనుకుంటా! బిక్కమొహంతో పక్కన నిలబడి చూస్తున్నారు. ఆమె వయసు ముఫ్ఫై అయిదు పైనే వుంటుంది. కళ్ళు రెండూ ఎర్రబడగా తలదించుకుని పైటతో వత్తుకుంటూంది. అతడు ఆమెచెంపలు తుడుస్తున్నాడు. అయితే అందులో ఏదీ కృత్రిమంగా లేదు. అది ఎంత స్వాభావికంగా వుందంటే- నత పెద్ద విమానాశ్రయంలో ఒక్కరు కూడా ఆ దృశ్యాన్ని చూసి మొహం ప్రక్కకి తిప్పుకుని నవ్వుకోలేదు. మనసంతా ఒక ఆర్ద్రభావాన్ని నింపేలా వుంది. ఆ దృశ్యం మనుష్యులకీ, జంతువులకీ తేడా ఏమిటో తెలియచెప్పేలా వుంది. ఇద్దరు పిల్లలు, ఆమె వెనుకనుంచి చేతులు ఊపుతూ వుండగా అతడు కౌంటరు వైపు సాగిపోయాడు- వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటూ.