Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 15

 

     "ఎలావుంది?" అనడిగాడు రాబోతూ.
   
    "అలాగే వుందండి. తగ్గలేదు" అంది అరుణ.
   
    "అరె, యింకా తగ్గకపోవటమేమిటి?" అంటూ లోపలకు వెళ్ళాడు.
   
    రాధ మంచంమీద పడుకునివుంది. కారాగిన చప్పుడు తనుకూడా విన్నది. ప్రదీప్ ని చూడగానే ఆమెమొహంలో సంతోషం కనిపించింది. కాని ఆమె ముఖం చాలా వడిలిపోయివుంది.
   
    "అంకుల్!" అంది లేచి కూర్చుంటూ.
   
    అరుణ కొందెం దూరంలోవున్న కుర్చీని దగ్గరకు లాగింది.
   
    "ఎలావుంది పాపా?"
   
    "తగ్గటంలేదు అంకుల్! నొప్పి ఎక్కువగా వుంది" అంది రాధ జాలిగా.
   
    "నాన్నగారులేరా?" అన్నాడు ప్రదీప్ అరుణని ఉద్దేశించి.
   
    "లేరండీ ఆఫీసుకెళ్ళిపోయారు."
   
    "డాక్టరుగారేమన్నారు?"
   
    "రెండుమూడు రోజులుగా తగ్గలేదని ఆయనకూడా బాధపడుతున్నారు. ఎవరైనా స్పెషలిస్టుకి చూపిస్తే బాగుంటుందేమో అన్నారు."
   
    "చూపించారా?"
   
    "లేదు."
   
    "ఏం?"
   
    ఆమె ఏమీ జవాబివ్వలేక తలవొంచుకుంది.
   
    "నాన్నగారు... పట్టించుకోవటంలేదా?"
   
    "అదికాదు" అంటూ ముఖం పైకెత్తింది. ఆమెకళ్ళలో చిన్న నీటిపొర క్రమ్మివుంది.
   
    "డబ్బులేక..."
   
    అతని మనసు చివుక్కుమంది. ఒకస్థితిలో వున్న మానవుడ్ని చాలా చిన్న విషయాలు కొందరు మనుషుల్ని ఎలా నలిపేస్తుంటాయో యిప్పుడర్ధమయింది.
   
    అతనికి తెలిసిన అఫ్థల్ మాలజిస్ట్ ఒకతను వున్నాడు డాక్టర్ గుర్నాథ్ అని. చాలా తెలివైనవాడు. అతను గుర్తొచ్చాడు ప్రదీప్ కి.
   
    "రండి. నేను తీసుకెళతాను స్పెషలిస్ట్ దగ్గరకు" అన్నాడు.
   
    "మీరా?" అంది అరుణ.
   
    "అవును బయల్దేరండి."
   
    పదినిముషాల్లో రాధను తీసుకుని ప్రదీప్ తో బయటికొచ్చింది అరుణ. సునీత గుమ్మంలో నిలబడి చూస్తుంది.
   
    అరుణ రాధతోబాటు వెనకసీట్లో ఎక్కబోతుంది.
   
    "ఫర్వాలేదు. యిటురండి" అంటూ ఫ్రంట్ డోర్ తెరిచాడు.
   
    మొదట రాధను ఎక్కించి, తాను డోర్ప్రక్కన కూర్చుంది అరుణ.
   
    కారు కదిలింది.
   
                                * * *
   
    డాక్టర్ గుర్నాథ్ రాధ వ్యూపిల్స్ డైలేట్ చేసి ఆఫ్ థల్ మాస్కోప్ తో ఫండో స్కప్ చేశాడు.
   
    "ఊరంతా ఎపిడమిక్ గా కన్ జక్టివైటిస్ వుంది కాబట్టి అదే అనుకోవటంలో తప్పులేదు. కాని ఎడమకన్ను కేవలం కన్ జక్టివైటిస్ లా లేదు. అఫ్ కోర్స్ కుడికన్ను ఎక్యూట్ వైరస్ ఇన్ఫెక్షన్ లాగే వుంది." అన్నాడు డాక్టర్ గుర్నాథ్ ఎగ్జామిన్ చెయ్యటం పూర్తయ్యాక.
   
    "మరి?"
   
    "నాకేవో కొన్ని డౌట్స్ వున్నాయి. సరిగ్గా చెప్పలేను. సూపర్ స్పెషలిస్ట్ తో చూపిస్తే బాగుంటుంది."
   
    "ఎవరికి చూపించమంటారో చెప్పండి."
   
    "డాక్టర్ అశోక్ అని స్టేట్స్ లో పనిచేసి యీ మధ్యనే శ్రీలక్ష్మి హాస్పిటల్స్ లో ఆఫ్ థర్మాలజీ యూనిట్ కి చీఫ్ గా వచ్చారు. బ్రిలియంట్ చాప్, ఆయనకు చూపిస్తే బాగుంటుంది."
   
    "శ్రీలక్ష్మి హాస్పిటలా?"
   
    "ఏం?"
   
    ఆ రోజు వార్షికోత్సవ సభలో ఉపేంద్ర తమ హాస్పిటల్లో త్వరలోనే అఫ్ థల్మాలజీ యూనిట్ ఓపెన్ చెయ్యబోతున్నామనీ, దానికి అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్ అశోక్ ను ఛీఫ్ గా నియమించబోతున్నామనీ చెప్పటం గుర్తొచ్చింది.
   
    "ఏంలేదు. అలాగే."
   
    వస్తానని చెప్పి అక్కడ్నుంచి వచ్చేశాడు.
   
    అరుణని, రాధను వాళ్ళింటిదగ్గర దింపి, "నేను మళ్ళీ కలుస్తాను. శ్రీలక్ష్మి హాస్పిటల్లో చూపించాలనుకుంటున్నాను" అన్నాడు.
   
    "శ్రీలక్ష్మి హాస్పిటలా?" అంది అరుణ ఆశ్చర్యంగా.
   
    "అవును! ఏం?"
   
    "అది చాలా గొప్ప హాస్పిటల్ అంటారు. మాలాంటి సామాన్యులకి...."
   
    "నే వున్నాగా" అన్నాడు ప్రదీప్ నవ్వి.
   
    అతను వెళ్ళబోతుంటే "అంకుల్!" అంది రాధ భయంగా అతని చెయ్యి పట్టుకుని.
   
    "నన్నెందుకు యిన్నిచోట్ల త్రిప్పుతున్నారు? నాకు నయమవుతుందా?"
   
    "తప్పకుండా నయమవుతుందమ్మా! మంచి డాక్టరుకు చూపిస్తే తొందరగా నయమవుతుందనీ..."
   
    "అంకుల్! నాకు భయంగా వుంది."
   
    "భయంలేదమ్మా నే వున్నాగా" అని బుగ్గమీద చిటికె వేసి కారెక్కాడు. ఆ సాయంత్రం శ్రీలక్ష్మి హాస్పిటల్ కు ఫోన్ చేసి డాక్టర్ అశోక్ తో మాట్లాడాడు.
   
    మర్నాడు ఉదయం తొమ్మిదిగంటలకు ఎపాయింట్ మెంట్ ఇచ్చాడు.
   
                                 * * *
   
    శ్రీలక్ష్మి హాస్పిటల్ ఆవరణలో కారు పార్క్ చేసి దిగుతుంటే అరుణా, హనుమంతరావుగారు ఆ సువిశాలమైన భవనాలకేసి భయంగా, విస్మయంగా చూశారు.
   
    వాళ్ళని తీసుకుని ప్రదీప్ లోపలకు వెళుతున్నాడు.
   
    డాక్టర్స్ కార్లు పార్క్ చేసే చోట కారాపి వాళ్ళ ప్రక్కగా నడిచి వచ్చింది డాక్టర్ మైథిలి.
   
    అప్రయత్నంగా అటుకేసి చూసి ఆమెను గుర్తుపట్టాడు ప్రదీప్.
   
    "నమస్కారమండీ" అన్నాడు.
   
    ఆమెకూడా విష్ చేసి అతన్ని గుర్తుతెచ్చుకుంటున్నట్లుగా చూసింది.
   
    "నా భార్యకు మీరు ట్రీట్ మెంట్ ఇచ్చారు డెలివరీ కేసు యుటరస్ రప్చర్డ్ శ్వేతబిందు..."
   
    "ఓ! యస్! యస్! గుర్తుకొచ్చింది" మరుక్షణం ఆమెముఖంలో విషాదచ్చాయలు తొంగిచూశాయి.
   
    'వస్తాను' అన్నట్లు చూసి తాను వెళ్ళే దిశగా వెళ్ళిపోయింది.
   
    "మీ మిసెస్ కు యిక్కడేనా డెలివరీ జరిగింది?" అన్నారు హనుమంతరావు గారు.
   
    "అవును" అన్నాడు ప్రదీప్ ముక్తసరిగా.
   
    హనుమంతరావుగారు ఇంకేమీ ప్రశ్నించలేదు.
   
                                    * * *

 Previous Page Next Page