మేఘమాలికల నీడల్లో బద్దకంగా పవళించిన నెలబాలుడు వేకువ విసిరిన కొరడా వెతుకి అదిరిపడి లేచి, లోతు తెలియని సాగరగర్భంలోకి అదృశ్యమై పోతుండడం చూసి పిల్లగాలులు బాధగా మూలిగాయి!
మీదుగా పయనిస్తున్న ఓ పిల్లగాలి చెవిలో గుసగుసగా మేల్కొలుపు పాడింది. అయినా ధరణికి లేవాలనిపించలేదు. శ్రీధర్ విశాలమైన చాతీమీద తలవాలుస్తూ 'పోవే!' అని ముద్దుగా విసుక్కుంది.
భగవంతుడు మనకు రాత్రి ఇచ్చినందుకు ప్రతి వేకువలోనూ మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి! బాధలూ, దుఃఖాలూ, భయాలూ, ఆనందాలూ ఏవీ తెలియని అద్భుతమైన స్థితిలోకి మనని తీసుకువెళ్ళే ఇంద్రజాల దండం 'రాత్రి'!
'సాధించే అత్తగార్లూ, పీడించే అప్పులవాళ్ళూ, ఏడ్పించుకుని తినే బాస్ లూ ఎవరూ అందుకోలేని స్థితి నిద్రే కదా!' అనుకుని నవ్వుకుంది ధరణి.
"అమ్మా! .... పాలు!" పాలవాడి కేకలు వినిపించాయి.
ధరణి లేవలేదు. శ్రీధర్ ని మరింతగా హత్తుకుని పడుకుంది.
"ఏయ్, రాకాసీ!" శ్రీధర్ ఆమె తల నిమురుతూ పిలిచాడు.
"ఈ రోజు నేను లేవను! ఇంకా కాసేపు పడుకుంటాను" గారాంగా చెప్పింది.
"మరి.... పాలవాడూ....? నేను లేవనా?" శ్రీధర్ లేవబోయాడు.
ధరణి అతన్ని కూడా లేవనివ్వలేదు.
"మరెలా?" అర్ధంకానట్లుగా అడిగాడు.
"పిలిచి పిలిచి పాలవాడు వెళ్ళిపోతాడు" అంది.
"అప్పుడెలా?" అడిగాడు శ్రీధర్.
"కాఫీ ఉండదు. హోటల్లో తాగుతాం. అంతేగా! ఆ చిన్న ఇబ్బందికి భయపడి ఇంత ఆనందాన్ని పాడుచేసుకోవాలా?" తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
"రాకాసీ!" శ్రీధర్ ఆమెతో బాటుగా పక్కకి దొర్లుతూ అన్నాడు.
బహుశా ఆలుమగలు అంతకన్నా అద్బుతంగా 'గుడ్ మార్నింగ్' చెప్పుకునే ప్రక్రియ ఇంకా కనుగొనబడలేదు!
* * *
ధరణి ఆఫీసుకి వెళ్ళేటప్పటికి అక్కడంతా చాలా గందరగోళంగా వుంది! గీత ఏడుస్తూ కనిపించింది.
ధరణి కంగారుగా "ఏవైందీ?" అని గీతని అడిగింది.
"నిన్న పని ఎక్కువగా ఉంది. రావుగారు కొంచెంసేపు ఉండమంటే ఉన్నాను. ఈ రోజు ఉదయం అర్జెంటుగా పంపాల్సిన కాన్ఫిడెన్షియల్ ఫైలు పోయింది! 'కీస్ నీ దగ్గరేగా వున్నాయి. అందరూ వెళ్ళాక తీసేసి వుంటావు' అంటూ నోటికొచ్చినట్టల్లా అంటున్నాడు" అంటూ బావురుమంది.
ధరణి ఆమెమీద ఓదార్పుగా చేతిని వేసి "నిజం చెప్పు! అందరూ వెళ్ళిపోయాక ఏం అడిగాడో?" అంది.
గీత మళ్ళీ గట్టిగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్పు ప్రారంభించింది.
"అలా ఏడవడం వల్ల ప్రయోజనం శూన్యం. ముందు జరిగిందేవిటో వివరంగా చెప్పు!" అంది ధరణి.
"నన్ను ఆయనతో గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడు. రానన్నాను."
"ఓ!" ఆలోచనగా చూసింది ధరణి.
"హెడ్ ఆఫీసుకి నోట్ పంపిస్తాడుట. రేపట్నుంచీ నాకు ఉద్యోగం ఉండదు. మా అమ్మా, తమ్ముడూ, నేనూ ఎలా బతకాలి?" గీత మళ్ళీ ఏడ్చింది.
"భయపడకు, యూనియన్ వాళ్ళకి చెప్దాం!"
"వద్దు! ఇలాంటి విషయాలు అందరికీ తెలియడం నాకిష్టం లేదు" బాధగా చెప్పింది గీత.
"అయితే భరించు!"
"అదికాదు ధరణీ! మొన్న నన్ను చూసి వెళ్ళిన అమలాపురం సంబంధం వాళ్ళకి నచ్చానని కబురు పంపించారు. కానీ చాలా ఆర్దడాక్స్ మనుషులు. ఈ సంగతి వాళ్ళదాకా వెళ్తే - ఎలా అర్ధం చేసుకుంటారో" అంది నసుగుతూ.
"అయితే చెయ్యని నేరం మీద వేసుకుని శిక్షననుభవిస్తావా?" కోపంగా అడిగింది ధరణి.
"ఉద్యోగం పోతే ఎలా? అది చూసేకదా ఆ సంబంధం వాళ్ళు ఒప్పుకున్నదీ!" దిగులుగా అంది గీత.
"లాభం లేదు! వీణ్ణి ఇలా వదలకూడదు."
"ధరణీ నువ్వేం గొడవ చెయ్యకు. నేను మంచి మాటలతో బతిమాలుకుంటాను" అంది విధిలేనట్లు గీత.
ధరణి ఆశ్చర్యంగా "బతిమాలుకుంటావా? నువ్వేం తప్పుచేశావనీ?" అంది.
గీత మాట్లాడలేదు.
"దొంగతనం నువ్వు చెయ్యలేదనీ, ఇదంతా అబద్దమనీ అతనికి తెలుసుగా! ఏం బతిమాలుకుంటావు? ఆ ఫైలు ఇచ్చెయ్యమనీ, గెస్ట్ హౌస్ కి ఈ రాత్రి వస్తానని అంటావా?" తీవ్రంగా అడిగింది ధరణి.
"అదికాదు..." అంటూ గీత అంతలోనే మళ్ళీ ఏడవటం ప్రారంభించింది. ధరణి దాన్ని పట్టించుకోకుండా "ఆవూ- పులీ కథ జ్ఞాపకం వస్తోంది. పిల్లకి పాలిచ్చి వస్తానంటే నమ్మి ఆ పులి వదిలిపెట్టింది కానీ యీ పులి వదిలిపెట్టదు. తెలుసుకో!" అంది.
గీత కళ్ళు తుడుచుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టు రావుగారి క్యాబిన్ లోకి వెళ్ళింది.
ధరణి అద్దాల తలుపులోంచి గీత బతిమాలడం, ఆయన గంభీరంగా కళ్ళజోడు సవరించుకుంటూ ఏదో అనడం కనిపిస్తూనే ఉంది. ఆమె ఆలోచన్లు రకరకాలుగా సాగాయి.
"ఏమిటి ఆడదాని బతుకు? ఆడదై పుట్టినందుకు ఇలా ప్రతివాడికి లొంగాల్సిందేనా? గీత చేసిన తప్పేమిటి? ఆయనతో వెళ్ళడానికి ఒప్పుకోకపోవడమేనా? అందుకా ఇంతలా క్షమార్పణలు చెప్పించుకుంటున్నాడు. చేయని తప్పుకి శిక్షిస్తున్నాడు! ఇటువంటి పరిస్థితులు సెక్షన్ లోని మిగతా మగాళ్ళకి రావు, ఆడవాళ్ళకే వస్తుంటాయి. ఇన్ హ్యూమన్ ఒక్క మగాడు కూడా లేచి 'ఇదంతా ఏమిటి? ఆడదాన్ని ఇలా ఏడిపించడానికి నీకు హక్కెవరిచ్చారు?' అని అడగడేమిటి అయినా ఆడది, తనకు జరుగుతున్న అన్యాయాన్ని మగాడి తోడు లేకుండా ప్రతిఘటించలేదా? ఇంకో మగాడి సహాయం దేనికీ? 'మా ఇంట్లో ఫ్యూజ్ పోయింది. మీ ఇంట్లో మగాళ్ళు ఎవరైనా ఉన్నారా?' అని ఆడది అడిగినంత కాలం యీ మేల్ ఈగోయిజమ్ ఇలాగే ఏడుస్తుంది. దీనికి విరుగుడు ఏవిటో" అనుకుంది. అంతలో క్యాబిన్ తలుపు చప్పుడయింది.
ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చిన గీతని 'ఏవైంది?' అన్నట్లు కళ్ళతోనే అడిగింది.
గీత కూడా కళ్ళతోనే 'అంతా సర్దుకుంది' అన్నట్లు జవాబిచ్చింది.
'ఏం సర్దుకుందీ? నువ్వు అతనితో వెళ్ళడానికి ఒప్పుకున్నావా? లేక అతని ఈగో శాటిస్ ఫై అయి అతనే వదిలిపెట్టేశాడా?' అని ధరణి అడగదలుచుకోలేదు. కొన్ని చేదునిజాలని షుగర్ కోటింగ్ మాటున దాగి ఉండనీయడమే మంచిది.
ఉద్యోగం లేకపోతే వివాహం జరగదు- అన్న భయం గీతది, యూనియన్ వాళ్ళు వెళ్ళి గొడవచేస్తే- ఎక్కడ పరువుపోతుందో అన్న భయం గీతది!! అలా అని- ఒకసారి శీలంపోతే ఏమవుతుందిలె అనుకోలేని నైతికం గీతది!!! అందుకే ఈ ఘర్షణ....!నిజంగా ఇదంతా ఘర్షణేనా? లేక 'అధైర్యా'నికి పెట్టుకున్న ముద్దు పేరా అది?
లక్షలాది మామూలు ఆడపిల్లలకి గీత ఓ ప్రతినిధి మాత్రమే! 'నేను నచ్చానా?' అంటూ ఇన్ డైరెక్ట్ గా పెళ్ళి చూపుల్లో ప్రతివాన్నీ యాచిస్తూ అతని ఎదురుగా తనని ప్రదర్శించు కుంటుంది. నచ్చితే పొంగిపోతుంది. అదే మరొకడు బజార్లో 'నచ్చావు'.. అంటే క్రుంగిపోతుంది. పొంగిపోవడానికీ, క్రుంగిపోవడానికీ తేడా ఓ పసుపుతాడు! పై రెండు విధానాల్లోనూ ఆమె పొట్ట ఆమే పోషించుకుంటోంది. పెళ్ళి పేరిట 'సరే' నన్నవాడికి కట్నం రూపంలో ముట్టజెప్పడానికి కష్టపడి సంపాదించి కూడపెడ్తోంది! తను పుట్టడం, పెరగడం, బతకడం అన్నీ ఓ మగవాడి కోసమే అన్న ఆలోచనని ఆమె బలపరుస్తోంది! ఆ అభిప్రాయాన్ని ఆమె గాఢంగా నమ్ముతోంది. ఎంతమంది గీతలు! వారి గీతలు మార్చేదీ.... పేర్చేదీ..... ఈ పురుష పుంగవులే!
దీర్ఘంగా నిట్టూర్చింది ధరణి. ఆ రోజంతా రావు మొహంలోని విజయ దరహాసం ఆమె గమనించింది!
సాయంత్రం బస్ స్టాప్ లో నిలబడి ఉండగా కమల వచ్చి "నీతో మాట్లాడాలి పద" అంటూ ఎదురుగుండా ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది.
కమల బాగా తెలుసు. ఒడ్డూ పొడుగూ సమానంగా ఉండి ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది. అలంకరణ కూడా అందుకు తగినట్లుగా చేసుకుంటుంది. జుట్టుని రకరకాలుగా కొప్పు వేసుకుని సైడ్ కి ఓ గులాబీ పెట్టుకుంటుంది. జరీ అంచు చీరలు కట్టుకుని హుందాగా కనిపిస్తుంది.
ఈ రోజు మాత్రం ఆమె ముఖం పాలిపోయి ఉంది. కళ్ళ కింద నిద్ర లేమిని సూచిస్తూ నల్లగా చారికలున్నాయి.
ధరణి సంభాషణ ప్రారంభిస్తూ "అలా వున్నావేం? ఒంట్లో బావుండటం లేదా?" అంది.
కమల విరక్తిగా "ఇంకెలా ఉంటామా? ఆ మనిషికి తన జపాలూ, తపాలూ తప్ప ఇవతల ఇంకో ప్రాణి ఉందనీ, దాని అవసరాలు పట్టించుకోవాలనే ధ్యాస వుంటే కదా!" అంది.