Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 15

   

    అతను ఓ చిన్న రాజకీయ నాయకుడు. ఈ స్కూల్ కి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడు!" అన్నాడు యోగి.
   
    "అబద్దం! అతను ఓ సామాన్య వుద్యోగి, కావాలంటే అతని కార్డు చూపిస్తాను" అంది ధరణి.
   
    "అయ్యుండవచ్చుగాక! లేదా మనిషిని పోలిన మనుషులుంటారు. కాబట్టి మీరు పొరబడి ఉండచ్చు? ఇప్పుడు అదంతా ఎందుకూ?" నవ్వాడు యోగి.
   
    "అది మీరు అనుకున్నంత చిన్న విషయం కాదు యోగిగారూ! పాఠశాలకీ, దేవాలయానికీ నా దృష్టిలో తేడా లేదు. పిల్లల్ని ఆదర్సవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఈ గురుకులంలో అటువంటి నీచమైన మనుషుల ప్రమేయం వుంటే భరించలేం!" నిష్కర్షగా చెప్పేసింది ధరణి.
   
    "ఓ... కే... అతని గురించి మొత్తం వివరాలు కనుక్కుని అతను నిజంగా మీరు భావిస్తున్నట్లే నీచమైన ప్రవృత్తి గలవాడైతే అతనితో ఈ స్కూల్ కి గల సంబంధాలన్నీ తెంచి వేస్తాను. నాకు మీకంటే ఈ ఆర్ధిక సంబంధాలు ముఖ్యంకాదు. నేను ఈ స్కూల్ ను ఓ ఆదర్శంతో పెట్టాను. ఓ యజ్ఞంలా నడుపుతున్నాను. పేరెంట్స్ నిశ్చింతగా, ఆనందంగా నామీద పరిపూర్ణమైన నమ్మకం వుంచి తమ పిల్లల్ని నా దగ్గర వదిలెయ్యాలన్నదే నా కోరిక" అన్నాడు నవ్వుతూ.
   
    ఆ మాటలకి ధరణి వూరట చెంది "సారీ.. మీ ప్రశాంతతని భంగం చేశాను...." అంది.
   
    "ఇట్స్ ఓ.కే! మీకు చాలా ఆవేశం అనుకుంటా!"
   
    చందూ నవ్వేసి "అక్రమాల పట్ల ఆవేశం ఎక్కువ" అని కరెక్ట్ చేశాడు.

    "ఇక్కడ అంత క్రమబద్దంగానే జరుగుతూ వుంటుంది లెండి" హామీ ఇచ్చాడు యోగి.
   
    ఆయా పూజనీ, అభీనీ వెంటబెట్టుకుని వచ్చింది.
   
    "మమ్మీ!" అనుకొని పెన్నిధి ఏదో దొరికినట్లుగా అభీ ముందుకు వచ్చి తల్లి మెడని కౌగలించుకున్నాడు. చందూ లేచి పూజని దగ్గరికి తీసుకున్నాడు. యోగి నవ్వుతూనే "ఎంతసేపు వుండదలుచుకున్నారూ!" అని ధరణిని అడిగాడు.
   
    "చాలా దూరంనుంచి వచ్చాం గదా! ఓ అరగంట ఉంటాం" అన్నాడు చందూ.
   
    "నో ..... నో .... వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకండి. ఫైవ్, టెన్ మినిట్స్ అయితే ఓ.కే.!" అన్నాడు అదే చిరునవ్వుతో.
   
    చందూ ఏదో అనబోయాడు. యోగి మృదువుగానే, కానీ కాస్త నిష్కర్షగా- "ప్రతీ స్టూడెంట్ తాలూకు తల్లిదండ్రులూ ఇలాగే అరగంటసేపు వుంటామంటే, మా పరిస్థితి ఎలా తయారవుతుందో ఆలోచించండి" అన్నాడు.
   
    ధరణికి అతడు చెప్పేదాంట్లో తర్కం కనపడింది. ఈలోగా పూజ ధరణితో "మమ్మీ నేనూ నీతో వచ్చేస్తాను" అంది.
   
    "తప్పమ్మా! క్లాసెస్ మిస్ అవుతాయి. అందుకే మానేజరు గారు కోప్పడుతున్నారు" అంది.
   
    పూజ యోగివైపు చూసి ఊరుకుంది.
   
    "పూజా ... ఇట్రా అమ్మా!" యోగి కంఠంలో ప్రేమ తొణికిసలాడుతుండగా చేతులు జాపి పిలిచాడు. పూజ వెళ్ళలేదు. "కమ్ మై చైల్డ్" మళ్ళీ పిలిచాడు.
   
    "గో..." ధరణి మృదువుగా కూతురి చేతిని పట్టుకుని యోగివైపు జరిపింది.
   
    యోగి ఆ పాపని తన దగ్గరికి తీసుకుని "దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్!" అంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని బుగ్గలమీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు.
   
    పూజ తన బ్లౌజ్ స్లీవ్ తో తడిని తుడిచేసుకుంది.
   
    ధరణి కూతురి చర్యకి నవ్వింది.
   
    "గో టూ యువర్ క్లాస్. సాటర్ డే ఎంతో దూరం లేదుగా!" నచ్చచెబుతున్నట్లుగా అన్నాడు యోగి.
   
    పూజ బుద్దిగా తల ఊపి అతని ఒడిలోంచి దిగి చందూ దగ్గరికి వచ్చింది.
   
    చందూ పూజకీ, అభీకీ తను తెచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్ యిచ్చాడు.
   
    "మేం శనివారం ఇంటికి వచ్చేవరకూ నువ్వు వుమ్తావుగా మావయ్యా!" దిగులుగా అడిగాడు అభి.
   
    "ఎందుకుండనురా? అసలు హెడ్ మాస్టర్ గారు ఒప్పుకుంటే నీతోబాటు ఇక్కడే ఉండిపోతా!" అభీని ఎత్తుకుంటూ అన్నాడు చందూ.
   
    యోగి వాచ్ వైపు చూసుకున్నాడు.
   
    ధరణి లేచి "స్కూల్ ఓ సారి చూడచ్చా? మా తమ్ముడు ఇదే మొదటిసారి రావడం" అంది.
   
    యోగి కాస్త ఆలోచించి అంతలోనే "ఓ.. ష్యూర్! పదండి" అని వాళ్ళతో బాటు తనూ బయలుదేరాడు.
   
    "ప్రొద్దుట పూజక్కని టీచర్ కొట్టింది" చందూ చెవిలో రహస్యంగా చెప్పాడు అభి.
   
    ఆ మాట ధరణికి కూడా వినపడింది. వెంటనే పూజతో "ఎందుకు? హోంవర్క్ చెయ్యలేదా?" అని అడిగింది.
   
    పూజ తల అడ్డంగా ఊపింది.
   
    "ఆవిడ వేసిన ప్రశ్నలకి జవాబివ్వలేకపోయావా?" అనునయంగా అడిగింది.
   
    "ఊహూ!" అంది పూజ.
   
    "మరెందుకు కొట్టింది?" అడిగాడు చందూ.
   
    "మరేమో పూజక్క... బయట స్నానం చెయ్యనందిగా!" అన్నాడు అభినవ్.
   
    "బయట స్నానమా?" ఆగి అడిగింది ధరణి.
   
    యోగి కూడా ఆగి "ప్రొద్దుట ఏదో ప్రాబ్లెంవల్ల నీళ్ళు రాలేదు. అందుకని బయట మోటార్ దగ్గర స్నానాలు చేయించమని నేనే చెప్పాను. ఏమ్మా....అంతేనా?" అని పూజని అడిగాడు.
   
    "ఔను... కానీ బయట" అంది పూజ అర్ధోక్తిగా.
   
    ధరణి యోగి వంక చూస్తూ "పూజకి సిగ్గెక్కువ. బయట పంపు దగ్గర స్నానం చేయమంటే చచ్చినా ఒప్పుకోదు. అంత మాత్రానికే కొడ్తారా?" అంది.
   
    యోగి నవ్వుతున్న పెదవులు బిగుసుకున్నాయి.
   
    "ఏ టీచర్ కొట్టిందమ్మా?" అని అడిగాడు.
   
    "స్వప్నాటీచర్" అంది పూజ.
   
    "రేపట్నించీ స్వప్నాటీచర్ వుండదు. సరేనా" హామీ ఇస్తున్నట్లుగా అన్నాడు.
   
    ధరణి వెంటనే "నా భావం అదికాదు! పిల్లల్ని మెత్తగా మాట్లాడుతూ బుజ్జగించాలి. అంతేకానీ కొట్టకూడదని నా ఉద్దేశ్యం. ఇక్కడ వినయ విధేయతలతో క్రమశిక్షణతో పెరుగుతారనేగా వుంచాం. పిల్లల మనసుకి ఇష్టంలేని పనులు చెయ్యమని ఒత్తిడి చేసి, చెయ్యలేదంటూ వాళ్ళని కొట్టకూడదు" అంది.
   
    "మీ ఉద్దేశ్యం నాకు అర్ధం అయింది. ఈ విషయం నా దృష్టికి రావడం కూడా ఎంతో మంచిదయింది" నవ్వుతూ అన్నాడు యోగి.
   
    స్కూల్ ఆవరణలో చాలా ఖాళీ స్థలం వుంది. పునాదులు కూడా వేసివున్నాయి.
   
    "ఫండ్స్ బాగా ఉన్నట్లున్నాయి" అన్నాడు చందూ చుట్టూ చూస్తూ.
   
    యోగిపైకి చూపిస్తూ "ఆ పైవాడే చూస్తాడు. నేను ఎవర్నీ అడగను. సహాయం దానంతట అదే అందుతోంది!" అన్నాడు.
   
    హాస్టల్ రూమ్స్ దాటాక విశాలమైన ఓ గదిలో టి.వి. కెమెరాలు, స్టాండ్సూ కనిపించాయి.
   
    "ఇవన్నీ ఎందుకూ?" అడిగింది ధరణి.
   
    "స్టూడెంట్స్ కి కావాలసిన ఇన్ఫర్మేషన్ అంతా మా వాళ్ళు బైటికి వెళ్ళి షూట్ చేసి తెస్తుంటారు. మా విద్యా విధానమే వేరుగా వుంటుంది" అన్నాడు యోగి.
   
    "స్టూడియో కూడా వుందా?" అడిగింది ధరణి.
   
    "ఆ! ఆడిటోరియం కూడా!" అన్నాడు.
   
    ధరణి తమ్ముడివైపు గర్వంగా చూసింది. చందూ ఆమె వైపు చూడటంలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.
   
                                      6
   
    ధరణికీ చందూకీ టాటా చెప్పి పిల్లలు తమ క్లాస్ రూమ్స్ వైపు ఆయాతో కలిసి వెళ్ళిపోయారు.
   
    వెళ్ళేటప్పుడు పూజ దిగులుగా చూసిన చూపు ధరణి మనసుని ముల్లుతో పొడిచినట్లనిపించింది. యోగి చేతులు జోడిస్తూ "నాకు ప్రార్ధనకి టైం అయింది!" అన్నాడు.
   
    ధరణి కూడా నమస్కరించి సెలవు తీసుకుంది. ఇంతలో "సార్ .... క్యాష్ బ్యాంక్ కి పంపిస్తున్నాను" అంటూ ఒక బక్కపల్చని వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.
   
    యోగి అతనివైపు తిరిగి "స్వప్నాటీచర్ ఎకౌంట్ సెటిల్ చెయ్యి, ఆవిడ ఉద్యోగం మానేస్తున్నారు" అన్నాడు.
   
    ధరణి ఉలిక్కిపడి చూసింది.
   
    "ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారా?" చందూ ఆశ్చర్యంగా అడిగాడు.
   
    "నాకు పిల్లల భవిష్యత్తుకన్నా ఏదీ ముఖ్యం కాదు! పిల్లలే నా దైవం! మీకోటి చెప్పనా?     Children run out of the temple
    and play in the dust.
    god watches their games
    And forgets the Priest!" అన్నాడు.
   
    ధరణి నవ్వేసింది.
   
    చందూ యోగివైపు ఆసక్తిగా చూశాడు.
   
    యోగి కళ్ళు గంభీరంగా ఉన్నాయి. పెదవులు మాత్రం నవ్వుతున్నాయి!
   
                                      *    *    *

 Previous Page Next Page