కమల భర్త విశ్వనాథం గురించి బాధపడటం సర్వసాధారణం కాబట్టి ధరణి నవ్వి వూరుకుంది.
"ఏమైనా అంటే 'పిల్లలు పెద్దవుతున్నారు. మనం వాళ్ళ ముందు శృంగారం జరపాలా?' అంటారు. ఇంత మేము మడిగట్టుకుని కూర్చున్నా రాజేష్ కి తెలిసేవి తెలుస్తూనే వున్నాయి!" అంది.
ధరణి ఆశ్చర్యంగా "రాజేష్ కా? ఏం తెలుస్తున్నాయి?" అంది.
"వాడి పుస్తకాల్లో కట్ చేసి దాచుకున్న అమ్మాయి ఫోటోలు దొరికాయి" గొంతు తగ్గించి రహస్యంగా అంది కమల.
ధరణి నవ్వేసి "వాడికి పదిహేను వచ్చాయి కదూ! ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకోనవసరంలేదు."
"అంటే అది ప్రకృతి సహజమేనని నీ ఉద్దేశ్యం కదూ!"
"అందులో సందేహం ఏం ఉందీ?"
"మరి ఈయన...?" అని నిట్టూర్చింది కమల.
సర్వర్ రాగానే కాఫీ ఆర్డర్ చేసి "మీ వారికి స్నేహితులెవరూ లేరా?" అడిగింది ధరణి.
"స్నేహితులా? అసలు మాట్లాడడానికి ఈయనకి టైం ఉంటేగా" అంది కోపంగా.
"మీ అత్తగారికి చిన్నప్పుడే భర్త పోయాడా? అప్పట్నించీ ఆవిడ నోములూ, వ్రతాలూతో పొద్దుపుచ్చుతూ ఈయన్ని పెంచిందా?" సీరియస్ గా అడిగింది ధరణి.
తలూపింది కమల.
"ఆవిడ పెంపకంవల్ల ఈయన ఇలా తయారయ్యాడనా నీ ఉద్దేశ్యం?"
"అవును!" అని "ఈయన దూరపు బంధువు... వరసకి మామయ్య ఒకాయన వచ్చాడు ఇంటికి." అంది.
"ఆయన గురించి మనకెందుకులే! మనకి కావల్సింది మీ ఆయన గురించి కదా" అంది ధరణి.
కాఫీ కప్పు అందుకుంటూ "ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాబ్లెం ఆ ముసలాయనవల్లే వచ్చింది" అంది కమల.
ధరణి వింతగా చూసింది.
"ఆయన ఏలూరులో లెక్చరర్. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేశారు. ఈ మధ్యన వేల్యుయేషన్ కని ఆయన మన ఊరు వచ్చారు. మా ఇంట్లోనే దిగారు" అని కమల ఆగి కాఫీ తాగడం పూర్తిచేసింది.
ఆమె సమస్య ఏమిటో ధరణికి కాస్త అర్ధమయింది.
"తండ్రితో సమానం కదా అని చనువుగా మాట్లాడాను. కాఫీ ఇస్తుంటే చెయ్యి నొక్కితే నాదే పొరపాటు అనుకున్నాను. నిన్నరాత్రి స్నానం చేసి నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే కిటికీ రెక్కతొలగించి చూస్తూ నా కంటపడ్డారు. పెద్దమనిషి! ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఎవరు నమ్ముతారు చెప్పు? చెప్పుకోలేక నాలో నేనే మధనపడుతున్నాను!" అంది బాధగా.
"ఎవరితోనో చెప్పుకోవడం ఎందుకూ? నువ్వే నిలదీసి అడుగు!" గట్టిగా అంది ధరణి.
"మా ఆయన అందుకు ఒప్పుకోలేదు" అంది కమల.
"ఓ! మీ ఆయనకి కూడా తెలిసిందా? మరింకేం? ఆయననే అడగమనూ."
"వద్దు! ఇంటికి పెద్దాయనా, పరువుపోతుందీ, అసలు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా చనువుగా మాట్లాడినందుకే ఇదంతా వచ్చిందీ అన్నారు" అంది.
షాక్ తగిలినట్లయింది ధరణికి.
"నువ్వంత అతి చనువుగా ఏం మాట్లాడావూ?" అంది.
"ఏమీలేదు. ఈ మనిషి ఏమీ పట్టించుకోడని కష్టం, సుఖం చెప్పుకున్నాను. అంతే!"
"అది ఆ మహానుభావుడికి అలా అర్ధం అయిందన్నమాట!"
"అవును. ఇంకో పది రోజులుంటాడట. నరకంగా ఉంది. చూపులతో తినేస్తున్నాడు. దానికితోడు ఈయన నస ఒకటీ!"
"ఏవంటాడూ?"
"మా బాబాయ్ ని నువ్వు కవ్వించావు. అగ్నిహోత్రం అంత పవిత్రమైనవాడు. అలాంటి పనులు చేస్తున్నాడంటే నువ్వేకారణం!" అని సతాయించుకుని తింటున్నారు.
"కవ్వించడం అంటే?"
"మొన్న బజారునుండి ఆయన స్వీట్లూ, పువ్వులూ తెస్తే నవ్వుతూ తీస్కున్నానట. అదే కవ్వించటం అంటారు."
ధరణి మౌనంగా కూర్చుని ఆలోచించసాగింది.
మగాడు స్త్రీ కోసం రకరకాలుగా ట్రై చేస్తూనే ఉంటాడు. పడితే పడ్తుంది- కాద్మతే 'ఫళానరోజున నాకు కాఫీ ఎందుకు ఇచ్చావూ? నేను తీసుకొచ్చిన మిరపకాయబజ్జీలు ఎందుకు తీసుకున్నావూ?' అని ఆమెనే తప్పుపట్టగలడు.
అలాటివి ఇష్టం లేకపోతే, మొగవాడి మనసులో భావాల్ని గ్రహించి తన నిరాకరణని అన్యపదేశంగా సూచిస్తూ, స్త్రీ ఏదో ఒకటి అవాలని మొగవాడి ఉద్దేస్యమా? మౌనాన్ని అంగీకారంగా భావిస్తాడా ప్రతీ పురుషుడూ?
స్త్రీ ఎలా ప్రవర్తించాలి! తోడపుట్టిన అన్నదమ్ములతో, తండ్రితో, భర్తతో తప్ప ఎవరితో మాట్లాడకూడదా? నువ్వు పూర్తిగా నిషిద్ధమా? తాలీబాన్ కి మనకి తేడా ఏమిటీ? బురఖా, ఘోషా తప్ప!
"ఇంకోమాట కూడా అన్నారు. చెప్పాలంటే సిగ్గుతో ప్రాణం పోతుంది!" కన్నీళ్ళతో అంది కమల వాళ్ళాయన గురించి.
"ఏవన్నాడూ?"
"నీకు అసలే సెక్స్ పిచ్చి! అందుకే ఆయన్ని కవ్వించావు, అంటున్నారు. నాకు పదిహేడో ఏట పెళ్ళయింది. పద్దెనిమిదేళ్ళకి రాజేష్ పుట్టాడు. మరో నాలుగేళ్ళకి డాలీ పుట్టింది. నాకిప్పుడు ముప్ప్ఫై మూడు నిండాయి. ఏవీ తెలీని వయసులో ఏం అనుభవించానో ఏమిటోగానీ, ఇప్పుడు అన్నీ తెలిసి కావాలనుకోవడం ... అధీ కట్టుకున్న భర్తని నేరో విడిచి అడగడం తప్పా? అందుకు నన్ను బరితెగించినదానిలా చూడాలా? ఇంత అసహ్యంగా మాట్లాడాలా?" కమల ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అంది.
కమలది ఎంత నిస్సహాయమైన స్థితో ధరణికి అర్ధమైంది. తన లోపమేమిటో విస్వనాథానికి ఎవరూ చెప్పక్కరలేదు. అతనికే తెలుసు! అతని బాబాయ్ ప్రవర్తనవల్ల అతనికి బుద్ది రావాల్సిందే. కానీ అందుకు విరుద్దంగా కమలాని బ్లేమ్ చెయ్యడానికి విషయం దొరికినట్లయింది. మనిషి ఎంత కన్వీనియెంట్ గా తన లోపాన్ని అవతలి వ్యక్తిమీదకు తోసేస్తాడో కదా అని బాధగా అనుకుంది ధరణి.
"నాకైతే చచ్చిపోవాలనిపిస్తోంది ధరణీ!" విరక్తిగా అంది కమల. మళ్ళీ ఆలోచనలు....
ఇటువంటప్పుడు చచ్చిపోవడం, విడిపోవడం అన్న రెండు మార్గాలు కనిపిస్తాయి స్త్రీకి! వారి వారి ధైర్యాన్ని బట్టి ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. వ్యక్తిత్వం అనే మాటకి అర్ధం పూర్తిగా తెలిసిన వాళ్లయితే తమకేది ఎక్కువ సంతోషంగా వుంటుందో ఆ దారి ఎన్నుకుంటారు. కానీ చాలామంది మాత్రం రా.... జీ.....పది అలాగే బ్రతికేస్తూ వుంటారు-నిరంతరం ఘర్షణకి వేదనకీ అ...ల....వా....టు.....పడి!!!
"చచ్చిపోవడం మాత్రం ఏ సమస్యకి పరిష్కారం కాదు!" దృఢంగా అంది ధరణి.
"నాకు తెలుసు. కానీ నానాటికీ బతుకుంటే ఇంట్రెస్ట్ పోతోంది!" అంది కమల.
సెక్స్ అనేది జీవితానికి అవసరమైన టానిక్ లాంటిది. సరైన మోతాదులో అందుతూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని ధరణికి తెలుసు. కమలకి ఇది మంచి వయస్సు. స్త్రీకి ముప్పై పైపడ్డాక మెచ్యూరిటీ వస్తుంది. తనకేం కావాలో, ఎలా కావాలో చెప్పగలుగుతుంది. తగినంత రెసిప్రొకేషన్ ఉంటే జీవితం మధురంగా మారుతుంది. లేకపోతే కమలలా నిరాసక్తంగా గడపాల్సి వస్తుంది. మనుష్యులు తారుమారై విశ్వనాథం కమల స్థితిలో ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమలని వదిలేసేవాడు! పైనుండి చూసేవారికి మాత్రం ఇవన్నీ చిన్న సమస్యల్లా కనిపిస్తాయి. 'ఇంతమాత్రానికే పండంటి కాపురాల్ని వదిలేసుకోవాలా?' అంటారు. తినడానికి పనికిరాని పండ్లెందుకూ?
"నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒకాయన ఉన్నాడు. మీవార్ని ఓసారి ఆయన దగ్గరికి కౌన్సిలింగ్ కి తీసుకెళితే ప్రయోజనం వుంటుంది. ఇంక మీకు మామగారి విషయం అంటావా.... అటువంటి వాళ్ళకి 'దండం దశగుణం భవేత్" అంటూ నవ్వింది ధరణి.
"కానీ మా ఆయన సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తారంటావా?" అనుమానంగా అడిగింది కమల.
"వచ్చేట్లు చెయ్యాలి! అందుకూ నేనే ఓ మార్గం చూస్తాను" అభయం ఇచ్చింది ధరణి.
కమల ధరణి చేయి అందుకుని "తోడపుట్టకపోయినా నా చెల్లెలి లాంటి దానివి! నా సమస్యకి పరిష్కారం దొరికినా దొరకక పోయినా నువ్విచ్చిన మోరల్ సపోర్ట్ చాలు! అదే నాకు బతుకంటే ఆశ కలిగేటట్లు చేస్తోంది. ఎదుటివాళ్ళ సమస్య విని ఎంజాయ్ చేసేవాళ్ళే ఎక్కువశాతం వుంటారు. నీలా తక్కువ ప్రశ్నలు అడిగి, సమస్య తీవ్రతనిబట్టి సలహాలిచ్చే వాళ్ళు అరుదు ధరణీ!" అంది.
ధరణి నవ్వేసి "అయితే ఇంకేం? నేను ఉద్యోగం మానేసి ఓ సలహాల కేంద్రాన్ని నడపచ్చన్నమాట!" అంది.
కమల కూడా తేలికపడ్డ మనసుతో నవ్వింది. "మీ మామగారి కోసం ప్రత్యేక శ్రద్దతో వంటచెయ్యి!" కన్ను కొట్టింది ధరణి.
"ఆ.. ఆ .... ఓ కారం ప్యాకెట్టు కొనుక్కునే వెళ్తాను. ఇంట్లోది సరిపోదు" నవ్వుతూ జవాబిచ్చింది కమల.
"ఆడది తలుచుకోవాలే కానీ మగాన్ని నోటిమీదా, మనసు మీదా, అవి రెండూ పనిచెయ్యకపోతే శరీరంమీద కొట్టడం పెద్ద పనేం కాదు!" చెప్పింది ధరణి.
"కరెక్టే!" బ్యాగ్ భుజాన వేసుకుంటూ అంగీకరించింది కమల.