"ఆ విషయం ప్రధాని ఎందుకు ఆ రోజే వెల్లడి చేయలేదు?"
"ఏమని వెల్లడి చేస్తారు? అర్దరాత్రి తాను ఓ రాయి గాలిలోకి లేవటం చూశాననా? అలా చెప్తే ప్రతిపక్షం వాళ్ళు బ్రతకనిస్తారా? ప్రధానికి మతి పోయిందని ప్రచారం చెయ్యరూ-"
నిజమేనన్నట్టు రమణ మాట్లాడలేదు.
"ఏ లెవల్ లో వుండే కష్టాలు ఆ లెవల్లో వుంటాయి. బైదిబై నీకు పెళ్ళయిందా?"
రమణ నవ్వేడు. "కాలేదు."
"మరి ప్రపంచం ఆఖరయిపోతే ఏం చేస్తావ్"
"బ్యాచలర్ గానే చచ్చిపోతాను."
"లేదు లేదు. విషయం అంతవరకూ వస్తే ఈ పదిరోజులూ బాగా ఎంజాయ్ చెయ్యి. అందమైన అమ్మాయిని చూసి, రేపే పెళ్ళిచేసుకో?"
"పదిరోజుల కోసం ఎలాంటి అమ్మాయి అయితేనేం? అమ్మాయి అయితే చాలు."
"అలా అనకు. కళ్ళు తామరపూవుల్లా వుండాలి."
"మెడ శంఖంలా వుండాలి" రమణ నవ్వాడు. అతడికి మాలతి జ్ఞాపకం వచ్చింది."
"పెదవులు తమలపాకుల్లా వుండాలి".
"మీకు కవిత్వం వచ్చే-"
"చెక్కిళ్ళు దానిమ్మ పళ్ళలా వుండాలి."
"పలువరస బియ్యపు గింజల్లా వుండాలి."
"ముక్కు సంపెంగ-"
"జడ మిన్నాగు-"
"బొట్టు, దోసగింజంత సింగారం."
"కట్టు, పోత పోసిన బంగారం."
"అన్నీ కలిసిన మొహం చంద్రబింబం."
"మామూలు చంద్రబింబం కాదు, పౌర్ణమి నాటి చంద్రబింబం......"
"ఆహా..... నిండు ఆకాశంలో..... అలా....." వృద్దుడు చెయ్యి పైకెత్తాడు.
"ఈ రోజు అమావాస్య" అన్నాడు రమణ.
"ఆస్ట్రానమిస్ట్ కి అమావాస్య ఏదో పౌర్ణమేదో చెపుతున్నావా-ఆగస్టు నాలుగు- ఈ రోజు పౌర్ణమి."
"మరి చంద్రుడేడి?"
ప్రొఫెసర్ ఆకాశం వైపు చూసేడు.
నక్షత్రాలు మిల మిల మెరుస్తున్నాయి. ఎక్కడా చిన్నమబ్బు తునక కూడా లేదు. ఆకాశం నిర్మలంగా వుంది. చంద్రుడు మాత్రం లేడు. ఇద్దరు మొహమొహాలు చూసుకొన్నారు.
"ఆరింటికి రావలసిన శశాంకుడు ఏ తారతో సరసమాడటానికి వెళ్ళేడు?" ప్రొఫెసర్ నవ్వుతూ అన్నాడు.
రమణ నవ్వలేదు.
ఇప్పటివరకూ అంతా నవ్వులాటగా - ఏదో కలలాగా జరిగిపోయింది. కానీ ఒక్కొక్క విపరీతమే చూస్తూ వుంటే జరుగుతున్నదంతా నిజమేనన్న నమ్మకం కలుగుతోంది. ఒక్కసారి ఆ భావన వచ్చేసరికి ఒళ్ళు గగుర్పొడిచింది. సన్నగా వణికేడు.
"చం....చంద్రు డేమయ్యాడు?"
"చూద్దాం" అంటూ కళ్ళు మూసుకున్నాడు. అతడి పెదవులు అస్పష్టంగా కదలసాగాయి. రెండు నిముషాల తర్వాత కళ్ళు తెరచి, "పదిన్నర....." అన్నాడు. "....నా లెక్క కరెక్టయితే ఈ రాత్రి పదిన్నర వరకూ చంద్రుడు రాడు-"
ఇంతలో క్రింద చప్పుడయింది.
ఫోను......
భూగర్భ శాస్త్రజ్ఞుడు భట్ ఫోన్ చేసేడు.
"యస్ భట్!"
"మీరు అర్జంటుగా రాగలరా?"
"ఆ రాయి పరీక్ష చేసేరా?"
"ఆ విషయమే మాట్లాడాలి, వస్తారా?"
"ఇప్పుడే వస్తున్నాను."
రమణా, ప్రొఫెసర్ లాబ్ కు వెళ్ళేసరికి పది అయింది.
భట్ వాళ్ళకోసమే ఎదురు చూస్తున్నాడు. వాళ్ళని లోపలి తీసుకెళ్ళేడు.
"ఏ యే ఎలిమెంట్సు వున్నాయి ఆ రాతిలో?"
"చాలా చిత్రం-"
"చెప్పండి."
"భూమ్మీద వున్న ఎలిమెంట్సు- ఇనుము, రాగి, ఇత్తడి.....ఇలాంటివేమీ అందులో లేవు. ఏ లోహమూ లేదు. అందులో వున్న పదార్ధం....."
"ఊఁ.......పదార్ధం?"
'క్షమించండి. నా ముప్పై సంవత్సరాల అనుభవంలో ఆ పదార్ధం ఏమిటో నేను కనుక్కోలేకపోయాను. భూమ్మీద దొరికే అన్ని రకాల ఎలిమెంట్సుతోనూ, లోహాలతోనూ పరిశీలించి చూసేను. నాకు అంతుబట్టలేదు."
ఎవరూ మాట్లాడలేదు చాలాసేపు.
ప్రొఫెసర్ బలంగా శ్వాస వదిలి, "టిటానియమ్ ఏమో చూశారా?" అన్నాడు.
"సారీ ప్రొఫెసర్, కాదు" అన్నాడు భట్.
"పరిశీలించండి నేనూ ఆలోచిస్తాను" బయటికి వస్తూ అన్నాడు.
మెట్లెక్కి పైకి వస్తూంటే, "టైమెంతయింది?" అడిగేడు ప్రొఫెసర్.
"పదిన్నర."
"వచ్చేడా చంద్రుడు?"
చప్పున తలెత్తి చూసేడు రమణ.
.....ఆకాశం నిర్మలంగా వుంది. నక్షత్రాలు మిల మిల మెరుస్తున్నాయి. ఒక మూలనుంచి నెమ్మదిగా వస్తున్నాడు చంద్రుడు.
ఏదో ఆలోచన స్ఫురించి ప్రొఫెసర్ సన్నగా వణికేడు.
* * *
ఆ మరుసటి రోజు గెస్ట్ హౌస్ లో తెల్లవారుఝామున అయిదింటికి మెలకువ వచ్చింది రమణకి. కళ్ళు విప్పగానే పచార్లు చేస్తున్న ప్రొఫెసర్ కనిపించాడు. పక్కనిండా గాలికి చెల్లాచెదురైన కాగితాలు. కగితాల్నిండా లెక్కలు.
రమణ లేవటం చూసి, అతడు ఆగి, "ఈ రోజు మనమో దొంగతనం చెయ్యాలి!" అన్నాడు.
"ప్రొద్దునే మాట్లాడటానికి ఇంతకంటే మంచి కబుర్లు దొరకలేదా?" అన్నాడు అతడ్ని తేరిపార చూస్తూ.
"జోకు కాదు నిజమే!"
"ఏం దొంగతనం చెయ్యాలి?"
"చంద్రశిల....."
రమణ తల విదిలించేడు.
ప్రొఫెసర్ అన్నాడు. "నీకు జ్ఞాపకం వుందా? చాలా రోజుల క్రితం - ఐ మీన్ కొన్ని సంవత్సరాల క్రితం ఆర్మ్ స్ట్రాంగ్ అనే అతను చంద్రుడి రాళ్ళను తెచ్చేడు. ఆ తెచ్చిన రాళ్ళలో ఒక్కో దేశానికి ఒక్కో పౌండు బరువున్న శిలని అమెరికా బహుమతిగా యిచ్చింది....."
తెలుసన్నట్టు తలూపాడు రమణ.
"చంద్రుని నుంచి తెచ్చిన ఆ శిలల్లో భూమికి వినాశకరమైనదేమన్నా వుందేమోనని ఆ రాళ్ళని చాలా భద్రంగా వుంచింది ప్రతి దేశమూ దాన్ని మనం సంపాదించాలి."
"ఎందకు?"
"ప్రశ్నలెయ్యకు. నిజానికి ఎందుకో నాకూ తెలీదు."
.........
ఆ రోజు పదింటికి ఇద్దరూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ మ్యూజియంలో వున్నారు. ప్రధాని తాలూకు అతిధులుగా వాళ్ళకి ప్రత్యేక స్వాగతం లభించింది. తిరిగొచ్చేటప్పుడు ప్రొఫెసర్ పొడవాటి తన కోటు వెనుకనుంచి చంద్రశిల తాలూకు ఓ చిన్న ముక్క తీసుకువచ్చాడు. పదకొండింటికి ఇద్దరూ జియాలజిస్ట్ భట్ లేబరేటరీలో వున్నారు.
"ఇదిగో ఇది చూడండి" అంటూ శిలని అందించేడు ప్రొఫెసర్.
"ఎక్కడిదీ రాయి?" అందుకొంటూ అడిగాడు భట్.
"మా ఇంటి పెరట్లోది. దీన్ని పరీక్షించి ఇదీ, ఆ పెద్ద రాయిలో వున్నదీ ఒకే లోహం అవునో కాదో చెప్పండి-" అన్నాడు ప్రొఫెసర్.