Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 15

    ఈ శుభవార్త మోసుకువచ్చి ఈశ్వరరావు రాజారావుని ప్లాట్ ఫారం మీద మిల్క్ బార్ లోకి తీసుకుపోయి బలవంతంగా ఫ్లావర్డు మిల్క్ ఇప్పించాడు. రాజారావుకి పానీయాలలవాటు లేదు.కాఫీ, టీలు మొదలే త్రాగడు తను అస్తమానూ కాఫీ త్రాగుతున్నాననీ అతను త్రాగడంలేదనీ ఈశ్వరరావుకు బాధగా వుంది. అయిష్టంగానే అయినప్పటికీ ఈశ్వరరావు మరీ ఎక్కువగా బలవంతపెట్టడంవల్ల రాజాదిరావది తాగాడు. అటువంటివి తాగినప్పుడు రాజారావు కడుపులో ఏదోలావుంటుంది. ఒకసారి తను అనుకోకుండా ఈ ప్లావర్డుమిల్క్ తాగాననీ, అప్పట్నుంచీ ఇష్టపడడం మొదలు పెట్టాననీ ఈస్వరరావు చెప్పడంవల్ల రాజారావుకూడా దానిని మెచ్చుకున్నాడు. ఇద్దరూ తిరిగి బొంబాయి బోగీలోనే ఎక్కారు.  
    చౌదరితో కలసి ఇప్పుడు తాము చేయవలసిన దేమిటీ అని చర్చలారంభించారు. ఈ బోగీ నుంచి దిగి అందులోకి మారి పోవాలా- లేదా ఇందులో మరి కాసిని ప్రయత్నాలు చేయాలా ఆనంది వారి ఆలోచన. "ఎందుకైనా మంచిది-కొత్త కండక్టరునో పట్టుపట్టి చూద్దాం-" అన్నాడు చౌదరి. రహీం ఏం మాటాడకుండా వీళ్ళ సంభాషణ వింటున్నాడు. అతను హిందీలోనే మాటాడుతాడుకానీ- తెలుగు విని పూర్తిగా అర్ధం చేసుకోగలుగుతాడు.   
    అందులోకి కండక్టరు ఎక్కాడు. ఆయనపేరు ఎల్లయ్య మనిషి బాగా నల్లగా వున్నాడు. ముసలివాడుకాడు. వస్తూనే రాజువెడలె రవితేజములలరగ అన్నట్లుబోలెడుమంది జనంతో ఎక్కాడు. ఆ జనంలో చటుక్కున ఈశ్వరరావు కూడా కలిశాడు. రెండు నిమిషాలలోనే ఎల్లయ్య కంఠం బోగీ అంతా ధ్వనించింది- "పొజిషన్ చాలా టైట్ గా వుంది. రిజర్వేషన్ లేనివాళ్ళు అందరూ దిగిపోండి..."   
    మళ్ళీ వాల్తేరు లోని నాటకం ఆరంభమైంది. ఎల్లయ్య మాటలు విని కొంతమంది వెళ్ళిపోయారు. అయితే తమతమ జాలిగాధలను వినిపించేవారు కొందరింకా మిగిలారు. వాళ్ళలో ఈశ్వరరావు వున్నాడు. అతనిచేతిలోకి నోట్లు మళ్ళీ వచ్చాయి. అతను ఎల్లయ్యను సమీపించి- "ఎలాగో అలా మాకో మూడు బెర్తులు ఇవ్వాలి. మీమేలు మర్చిపోము. కోరిన విధంగా ఇస్తాము. ఎంతివ్వాలో చెప్పేయండి.... అన్నాడు డైరెక్టుగా.   
    ఎల్లయ్య పెద్దగా చలించినట్లు కనబడలేదు__" ఇంతని ఏముందండీ. మీ సంతోషం కొద్దీ మీరేమిచ్చినా పుచ్చుకుంటాం. పుచ్చుకునేందుకు మాకూ అదృష్టముండాలి గదా- అనగా ఏమైనా కాళీలు__"   
    "మీరు తల్చుకుంటే కాళీలదేముందండీ__" అన్నాడు ఈశ్వరరావు.   
    "ఎంతమందికని తల్చుకోనండీ- నలభైరూపాయలిస్తామని నలుగురు వెంటబడ్డారు. ఎవరిని తల్చుకున్నా వాళ్ళ  తర్వాతనేగదా__" అన్నాడు ఎల్లయ్య.   
    "నీ అసాధ్యం కూలా!" అనుకున్నాడు రాజారావు.   
    ఈలోగా చౌదరి ఇద్దరు పోర్టర్లతో మాటాడుతున్నాడు.   
    "బొంబాయి బోగీలోంచి మీరు దిగనక్కరలేదు. మమ్మల్ని నమ్మి బెర్తుకు పాతిక ఇప్పించండి. అన్నీ అరేంజి చేస్తాం-" అంటున్నారు పోర్టర్లు.   
    "నమ్మి డబ్బెలాగిస్తాం- ముందు బెర్తు నంబర్లు చెప్పి రసీదు కోయించు-" అంటున్నాడు చౌదరి. వాళ్ళు గొణుక్కుని వెళ్ళిపోతుంటే_"బెర్తుకి పాతికరూపాయలట. మనమంతా చెట్లు దులుపుతున్నామనుకున్నాడో ఏమో-" అన్నాడు చౌదరి రాజారావుతో.   
    రాజారావుకి మతిపోయినట్లుంది. అయిదున్నర బెర్తుకి పాతికనుంచి నలబైరూపాయలదాకా రేటు. దేశం ఏ దారిలో నడుస్తోంది.   
    ఎవరిదగ్గరా పైసా తీసుకోకుండా తన బాధ్యతను సక్రమం అనే పధం చాలనంత బాధ్యతతో నిర్వహించి విజయవాడలో నాగరాజు దిగిపోతే- అంతకు అంతా బదులుతీర్చుకోడానికి అన్నట్లు విజయవాడలో ఎల్లయ్య ఎక్కాడు. అతని కళ్ళనిండాఆశ. చూపుల్లో కాంక్ష. ఎల్లయ్యనుచూస్తుంటే రాజారావుకు నాగ రాజుపైన గౌరవం ఇంకా పెరిగిపోయింది. దేశంనిండా ఎల్లయ్యలేవున్నారు. నాగరాజులు అక్కడక్కడ వుంటున్నారు.   
    పోర్టర్సు మళ్ళీ తిరిగివచ్చి ఎల్లయ్యతో ఏదో మాటాడేరు. తర్వాత చౌదరి దగ్గరకు వచ్చీ- "ఏమాలోచించుకున్నారు? అనడిగేరు.   
    "ఈ బోగీ దిగిపోదామని!" అన్నాడు చౌదరి. అప్పుడే అతను రహీంను చూశాడు. రహీం నిశ్చింతగా కూర్చుని ఉన్నాడు. అతను ఏమీ కంగారుపడుతున్నట్లు లేదు. తామందరికీ పరవాలేదు. యెంతో సామాను లేదు. రహీం విషయం అలాకాదు. 
    "ప్రయాణాలలో బాగా ఢక్కాముక్కలు తిన్నవాడయి యుండాలి__అనుకున్నాడు చౌదరి. రాజారావు అతన్ని చూపించి నెమ్మదిగా- "వీన్నిప్పుడు ఇక్కడ దింపేస్తే ఏ కంపార్టుమెంటులోకి వెడతాడు - యెలా వెడతాడు?" అన్నాడు.   
    "సరేలెండి- ముందు మనసంగతి చూసుకుందాం__" అన్నాడు రాజారావు.

 Previous Page Next Page