Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 16

    జ్ఞాపిక తలక్రిందులుగా అయింది. రెండుకాళ్లూ రెండోవాడు పట్టుకున్నాడు. తల నేలమీద ఆనింది. తలపై బలమంతా మోపి అరచేతుల్తో శరీరాన్ని లేపి రెండు కాళ్లను పొత్తికడుపులో కుమ్మింది.
    వాడూ కాళ్లు వదిలేశాడు. చివుక్కున లేచి లాబ్ వైపు పరుగెత్తబోయింది.
    ఒకడు కాలు పట్టుకుని లాగాడు. దభీమని బోర్లా పడింది. రెండోవాడు పైనుంచీ అదిమిపట్టి రెండుచేతులూ వెనక్కి మడిచిపట్టాడు. జేబులోంచి క్లోరోఫాం స్ఫ్రే తీసి ముక్కు దగ్గర స్ప్రే చేయ్యబోతుంటే వినిపించింది.... రేవంత్ బైక్ సౌండ్!
    అది లాబ్ ముందు ఆగింది! రేవంత్ లోపలికెళ్లాడు.
    ఈష్ బైకుకు ఆనుకుని నిలుచున్నాడు.
    "రేవంత్..!" గొంతుచించుకు అరిచింది. లాబ్ లో రేవంత్, బైకు నానుకున్న ఈష్ ఇద్దరూ గొంతు వినిపించిన చీకట్లోకి చూశారు. ఏవీ కనిపించలా!
    అయినా ఇద్దరూ పరిగెత్తుకు వచ్చారు. ఈలోపే  జ్ఞాపికను పక్కనున్న పోద చాటుకు లాగి క్లోరో ఫాం ముక్కు దగ్గర స్ప్రే చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నారు. తల వాళ్ళకు దొరకకుండా తిప్పుతూ తను మెలికలు తిరగసాగింది!
    "నీయమ్మ దీనికి ఎంత బలముంది బై!" అన్నాడోకడు.
    "పొగురు గూడ మస్తుగుంది... దీన్నిడవద్దియ్యాల!" ఇంకొకడన్నాడు.
    రేవంత్, ఈష్ కైనటిక్ దగ్గరికొచ్చారు. పోద వెనుక జ్ఞాపికను కదలకుండా పట్టుకుని అరవకుండా నోరు మూశారు.
    'రేవంత్... ఇక్కడా; ఇక్కడా!' అని అనాలనుకుంది. కానీ, అనలేకపోయింది.
    "జ్ఞాపికా! జ్ఞాపికా.... వేరార్ యూ?" ఈష్ అరిచాడు.
    "ఇటు.., ఇక్కడ!" అని లోలోపలే అనుకుని బలంగా గింజుకోసాగింది.
    వాళ్ళపట్టు మరింత బిగిసింది.
    రేవంత్ కూ, ఈష్ కూ ఇంకా కంగారెక్కువయింది. చిందరవందరగా పడిన బుక్సూ జారిపడిన హ్యాండ్ బ్యాగ్, పడిపోయిన కైనటిక్... ఏదో జరిగిపోయిందని అర్థమావుతోంది. కంగారుగా చుట్టుపక్కల వెతకసాగారిద్దరూ.
    జ్ఞాపికకు ఇద్దరూ కనిపిస్తున్నారు. చీకట్లో ఉండటాన జ్ఞాపిక వాళ్ళకు కనిపించంలా! నోరు మూసినవాడి చెయ్యి బలంగా కొరికింది. వాడు చెయ్యి లూజ్ చేశాడు.
    పిచ్చిగా అరిచింది- "రేవంత్..!" అని. అంతే.... ఇద్దరూ ఎలర్ట్ అయిపోయి అటువైపు పరుగెత్తారు. క్లోరో ఫామ్ జ్ఞాపిక ముక్కుమీద స్ప్రే చేసి బిగిసి పట్టాడొకడు.
    జ్ఞాపిక వాలిపోతుండగా... వాళ్ళిద్దరూ మరో పోద వెనుక నక్కారు.
    చప్పుడువైపు పరిగెత్తుకొచ్చిన రేవంత్ కాలికి తగిలింది.... చీకట్లో మెత్తటి చెయ్యి! వంగి చూశాడు.... జ్ఞాపిక.
    "జ్ఞాపీ! జ్ఞాపీ!" తట్టాడు. అరకొర స్పృహలో ఉంది. ఈష్ కూడా వచ్చి వంగి చూస్తుండగా-
    "రేవంత్.... అక్కడా! స్ఫూర్తీనీ.... రేప్.... చేసిన.... వాళ్ళు... అక్కడా... అక్కడా!" అని పోదవైపు చూపించి స్పృహ తప్పింది.
    రేవంత్ చివ్వుక్కున లేచి ఆ  పొడవైపు కదలబోయాడు.
    "నువ్వుండు! జ్ఞాపికను చూసుకో!" అని అటువైపు అడుగేశాడు ఈష్.
    మరో పోద వెనుక చిరు కదలిక! చివుక్కున అటు తిరిగాడు.
    రెండు ఆకారాలు చెరోవైపు పరుగెత్తాయి. ఒక ఆకారం వైపు రేచుక్కలా పరుగెత్తాడు. ఆ ఆకారం మరింత వేగంగా పరిగెత్తి కంపౌండ్ వాల్ దూకింది.
    ఈష్ కూడా కంపౌండ్ వాల్ జంప్ చేసి మెయిన్ రోడ్డు మీదకొచ్చాడు.
    స్ట్రీట్ లైట్ వెలుతుర్లో చూశాడు వాడ్ని! వాడు హాస్టల్  టీ స్టాల్లో ఉండేవాడు ఎప్పుడూ. గుర్తుపట్టాడు. మరింత వేగంగా వాడ్ని పట్టుకునేందుకు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇంక రెండడుగులు వేస్తే అందేంత దగ్గరికి రాగానే చెయ్యిచాచి షర్టు పట్టుకునేలోపు- వాడు డైవర్షన్ మార్చి రోడ్డు క్రాస్ చెయ్యబోయాడు.
    అటునుంచి లారీ, ఇటునుంచి బస్... సడన్ బ్రేక్స్ వేశాయి కానీ, అప్పటికే వాడి శరీరం లారీటైర్ క్రింద నజ్జునజ్జయింది. విగ్రహలా నిలబడిపోయాడు ఈష్.
    తన స్పూర్తిని, తన ప్రాణాన్ని, తన పువ్వుని, తన హృదయాన్ని నలిపిన ఆ చేతులూ, ఆ శరీరం చితికి చితికి మాంసం ముద్దయి, రక్తం ఓడుతుంటే.... కసి తీరిన కళ్ళతో చూశాడు దగ్గరికెళ్లి.
    ఇంకా దగ్గరికెళ్లి మోకాళ్ల మీద కూర్చుని ముఖంమ్మీద ఉమ్మేసి చూస్తూ ఉన్నాడు కసిగా. రగులుతున్న గుండెకేదో ఊరట, శాంతి! మసలుతున్న రక్తం వేడిపొంగు కొంచెం తగ్గించిన నిలకడ! బస్ లో వాళ్ళూ, లారీ వాళ్ళూ యాక్సిడెంట్ జరిగిందని దిగి చుట్టుమూగేసరికి గుంపులోంచి బయటపడి నింపాదిగా మళ్లీ గోడ జంప్ చేసి లోపలికొచ్చాడు.
    రేవంత్ జ్ఞాపిక తలను ఒళ్ళో పెట్టుకుని కూర్చునున్నాడు. ఈష్ పరుగెత్తుకొచ్చాడు రేవంత్ దగ్గరకు. జ్ఞాపికను చూసి కంగారుపడి-
    "ఏం కాలేదుగా?!" అనడిగాడు.
    "ఏం కాలా! క్లోరోఫామ్ ముక్కుకు స్ప్రే చేశారు. లేస్తుంది కాసేపయితే! ఎలా తీస్కెళ్లాలో అర్థంకాక అలానే కూర్చున్నా!" అన్నాడు.   
    "నువ్వుండు! నేను లాబ్ కెళ్లి నీళ్లు తీసుకొస్తా" నని, లాబ్ కెళ్లి నీళ్ల జగ్ తో వచ్చాడు.
    నీళ్లు చిలకరించాక- కొద్దిగా కళ్ళు టపటపలాడించింది.
    నీళ్లు తాగించాడు రేవంత్ గుండెల కదుముకుని! రెండు గుటకలేసి పెదాలు తడుపుకుంది! మెల్లగా కళ్ళు తెరిచి కెవ్వున అరచి, మళ్లీ అరవబోయి రేవంత్ ను చూసి ఆగింది.
    "నేనే జ్ఞాపీ! నీకేం కాలా! చూడూ! వాళ్ళెవరూ లేరు!" చిన్నపిల్లలా తట్టి లేపాడు.
    రేవంత్! వాళ్ళూ స్ఫూర్తినీ.... వాళ్ళే.... వాళ్ళను చంపెయ్యాలి! రేవంత్.... వాళ్ళను చంపేయాలి వెళ్లు!" అని  రేవంత్ ను  నెడుతూ చిన్నగా ఏడ్వసాగింది!
    తనను ఎటాక్ చేశారాన్నది కాదు.... తన బాధ! స్పూర్తిని పాడుచేశారన్నది బాధ! పగ తీర్చుకొమ్మన్నది బాధ!!
    "జ్ఞాపికా! ఒకడు చచ్చిపోయాడు....కుక్కచావు! ఇకలే.... నీ కసీ, నా కసీ, మనందరి కసీ కలగలిపి లారీ, బస్సూ తీర్చేశాయి!" నింపాదిగా చెప్పాడు ఈష్.
    "నిజంగా...!" నమ్మలేనట్టు అడిగింది జ్ఞాపిక.
    "ప్రామిస్! స్పూర్తి మీద! ఓ.కే.!" అని ఈష్ అనగానే- అది ఆనందమో, కోపమో, ఉన్మాదమో తెలియనట్టు రేవంత్ ను నిలువెల్లా కౌగిలించుకుంది తమకంగా!
    రేవంత్ రెండుచేతుల్తో అదిమిపట్టుకున్నాడు. ఈష్ మెల్లగా అక్కడ్నుంచి కదిలి వెళ్లిపోయాడు. చాలాసేపు వెక్కివెక్కిపడింది జ్ఞాపిక.
    "రేవంత్! మీరు రాకపోతే  నన్ను  కూడా స్పూర్తిలా..."
    చటుక్కున జ్ఞాపిక ముఖం దోసిట్లోకి తీసుకుని  పెదాలు మూసేశాడు బలంగా, మాట్లాడనీకుండా, ఇక వినలేనట్టు.
    మెల్లగా అతని స్పర్శలో రిలాక్సయిపోయింది.
     తననలాగే ఒడిసి పట్టుకుని నడిపించుకొచ్చాడు బైక్ దాకా! దారిలో శాండిల్స్,  హ్యాండ్ బ్యాగ్ కిందపడినవి ఏరుకొచ్చి, జ్ఞాపికను కూర్చోబెట్టి శాండిల్స్ వేశాడు. హ్యాండ్ బ్యాగ్   చేతికిచ్చాడు. పాకెట్ జేబులోంచి కోంబ్ తీసి పైపైన హెయిర్ సవరించాడు. మళ్లీ నుదుట ముద్దెట్టి బైక్ స్టార్ట్  చెయ్యబోతూ-
    "నిన్నెవ్వరూ ఏవీ చెయ్యలేరు.... నేను బ్రతికుండగా!" స్థిరంగా చెప్పాడు. ఎంత కాన్ఫిడెన్సో!
    "రేవంత్... నాకు జీవితాంతం తోడుగా ఉంటావా?"
    "జీవితం అయిపోయాక కూడా ఉంటా! నీ కోసం కాదు! నా కోసం! నేను నువ్వు లేందే జీవించలేను. నిన్ను చూడగానే  నువ్వు 'నా' అనే భావన ఏర్పడింది. అది నా ప్రాణం ఉండగా తొలిగిపోదు" అరచేతుల్లోకి మొహం తీసుకుని మొహం తీసుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సన్నీహితంగా, ఇద్దరి ఊపిరీ కలిసేంత సన్నిహితంగా చెప్పాడు.
    "నిజంగా..." కళ్ళు పెద్దవిచేసి అమాయకంగా అడిగింది.
    "నిజంగా! నా భవిషత్తులోని ప్రతిక్షణంలోనూ నీ ఉనికిని నిర్మించుకున్నాను. నీ ఉనికి లేని నీ భవిషత్ క్షణాలు లేవు."
    "నాక్కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు  పరిచయం అయ్యాక డాడీకూడా ఎక్కువగా గుర్తురావడంలా! డాడీని మరిపించావు నువ్వు!"
    "నువ్వు ప్రపంచాన్ని మరిపించావు."
    "దీన్నేమంటారు?" పసిపిల్లలా అడిగింది.
    చిన్నగా నవ్వి తలను ఎదకు హత్తుకుని "ప్రేమని మాత్రం అనరు."
    "మరేంటిది...?" అలాగే పొదివి పట్టుకుని అడిగింది.
    "ఆత్మీయత! అనురాగం! మమత్వం! 'నాది' అనే భావన.... చాలా!" నుదుటికి నుదురు కొట్టి అడిగాడు.
    "ఇది ఎన్నాళ్లుంటుంది..?" తల అడ్డంగా వంచి నొసలు పైకెత్తి అడిగింది.
    "పిచ్చీ.... గుండె ఎన్నాళ్లుంటుంది! ఊపిరి ఎన్నాళ్లుంటుంది!"
    "బ్రతికినన్నాళ్లూ...!"
    "అలాగే గుండెలో పుట్టింది, ఊపిరిలో పెరిగింది ఇది! కాబట్టి గుండె ఉన్నాన్నాళ్లు.., ఊపిరి ఉన్నన్నాళ్లూ ఉంటుంది."
    "ప్రామిస్..!" చెయ్యి సాచింది.
    తలమీదు చిన్నగా కొట్టి, తల పక్కకుపంచి బుగ్గమీద నాలుక తడితో "ప్రామిస్' అని రాశాడు.
    కళ్ళు మూసుకుని ఆ స్పర్శతో లీనమై 'ప్రామిస్' అని చదువుకుంది. చటుక్కున తలవంచి రేవంత్ కాలర్ జరిపి గుండెపై 'థాంక్స్' అని నాలుక కొసతో రాసింది.
    "అమ్మో... ఏం తెలీదనుకున్నా- ఫర్వాలేదే! నీ మనసుకూ బయటపడే మార్గాలు తెలుసు!" టీజ్ చేశాడు.
    "నువ్వేగా....నేర్పావ్!" కినుకగా అంది.
    "ఓ.కే! ఓ.కే! ఓ.కే!" అలిగిన  గడ్డం పైకెత్తి పట్టుకోగానీ- కళ్ళు రెండూ మూసుకుంది.... జరగబోయేది తెలుసన్నట్టు! అతను నవ్వుతూ చెవిలో-
    "సారీ! నిన్ను  ముద్దు పెట్టుకొబోవటంలేదు... ఇక కళ్ళు తెరవచ్చు!" గుసగుసగా అన్నాడు. పిచ్చికోపమొచ్చి తనే   ముఖమంతా ముద్దుల పెట్టేసింది.
    రెండుచేతుల్తో ముఖాన్ని మృదువుగా తడుముకుని, "థాంక్యూ.... కోపమా! నీ కోపం చాలా బావుంది! అప్పుడప్పుడూ ఇలా కోపం తెప్పిస్తూ ఉండాలన్నమాట నేను- ఈ అదృష్టం దక్కాలంటే!" చిలిపిగా చూస్తూ అన్నాడు.
    "ధిత్..." గుప్పెళ్ళతో ఛాతీమీద కొట్టింది.
    "లెట్ వుయ్ స్టార్ట్  మేడమ్...!" చేతులు  కట్టుకుని వినయంగా అడిగాడు.
    "ఓ.కే. మిస్టర్! పర్మిషన్ గ్రాంటేడ్....!" అధికారంగా తలూపింది.
    "రేవంత్.... నీకెలా తెలుసు నేనిక్కడ ఉన్నానని?"
    "క్యాజువల్ గా హాస్టల్ కు ఫోన్ చేశా.... నీ వర్క్ అయిందా, లేదా అని! వార్డెన్ చెప్పారు- జ్ఞాపిక  ఇంకా రాలేదు, కంగారుపడుతున్నామని! నాకు డౌట్ వచ్చింది- నువ్వు  టైమ్ మర్చిపోయి వర్క్ లో పడిపోయుంటావని! వెంటనే నేనూ, ఈష్ వచ్చేశాం!" అన్నాడు.
    వెనుక కూర్చుని అతన్ని రెండుచేతుల్తో పొదివి పట్టుకుంది.... తనకేం భయం లేదన్నట్టూ, ఏదో బరువూ,బాధ్యతా తొలిగిపోయినట్టు!
    వెళ్లేసరికి వార్డెన్, కామినీ, రేవతీ, స్పూర్తీ కంగారుపడుతున్నారు... జ్ఞాపిక ఇంకా రాలేదని. లోపలికి తీస్కెళ్తూ- "క్యాజువల్ ఉండు" మెత్తగా చెప్పాడు రేవంత్.
    వార్డెన్ కోపంగానే అడిగింది-
    ఏమ్మా జ్ఞాపికా... ఇంతసేపు బయట ఉండటం నాకిష్టం ఉండదని తెలుసుగా!"
    "సారీ మేమ్! డేటా తయారుచేయడంలో పడి టైమ్ తెలీలా! రేవంత్ వాళ్ళోచ్చేదాకా! ఇంకోసారి ఇలా చెయ్యను మేమ్... సారీ మేమ్!" తలవంచుకుంది.
    జ్ఞాపిక సంగతి ఆవిడకు తెలుసు... ఎంతో అవసరమయితేగానీ పొరపాట్లు చెయ్యదని! అందుకే ఇంకా ఎక్కువ తిట్టలేకపోయింది.
    "బై..." అని, "భయపడకు! ఎక్కువ ఆలోచించకు! నేనున్నాను నీ గురించి ఆలోచించడానికి!" మెత్తగా  ఎవరికీ వినబడకుండా చెప్పాను రేవంత్.
    "ఓ.కే.బై..!" అనేసి మెల్లగా నడుచుకుంటూ వచ్చి రూమ్ లోతనవాళ్ళకు  చెప్పింది జరిగింది. మళ్లీ ఒక మారణం హొమం జరిగినట్టు విన్నారు.
    రాత్రి చాలాసేపు నలుగురూ నిద్రపోలా! ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని అలాగే  కూర్చుండిపోయారు. ఎప్పుడు, ఏ ప్రమాదం వాళ్ళను కమ్ముతుందో ఊహించలేని స్థితిలో
వాళ్ళున్నట్టు తెలిసిపోయింది వాళ్ళకు.
    అలిసిపోయిన జ్ఞాపిక- స్పూర్తి ఒళ్ళో చేతులూ,  కామిని ఒళ్ళో తల, రేవతి ఒళ్ళో పాదాలు పెట్టి నిద్రపోయింది.  అపాయం తప్పించుకుని వచ్చిన తమ ప్రియనేస్తాన్ని వాళ్ళు అపురూపంగా, అనందంగా మేశారు తెల్లార్లూ కదలకుండా! కదిలితే లేస్తుందని!!
    మధ్యమధ్యలో రెండుమూడుసార్లు జ్ఞాపిక- "ధిత్..." అని గుప్పెడితో కామిని తొడమీద కొడితే రేవతికి డౌట్ చ్చింది- "ఇదేంటే.... ఇది రేప్ చెయ్యబోతుంటే- అదేదో సెన్నిబుల్స్ రోమాన్స్ జరుగుతున్నట్టు ముద్దుముద్దుగా కసురుతుంది కలలో! ఈడ్చి కొట్టాలి గానీ, దెబ్బ తగిలీతగలకుండా ఆ వత్తిడేవిటే?!" అని. ముగ్గురికీ అర్థంకాలా!
    'రేప్పోద్దున అడుగుదాం.... కలవరింతలు రేప్ చెయ్యబోయినట్టు లేవూ, ఇష్టంగా రోమాన్స్ చేస్తుంన్నట్టున్నా యెందుకని!' అని  నిర్ణయించేసుకుంది.
    "నువ్వు మెదడు వాడటం మానేస్తావా ఈ  ఒక్కరాత్రికి! దాని కలవరింతలేవో అది కలవరించుకుంటుందిగానీ, నీ డౌట్లు తీర్చలేక మేం ఛస్తున్నాం!" అని స్పూర్తి తడితే నోర్మూసుకుంది.
                                          12
    నలుగురూ నడుస్తున్నారు.... అల్లరల్లరిగా కబుర్ల చెప్పుకుంటూ!
    హాస్టల్ వస్తున్నారు. ఆరోజు కాలేజ్ అవర్స్ లీజర్! 'టైమ్ పాస్ ఎలా అబ్బా...' అనుకుంటుండగా- "హాయ్ జ్ఞాపీ! మమ్మా నిన్ను రమ్మంది వీలుంటే! లిటరేచర్ బుక్స్ ఇస్తుందట!" బైకాపి చెప్పాడు రేవంత్.
    "ఈ రోజు లీజరే.... రానా?" అని బైక్ ఆఫర్ చేశాడు.
    వాళ్ళు వెళ్లాక ఈష్ వచ్చి, "ఏయ్ స్పూర్తీ! ఐస్ క్రీం  పార్లర్ కొస్తావా!" మెత్తగా పిలిచాడు. వీళ్ళకు బై చెప్పేసి స్పూర్తి వెళ్లిపోయింది.
    "రాత్రికి మనిద్దరం ఛస్తాం!" అంది రేవతి.
    "వాళ్ళు వెళితే మనం చావడం ఎందుకే?" కామినికి అస్సలు అర్థంకాలా.
    "జ్ఞాపిక రాత్రంతా "థిత్....థిత్!" అని కలవరిస్తుంది. స్పూర్తి వచ్చి దిండు వాటేసుకు పడుకుని కలవరిస్తుంది. మన వినలేక...." అని పూర్తీచేసేలోపు క్రాంత్ వచ్చి, "హాయ్ కామీ, రేవతీ....! అని విష్ చేశాడు.
    "వెళ్లండి.... మీరిద్దరూ కూడా వెళ్లండి! ఈరాత్రికి నిద్రపోనీయంది నన్నొక్కదాన్నే!" గొణిగింది రేవతి.
    "షటప్....!" చిన్నగా కసిరింది కామిని.
    "వాట్ రేవతీ?" అడిగాడు క్రాంత్.

 Previous Page Next Page