Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 17


    "నథింగ్! లేట్ వుయ్ గో టు లాబ్!" అని కామిని మాట మార్చేసి, "ఒక్కదానివే ఏంచేస్తావే?" అడిగింది రేవతిని.

    "బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుంటా!" కసిగా సమాధానం ఇచ్చింది.

    "జెలస్ వద్దూ! జాగ్రత్త.... కళ్ళద్దాలు పెట్టుకుని వెతుక్కో లేపోతే అమ్మాయిని సెలక్ట్ చేసుకోగలవు!" అని వెళ్లిపోయింది.
    తను వెళ్లినవైపు చిన్నరాయి విసిరేసి రేవతి ఒక్కతే కూర్చుంది మౌనంగా- ఫ్రెండ్స్ ను తిట్టుకుంటూ!
    దూరంగా ఎవరో అబ్బాయి ఒళ్ళో పేపర్స్ పెట్టుకుని ఏదో రాసుకుంటున్నాడు. ఆ పేపర్స్ ఎగిరిపోతే పట్టుకోబోతూ తన దగ్గరికి వచ్చాడు. 'పాపం....' అనుకుని, తనూ హెల్ప్ చేద్దామని రెండడుగులు వేసింది. దభీమని డాష్ ఇచ్చాడు. వెంటనే "సారీ..." చెప్పాడు. నాలుగయిదు కాగితాలు పట్టుకుని అతనికిచ్చి వెళ్తుండగా ఆతనన్నాడు-
    "థాంక్యూ మిస్టర్! మీ పేరు...?" అని.
    "మిస్టర్ కాదు మిస్! మిస్ రేవతి!" అంది టీషర్టు కిందకు లాక్కుని.
    "సారీ  అండీ... జీన్ అండ్ షర్ట్ లో చూసి అబ్బాయనుకున్నా!"
    ఈసారి తలవంచి చూసుకుని, హెయిర్ విదిలించి- "అన్నీ సక్రమంగానే ఉన్నాయి అబ్బాయని ఎలా అనుకున్నాడబ్బా?" డౌట్  వచ్చింది.
   కిందకు వంగి తన గ్లాసెస్ తీసుకుని పెట్టుకుని, టీషర్ట్ వైపు చూసి అపుడు-
    "సారీ! మీరు అమ్మాయే!నేనే పొరపాటు పడ్డా! మిస్ రేవతీ.... గ్లాడ్ టు మీట్ యు!" అన్నాడు కళ్ళద్దాలు సవరించుకుంటూ.
    "మీక్కూడా నాలా కళ్ళద్దాల్లేందే సరిగా కనిపించదా? మసగ్గా  కనిపిస్తాయా?' అనందం పట్టలేక అడిగింది.
    "అవునండీ! మీకూ ఆ ప్రాబ్లమ్ ఉందా?" తనూ ఆనందపడిపోయాడు.
    "అవునూఁ... ఇంతకీ మీ పేరు?"
    "ఆనంద్!"
    "బావుంది! బావుంది!" ఇక ఇద్దరూ ఒకర్ని ఒకరు తినడం మొదలెట్టుకున్నారు.
    "మీకూ ఐస్ క్రీమూ, కాడ్ బరీస్ ఇష్టమా?" తొందరతొందరగా అడిగేసింది.
    "ఆఁ... అవునవును. మిల్క్ బార్, బబుల్ గమ్ కూడా ఇష్టం!" అన్నాడు ఇంకా ఆనందంగా.
    జ్ఞాపికను ఇంట్లోకి తీసుకెళ్తూ.... రేవంత్ తను ఒకడుగు ముందుకేసి, "వెల్ కమ్ ఈ ఇంటి యువరాణీవారికి!" చేతులు రెండూ వంచి స్వాగతం పలికాడు.
    "థాంక్స్...!" అని భద్రంగా కుడికాలు పెట్టబోయింది.
    అది నేలను తాకకముందే రేవంత్ చటుక్కున వంగి తన కుడిచేయి పాదానికీ, నేలకూ మధ్య పెట్టాడు. రేవంత్ అరచేతిలో జ్ఞాపిక పాదం!
    జ్ఞాపిక ఇంకో అడుగు వేయబోయేంతలో.... ఇంకో చెయ్యి పెట్టాడు. మళ్లీ రెండో చేతిలో రెండో పాదం! జ్ఞాపిక బరువంతా రెండు అరచేతులపై మోస్తూ తలెత్తి-
    "నడవండి యువరాణీ! గుండెనెలా పరవాలో తెలీక అరచేతులు పరిచా! అందుకని కినుకా?!" నేరస్థుడిలా అడిగాడు చటుక్కున  కూర్చుండిపోయి.
    "ఐ లైక్ యూ రేవంత్! రియల్లీ నీ లవ్ ఎక్స్ ప్రెషన్ ఎంత బావుంటుందంటే.... నీ ప్రేమలేని జన్నెందుకు?.... అనిపించేంత! థాంక్యూ!కానీ, మోసింది చాలు- ముందు ముందు మోయాల్సింది చాలావుంది.... చేతులు తీసెయ్యొచ్చు" అంది.
    "థాంక్స్! నేనెలా మోయాలో నాకు చాలా బాగా తెలుసు. నేను చేతులు తీయాలంటే మీరు ముందు నా చేతులపైన మీ ఏడుమల్లెల ఎత్తు అందాన్ని తీయాలి!" అని కన్నుకొట్టాడు.
    నాలిక్కరుచుకుని, "అవునుకదా....  మర్చిపోయా!" అని లేచి తన కాళ్లు అతని అరచేతుల్లోంచి తీసింది. అతను అరచేతులు బార్లా తెప్పేసరికి ఎర్రగా కందిపోయాయవి. వాటిని సవరించి చటుక్కున ముద్దు పెట్టుకోబోయింది. రేవంత్ ఊపిరి బిగపట్టాడు.
    కళ్ళల్లోకి చూస్తూ- "ముద్దు పెట్టుకోబోవట్లేదు. రేవంత్ ఊపిరి బిగపట్టాడు.
    "యూ నాటీ గర్ల్! నాది నాకే రీప్లే చేస్తావా?" తలమీద చిన్నగా కొట్టాడు.
    "మమ్మా ఎక్కడ?" ఇల్లంతా కలియచూస్తూ అడిగింది.
    "లేదు! గంటక్కానీ రాదు!"  రెండుచేతులూ భుజాలమీద వేసి అన్నాడు.
    "మరి.... మమ్మ రమ్మందని చెప్పావ్?"
    "లేపోతే నువ్వొస్తావా! 'మా ఇంటి కెళ్దాం రా! పెళ్ళయ్యాక రోమాన్స్ ఎలా చెయ్యాలో ప్రాక్టీస్ చేసుకుందాం....' అని నేనంటే!" నుదుటికి నుదురు కొట్టి చిన్నగా కవ్వించాడు.
    చేతులు తీసి దూరంగా జరిగి- "దూరం.... దూరం! మా డాడీ ఒప్పుకోందే, మా డాడీకి నచ్చందే నో రోమాన్స్, నో ప్రాక్టీస్!" సీరియస్ గా అంది.
    "మీ డాడీ నచ్చేదేంటి? నువ్వు 'ఐ లవ్ యూ' అన్నాక దేవుడికి నచ్చకున్నా ఎత్తుకెళ్లిపోయి పెళ్ళిచేసుకుంటా.... ఇలా!" అని రెండుచేతుల్తో పసిపిల్లలా ఎత్తేశాడు.
    పడేస్తాడేమోనని మెడను గట్టిగా పట్టుకుంది.
    కిటుకు కనిపెట్టేసి "పడేస్తున్నా!" అని చేతులు లూజ్ చేశాడు.
    ఇంకా గట్టిగా పట్టుకుని, "వద్దూ.... ప్లీజ్ దింపెయ్!" బ్రతిమాలింది.
    "పడేశా...!" అని ఇంకా వదులుచేశాడు. చిన్నగా అరిచి ఇంకా గట్టిగా వాటేసుకుంది.
    "పడిపోతున్నావ్...." ఇంకొంచెం లూజ్ చేశాడు.
    విషయం అర్థం అయిపోయింది జ్ఞాపికకు. "సరే.... పడేసుకో!" అని చేతులు వదిలేసింది.
    జారుతున్న జ్ఞాపికను చటుక్కున బిగిలిపట్టి సోఫాలో పడుకోబెట్టాడు.... మెత్తటి లాన్ పై వాల్చిన పువ్వులా.
    "నిజంగా పడేసుంటే?"
    "నిజంగానే లేపేసి ఉండేవాడివి! 'నేనుండగా నీకేం కాదు' అన్నవాడివి- నువ్వు నన్ను పడేయగలవా బిట్టూ!" చిన్నపిల్లాడ్ని పిలిచినట్టు పిలిచింది.
    "ఏయ్ఁ! నేను మమ్మాకి బిట్టూని. నీక్కాదు" చిరుకోపం.
    "నాక్కూడా బిట్టూనే! బిట్టూ.... బిట్టూ.... బిట్టూ! ఏంచేస్తావ్- మళ్లీ అంటా! బిట్టూ.... బిట్టూ.... బిట్టూ..."
    చటుక్కున పెదాల్తో పెదాలు మూసేశాడు.
    "ఏదీ... మళ్లీ అను హనీ- బిట్టూ అని!"  కవ్వింతగా చూశాడు. ఇక అన్లేదు అనదనీ తెలుసు. యుద్దంలో గెలిచిన వీరుడిలా చూశాడు.
    "గోప్పేలే...! గొణిగింది.
    పక్కకు తిరగ్గానే మమ్మా ఫోటో కనిపించింది జ్ఞాపికకు.
    "రేవంత్! నీకో విషయం చెప్పనా?"
    "రెండు చెప్పు!" ఫ్రిజ్ లోంచి కూల్ డ్రింక్ తీస్తూ అన్నాడు.
    "ఓ.కే.! ఒకటి... మమ్మా నీకు మమ్మాలా లేదు- అక్కయ్యలా ఉంది! రెండు... మీ డాడీ చనిపోగానే మారేజ్ చేసుకునుండాల్సింది!"
    "మా డాడీ పెళ్ళయిన ఆర్నెల్లకే యాక్సిడెంట్ లో చనిపోయార్ట. అప్పటికి మమ్మా మూడోనెల గర్భిణీ అట. అంటే నేనన్నమాట! అంత చిన్నవయసులో విడో అవడంతో మళ్లీ పెళ్ళి చెయ్యాలంటే పిల్లలుంటే కష్టమని మా మామయ్య అబార్షన్ చేయిస్తానన్నారట! కానీ, మమ్మా ఒప్పుకోలేదట. 'నాకు పెళ్ళికంటే నా బిడ్డ ముఖ్యం' అందిట. చాలా ఆఫర్స్ వచ్చాయట. కానీ, నాకోసం చేసుకోలేదట.  అంటే....20 సంవత్సరాల వయసులో కడుపులోని నాకోసం మళ్లీ  పెళ్ళి చేసుకోలా! ఆ తర్వాతే తను పి.జి.పి. హెచ్.డి చేసింది. బంధువులంతా చాలా బలవంతం చేశార్ట. తనకో ఆఫర్ కూడా వచ్చిందట- బిడ్డతో కూడా చేసుకుంటానని.... తన క్లాస్ మేట్ నుండి! కానీ, మమ్మా ఒప్పుకోలేదట- బిడ్డను మారుతండ్రి సరిగా చూసుకోడేమోనని! ఆ క్లాస్ మేట్ కూడా అలాగే ఉండిపోయట్ట. మా అంకుల్ చెప్పారు- అంటే... మమ్మా అన్నయ్య!"
    "ఇప్పటికీ అలానే ఉండిపోయారా ఆయన?" కుతూహలంగా అడిగింది.
    "అవునట! అంకుల్ చెప్పారు."
    "నువ్వు ఫారిన్ వెళ్లిపోతే- మరి, మమ్మాకి తోడు?" అనుమానం వచ్చింది.
    "అవును! నాకదే ఆలోచన! కానీ, మనిద్దరి పెళ్ళయిపోతే నువ్వుంటావుగా! ఆ తర్వాత ఇద్దర్నీ నేను ఫారిన్ తీస్కెళ్లిపోతా! అన్నాడు ఈజీగా.
    "దానికంటే మమ్మాకి మళ్లీ పెళ్ళిచేస్తే అసలయిన తోడు దోరుకుతుందిగా!" కొంచెం నెమ్మదిగా అంది.
    చివుక్కున తిరిగి చూశాడు.
    "కరెక్ట్... నాకొచ్చిన ఆలోచనే!" గబగబా జ్ఞాపిక దగ్గరికొచ్చి ముఖం దోసిట్లోకి తీసుకుని, "నీకూ నిజంగా అలానే  అనిపిస్తుందా? నాకూ అప్పుడప్పుడూ అలానే అనిపిస్తుంది!" ఉద్వేగంగా అడిగాడు.
    ఇంతలో.... కాలింగ్ బెల్ చప్పుడు!
    జ్ఞాపిక సిటౌట్ లోకి వచ్చింది. తలుపు తీసి- "హాయ్ఁ... మేమ్!" అంది.
    "ఇఫ్ యు డోంట్ మైండ్ కాల్ మీ ఆంటీ!" అందావిడ చల్లగా నవ్వుతూ.
    "ఇఫ్ యు డోంట్ మైండ్ ఐ విల్ కాల్ యు మమ్మా! జస్ట్ లైక్ రేవంత్!"
    "ఓఫ్ఁ... విత్ ప్లెజర్! నౌ ఐ హావ్ టూ చిల్డ్రన్! వెరీ గ్లాడ్ న్యూస్!" జ్ఞాపిక భుజాలమీద చెయ్యేసి రేవంత్ దగ్గరికెళ్లింది!
    రేవంత్  కూల్ డ్రింక్ మమ్మాకి, జ్ఞాపికకు అందిస్తూ-
    "మమ్మా అని పిలిస్తే పిలవనీ! కానీ, నా ప్రేమలో షేరిచ్చావంటే నేనోప్పుకోను" చిన్నపిల్లాడిలా మారాంగా అన్నాడు.
    "బిట్టూ! ప్రేమలో షేర్లుండవ్... అది సముద్రం!" అంది తలమీద కొట్టి.
    "థాంక్యూ...మమ్!" అంది జ్ఞాపిక. కళ్ళల్లో నీళ్లు! 'అమ్మ స్పర్శ' ఎరుగని మనసుకు అదొక అనిర్వచనీయమైన భావన.
    "ఏవయింది జ్ఞాపికా! లాస్ట్ టైమ్ కూడా నీ కళ్ళలో నీళ్లు చూశాను" అందావిడ అనునయంగా.
    "నథింగ్ మమ్! తనకు అమ్మలేదు. నిన్ను చూడగానే తనకు అమ్మ గుర్తొచ్చి!" విషయం చెప్పాడు.
    "సారీ! ఐయాం సారీ జ్ఞాపికా! ఇకనుంచీ మీ అమ్మ దగ్గర ఎలా ఉండాలనుకున్నావో అలాఉండు నా దగ్గర! ఓ.కే. !" అంది గడ్డంపట్టి పైకెత్తుతూ.
    ఆమె భుజాలచుట్టూ చేతులేసి మెడమీద నుదురు ఆన్చి, "థాంక్యూ....థాంక్యూ!" అంది మెల్లగా! రేవంత్ లేచివచ్చాడు టాపిక్ మార్చడానికని.
    "మమ్! తనకు లిటరరీ బుక్స్ ఇస్తానన్నావట. నన్ను చంపుకుతింటూంది రోజూ... తీస్కెళ్లమని. ఏదో ఈరోజు పోరు భరించలేక తీస్కోచ్చా!" అన్నాడు.
    తడికళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూస్తూ-
    "నేనా.... చంపుకుతిన్నానా? నువ్వే నన్ను మమ్మా తీసుకురమ్మందని తీసుకొచ్చి..." అని వెంటబడింది- తలమీద కొడదామని!
    టేబుల్ చుట్టూ ఒక రౌండ్ కొట్టి, "మమ్! హెల్ప్ హెల్ప్! మర్డర్! కిల్లింగ్!" అనరిచాడు.
    "మమ్! ప్లీజ్...వదలోద్డు- పట్టుకో! ఉండు.... నీ పనిచెప్తా" తల అందుకోబోయింది.
    ఇద్దరూ అలా తనచుట్టూ ఆటలాడుకుంటుంటే... తనూ తల్లిలా ఇద్దర్నీ సముదాయించడంలో తనూ చిన్నపిల్లయిపోయింది... సుహాసిని.
    జ్ఞాపికను డ్రాప్ చేసి వచ్చాక సుహాసినిని చూడగానే- 'అమ్మకు పెళ్ళిచేస్తే...' అన్న ఆలోచన మళ్లీ వచ్చింది రేవంత్ కు.  'పుట్టని తన కోసం అందం, జీవితం అన్నీ అంకితమిచ్చిన అమ్మకు కొత్తజీవతం ఇస్తే ఎంత బావుంటుందో!' అనుకున్నాడు. తనలాగే ఆలోచన  వచ్చిన జ్ఞాపిక అంటే ఇంకా ఇష్టం పెరిగింది. 'తనూ, జ్ఞాపిక కలిసి ఏదో ఒకటి చెయ్యాలి'  అనుకున్నాడు.
    నుదుట పెద్ద బొట్టూ, పూలూ, చేతినిండా గాజులూ, పట్టుచీర, పక్కన తనమనిషి తోడుగా నిండుగా నవ్వుతున్న అమ్మరూపం కదిలింది. అలానే చూస్తూండిపోయాడు.
    "బిట్టూ! ఏంటలా చూస్తున్నావ్? ఎప్పుడూ చూడనట్టు!" యాపిల్  కట్ చేసి ఇస్తూ అంది.
    "మమ్! నువ్వు పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుందీ?" అడిగేశాడు.
    పకపకా నవ్వింది. "నేను నిన్నడగాలి బిట్టూ అది!  నువ్వు నన్ను కాదు!"
    "సీరియస్ గా అడుగుతున్నా.... ఎలా ఉంటుందీ?!" అన్నాడు మొండిగా.
    "ఏవీ  బావుండదు! నాకసలు అక్కర్లేదు కూడా! అయినా నువ్వుండగా నాకింకేం కావాలిరా! హాఁ..! ప్రపంచమంతా నీలోనే కనిపిస్తుంది నాకు!" అంది ముక్కుమీద యాపిల్ తడి తుడుస్తూ.
    లేచి వెనకనుంచి మమ్మా భుజాలమీద చెయ్యేసి "నేను స్టేట్స్ వెళ్లిపోతే నీకు తోడు?" అడిగాడు.
    "నీ ఆలోచనలు, నా జాబ్!~ ఇవిచాలు! అయినా పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తున్నా వెందుకీరోజు?" ముద్దుగా కసిరి లోపలికెళ్లింది.
    అమ్మ పడుకున్నాక లేచి, అమ్మ రూమ్ లోని అల్మారాల్లోంచి కొన్ని డైరీలు తీసి వెతికాడు.... ఏదో అడ్రసు దొరికేదాక!
    ఆ తర్వాత డైరీలన్నీ పెట్టెసి మౌనంగా పడుకున్నడు.
    చాలాసేపు నిద్రపోలా! ఏదో తర్కం.., మనసులో ఘర్షణ! ఈ రెండింటి మధ్యా స్థిరంగా తీసుకున్న నిర్ణయం!!
                                           13
    ఈష్ భుజంమ్మీద తలపెట్టుకునుంది స్పూర్తి!
    మౌనం! మౌనంలో ఏకత్వం! ఏ భావమో తెలీని భావోద్వేగంలో హృదయాల స్పందన లేకమయిన మౌనం! ఆ మౌనం ఎంత ఏకీకృతం చేసిందంటే.... రెండు శరీరాలన్న భావనే దూరం చేసింది. ఏకాత్మను చేసి ఇద్దర్నీ ఒకర్ని చేసింది.
    "ఈష్..!"
    "ఊఁ..."
    "నాకోసం నువ్వు లోలోపల రగులుతున్నావు కదూ!"
    "లేదు! నా నువ్వు నాకు దక్కాక ఇంకా కోపమెందుకు?"
    "నీలాంటి వ్యక్తిచే ప్రేమించబడటం నా అదృష్టం కాదూ!"
    "నిన్ను ప్రేమించుకోవడం నా అదృష్టం అనుకున్నాను గనుకే- నిన్ను నా స్వంతంచేసుకున్నా!"
    "నిన్ను దేవుడనాలి కదూ!"
    "అక్కర్లేదు! మామూలు మనిషిని! అయితే, నీ మనిషిని! అందుకే నీకోసం ఆరాటం!"
    "నువ్వు అందర్లాంటివాడివి కాదు."
    "వద్దు! అలా అని నిన్ను నీవు కించపరచుకోకు! నేను మామూలు మనిషినే. నాదనుకున్న మనిషిని నేను పొందాను. ఎలా అన్నది ముఖ్యం కాదు- పొందానా, లేదా.... అన్నది ముఖ్యం!"
    "ఈష్! ఈష్... నేను చాలా అదృష్టవంతురాల్ని! నువ్వు లేపోతే నేను డిప్రెషన్ లో పడి జీవితాంతం కొట్టుమిట్టాడేదాన్ని!" మెడచుట్టూ చేతులు వేసి  మెడవంపులో ఏడ్చేసింది.   

 Previous Page Next Page