Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 15

   "ఇదీ వరుస జ్ఞాపిక! నువ్వెళ్లినప్పటి నుండీ ఇది మమ్మల్ని మాట్లాడనీకుండా తింటోంది!" స్పూర్తి, కామినీ కంప్లయింట్ చేశారు.
    "నీకు బైకూ, బాయ్ ఫ్రెండేగా కావాలి...?!" జ్ఞాపిక సీరియస్ గా అడిగింది.
    "య్యా! ఎగ్జాట్లీ! ఎంత బాగా అర్థంచేసుకున్నవో! వీళ్ళకు అర్థమయిచావక ఛస్తున్నారు!" రేవతి తలమీద చేతులు తీసి  గుండెమీద పెట్టుకుని హాయిగా నిట్టూర్చింది.
    "నో ప్రాబ్లమ్... ఇప్పుడే ఆరెంజ్ చేస్తా!"
    "ఇప్పుడా! రాత్రయిపోయిందే! ఈ పిచ్చిది నిజామనుకుని తెల్లార్లూ మనల్ని తింటుందే!వెధవ ప్రామిస్ లు చెయ్యకు!" అంది స్పూర్తి కంగారుగా.
    "అసలు దీనికి రేచీకటి! చీకట్లో మగాడో, ఆడదో తేడా కూడా తెలీదు.... వదిలేయ్!" కామిని ఆపబోయింది.
    "జెలస్! ఎంత జెలసో నేనంటే, నా బాయ్ ఫ్రెండంటే! నిజమైన ఫ్రెండంటే జ్ఞాపికానే! పద! నా బాయ్ ఫ్రెండ్ పాకెట్ మనీతో మీకు ఐస్ క్రీం కాదు, కుంకుడు కాయలు, తెస్తా! తినకపోతే చంపేస్తా! అని రెండడుగులు వేసింది.
    జ్ఞాపిక చెయ్యి పట్టుకుని ఆపి-
    "ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఇక్కడే చూపిస్తా!" అంటూ రేవతిని వెనక్కి లాగింది.
    "ఇక్కడా? ఎక్కడున్నా డెక్కడున్నా డెక్కుడున్నాడూ?" అని హడావిడిగా కాట్స్ కిందా, టేబుల్ కిందా, బాత్ రూమ్ లోనూ వెతికింది.
    "ఆగు! కంగారోద్దు! నేను చూపస్తాగా..." అని రేవతి చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి, "నువ్వు కళ్ళుమూసుకో! కళ్ళు తెరిచేసరికి  రూమ్ లో నువ్వూ, నీ బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఉంటారు...ఓ.కే.!" అంది.
    "కళ్ళేందుకే మూసుకోవాలి...?" కయ్యానికి దిగింది రేవతి.
    "ఒళ్ళు కూడా మూసుకో!" స్పూర్తి అంది.
    "పుట్ బాలయిపోతావ్,.! రేవతి తిట్టింది స్పూర్తిని.
    "అయితే.... నేను చూపించనుపో!" అంది జ్ఞాపిక.
    "సర్లే.... ఏడువ్!" అని కళ్ళు మూసుకుంది.
    కామినికీ, స్పూర్తికీ ఏదో సైగచేసింది జ్ఞాపిక, రేవతి కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టారు. ట్యూబ్ లైట్ తీసేసి బెడ్ లైట్ వేశారు.
    పది నిముషాల తరువాత- "కళ్ళు తెరూ!" అని గుసగుసగా వినిపించింది.
    రేవతి కళ్ళు తెరిచింది.
    ఎదురుగా... జీన్ ప్యాంట్ లో కాటన్ షార్ట్ టక్ చేసి- బెల్ట్, టైతో ఒకబ్బాయి నిలుచని ఉన్నాడు. మంచి స్ప్రే స్మెల్! మెల్లగా రేవతి చెయ్యిపట్టుకుని చెవి దగ్గర పెదాల చేర్చి "ఐ లైక్ యూ రేవూ!" అన్నాడు. నూనూగు మీసాలు చెవి దగ్గర చక్కలిగిలి పెట్టాయి.
    "రేవూ ఎవరు?" అడిగింది ముక్కు నలుపుకుంటూ.
    "నువ్వే డాళింగ్! నీ కిస్ నేమ్ 'రేవూ...' అని పెట్టుకున్నా!" అన్నాడు మళ్లీ గుసగుసగా.
    "గట్టిగా మాట్లాడండీ! లైటెందుకు తీశారు? మా దెయ్యాలేరీ?" అంది.
    "ష్ష్...! లవర్స్ గట్టిగా మాట్లాడకూడదు. డిమ్ లైట్ లోనే ప్రేమించుకోవాలి. మీ దయ్యాలు శ్మశానాని కెళ్లాయి" అన్నాడు మళ్లీ, చెవి దగ్గర మళ్లీమీసాల చక్కిలిగిలి.
    "పీడా పోయారు! లేపోతే ఏడ్చి ఛస్తారు! ఇంతకీ మీపేరు?"
    "నా పేరు 'చావూ'! అంటే.... చక్కిలిగింతల ఉమేష్ షార్ట్ ఫామ్ అన్నమాట!"
    "బావుంది!బావుంది 'రేపూ! చావూ!' భలే కాంబినేషన్! కూర్చోండి...కూర్చోండి!" అని పక్కకు జరిగింది.
    "నిన్ను రోజూ చూస్తున్నా!" మళ్లీ చెవిదగ్గర! ఈసారి చెవి గోక్కుంది రేవతి.
    "ఏ యాంగిల్ లో!" అడిగింది అర్థంకాక.
    "అన్ని యాంగిల్స్ లో! మీరు అజంతాసుందరి!"
    "తనెవరు మీ క్లాస్ మేటా... చావూ!" అర్థంకాలా రేవతికి.
    "కాదు! శ్మశానం మేటు రేవూ!" మునిపళ్ళతో చెవి మెత్తగా కొరికాడు- కొంచెం కోపంగా.
    "నాకు తెలుసు మీకేవిష్టమో!" అంది రేవతి తనూ గుసగుసగా.
    "రేవూఁ...నీకూ బుర్రందే! 'బుర్ర' అంటే మనసన్నమాట!" అని గుండెపై చెయ్యేసి చూపించాడు. చటుక్కున చెయ్యి పట్టుకుని ఆపి-
    "చావూ! మీకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదూ! " కనిపెట్టేసిన ఆనందం గొంతులో పొంగుతుండగా చెప్పింది.
    "అరేఁ....నీకెలా తెలుసురేవూ?" అడిగాడు ఇంకా ఆనందంగా.
    "ఎలా అంటే, ఎలా అంటే.... నా చెవి కొసలు మునిపంటితో కొరికితే కనిపెట్టేశా!" నెపోలియన్ ఇండియాను కనిపెట్టిన విజయం గొంతులో.
    తల రేవతి భుజంకేసి కొట్టుకుని, రేవూ! నీ చెవి నాన్ వెజ్ కోసం కొరకలఔా! అది రోమాన్స్..!" అన్నాడు మళ్లీ గుసగుసగా.
    "రోమాన్స్ లో వెజ్ ఉండదా చావూ?!" మళ్లీ గుసగుసగా అడిగింది.
    ఇంతలో....వార్డెన్!" అరిచింది రేవతి! గబగబా లైటెలిగించింది.
    కామినీమ్ స్పూర్తి పుస్తకాలు పట్టుకున్నారు తిగేసి. జ్ఞాపిక గోడవైపు తిరిగి కళ్ళు మూసుకు పడుకుంది. రేవతి కళ్ళద్దాలు తడుముకుని పెట్టుకుంది. పక్కనే ఏదో కాగితం. పెన్నూ ఉంటే  గెలకసాగింది సేరియాస్ గా.
    మేడమ్ కిటికీలోంచి చూసి- 'చదువుకుంటున్నారు పిల్లలు.... పాపం. M.C.A. స్టూడెంట్స్ బాగా కష్టపడతారు!' అనుకున్నారు.
    "జ్ఞాపిక పడుకుందేం?" అడిగారు బయటినుండే.
    "ఇప్పటివరకూ చదూకుంది కదా మేమ్! జస్ట్ రిలాక్స్ గా పడుకుంది. నిద్రపట్టినట్టుంది!" కామిని చెప్పింది.
    "కాదు....మేమ్! వీళ్ళు ముగ్గురూ శ్మశానానికి...."రేవతి.
    "అవును మేమ్! మేమిప్పుడే  శ్మశానం అంటే ఏవిటీ టాపిక్ డిసికస్ చేసుకున్నాం!" అంది స్ప్జ్హూర్తి కంగారుగా! కామిని- రేవతి చెయ్యి గిల్లింది గోరు దిగేలా.
    "ఓ.కే. గుడ్ నైట్ గర్ల్స్! వెళ్లిపోయారావిడ!
    అప్పుడు లేచారు ముగ్గురూ. రేవతిని చుట్టుముట్టారు.
    "నా బాయ్ ఫ్రెండూ, నేనూ కలిసి 'వెజ్' నాన్ వెజ్ రొమాన్స్' చేసుకుంటుంటే మీరెప్పుడోచ్చారే?" అడిగింది అమాయకంగా రేవతి.    "నీ బొంద! రొమాన్స్ లో వెజ్, నాన్ వెజ్ ఉండదే!" స్పూర్తి తిట్టింది.
    'అసలు  నా బాయ్ ఫ్రెండ్...." అని జ్ఞాపిక వైపు చూసింది.
    జీన్ ప్యాంట్, కాటన్ షార్ట్, టక్, టై, రెజాయ్ ని కట్ చేసి పై పెదవి అంటించుకున్న మీసాలూ చూశాక అర్థమయిపోయింది రేవతికి.
    అమాంతం జ్ఞాపిక మీదకు ఎటాక్ చేసి- రెజాయ్ ముక్కను మీసాలుగా పెట్టుకున్నాది పీకి "నా బాయ్ ఫ్రెండ్ తో నేను పంచుకోవాలనుకున్న 'వెజ్' నాన్ వెజ్ రోమాన్స్ సీను'లోకి నువ్వు ఎంటరయిపోయి పాడుచేశావు కదే! ఇక నేను మొట్టమొదటిసారి కాబోయే బాయ్ ఫ్రెండ్ తో ఏ సీను పంచకోవాలే?! నా జీవితపు అపురూపపు ఆశను నా సోడాబుడ్డీ కళ్ళద్దాలు తీసేసి మసకలో నన్ను మోసంచేసి నాశనం చేశావు కదే!" అని దిండు తీసుకుని వెంటబడి కొట్టసాగింది.
    రేవతిని కామినీ, స్పూర్తీ ఇద్దరూ కలిసి పట్టుకుని కూర్చోబెట్టారు. చేతిలో ఉన్న మీసాలు విసిరికొట్టి-
    "నన్ను మోసం చేసినందుకుగాను నీకు జీవితాంతం నీ బాయ్ ఫ్రెండ్ 'వెజ్, నాన్ వెజ్ రోమాన్స్' చెయ్యకుండుగాక!" అని శపించింది పరమసాద్వీమణిలా ఫోజ్ పెట్టి.
    జ్ఞాపిక, కామినీ, స్పూర్తీ  నవ్వీనవ్వీ "ఒసేయ్ బకిరీ! రొమాన్స్  లో 'వెజ్, నాన్ వెజ్  ఉండవే!" అంటే వినలా.
    "ఉంటాయి! ఉంది తీరాలి!" అని వాదన. "ఒట్టి ముద్దు  పెడితే వెజ్, మునిపంట నొక్కితే నాన్ వెజ్...." అని ఇంకేదో చెప్పబోతున్న రేవతిని ఆపి-
    "సర్లే....దీంతో మనకేంటి! పడుకోమ్మా- వెజ్ రొమాన్స్ చేసుకో!" అంటూ గుడ్ నైట్ చెప్పి బలవంతంగా పడుకోబెట్టి దుప్పటి కప్పారు.
    "అవును జ్ఞాపికా....ఏంటంత ఆనందంగా  వచ్చావీ రోజు?" స్పూర్తి అడిగింది.
    "నేనో ఇష్టమైంది చూశా!" అంది జ్ఞాపిక...అదో రకమైన తన్మయపు అనుభూతి ముఖంలో.
    "ఏవిటేఁ... నిన్నంత తన్మయంలో ముంచింది?!" ఇద్దరికీ తెలుసుకోవాలనిపించింది.
    రేవతి కూడా దుప్పటి తీసి జ్ఞాపికవైపు చూడసాగింది- "ఏం చెబుతుందో....' అని.
    "రేవంత్ వాళ్ళ మదర్ ను చూశా! ఆవిడ రేవంత్ అక్కయ్యలా ఉందే! మనక్కూడా అక్కయ్యలా ఉంది! ఎంత బాగా కీట్స్ పోయెట్రీఎక్స్ ప్లెయిన్ చేసిందో! నేనసలు ఇమ్మర్స్ అయిపోయా! ఆ ఇమ్మర్స్ ఏదేదో చేసేసా! నాకు భలే నచ్చిందిలే!  అసలు రేవంత్ కు మమ్మీలా  లేనే లేదే! రేవంత్ తనకంటే హైటూ పర్స్ నాలితీ! అసలు రేవంత్ ను తనెలా కండో అర్థంకాలా!" సంతోషంగా గబగబా చెప్పింది.
    "నా కర్థమైంది!" రేవతి అంది.
    "ఛుప్... పడుకో!" స్ఫూర్తి తిట్టింది.
    "పాపం....ఊరుకోవే! ఇప్పటిదాకా ఏడిపించాం! ఇక వదిలేద్దామే!" జ్ఞాపిక అంది. "ఎవర్థవయిందే?" అడిగింది రేవతిని సౌమ్యంగా.
    "రేవంత్ ను ఎలా కందంటే.... రేవంత్ పుట్టినపుడు ఇంత పెద్దగా లేడు కాబట్టి!" అంది కనిపెట్టేసిన ఉత్సాహంతో.
    చేతిలో బుక్ తీసుకొని కొట్టింది జ్ఞాపిక.
    టక్కున ముసుగు పెట్టేసింది- "ఏది మాట్లాడిన తిడతారు, కొడతారు!" అని  గొణుక్కుంటూ.
    ముగ్గురూ హాయిగా నవ్వారు. దుప్పట్లో కూడా నవ్వుకుంది. రేవతి కావాలని అల్లరి చేస్తుందని వాళ్ళకీ తెలుసు. రేవతికీ తెలుసు.  అందుకే ఆ నవ్వులు!
    ఆరాత్రి జ్ఞాపికకు నిద్ర పట్టలా!
    రేవంత్ వాళ్ళమ్మ భుజాల చుట్టూ చేతులేసి తలపెట్టి తనవైపు చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. 'అమ్మంటే అలా ఉంటుందా... అక్కయ్యలా,ఫ్రెండ్ లా?! అమ్మను వాటేసుకుంటే ఎలా ఉంటుంది? రేవంత్ అమ్మను తను తీసేసుకుంటే! రేవంత్ లా తనూ ఆవిడనలా వాటేసుకుంటే! ఎంత దగ్గరితనం, ఎంత గారాబం రేవంత్ ముఖంలో! కాలేజ్ లో  సీరియస్ గా ఉంటాడు. వాళ్ళమ్మ దగ్గర పిల్లాడిలా, ఒద్దికగా, గారంగా! నిజంగా అమ్ముంటే బావుండేది! రేవంత్  అడగాలి- 'మీ అమ్మను ఒక్కసారి భుజాలమీదుగా  వాటేసుకుని భుజంమ్మీద తల పెట్టాలని ఉందీ!' అని. ఏవంటాడో! 'వద్దు! నేనున్నాగా...' అంటాడా? అననీ! తనున్నా అమ్మ కావాలి. రేవంత్ అమ్మల్లాంటి 'అమ్మ.' రేపు పెళ్ళయ్యాక తనూ రేవంత్ లా ఆవిడ దగ్గర ఉండిపోవచ్చు. ఆవిడ దగ్గర గారాలు పోవచ్చు. తనకు ఇన్నేళ్ల నుండీ అమ్మ లేదనే లోటు రేవంత్ తీర్చేశాడనిపించింది. అందుకే... కానుకగా రేవంత్ కు  ముద్దు పెట్టింది.
    రేవంత్ చేతిని తాకిన తన పెదాలను మెత్తగా  తడిమింది.
    రేవంత్ తడిమినట్లనిపించి ఒళ్ళు జలదరించింది. 'ఒఫ్చ్ఁ....'అనుకుని దిండు గట్టిగా పట్టుకుంది.
    మసక వెలుతుర్లోంచి రేవతి- "వెజ్జా? నాన్ వెజ్జా?" అడిగింది.
    "చంపేస్తా! పడికో! నైటీ పిన్ గుచ్చుకుంటే అరిచా!" అడక్కుండానే సంజాయిషీ ఇచ్చింది జ్ఞాపిక.
    "అయితే.... నాన్ వెజ్!" అంది రేవతి.
    "షటప్... ఈవిల్!" అని అరిచింది. ఇక మూల్గలా రేవతి.
                                                                                     11
    ఆరోజు కాలేజ్ లో ఎంటర్ కాగానే రేవంత్ ఎదురై విష్ చేస్తే అడిగింది జ్ఞాపిక-
    "రేవంత్! నాక్కొంచెం లాబ్ హెల్ప్ కావాలి నీది!" అని.
    "జ్ఞాపీ...నువ్వు నెక్ట్స్ ఫైనలియర్ కొస్తున్నావు! నువ్వు గైడ్ వు కావాలి.... నీ జూనియర్స్ కు! ఇంక కొంచెం కొంచెం నామీద డిపెండెన్సీ మానుకోవాలి" అన్నాడు సున్నితంగా.
    నిజమేననిపించింది జ్ఞాపికకు. కొద్దిగా రోషం కూడా వచ్చింది. "ఏం... రేవంత్ గైడెన్స్ లేకుండా నేను చేసుకోలేనా?' అనిపించింది. చేసిచూ పెట్టాలనే  పట్టుదల కూడావచ్చింది.
    క్లాసయిపోయాక కామినీ, స్పూర్తీ, రేవతీ హాస్టల్ కెళ్తుంటే జ్ఞాపిక ఆగిపోయి అంది-
    "మీరెళ్లండే! నేను ఒకసారి లాబ్ కెళ్లోస్తా! రేవంత్ కోప్పడుతున్నాడు- 'నీకు నువ్వే  ప్రాక్టికల్స్ చేసుకో. నేనీ ఇయర్ వెళ్లిపోయాక ఎవరు హెల్ఫ్ చేస్తారు? అయినా... నువ్వే నీ జూనియర్స్ ని గైడ్ చెయ్యాలి. ఇంకా నామీద ఆధారడోద్దూ' అని!" లాబ్ వైపు మళ్లింది.
    "నువ్వెళ్లవే జ్ఞాపికాకు  తోడు!" అన్నారు రేవతిని.
    "దానికా? నేనెళ్లను! అది రెజాయ్ మీసాలు పెట్టుకుని నా మొట్టమొదటి ఫీలింగ్ కాజేసింది! ఐ హేట్ హర్! లెట్ హర్ గోటు హెల్!" విసుక్కుంది.
    "నీకేమీ నీ తోడక్కర్లా! కాస్త దారి చూసుకుని నడువు! కళ్ళద్దాలు  కనిపించక బోర్లాపడ్డావంటే నీ మొట్టమొదటి 'బోర్లా ఫీలింగ్' నేల కాజేస్తుంది!" అని, "మీరెళ్లండి.... నేను వన్ అవర్ లో వచ్చేస్తా!" అని వెళ్లిపోయింది.
    "దీనికి ఒళ్ళంతా పొగరే!" రేవతి గొణిగింది.
    "నీకు మాత్రం తక్కువేంటీ....?!" స్పూర్తి రెట్టించింది.
    "నీకంటే కొంచెం తక్కువే!" మొదలెట్టారు దెబ్బలాట.
    రేవతి లాబ్ కెళ్లి తన వర్క్ లో పడిపోయింది. టైమ్ చూసుకోలా! చీకటయిపోయి లైట్లు వేసేసరికి వాచ్ చూసుకుంది.
    "మైగాడ్...!" అని గబగబా బయటకొచ్చింది.
    కైనటిక్ పార్క్ చేసినచోట కైనటిక్ లేదు. దూరంగా చెట్టుకింద పెట్టి ఉంది.
    'నేనిక్కడ పార్క్ చేశాను.... అక్కడికెలా వెళ్లిందబ్బా!' అనుకుంది. మళ్లీ తనమీదే అనుమానం వచ్చింది. 'అక్కడే పార్క్ చేసి ఉంటాను' అనుకుని దాని దగ్గరకు నడిచి, కీ హొల్ లో కీ పెడుతుండగా పడింది...
    భుజంమ్మీద చెయ్యి...!
    చివుక్కున తల తిప్పింది.
    వాళ్ళిద్దరూ స్పూర్తిని చింపిన కుక్కలు. రెండోవాడు ఇంకో భుజంమ్మీద చెయ్యి వేశాడు. కైనటిక్ స్టార్ట్ చేసింది. కైనటి క్ ను ఒక్క నెట్టు నెట్టారు. కైనటిక్, దాంతోపాటు జ్ఞాపిక కూడా పడిపోయింది.
    పడిపోయిన జ్ఞాపిక తల దగ్గరకు రెండు పాదాలూ, కాళ్ల దగ్గరకు రెండు పాదాలు నిలబడ్డాయి. చుట్టిన పరుపులా జ్ఞాపికను ఎత్తి పట్టుకున్నాయి. విదిలించుకోవడానికి లేదు. చేతిలో ఉన్న కైనటిక్ కీతో భుజాలు  పట్టుకున్నవాడి కడుపులో గుచ్చింది.
    ఒక చెయ్యి వదిలాడు. అదే చెయ్యికున్న కడెం లాంటి గాజుతో ముక్కుమీద బలంగా గుద్దింది. రిమ్మతిరిగి రెండు భుజాలు వదిలాడు.

 Previous Page Next Page