"అయితే మీరెప్పుడూ తాగలేదా?" అంది సుహాసిని.
"నేను పాలు తప్ప ఏమీ తాగను" అన్నాడు సుబ్బారావు.
సుహాసిని నిట్టూర్చి "మిమ్మల్ని పెళ్ళి చేసుకున్న ఆడది దురదృష్టవంతురాలు" అంది.
పెళ్ళి అనగానే సుబ్బారావు సిగ్గుపడి చటుక్కున లేచినిలబడి "నేనింక వస్తానండి" అన్నాడు.
సుహాసిని తనూలేచి నిలబడి టైము చూసుకుని "బావ ఈ రోజు కూడా రాలేదు" అంది.
"మీరిక్కడ మీ బావకోసం చూస్తున్నారా?" అన్నాడు సుబ్బారావు.
"అవునండీ-నిన్న వస్తానన్నాడు. నిన్న రాలేదు. ఈ రోజొస్తానన్నాడు. ఈరోజూ రాలేదు. ఏమయిందో ఏమో" అంది సుహాసిని.
"నా విషయంలోనూ అంతే జరిగిందండి. వస్తానన్న మనిషిని బదులు రౌడీలు వస్తున్నారు" అన్నాడు సుబ్బారావు.
ఇద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. సుబ్బారావు ఆగి, "పాపం వీల్లింకా ఇలాగే పడి ఉన్నారు. నన్ను లేపమంటారా?" అన్నాడు.
"అందుకు నా అనుమతి ఎందుకు?" అంది సుహాసిని.
"వాళ్ళనుపడగొట్టినది మీరు. మీ అనుమతి లేకుండా వాళ్ళను లేపొచ్చా?"
"అసలు వాళ్ళు కొడుతున్నది మిమ్మల్ని. మీ విషయంలో నేను జోక్యం చేసుకోలేదూ? అలాగే నా విషయంలో మీరూ జోక్యం చేసుకోవచ్చు" అంది సుహాసిని.
రామ్ గోపాల్, మోనికా పొదలచాటున కదిలి వీళ్ళని అనుసరిస్తూనే ఉన్నారు.
"అయితే పాపం వాళ్ళను లేపుతాను...." అన్నాడు సుబ్బారావు.
"వాళ్ళు లేవగానేమిమ్మల్ని తంతారు" అంది సుహాసిని.
"వాళ్ళను లేపడం మీకిష్టం లేదులా ఉంది. వద్దని చెప్పండి మానేస్తాను."
"మధ్య నేనెందుకూ చెప్పడం!" అంది సుహాసిని.
"ఎవరైనా చెబితేనే, నేననుకున్నా పని మానేస్తాను. దగ్గర్లో అమ్మలేదు. మీరు వద్దని చెప్పకపోతే నేను వాళ్ళ లేపుతాను" అన్నాడు సుబ్బారావు.
సుహాసిని సుబ్బారావు వంక జాలిగా చూసి "సరే లెండి. వాళ్ళను లేపొద్దు" అంది.
"మరి వాళ్ళకేం ప్రమాదం లేదంటారా?"
"ఏ ప్రమాదం లేదు. ఇంకాసేపట్లో ఎవరూ లేపకుండా వాళ్ళే లేచి వెళ్ళిపోతారు."
ఇద్దరూ పార్కులోంచి బయటకు వచ్చేక సుహాసిని "మీ అమ్మగారిని నాకోసారి చూడాలని వుంది" అంది.
"నాకూ మీ బామ్మగారిని చూడాలని ఉంది" అన్నాడు సుబ్బారావు.
"ఎందుకు?" అంది సుహాసిని.
"మీరెందుకు కనుకుంటున్నారో, నేనూ అందుకే" అన్నాడు సుబ్బారావు.
"తెలివైనవారే" అని నవ్వింది సుహాసిని "అమ్మను మాట్లాడనివ్వని బామ్మ- బామ్మను మాట్లాడనివ్వని అమ్మ-వీళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది కదూ!"
ఇద్దరూ విడిపోయారు.
9
"వీళ్ళేం కుర్రాళ్ళయ్యా, అమ్మల గురించీ బామ్మల గురించీ మాట్లాడుకుంటారు. వయసులోఉన్న యువతీ యువకులు మాట్లాడుకోవలసిన మాటలేనా ఇవి!" అన్నాడు రాయుడు.
"రాయుడుగారూ సుబ్బారావు దారిలోకి వస్తున్నాడు అసలతను సుహాసినితో అంతసేపు మాట్లాడడమే ఓ పెద్ద విశేషం!" అన్నాడు రచయిత.
ఇంతకీ అతడికి సుహాసిని వచ్చిందో లేదో తెలుసుకోవాలి!"
రచయిత సుబ్బారావుకి కబురంపించి రప్పించాడు.
"నేనేవద్దామనుకున్నానండీ. వంటైపోయాక" అన్నాడు సుబ్బారావు.
"నువ్వు వంట చేస్తున్నావా?" అన్నాడు రాయుడు.
"లేదండి, అమ్మకు సాయం చేస్తున్నాను. ఇంకా రేపొక్కరోజు నేనే సాయం చేయాలండి. చెల్లెలికీరోజే పథ్యం పెట్టాం. ఈరోజు ఒంటి పూట భోజనం దానికి రేపటికి రెండుపూటలా భోజనాలైపోతే- అదే అమ్మకు సాయం చేస్తుంది" అన్నాడు సుబ్బారావు.
"నువ్వు తొందరగా పెళ్ళి చేసుకోకూడదూ- మీ అమ్మకు వంట పనిలో సాయంగా ఉంటుంది" అన్నాడు రాయుడు.
సుబ్బారావు సిగ్గుపడి "సంబంధా లొస్తున్నాయండి. అంతా అమ్మ చూసుకుంటోంది" అన్నాడు.
"అలాగా - సుహాసినిని చూశావు గదా - నీకెలాగుంది?" అన్నాడు రాయుడు.
"ఆ అమ్మాయి చాలా అందంగా ఉందండి" అన్నాడు సుబ్బారావు.
"ఆమెను పెళ్ళిచేసుకుంటావా?" అనడిగాడు రాయుడు.
సుబ్బారావు క్షణం తడబడి తర్వాత తేరుకుని "ఆమెది మా కులమేనాండీ?" అన్నాడు.
రాయుడు నివ్వెరపోయాడు. ఓ అందమైన అబ్బాయి, అందమైన అమ్మాయి కలుసుకుని ఒకర్నొకరు చూసుకోగానే వెంటనే ప్రేమలో పడిపోవాలి. అంతేగానీ కులం చూసుకుని ప్రేమించుకుంటారా?
రాయుడిలా అనగానే రచయిత మళ్ళీ ఆవేశపడ్డాడు. "మనం సినిమాల్లో చూపించేదంతా బూటకం. నాటకం. హీరో ఓ అమ్మాయిని చూడగానే ప్రేమించేసి ఆ ప్రేమ కోసం అడ్డమైన త్యాగాలు చేసేసి, అష్టకష్టాలకూ ఓర్చుకుని ఆఖరికి పెళ్ళి చేసుకుంటే,ఆ హీరోకి పూలదండలు వేసి అభిమాన సంఘాలు స్థాపించే ఈ యువకులంతా పెళ్ళి అనగానే కులమేమిటి, మతమేమిటి అంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తారు. అలా సినిమాల్లో ప్రవర్తించిన హీరోలు, ఆ సినిమాలు తీసేరాయుళ్ళు కూడా తమ ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళు కూడా కులం ప్రాతిపదికతోనే జరిపిస్తున్నారు. ఈ కులతత్వం దేశంలో సమసిపోదు. ఎన్నేళ్ళయినా ఇలాగే ఉంటుంది."
"అబ్బబ్బ- రచయితా - అలా ఆవేశపడకయ్యా- మన సినిమా కులం సమస్యమీద కాదు. నేను సినిమా తీస్తే నలుగురూ చూసి రాయుడు బాగా తీశాడని మెచ్చుకోవాలి. నాకు నాలుగు డబ్బులు రావాలి. ఈ సంఘాన్ని మరమ్మత్తు చేయాలనీ, సంస్కరణలు తీసుకు రావాలనీ నేను సినిమాలు తీయడం లేదు" అన్నాడు రాయుడు. తర్వాత ఆయన సుబ్బారావు వంక తిరిగి "నీలాంటి యువకులు ముందుకు వస్తే తప్ప అనాదిగా మన సంఘాన్ని పట్టిపీడిస్తున్న ఈ కులమత బేధాలు సమసిపోవు సుహాసిని ఏ కులమో చూసి తెలుసుకోగలిగేవా నువ్వు? అలాంటప్పుడు నీ కీ కులం పట్టింపు ఎందుకు?" అన్నాడు.