Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 15

   

"నేను వాణ్ణి కొట్టలేనురా! ఆ వందా నాకే ఉంచు, పోనీ ఆ తర్వాత అది నీకే యిచ్చేస్తాలే- ప్రస్తుతానికి నా దగ్గరుండనీ" అన్నాడు మొదటి రౌడీ.   
    "కావాలంటే అది నీకే యిచ్చేస్తాను. కానీ నన్ను కొట్టమనకు వాణ్ణి!"   
    ఆ వంద రూపాల నోటు ఆసరాగా తీసుకుని సుబ్బారావుని కొట్టే అవకాశం తప్పించుకోవాలని. ప్రతి ఒక్కడికీ ఉంది. ఆ విషయమి చివరికి నలుగురూ జుట్టూజుట్టూపట్టుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళెందుకు దెబ్బలాడుకుంటున్నారో తెలియక సుబ్బారావు కాసేపు జరుగుతున్నది ఆశ్చర్యంగా చూడసాగాడు.   
    చూస్తూండగా రౌడీల పోట్లాట తీవ్రతరమయింది. వాళ్ళు సుబ్బారావు సంగతి మర్చిపోయి కాట్లకుక్కలా కొట్టుకోసాగారు. తనిచ్చిన ఒకే ఒక్క వంద రూపాయల నోటు అందుకు కారణమని గ్రహించి సుబ్బారావు మనసులో బాధ పడ్డాడు. తన కళ్ళముందు వాళ్ళు ఒకరినొకరు చంపుకోవాలన్నంత తీవ్రంగా పోరాడుకుంటున్నారు. ఒక్క వందరూపాయల నోటు కోసం!   
    సుబ్బారావు కీ పోరాటం ఆపాలనిపించింది. అతను వాళ్ళ మధ్యకు పరుగెత్తాడు. అయితే రౌడీలు అతన్నిపట్టించుకోలేను. వాళ్ళ నాపాలని ప్రయత్నించినందుకు అతడికీ దెబ్బలు తగుల్తున్నాయి. అలా కొంతసేపు జరిగేసరికి రౌడీలు ఈ లోకంలోకి వచ్చారు.   
    "ఒరేయ్, మనం మనలో మనం దెబ్బలాడుకుంటున్నాం. ఇలా ఎప్పుడేనా జరిగిందా? అంతా వీడి మూలానే వచ్చింది" అన్నాడో రౌడీ.   
    అప్పటికి నలుగు రౌడీలకూ అవసరమైనంత ఆవేశం వచ్చింది. వాళ్ళు నలుగురూ కలిసి సుబ్బారావు మీద పడ్డారు.   
    సుబ్బారావుకు భయం వేసింది. ప్రాణభయం కలిగింది. ఆ క్షణంలో రౌడీలతడికి మనుషుల్లా కాక రక్షసుల్లా కనబడ్డారు.   
    "రక్షించండి __ రక్షించండి...." అంటూ అతను వెనక్కు తిరిగి పరుగెత్తబోతూ చటుక్కున కనిపించిన వ్యక్తి వెనుక నిలబడ్డాడు.   
    ఆ వ్యక్తి సుహాసిని!   
    అప్పుడే ఆమె పార్కులో అడుగుపెట్టింది. తన వెనుక నిలబడ్డ సుబ్బారావునీ తన ముందున్న నలుగురు రౌడీలనూ చూసిందామె. ఆమెను చూస్తూనే రౌడీలు ఆగిపోయారు.   
    "ఆడపిల్లవు తప్పుకో!"అన్నాడో రౌడీ.   
    ఆ మాటలకు సుహాసిని సమాధానం ఇవ్వలేదు.   
    సుబ్బారావింకా ఈ లోకంలో లేడు. ప్రాణభయం అతడిని వదలలేదు. తనకే రో తోడుగా అక్కడ నిలబడిందని గ్రహించాడే తప్ప ఆమె ఆడది అని కూడా అతను గుర్తించ లేదు.   
    రౌడీలు, సుహాసిని, సుబ్బారావు తమ తమ స్థానాల్లో అలా కాసేపు అనగా కొద్ది నిముషాలు నిలబడ్డారు. ఉన్నట్లుండి సుహాసిని మెరుపువేగంతో కదిలి చిన్నగా కేక పెట్టించి ఆమె రెండు కాళ్ళు, రెండు చేతులు-ఇంచుమించు ఒకేసారి పని చేశాయి. నలుగురు రౌడీలూ నెల మీదకు వాలిపోయారు.   
    ఈ దృశ్యం చూసిన సుబ్బారావు అవాక్కయి పోయాడు.   
    సుహాసిని అక్కణ్ణించి తను నిన్నటి దినం కూర్చున్న చోటకి వెళ్ళి కూర్చుంది. రౌడీలు ఇంకా అలాగే పడి ఉన్నారు. సుబ్బారావు ఒకసారి పడివున్న రౌడీల వంకా, కాస్త దూరంగా కూర్చునివున్న సుహాసిని వంకా చూశాడు. తర్వాత నెమ్మదిగా సుహాసిని సమీపించి "థ్యాక్సండి!" అన్నాడు.   
    అప్పటికి రాజగోపాల్, మోనికా - పొదల చాటున కదిలి - వీళ్ళకు దగ్గరగా ఉండే మరో పొదల చాటుకు వెళ్ళారు.   
    "సమయానికి నేను రావడం మీ అదృష్టం. అయినా వాళ్ళెవరు? మిమ్మల్నెందుకు కొడుతున్నారు?" అనడిగింది సుహాసిని.   
    సుహాసిని కూర్చుని వుంది. సుబ్బారావు నిలబడి ఉన్నాడు. అతను నిన్న తను పార్కుకు రావడం దగ్గర్నుంచి ఈ రోజు వరకూ జరిగిన దంతా చెప్పి "అంత మందిని మీ రొక్కరూ ఎలా కొట్టగలిగారు?" అనడిగాడు.   
    "నాకు కరాటే వచ్చు ఆత్మరక్షణ కోసం మా బావ నేర్చుకోమంటే నేర్చుకున్నాను" అంది సుహాసిని.   
    "కరాటే వచ్చినా అంత మందిని కొట్టాలని ఎలా అనిపించింది. మీకు?" అనడిగాడు సుబ్బారావు.   
    సుహాసిని ఓసారి సుబ్బారావు కళ్ళలోకి తీవ్రంగా చూసి "ఈ ప్రశ్న ఎందుకడుగుతున్నారో తెలియడంలేదు!" అంది.   
    "రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఎదుటి మనిషి మీద చెయ్యి ఎత్తితే మనం ఊరుకుంటే- అతడేమీ చెయ్యలేడు. ఎవరు నిన్నేం చేసినా సరే- నువ్వు మాత్రం ఎవర్నీ ఏమీ చెయ్యకు. అని మా అమ్మ చెప్పింది" అన్నాడు సుబ్బారావు.   
    నీకు చేతనైనంతలో ఎదుటి వాళ్ళకు సాయపడు అని మా బామ్మా చెప్పింది. మా బామ్మ మాట నాకు వేదవాక్కు" అంది సుహాసిని.   
    "ఏమండీ మీకు అమ్మలేదా?" అన్నాడు సుబ్బారావు.   
    సుహాసిని కోపంగా సుబ్బారావు వంక చూసి "మా అమ్మ ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంది. అయినా యిదేం ప్రశ్న!" అంది.   
    "ఇప్పుడైతే లేదు గానీ ఒకప్పుడు నాకూ బామ్ముండేది, "మా అమ్మ ఉండగా బామ్మ ఎప్పుడూ నోరు విప్పేది కాదు. అమ్మలున్న ఇళ్ళలో బామ్మలు మాట్లాడరని నాన్న అనేవాడు. నాకేమైనా సరే - అన్నీ అమ్మే చెప్పేది. అమ్మ మాట నాకు వేద హక్కు అందుకే అడిగాను" అన్నాడు సుబ్బారావు.   
    "అయ్యో మీరు నిలబడే ఉన్నారు. కూర్చోండి" అంది సుహాసిని. మొహమాట పడుతూ కూర్చున్నాడు సుబ్బారావు. అప్పుడామె - "మా యింట్లో అమ్మ మాట్లాడదు. అన్నింటికీ బామ్మే! బామ్మ ఉన్న యింట్లో అమ్మలు మాట్లాడరని మా నాన్న అంటూంటాడు" అంది.   
    "ఏమండీ! మీకు అమ్మా, నాన్నా బామ్మాఅంతా ఉన్నారా?"   
    ఈ ప్రశ్నకు సుహాసిని ఆశ్చర్యపడి "ఉన్నారు మీకు లేరా?" అంది.   
    "నాకు అమ్మ, చెల్లి తప్ప ఇంకెవరూ లేరు. అంతా ఉంటే ఎంతో బాగుంటుంది కదండీ" అన్నాడు సుబ్బారావు.   
    సుహాసిని జాలిగా సుబ్బారావు వంక చూసి, "మీరేం చేస్తున్నారు?" అనడిగింది. సుబ్బారావు తన ఉద్యోగం గురించి చెప్పాడు. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించడంవల్ల రాయుడి సంగతి మాత్రం చెప్పలేదు. "మరి మీకు ఫ్రెండ్సు లేరా?"   
    "నేనెవరితోనూ ఎక్కువగా స్నేహం చేయను. స్నేహితులు చెడు అలవాట్లు చేసి, పాడు చేస్తారని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది నిజమేనండీ- మా ఆఫీసులో చాలామంది సిగరెట్లు కాలుస్తారు. ఆ సిగరెట్ పెట్లమీదే రాసి ఉంటుంది. పొగత్రాగుట హానికరం అని అయినా సరే వాళ్ళుమానరు. ఇంకా కొంతమంది బార్లకుపోయి సారా తాగేస్తారు" అన్నాడు సుబ్బారావు.

 Previous Page Next Page