Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 17

    "నాకే పట్టింపూ లేదండీ. అంతా అమ్మ యిష్టం. అమ్మకిష్టమైతే సుహాసిని ఏ కులానిదైనా నాకూ యిష్టమే. కానీ అమ్మ యింతవరకూ మా కులం సంబంధాలానే చూస్తోంది. ఇంకో కులం పిల్లని ఒప్పుకోదని నా అనుమానం" అన్నాడు సుబ్బారావు.   
    "ప్రేమించడంలో స్వతంత్రంగా వ్యవహరించి, పెళ్ళి దగ్గరకు వచ్చేసరికి అమ్మా నాన్నల యిష్టం అనే చాలామంది కుర్రాళ్ళకంటే - ప్రేమకు ముందే అమ్మ ఇష్టం అనే నువ్వు చాల మెరుగు. నిన్ను నేను అభినందిస్తున్నాను" అన్నాడు రచయిత.   
    "ఇంతకీ, రేపు మళ్ళీ అదే టైముకి పార్కుకి వెళ్ళాలి. వెడతావా?" అన్నాడు రాయుడు.   
    "మీరుచెప్పకపోయినా వెడదామనుకుంటున్నానండి" అన్నాడు సుబ్బారావు.   
    రాయుడు ఆశ్చర్యంగా "సుహాసినిని మళ్ళీ చూడాలనుందా?" అన్నాడు.   
    "అవునండి. ఆమె కూడా రేపు తప్పకుండా పార్కుకు వస్తుందని నా నమ్మకం."   
    రాయుడు తను ఏదో అడగబోయి ఆగిపోయాడు. ఏదో అడగబోతున్న రచయితను కూడా వారించాడు. "మంచిది. వెళ్ళిరా! అని ఆయన అతన్ని పంపించేశాడు.   
    సుబ్బారావు వెళ్ళిపోయాక "మొత్తం మీద వయసు కొంచెం పని చేస్తోంది. సుబ్బారావు మళ్ళీ ఆమెను చూడాలనుకుంటున్నాడు" అన్నాడు.   
    "అంతేకాదు. ఆమె తనకోసం వస్తుందని కూడా నమ్ముతున్నాడు. కనుల బాసలో ఏమో- అమ్మ ఇష్టంలేనిదే ఏ పెళ్ళీ జరుగదన్న వాడు ఈ ప్రేమ వ్యవహారం ఎందుకు నడుపుతున్నాడూ అని అడగబోయాను. మీరు వారించారని మానేశాను" అన్నాడు రచయిత.   
    "అవునయ్యా, కుర్రాడు మన దారిలోకి వస్తూంటే రానివ్వాలిగానీ- ముందే బెదరగొట్టకూడదు. కథ ఎలా నడుస్తుందో చూడనీ!" అన్నాడు రాయుడు.   
    "మరి, రేపటికి ఏవైనా ఏర్పాట్లు చేయాలంటారా?" అన్నాడు రచయిత.   
    "పాత్రలక్కూడా కొంత స్వతంత్రం యిద్దాం- వాళ్ళు సరైన దారిలో నడవకపోతే అప్పుడే మనం కలగజేసుకుందాం" అన్నాడు రాయుడు.   
    "ఎందువల్లనో ఈ పాత్రలకు స్వతంత్రమివ్వడం నాకు నచ్చలేదు" అన్నాడు రచయిత. అతడేమన్నప్పటికీ రాయుడి మాటే నెగ్గింది.   
    మర్నాడింక వాళ్ళేఏర్పాట్లూచెయ్యలేదు. సాయంత్రం నాలుగింటికే బయల్దేరి వాళ్ళిద్దరూ పార్కుకి వెళ్ళారు. వాళ్ళక్కడికి చేరిన పావుగంటకి మోనికా, రామగోపాల్ కూడా వచ్చారు. వాళ్ళు రాయుడి గారిని చూసి "మీరిక్కడకు రావడం మంచిదే అయింది. రహస్యంగా పొదలచాటున కదలడం ఎంత కష్టమో తెలుసుకుంటారు. కదిలే పొదలు ఏర్పాటు చేసుకుంటే బాగుండి ఉండేది" అన్నాడు.   
    రాయుడు నవ్వి, "ఇంకా ఏమేం ఏర్పాట్లు చేయాలో తెలుసుకుందామనే నేనిక్కడకు వచ్చాను" అన్నాడు.   
    కాసేపటికి పార్కు గేటుదగ్గర అలికిడయింది. అంతా పొదల మాటుకు సర్దుకున్నారు. రామ్ గోపాల్ అటు వైపే చూస్తూ "సుహాసిని వస్తోంది. ఆమె పక్కన బహుశా సుబ్బారావే ననుకుంటాను. కాదు...కాదు సుబ్బారావు పొడుగ్గా ఉండాలి. అసలాపక్క నున్నది మగాడే కాదు. ఎవరో ముసలావిడ లాగుంది. సుహాసిని సుబ్బారావుని కలుసుకుందుకు వస్తూ ముసలావిన్ని ఎందుకు వెంటబెట్టుకొచ్చింది చెప్మా" అని "ఇంక నిశ్శబ్దం వాళ్ళు మనవి బాగా సమీపించారు" అన్నాడు.   
    "బామ్మా, మనం ఇక్కడే కూర్చుందాం. వాళ్ళూ వచ్చే వేళయింది" అంది సుహాసిని.   
    కొద్ది క్షణాల్లో అక్కడికి సుబ్బారావూ వచ్చాడు. తల్లిని వెంట బెట్టుకుని.   
    సుహాసిని బామ్మ, సుబ్బారావు అమ్మను చూసింది.   
    సుహాసిని చటుక్కున లేచి నిలబడి "ఈవిడ మా బామ్మ" అంది.   
    సుబ్బారావు ఆవిడకు నమస్కరించి "ఈవిడ మా అమ్మ. పేరు సుభద్రమ్మ" అన్నాడు.   
    "కూర్చోవమ్మా" అంది బామ్మ.   
    బామ్మ, అమ్మ-పరస్పరాభిముఖులై కూర్చున్నారు. బామ్మకు కాస్త వెనుకగా సుహాసిని - అమ్మకు కాస్త వెనుకగా సుబ్బారావు కూర్చున్నారు.
    "ఏమ్మా నీ యింట్లో నీ అత్తగార్ని మాట్లాడనివ్వవుట. పెద్దల్ని గౌరవించే సంప్రదాయం మీ ఇంట్లోలేదా?" అంది బామ్మ.   
    "మా అత్తగారెలా మాట్లాడుతుందండి. ఆవిడెప్పుదో చచ్చిపోయింది" అంది సుభద్రమ్మ.   
    "అయినా మీ యింట్లో నీ కంటే పెద్దవాళ్ళకి నువ్వు గౌరవమిస్తున్నావా?" అంది బామ్మ.   
    "మా యింట్లో నా కంటే పెద్దవాళ్ళు లేరు. ఓ అబ్బాయీ, అమ్మాయీ నాకు ఇద్దరూ కూడా నేను గీచిన దాటు దాటరు. అమ్మాయినింట్లో వదిలేసి ఓ గీత గీసి అబ్బాయిని వెంట బెట్టుకుని ఇలా వచ్చాను. మా అబ్బాయికి నేనంటేనే కాదు. పెద్దవాళ్ళెవరన్నా గౌరవమే!" అంది సుభద్రమ్మ.   
    "నమస్కారమండీ!" అన్నాడు సుబ్బారావు మళ్ళీ.   
    "ఆహా- ఏం వినయం. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాళ్ళు అరుదు" అని మెచ్చుకుంది బామ్మ. సుబ్బారావు సిగ్గుతో మెలికలు తిరిగాడు. అప్పుడు బామ్మ మళ్ళీ అంది - "మా పాప కూడా అంతే!"   
    "నమస్కరమండీ" అంది సుహాసిని. సుభద్రమ్మ ఆమె విషయాన్ని మెచ్చుకుంది. సుహాసిని అందంగా సిగ్గుపడింది.   
    "మా కోడలికి ఏమీ తెలియదు. కూతురు పెళ్ళీడు కొచ్చిందా, ఇంకా వరలక్ష్మీవ్రతం చేయడమెలాగో దానికి తెలియదు. అన్నీ నేనే చెప్పి చేయించాలి. తనెప్పుడు నేర్చుకుంటుంది? కూతురికెప్పుడు నేర్పుతుంది? అన్నీ నేనే చెప్పాలి నేనే క్షణాన హరీమంటానో తెలియదు. నా కోడలి గురించే నాకు బెంగ!" అంది బామ్మ.   
    "మా అత్తగారూ అంతేనండీ! ఆవకాయకని కాయ తెప్పించి ఆలిచిప్పలతో తొక్క గీయించేశారు. నేనేమో మాగాయేమో ననుకుని ఊరుకున్నాను. అంతా అయ్యాక ఆవిడ ఆవకాయంటే "మరి తొక్క తీసేది మాగాయక్కాదా?" అనడిగాను. అత్తగారు కంగారుపడి కాయలన్నీ అవతల పారేద్దామంది. దానికేముందీ, వీటితోటే మాగాయ పెట్టుకోవచ్చుగదా అంటే ఎన్ని తెలివితేటలే నీకు. ఇకనుంచి ఊరగాయ పనులన్నీ నువ్వే చూసుకో అందండి" అంది సుభద్రమ్మ.   
    బామ్మ, సుభద్రమ్మ - ఇది తల్చుకుని నవ్వుకున్నారు.   
    "ఉంటారమ్మా, కొందరలాగే! మా కోడలు పులిహోర చేస్తే పులుపు తక్కువయింది. పులుపు సరిపోవాలంటే ఏం చేయాలత్తయ్యా అనడిగింది. చింతపండు వేయాలన్నాను. పులిహోరలో చింతపండు వేస్తే నల్లగా అయిపోదూ అనడిగింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే పులిహోరలో చింతపండు వేస్తారని దానికి తెలియదు. చింతపండు లేకుండా పులిహోరేంటమ్మా" అంది బామ్మ   
    సుభద్రమ్మ కాసేపు పడి పడి నవ్వింది. "మా అత్తగారికి పులిహోరలో చింతపండు వేస్తారని తెలుసు. ఒకసారి నేను మామిడి పులిహోర చేశాను. మా అత్తగారు వంటింట్లోకి వెళ్ళి "ఏమే, ఆ ఇత్తడి గిన్నెల్ని తోమాలి-పులి హోరలో వేసిన చింతపండు పిప్పి ఎక్కడా అని కేక పెట్టింది. అప్పుడు నేను స్నానాలగదిలో ఉన్నాను. ఈరోజు చింతపండు వెయ్యలేదత్తయ్యా- మామిడికోరు పులిహోర చేశాను అన్నాను. అత్తగారనుకుందీ- నేనింకా చింతపండు వెయ్యలేదేమోనని అంతే- ఆవిడ తనే చింతపండు పులుసు తీసి ఉడకబెట్టి పులిహోరలో కలిపేసింది. జరిగింది తెలుసుకొని నేను "అదేంటత్తయ్యా, పులుపుకోసం మామిడికోరు వేశాను కదా- ఇంకా చింతపండెందుకు వేశారు?" అనడిగాను. చింతపండు లేకుండా పులిహోర చేసుకుంటారని ఆవిడకు తెలియదట- పులిహోర పుల్లరొడ్ద అయిందని ఆవిడ అవతల పారేద్దామంది. నేనావిన్నివారించి అప్పటికప్పుడు మరికాస్త  అన్నం వార్చి కలిపి దాన్ని బాగు చేస్తే "ఎన్ని తెలివి తేటలే నీకు ఇంకా నేనసలు వంటింట్లో అడుగెట్టను" అంది.

 Previous Page Next Page