"అబ్బ! ఫోజులుకొట్టక చెప్పన్నయ్యా"
"నీకు చెప్పి లాభంలేదు! నీ ఫ్రెండుకే చెబుతాను పద!" అంటూ ఆమె గదికే బయల్దేరాడు.
"ఆడ లేక మద్దెల ఓడన్నట్టుగా లెక్క చేయడంరాక లెక్కతప్పో ఆన్సర్ తప్పో అంటావా? లెక్క తప్పుకాదు. ఆన్సర్ తప్పుకాదు! అంటూ అపురూప ముందు లెక్క చెప్పడానికికూర్చున్నాడు ఆమెకంత దగ్గరగా కూర్చొని, ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పడం అతడికేమిటో పరవశంగా ఉంది. తనకు తానుగా లెక్చరర్ పదవి సంపాదించుకొని ఆమెకు రాని లెక్క చెప్పడం గర్వంగా ఉంది.
పుస్తకంలో ఉన్న ఆన్సర్ తో అతడు చూపిన ఆన్సర్ సరిగ్గా సరిపోవడంతో అతడి ముఖంలో విజయకేతనం రెపరెపలాడింది.
"ఎన్ని రకాలుగా చేసి చూశానుగాని. ఈ రకంగా చేయలేదు. ఈ రకం చేస్తే నాకు వచ్చేది ఆన్సర్."
"ఈ రకంగా చేస్తే వచ్చేదిగాని చేయలేదు కదా నువ్వు? మరిరాని లెక్క చెప్పినందుకు పారితోషికం నాకేమిస్తారు?"
తెల్లబోయినట్టుగా చూసింది అపురూప. ఈ మాత్రం లెక్క చెప్పినందుకు పారితోషికమా? అదీ తనివ్వాలా?
స్నేహితురాలిని ఆ ఇబ్బందినుండి తప్పిస్తూ "లెక్క ఒక్క అపురూపది మాత్రమే కాదు! నాది కూడా. మా ఇద్దరిదీ కలిపి ఒకకప్పు కాఫీ కమ్మటి బ్రూ కాఫీ కలిపి తీసుకువచ్చి ఇస్తాను!" అంటూ కాఫీ కలిపి తీసుకురావడానికి వెళ్ళింది శ్వేత.
"శ్వేతా కాఫీ ఇస్తున్నందుకు పారితోషిక గండం గడిచిందనుకోకు నేను లెక్క చెప్పింది నీకే. పారితోషికం నువ్వే ఇవ్వాలి!" ఆమెను ఆపాద మస్తకం చూపులతో తడుముతూ అన్నాడు.
"ఏం ఇవ్వాలి?" అయోమయంగా చూసింది.
"పాతికేళ్ళ అబ్బాయి స్వీట్ సిక్స్టీన్ ని అడిగే పారితోషికమేమిటో తెలియనంత అమాయకురాలివనుకోను. అది నానుండి వినాలని సరదా పడితే కాదనను! ఒక అబ్బాయి అమ్మాయినడిగే పారితోషికం ముందు మనసు! తరువాత......"
బుస్సు మంటూ పైకి లేచే పాముపడగలా అపురూప చెయ్యి పైకి లేచింది. కాని, అతడి చెంపను ముద్దు పెట్టుకోకముందే అతడి చెయ్యి చురుగ్గా కదిలి పట్టేసింది. "అబ్బ! గులాబీరేకుల్లా ఎంత మృదువుగా ఉందో చెయ్యి!" ముగ్దుడైనట్లుగా ఆ చేతిని ముద్దుపెట్టుకొన్నాడు.
ఊహించని ఈ సంఘటనకి కర్రలా బిగుసుకుపోయింది అపురూప.
"ఇక్కడ పెట్టిన ఈ ముద్దు ఈ పెదవుల మీద పెట్టాలని ఎన్నాళ్ళగానో ఉన్న కోరిక. మగసిరి గలవాడికి పర్మిషన్ అక్కరలేదనుకో! చదువూ సంస్కారం ఉన్నవాడిని కనుక పర్మిషన్ కోసం ఆగాల్సి వచ్చింది. పారితోషికంగా నేనడిగేది ఇదే! ఇస్తావా?" "నువ్విప్పుడు చేసింది చదువూ సంస్కారం ఉన్నవాడు చేయాల్సిందేనా?" అతడి చేతిోలంచి తన చేతిని దులిపేసుకొంటూ భద్రకాళిలా కళ్ళెర్రజేసి అడిగింది అపురూప.
"చదువూ సంస్కారం వున్నవాళ్ళకి ప్రేమలూ, ఆకర్షణలూ ఉండవా? స్త్రీ పురుషుల మధ్య సహజంగా జరిగే పనే నేనిప్పుడు చేసింది! కాదనగలవా?" చిలిపిగా చూశాడు.
"నాకున్న బ్రతుకుభారంలో నేను స్త్రీనన్న విషయమే గుర్తులేదు. గుర్తుచేసినందుకు థ్యాంక్స్!" కవ్వింపుగా నవ్వింది. "నేను ఆడపిల్లననీ, నాకు పదహారేళ్ళు వచ్చాయనీ ఇప్పుడే తెలిసింది. తెలియగానే నా ఎదుట కనిపించిన మగవారు మీరే! ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నాళ్ళకయినా ఎవరికో ఒకరికి ఈ మనసు ఇవ్వాల్సిందే ఆ తరువాత ఇవ్వాల్సింది కూడా ఇవ్వాల్సిందే. ఆ ఎవరో మీరే అయితే నాకేమీ అభ్యంతరం లేదు. చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యం, అన్నీ ఉన్న మీ బోటి వారు దొరకడం అదృష్టంగానే భావిస్తాను! కాని, ఒక్కటే షరతు."
"ఏమిటి?" ఉద్విగ్నంగా అడిగాడు ప్రదీప్.
ఇంత తేలిగ్గా ఆ అమ్మాయి తనకు లొంగుతుందనుకోలేదు!
లొంగక ఏం చేస్తుంది? తనకున్న అర్హతలు ఆ అమ్మాయే ఒప్పుకొందికదా? తనబోటి కలవారి పిల్లవాడు, అందగాడూ క్రీ గంట చూసినా ఆ పిల్ల జీవితం ధన్యమైపోతుంది.
ఆమె ఎటువంటి పేదరికం అనుభవించేది చెల్లెలివల్ల రాబట్టాడు. మరొకరిద్దరివల్ల కూడా వాళ్ళ ఇంటి పరిస్థితి తెలుసుకున్నాడు.
అందుకే చొరవ తీసుకున్నాడు. చెయ్యి పట్టుకున్నాడు. తప్పించుకోలేదన్న ధీమాతో వున్నాడు.
"......పెద్దల సమక్షంలో నా మెడలో తాళి కట్టాలి!"