Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 15

    యోగిలో రవంత కదలిక కన్పించింది.

    అతడు బొటనవ్రేలు మీదికి ఎడమచేతి అనామికను మడిచినాడు! ఫెటిల్లున ఏదో విరిగి పడినట్టు మరొకామె లేచింది.

    "అదే వరుస! అపచారం జరిగిపోయింది! అపరాధం చెల్లించకుంటే దండన తప్పదు! నగరంలో విలయం అనివార్యం!"

    యోగి మధ్య వేలు మడిచాడు!

    దాంతో మరో యువకుడు విరుచుకు పడినాడు!

    ద్రవిడ మాహేశ్వరుడు వ్రేలు ముడిచినప్పుడల్లా ఒకరు చొప్పున ఉగ్ర రూపానికి వస్తున్నారు. అరగంటలో మొత్తం పదిమంది అయ్యారు. ఆ వీధిలో దొరికిన సాంబ్రాణి అంతా ఊడ్చి తెచ్చారు. చివరకు ట్రాఫిక్ సంగతి అందరూ మర్చిపోయారు.

    కానిస్టేబుల్ కూడ ఆ విడ్డూరాన్ని గమనించటంలో నిమగ్నుడయ్యాడు.

    ఉమా పరుగున వెళ్ళి పోలీసు కంట్రోలు రూంకి ఒన్ డబల్ జీరో డయల్ చేసింది!

   
                                        4

    "హలో! దిసీజ్ పోలీస్ కంట్రోల్ రూం!"

    "డి.ఎస్.పి. రమేష్ చంద్రగారి డాక్టర్ని మాట్లాడుతున్నాను! రిపోర్టు ఉంది నోట్ చేసుకోండి! చాల అర్జెంట్ గా ఎవరో ఒకరు రావాలి! ప్లీజ్!"

    "వ్రాసుకుంటాం చెప్పండి మేడమ్!"

    "శివరాణి థియేటర్ సెంటర్ లో చాల గొడవ జరుగుతోంది. అరగంటనించి ట్రాఫిక్ జాం అయిపోయింది!"

    "అక్కడ మా మనుషులున్నారు డ్యూటీలో! రిపోర్టు చేయండి!"

    "వారు కూడ భక్తి తన్మయత్వంలో మునిగిపోయారండి బాబు!"

    "భక్తి తన్మయత్వంలోనా?? వివరంగా చెప్పండి!"

    కళ్ళముందు జరిగినదంతా వర్ణించి చెప్పింది ఉమ!

    "మేము చూచుకుంటాం!" అంటూ రిసీవర్ దింపేశాడు! వెంటనే ఎ.ఎస్.పి. గారికి ఇంటర్ కంలో జరిగినదంతా నివేదించాడు.

    "రెండు వ్యాన్ లు సిద్దంచేయండి! రౌండ్స్ కూడ తీయించి పన్నెండుమందిని తయారు కమ్మని చెప్పండి. రెండు నిముషాలలో వస్తున్నాను"

    "సర్! ఇది ట్రాఫిక్ కి కాని పబ్లిక్ న్యూసెన్స్ కి కాని సంబంధించిన వ్యవహారం! క్రిమినల్స్ కి సంబంధించిన వ్యవహారం కాదు."

    "షటప్! అదంతా నాకు తెలుసు చెప్పినట్టు చెయ్యండి వెంటనే!" అంటూ చదువుతున్న రెడ్ ఫైల్ బీరువాలో స్వయంగా భద్రపరిచాడు.

    వెంటనే క్యాప్ తగిలించుకుని స్టిక్ తీసుకున్నాడు!

    పోలీసు బూట్లు కరకరలాడించుకుంటూ ఎ.ఎస్.పి. శివరాజ్ వరండాలోకి వచ్చే సమయానికి రెండు జీపులు అరడజను వ్యాన్ తో కదిలేందుకు స్థిరంగా వున్నాయి.

    పోలీసు జీపులు నియమితమయిన వ్యూహంలో రెండు దిక్కులనించి ఒకేసారి దాడిచేసేందుకు రెండు వైపులకు బయల్దేరాయి. చేరవలసిన చోటుకి చేరుకున్నారు.

    ముందుగా ట్రాఫిక్ పోలీస్ లను అలర్ట్ చేసి వారిస్థానంలోకి పంపేశాడు. ముందు ప్రక్క ఆగిపోయి ట్రాఫిక్ జాం అయిపోవతనికి కారణమయిన వాహనాల మీదికి మైక్ ని దాడిచేయించాడు. ఎవరికి ఏ క్షణంలో ఏ ముప్పు వస్తుందో తెలియక డ్రయివర్స్ వాహనాల్లోకి పరుగుతీసి స్థిరంగా కూర్చున్నారు.

    ఎప్పుడయితే ముందు ప్రక్క వాహనాల కదిలాయో ట్రాఫిక్ ఫ్లో అవటం ప్రారంభించింది. షాపు ముందు మనిషి ప్రవేశించటానికి వీలుకాకుండా బిర్రుగా బిగిసిపోయిన జనసాంద్రత కాస్తంత రిలాక్స్ అవటం మొదలు అయింది.

    ముందుగా తానేలోపలకు దారితీశాడు శివరాజ్!

    ఒళ్ళు పెరిగిన వాళ్ళ వీరావేశంలో వచ్చి అతన్ని చుట్టుముట్టారు! పైశాచిక బలంతో క్రిందికి పడద్రోయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న తులసి తననితాను సంభాళించుకోలేక పోయింది. భర్త అపాయంలో ఉండగా చూచి ఆమె భక్తి తాదాత్మ్యం మంచులాగ విడిపోయింది.

    ఉమ, కల్యాణి ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా జనం మధ్యకు వెర్రెత్తిన దానిలా పరుగుతీసింది! జనాన్ని చీల్చుకుని భర్తను చేరుకోవాలని ఆమె తాపత్రయం!

    కాని అప్పటికే పోలీసులకి, ప్రజలకి మధ్య సంఘర్షణ తీవ్రతరం అయింది. రెండు మూడు రౌండ్లు గాలిలోకి కాల్చటం వినిపించింది.

    హా హా కారాలు చెలరేగినాయి.

    కొందరు పూర్వపు కక్షలు మనసులో ఉంచుకున్న వాళ్ళు సమయం చిక్కినందుకు సంతోషిస్తూ పోలీసుల్ని క్రిందికి పడలాగి యీడ్చుతున్నారు.

    "చార్జి చార్జి" అని అరుస్తున్నాడు శివరాజ్!

    అప్పటికప్పుడే తయారయిన ఒక వాలెంటరీ టీము వారికి పూర్తిగా ఎదురు తిరిగింది. ఎట్టి పరిస్థితిలోనూ పోలీసుల్ని యోగి వైపుకి పురోగమించకుండా చేయాలని తీవ్రంగా పోరాడుతున్నారు.

    లాఠీ దెబ్బలకు నలుగురు యువకులు ఇద్దరు స్త్రీలు కూడా స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులకు గాయాలు అయినాయి. శివరాజ్ కి కూడ దెబ్బలు తగిలినాయి. పాదపూజలకు వచ్చిన ఒక వి ఐ పి కల్పించుకున్నాడు.

    అప్పటికప్పుడు ఎస్ పి గారు కల్పించుకోవటం అని వారిం అయింది. ఆయన స్వయంగా వచ్చి పరిస్థితిని చక్కదిద్దటానికి పూనుకున్నారు.
 

 Previous Page Next Page