Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 14

    నీ ఖర్మకు ఎవరు బాధ్యులు! నిన్ను బాగు చేయటం మన బెనర్జీ మేడమ్ గారి వల్లనే కాలేదు. ఇంకా మావల్ల ఏమవుతుందికాని దయచేసి నోరు మూసుకో!

    "మన వెనక నిలబడిన ఆయన భక్తులు విన్నారంటే తన్నగలరు!" అని హెచ్చరించింది కళ్యాణి!

    అప్పటికే యువకులు వారివంక గుర్రుమని చూడటాన్ని గమనించిన తులసి రహస్యంగా భుజంమీద గిచ్చి మరీ హెచ్చరించింది.

    "స్వామీ చాలామంది భక్తులు తీర్ధ ప్రసాదాలకోసం వచ్చారు! కొంచెమయినా క్షీరధారల్ని విడిచిపెట్టండి. మమ్మల్ని అనుగ్రహించండి" అంటూ షాపు యజమాని అర్ధాంగి ఆ కాస్తంతగా ఉన్న స్థలంలోనే పొర్లు దండాలు పెట్టటం ప్రారంభించింది.

    ఆవేశం అణచుకోలేని ఓ యువకుడు పెద్దగా అరిచాడు!

    "ద్రవిడ మాహేశ్వర యోగి మహారాజ్ కీ!"

    "జై! జైజై!!" అంటూ భక్తులు ప్రతిధ్వనించారు. ఆ వీధి వీధి అంతా మార్మోగిపోయింది. బయట కూడ జనం గుంపు కట్టి రోడ్డు మీద వాహనాలకు అడ్డు వచ్చారు.

    ట్రాఫిక్ వారి విన్నపాలను పట్టించుకున్న నాధుడేలేడు. వారు ధారగా వస్తున్న వాహనాలను ఎలాగో శ్రమపడి తాత్కాలికంగా మార్జిన్ మీదికి మళ్ళించారు.

    క్షణక్షణానికీ జనం పెరుగుతున్నారు!

    ఈ వార్త క్షణాల మీద పొక్కింది. ప్రక్కనున్న షాపుల  వాళ్ళు కూడ వచ్చి చేరాడు. ప్రముఖులంతా వస్తున్నారు. జనసాంద్రత క్రమంగా మరింత ఎక్కువకుతోంది. భక్తి, ఆవేశం జనతరంగమై లేచింది. షాపు యజమాని అభ్యర్ధనని మిగిలిన వారంతా అందుకున్నారు. యెంత అలజడి జరుగుతున్నా, జనం ఎంతగా గగ్గోలు పడుతున్నా యోగి మాత్రం అఖండమయిన ఏకాంతాన్ని అనుభవిస్తున్న వాడిలాగా నిశ్చల సమాధిలో ఉన్నట్టు కన్పిస్తున్నాడు.

    క్రమంగా ప్రజల అభ్యర్ధనలు వేడికోళ్ళ తీవ్రతరం అయినాయి. ఒకప్పుడు రుద్రుడు తన జటా జూటంలో గంగను బంధించగా విడుదల చేయమని ఘోరాతి ఘోర తపస్సుచేశాడు భగీరధుడు!

    ఐస్ పార్లర్ ముందు చేరిన అఖండ జనవాహినిలో ఒక్కొక్కరూ ఒక్కొక్క భగీరధులైపోయి ప్రార్ధించటం మొదలెట్టారు.

    కాని యోగి మాత్రం ఎంతకూ కరగని ముడియినుములా బిగిసిపోయి వున్నాడు. కనురెప్పలు అయినా కదిలించినవాడు కాదు.

    ఫానుగాలికి జటల మీదినుంచి లేచిన పీచు వెంట్రుకలు మాత్రం ఊగిసలాడుతున్నాయి. అతని శరీరంమీద చెమటపట్టదు.

    అనవరతం భస్మధారణవల్ల మాత్రమే కాదు అతని శరీరంలో చాల విచిత్రమయిన, విశిష్టమయిన లక్షణాలెన్నో ఉన్నాయి.

    ఉన్నట్లుండి జనసముద్రంలో పిడుగుపడినట్లు అయింది.

    "భైరవా!! రుద్రభైరవా!!" అంటూ పెడబొబ్బ పెట్టివిరగ దీసుకుని లేచింది ఒకామె! చాలాకాలం ప్రాక్టీస్ చేసినాదానిలా రుద్ర తాండవం ప్రారంభించింది. అడుగులు లయబద్దకంగా ఊగుతున్నాయి. చేతులు గాలిలో పక్షుల్లా ఊగుతున్నాయి.

    యోగి ఎడమచేయి చిటికిన వ్రేలుమడిచాడు.

    దాంతో ఆమె పూర్తి వివశంగా అయిపోయింది.

    "సర్పభైరవా ఆవాహ! రుద్రభైరవా నమోనమ!!" అని పోలిరంకెలు వేయటం ప్రారంభించింది. ఒకకాలు పైకెత్తి మడిచింది. ప్రక్కనున్నవారు గాలికి లేచిపోతున్న చీరకొంగును నడుం చుట్టూ త్రిప్పి బొడ్డు దగ్గర దోపారు.

    ఇంకా ఆమె శివమెత్తిన మాతంగ కన్యలా విలయతాండవం ప్రారంభించింది. ఆ ఒక్కషాపు ముందున్న జనంలోనే కాదు వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి రోమాలు చిక్క బొడిచినాయి.

    "అపచారం జరిగిపోయిందిరా! ద్రవిడ మాహేశ్వరుడి శరీరం అపవిత్రం చేయాలని ప్రయత్నించారుగా!!

    నరజాతి నాగదేవతల్ని అవమానించింది.

    పడగ మీద కాలెట్టి ఆడుకుంటారా? శ్వేతనాగుల ధవళ కరాళ దంష్ట్రుల కాంతుల్ని మలినపరచాలని ప్రయత్నించారుగా! అగ్గిపుల్ల గీస్తే కాలి బూడిద అయేరంగు కాగితాలను చూచుకుని విర్రవీగారు!

    భిక్ష అడిగితే తప్పా!! నాగ దేవతల్ని నాలుగుగోడల మధ్య బంధిస్తారా? మూర్ఖులారా! పిడుగుల్ని పిడికిట పట్టాలనుకుంటున్నారా? భస్మమైపోతారు.

    "హుం!! హుహుహూం!! అంటూ వెర్రిగా ఆడటం మొదలెట్టింది. అప్పటికే జుట్టుముడి వీడిపోయింది. ఎవరో వేపమండలు అందించారు!!"

    వారు ఏదో ప్రయాణం మీద బయలుదేరి వెడుతున్న వారు. ట్రాఫిక్ జాం అయిపోవడంతో రిక్షాదిగి చిత్రం చూచేందుకు వచ్చారు. ఆమెతో వచ్చిన భర్త ఈవిపరీతానికి భయపడిపోయి భార్యని బ్రతిమాలటం ప్రారంభించాడు.

    "నాగవర్దనీ! నా మాట వినవే! వెళ్ళిపోదాం పదా!!" అన్నాడు.

    "ఎవడురా నువ్వు? నాగదేవతనించి నన్ను వేరుచేస్తావా?" అంటూ భర్తవంక కనుగ్రుడ్లు విపరీతంగా పెద్దవిచేసి చూచింది భార్య.

    "త్వరగా  అడుగేస్తే చీమలు చచ్చిపోతాయనే దానివి! తలెత్తి చూస్తే భయంతో క్రుంగిపోయేదానివి. ఇలా అయిపోయా వేమిటి?" అని వాపోయాడు భర్త!

    ఆమెను ఆ క్షణానికి పబ్లిక్ మనిషిగా భావించి ఆమె మీద అధికారం కలిగిన భర్తను ప్రక్కకు తీసుకుపోయారు బలవంతంగా! ఎవరో సమయస్పూర్తి కలిగినవారు సాంబ్రాణి తీసుకువచ్చారు.

    దగ్గరలో ఉన్న నిప్పులు తెచ్చారు.

    ధూపం వేపాకు మండలంతో వాతావరణం ఉన్మత్తం అయింది. ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరికి ఒళ్ళు జలదరించటం, వెన్నపూసలా కరిగిపోతున్న అనుభవం కలుగుతున్నాయి.

    "మాహేశ్వరా తీర్ధాన్ని ప్రసాదించు! ఇకముందు నీకు ఎలాం అపకారం జరగకుండ కాపాడుకుంటాం!" అని జనం ఎలుగెత్తి వేడుకోలు ప్రారంభించినారు.
 

 Previous Page Next Page