Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 14

                                 

           
                                    యూరపులో విశ్వవ్యాప్తి


                        'కాల్మార్' 'క్లూనీ' కచ్చడాలు

    ఇటలీ క్రూసేడ్లలో వెళ్ళాయి ఈ కచ్చడాలు. కరారా కచ్చడం లాంటివి. అనేకం అప్పుడు ప్రచారంలో ఉండేవి. కొన్ని నమూనాలు ఇప్పటికీ మ్యూజియంలో కనబడతాయి.
    ఇటలీనుంచి మెల్లిగా ఇవి ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లండు మొదలయిన దేశాలకు ఎగబాకినాయి. ఫ్రాన్సులో 17, 18 శతాబ్దాల వరకు వీటి ఉపయోగం ఉండేది. మ్యూజియంలలో ఉన్న కచ్చడాలను బట్టీ, కొంతమంది వ్రాసిన పుస్తకాలను బట్టీ, చిత్రకారుల బొమ్మలనుబట్టీ, అన్నిటికంటే చిత్రం, కోర్టులలో కేసుల రికార్డులను బట్టీ, ఈ కచ్చడాలు బహుళ వ్యాప్తిలో వున్న సంగతి రూఢి అవుతుంది.
    వస్తువంటూ ఒకటున్నప్పుడు, ఈ వైభవం అంతా వుండటం ఆశ్చర్యమా? మనుష్యులలో స్వలాభచింత, హక్కు, జ్ఞానమూ, అసూయ ఇలాంటి గుణాలున్నప్పుడు, ఇలాంటి వస్తువులు పుట్టడం ఆశ్చర్యమా? ఏదీకాదు.
    ఫ్రాన్సులో మొదేనా రాజకుమారుడి భార్య మేడమాయిల్ డివాలోయ్ అన్న స్త్రీ దీనివల్ల పడరానిపాట్లు పడ్డది. భర్తకు ఈమె మీద అనుమానం. అసలు విశాలహృదయం అన్నది అతనిలో లేదు. ఈ కచ్చడం బిగించాడు భర్త. పాపం! ఆ అమ్మాయి, తండ్రికి వ్రాసిన జాబులలో ఆమె బాధను అంతటినీ వెళ్ళగక్కింది.
    ఆ రోజులలో (1700) బ్యూపట్ అన్న ఒక గ్రంధకర్త ఈ విషయాన్నంతటిని లిఖితరూపంగా వుంచాడు. చక్కగా ఈ ఇనపకచ్చడాలనే భర్త ఉపయోగించాడని తేటపడుతుంది.
    అలగానే; ఈ ఆచారం జర్మనీకి ప్రాకింది. పదిమంది స్త్రీలతో పోవడం తనకు ఆచారం చేసుకున్న మగవాడు, తన స్త్రీని మాత్రం ఈ కట్టళ్ళలో పెట్టడానికి చూచేవాడు. కచ్చడాలు బిగించేవాడు. అయినప్పటికీ ఈ కచ్చడాలు అంత ఎక్కువగా స్త్రీలను నిరోధించినట్టు కనబడదు.
    ఎందుచేతనంటే, జర్మనీలో చిత్రకారుడూ, గ్రంధకర్తా, ఆ శతాబ్దాలలో, ఈ కచ్చడాల విధానాన్ని ఎగతాళి చేస్తూ బొమ్మలూ, గ్రంధాలూ వ్రాశారు. తాళాలువేసి తరుణులను నిరోధించడానికి చూచిన మగవాడు వట్టి మూర్ఖుడన్నట్టు తేల్చేవారు.
    ఒక బొమ్మలో ఈ కచ్చడంతో ఉన్న స్త్రీని విడిచిపెట్టి భర్త ప్రయాణానికి పోతూ వుంటాడు. ఆ ప్రక్కనే మరొకబొమ్మ. దానిలో ఒక గంధోళిగాడు వికృతమయిన ఆకారంతో ఈగలను మూటకడుతుంటాడు. అంటే అర్ధమేమిటి? ఇద్దరూ ఒక్కలాంటి తెలివి కలవారే అని కదా?
    కాని జర్మనీ విషయంలో మాత్రం ఒక్కమాట చెప్పాలి. ఈ కచ్చడాలను చాలా అందంగాను, ఎక్కువ సొగసుగాను తయారు చేసేవారు. పైని అంతా నగిషీపని. లోపలివైపు మెత్తని పట్టు, మఖమల్ అస్తరు వేసేవారు. ఆ అస్తరు జారిపోకుండా ఈ రేకులను కుట్టివేసేవారు. అలా కుట్టడానికి సౌకర్యంగా వుండేటట్టు, రేకుల చుట్టూ చిన్నచిన్న రంధ్రాలున్నాయి. ఈ రంధ్రాలద్వారా సూదితో అస్తర్లు కుట్టేవారు. (కాల్మార్ బొమ్మ చూడండి)
    అంతేకాదు. మరొక చమత్కారం గూడా కనబడుతుంది. ఈ కచ్చడం పారిసు నగరంలోని "క్లూనీ" మ్యూజియంలో వుంది.

    దీనిలోని విశేషం ఏమిటంటే, దీనికి అన్ని ముక్కలూ భాగాలూ లేవు. నడుము చుట్టూ గట్టి వడ్డాణం లాంటిది వుంటుంది. ముందుభాగంలో ఈ ఒడ్డాణానికి గట్టిగా బలంగా అతికి వుంచిన ఒక గట్టిరేకు కొంచెం ఉవ్వెత్తుగా వచ్చి వెనుకకు వంగి ఉంటుంది. ఒడ్డాణం బిగించి తాళం వేసిన తరువాత ఈ రేకు కదలదు. శరీరాన్ని అంటుకుపోయి వుంటుంది.
    ఈ రేకు వుండటం వల్ల అనాచారాలకు వీలుండదు. రెండుమూడు రేకులు కీలించి క్రిందా, ీదా చుట్టుకోవలసిన అవసరం వుండదు. దానివల్ల శరీరానికి కలిగే బాధ తగ్గుతుంది. ఉద్దేశంలో వున్న బందోబస్తు చక్కగా సాగుతుంది.
    కొందరు ఈ ఒక్క రేకుగూడా ఇనుముతోనో, రాగితోనో, చేయించకుండా, గట్టి దళసరి దంతంతో చేయించేవారు. బొమ్మలో చూపించిన కచ్చడంలో ఈ రేకు దంతంతో చేసింది.
    నడుముచుట్టు వుండవలసిన కమ్మర్ బందు శరీరానికి ఒత్తుకోకుండా మెత్తగా వుండేటట్టు ఎలాగ చేశారో చూడండి. ఈ ఒడ్డాణం ఎలాంటి కొలత నడుమకయినా పనికి వచ్చేటట్టుగా, చక్కని ఏర్పాటుచేశారు. ఒక చివర, ఇంకొక చివర కిందికి పోతుంది. ఇప్పటి పట్కా ఒడ్డాణంలాగా.
    నడుముకు తగినట్టుగా ఈ చివరలను సంతరించినప్పటికీ ఈ దంతపు నాలుక సరిగ్గా ముందుభాగానికే వస్తుంది. ఆ స్థితిలో దానికి బీగం వేస్తారు. (పటంలో ఈ తాళమూ, దాని చెవీగూడా కనపడతాయి.)
    బీగం వేసిన తరువాత, ఈ దంతపు రేకు కావలసిన సంరక్షణనంతటినీ ఇస్తుంది. కాల కృత్యాలకు ఎటువంటి అభ్యంతరమూ వుండదు. కాని, అనుమతి లేని అనుభవాలకు అవకాశమే ఉండదు. అదే కదా, పురుషులు కోరేది? దాని కోసమే కదా, ఇన్ని అగచాట్లు పడడం!

 Previous Page Next Page