"అలాగే పెంచుదురుగాని రెండు రోజులు పోనీండి."
"నీకు తెలియదు, రాజ్యం! నువ్వు అతిగారాబంచేసి దాన్ని పాడుచేస్తున్నావు! రెండురోజులు బలవంతంగా బడికి పంపిస్తే మూడోరోజు అదే అలవాటు అవుతుంది!" తల్లిని వాటేసుకొన్న ప్రేమీ చేతుల్ని విడదీసి భుజంమీద వేసుకొని, ఓ చేత పలకపట్టుకొని వెళ్ళిపోయాడు సుందరరయ్య.
దిగాలుగా కూర్చుండి పోయింది రాజ్యం. ఏడుస్తున్న పాపముఖం కళ్ళముందు కదులుతుంటే ఏడుపు పొరలి వచ్చేస్తున్నదామెకు!
పాపని బడిలో వదిలి వచ్చాడు సుందరయ్య. అతడి ముఖంలోనూ విచారమేఘాలు క్రమ్ముకొన్నాయి. "నాన్నా! నేను నీతోనే వస్తాను" అంటూ తనని పట్టుకువదలని ఆపిల్లని మాస్టారుబలవంతంగా ఇద్దరు పిల్లలసాయంతో బళ్ళోకి లాక్కువెళ్ళాడు చాలాదూరంవరకు ఆపిల్ల ఏడుపు చెవిని పడుతూనే ఉంది! 'వెళ్ళి పాపని తీసుకు వచ్చెయ్యనా?' అనిపించింది. 'రాజ్యాన్ని తిట్టి తను అదేపని చేస్తే ఎలా?' అనిపించింది. సుందరయ్య మనసు బిగబట్టి పాపని వదిలి వచ్చాడు.
రాజ్యం ఆత్రంగా అడిగింది. "పాప ఏడుస్తూందా?"
"ఏడుస్తూంది! ఏడుస్తూందని ఇంట్లో ఎలా కూర్చోబెట్టుకొంటాం?"
"వెళ్ళి తీసుకురండి. ఓనమాలు నేను నేర్పగలను. పెద్దబాలశిక్ష కూడా చెబుతాను. తరువాత బడికి పంపొచ్చు!"
"నువ్వు ఓనమాలు నేర్పుతావు! పెద్ద బాలశిక్ష నేర్పుతావు! కాని ఈ ప్రపంచంలో మనుషులెలాంటివాళ్ళో తెలుసుకొనే తెలివిని నేర్పలేవు కదా? నీతోడిదే నాతోడిదే ప్రపంచం కాకూడదు పాపకు! మన కవతలి ప్రపంచాన్ని కూడా బాగా తేరిపారజూడనీ. పాప అందరిలాంటి ఆడపిల్లకాదు! పెళ్ళికాని స్త్రీకి పుట్టిన పిల్లగా అది ముందు ముందు చాలా అవమానాల్ని ఎదుర్కోవాల్సివస్తుందేమో! ఈ లోకులు చేసే అవమానాల్ని తట్టుకు ఎదుర్కోవాల్సివస్తుందేమో! ఈ లోకులు చేసే అవమానాల్ని తట్టుకు నిలబడే శక్తిని అది ఇప్పటినుండే పుంజుకోనీ. 'నేను ఎలా పుడితేనేం? ఎవరికీ పుడితేనేం? నన్ను చూసి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పేట్టుగా దానివ్యక్తిత్వం దిద్దుకోనీ. 'ఎంతయినా నువ్వు ఆడపిల్లవి!' అని పిరికిపాలు పోయడానికి ఎప్పుడూ ప్రయత్నించకు."
"మనం అనుకొన్నట్టు అన్నీ జరిగితే బాగానే ఉండును!" ఆరోజు వంటసరిగా చేయలేకపోయింది రాజ్యం. మనస్సంతా పిల్లమీదే ఉంది! బడివదలడానికి అరగంటముందే "వెళ్ళి పాపని తీసుకురండి" అని చెప్పింది భర్తతో.
సుందరయ్య వెడదామని జోళ్ళేసుకొంటూంటే, ప్రక్కింటి అబ్బాయి పాపని తీసుకువచ్చాడు. "మాస్టారు అరగంటముందే బడి వదిలేశారు" అని చెప్పి వెళ్ళాడు.
పాప చెంపలమీద కన్నీటి చారికలు కట్టాయి. కాటుక కళ్ళ నిండా అల్లుకుపోయింది! రాజ్యం హృదయం కలిచినట్టుగా అయింది! "పాపా!" ఆత్రంగా చేతులు చాచింది.
పాప రాలేదు. ఆడపిల్లముఖం యమసీరియస్ గా ఉంది. పలక చాపమీదపడేసి తనూ పడింది!
"కోపం వచ్చిందా, తల్లీ?"
రాజ్యం చేతుల్ని విదిలించివేసింది ప్రేమీ. ఆడపిల్లకళ్ళు చెప్పలేనంత తిరస్కారంగా చూస్తున్నాయి! "నువ్వు నన్ను ముట్టుకోవద్దు!" కఠినంగా అంది.
"పాపా!" విలవిల్లాడి పోతున్నట్టుగా పిలిచింది రాజ్యం.
అపరాదిలా దూరంగా నిలబడిపోయాడు సుందరయ్య.
ఆరోజంతా ప్రేమీ కోపంగానేఉంది! తనలో తను ఏదో ఆలోచించుకొంటూన్నట్టుగా ఉంది! అయిదేళ్ళపిల్లలో ఆ పట్టుదలా, ఆ అభిమానం చూసి చకితులయ్యారు రాజ్యం, సుందరయ్య. మరురోజు తనే బడికి వెడతానంటూ తయారైంది ప్రేమీ.
"నాన్నా! భోజనానికి లే!"
ప్రేమీ పిలుపుతో గతస్మ్రుతులకు తెరపడ్డట్టుగా అయింది.
4
సువర్చల ఆరోజు మీటింగ్ లో మాట్లాడవలసింది వ్రాసుకొని, ఆ విషయాన్ని మననం చేసుకొంటున్నట్టుగా వ్రాసిన కాగితాల్ని చూస్తూంది.
"మీటింగ్ కి తయారవలేదా, ఆంటీ?"
"వచ్చావా? ఈరోజు రావేమో అనుకొన్నాను." ప్రేమీని చూచి సువర్చలకొ కొండంత బలం వచ్చినట్టుగా అయింది! ఎక్కడికి వెళ్ళినా ప్రేమీని వెంట తీసికెళ్ళడం అలవాటైంది ఆమెకు! బయటికి వెడితే ఆరోజు కట్టుకొనే చీర, పట్టుకొనే ఖర్చీఫ్ దగ్గరినుండి అన్నీ తీసిఉంచుతుంది ప్రేమీ. ముడి సరిగా కుదిరిందో లేదో, చీరకుచ్చిళ్ళు సరిగా వచ్చాయో లేదో అన్నీ జాగ్రత్తగా చూసి సర్దుతుంది. ఎవరైనావచ్చి మాటల్లోకి దించితే, 'ఆంటీ! టైమైంది" అని గుర్తు చేస్తుంది. కాస్త సుస్తీ చేస్తే 'ఎలా ఉంది, ఆంటీ?' అని హడావుడి చేస్తుంది! ఇంట్లో ఏం వండుకొంటుందో, ఏం తింటుందో తెలియదు! సుస్తీ తగ్గేవరకు తనని అంటిపెట్టుకొనే ఉంటుంది. ఒకరోజు ఆ పిల్లను చూడకపోతే ఏదో పోగొట్టుకొని వెదుక్కొన్నట్టుగా ఉంటుంది! తలుసుకొంటే, ఆపిల్ల తన జీవితంలోకి ఇంత బలంగా ఎలా చొచ్చుకు వచ్చిందా అని ఆశ్చర్యం వేస్తుంది!
"బి.ఎ. పరీక్ష ఫీజుకి లాస్ట్ డేట్ అనుకొంటాను. ఫీజు కట్టావా?"
"ఏంచదవలేదు. ఫీజుకట్టి ఏం చేయను?"
"మీ నాన్న నిన్ను ఎం.బి.బి.ఎస్. చదివించాలనుకొన్నాడు. నువ్వేమో ఇలా మొండికెత్తావు! చదువూలేక, పెళ్ళిలేక, ఏం చేయాలను కొన్నావు?"
"రెండో మాట, సంఘసంస్కర్తగా మీరు అనవలసిన మాటకాదు! ఆడదానికి పెళ్ళేముఖ్యం. భర్తేదైవం అని ఒకనాడు మగవాడూ, ఆడదీ! ఎలుగెత్తి చాటారేమోగాని ఇప్పటిపరిస్థితిలో అవి చాలా పరిహాసమైన నినాదాలు! చదవంటే అది మనిషికి అవసరమే. కాని, బళ్ళో చదివేదే చదువు కాదు! ప్రపంచమే ఒకబడి అనుకొంటే ఇక్కడ మనిషి నేర్చుకొనే చదువెంతో ఉంది!"