Previous Page Next Page 
మణిదీపం పేజి 15

    పదేళ్ళయినా ఇంకా ఆలోచన తెగలేదు అరవింద్ కి.
    వచ్చే అమ్మాయి ఎలాంటిదోనన్న భయం ఒక్కటే కాదు. ఈ జీవితం మరొకరికి పంచితే వృత్తికి న్యాయం చేయలేనేమోనన్న శంక. అర్దరాత్రి అపరాత్రి అనకుండా ఏ ఎమర్జెన్సీ కేసు వస్తుందో తెలియదు. మంచి భోజనం మధ్య చెయ్యి కడుక్కుని లేచిపోవాల్సి వస్తుంది. మంచి నిద్ర వదులుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఇప్పుడున్న స్వేచ్ఛ పెళ్ళయ్యాక వుండదుకదా అన్న భయం. ఇలా ఎన్నెన్నో భయాలతో ముప్పై దాటిపోయిందతడి వయసు.

    మరునాడు ఉదయం కొంచెం ఆలస్యంగా లేచిన అరుంధతమ్మ ముఖం కడుక్కుని టీ తాగి మళ్ళీ పడుకుంది.

    అప్పటికే స్నానంచేసి హాస్పిటల్ కి వెళ్ళడానికి తెల్లని సూట్ లో తయారయ్యాడు అరవింద్. తల్లి దగ్గరికి వచ్చి చూసి "ఈ రోజంతా విశ్రాంతి తీసుకో అమ్మా! వంట నరహరి చూస్తాడులే" అన్నాడు.

    "ఇహ నాకు ఒక్కటే విశ్రాంతి కావాలనిపిస్తూంది. మళ్ళీ లేవకుండా" ఆమె గొంతులో నిస్పృహతోపాటు దుఃఖపు జీర.

    "అమ్మా!" కదిలిపోయినట్టుగా తల్లి పక్కన కూర్చున్నాడు అరవింద్. "ఏం మాటలమ్మా యివి? ఇప్పుడేమైందని?" ఆమె చేతిని తన చేతి లోకి తీసుకుని అడిగాడు ఆర్ద్రంగా.

    "ఏమీ కాలేదనేకదరా నా బాధ?"

    "ఏమిటమ్మా నీ పిచ్చి? పెల్లికాకపోతే నాకిప్పుడేమైందని? నేను ఆనందంగా లేనా? ఎప్పుడయినా నా ముఖంలో ఒంటరితనపు ఫీలింగ్ చూశావా? చాలామంది సంసారులకంటే నేను చాలా హేపీగా వున్నాను. నా పెళ్ళికి ఇంత ప్రాముఖ్యత యిచ్చి బాధపడకు."

    "ఒంటరితనపు ఫీలింగ్ ఇప్పుడు కలగదురా. అన్నీ చూసుకోవడానికి నేనున్నంతవరకు నీకు కలుగదు. నేను పోతేగానీ...."

    "నేను పెళ్ళిచేసుకోవడం కోసం నువ్వు పోనక్కరలేదమ్మా. నీ కోరిక తీర్చడానికి నాకు కొంచెం టైం యివ్వు,"

    "పదేళ్ళనుండి అంటున్న మాటేకదరా యిది?"

    అరవింద్ వాచీ చూసుకుని లేచాడు. "టైమయింది-నేనొస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో."


                                                          *    *    *    *    *


    ఆ రోజు అర్చన బర్త్ డే!

    హాస్పిటల్ సూపరింటెండెంట్ మూర్తిగారితోపాటు మరో అయిదుగురిని పిలిచింది, సాయంత్రం చిన్న పార్టీ వుంటుందని. ఆహ్వానితులలో డాక్టర్ అరవింద్ కూడా వున్నాడు.

    లైట్ గా టిఫిన్, టీ ఇవ్వటమయ్యాక, అందరూ అర్చనకు బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళిపోతే అరవింద్ ని కావాలనే వుండిపొమ్మంది అర్చన.

    ఖాళీ ప్లేట్లు, కప్పులూ లోపల సింక్ లో పడేసి వచ్చి కూర్చుంది.

    "ఈ మధ్య మీ అమ్మగారి ఆరోగ్యం బాగాలేదని విన్నాను. ఇప్పుడెలా వున్నారు?"

    "ఫర్వాలేదు. బాగానే వున్నారు. కానీ మీకెలా తెలిసింది ఈ విషయం?"

    "మీ ఇంట్లో పనిచేసే ఎల్లమ్మ మా పనిమనిషికి అక్క. పనిమనుషులు ప్రచారం చేసే వార్తలముందు వార్తాపత్రికలు ఎందుకూ పనికిరావు కదా?" అంటూ నవ్వింది.

    "అయితే మీకు చాలా తెలుసన్నమాట."

    "చాలా అంటే...?"

    "అదే...నా పెళ్ళి గొడవ."

    "ఆఁ కొంతవరకు తెలుసు. మీ పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాననుకోకపోతే మీ అమ్మగారు బాధపడటం సహజమేకదా?"

    "ఓ గాడ్! మీరు మా అమ్మగారి పక్షంలో చేరిపోయారన్నమాట. అయితే రామకృష్ణగారిని నాకు తోడు తెచ్చుకుంటాను" అన్నాడు హాస్యంగా.

    గెస్ట్ లను సాగనంపి లోపలికి వచ్చిన రామకృష్ణ "ఏమిటి? ఎవరినో తోడు తెచ్చుకోవాలంటున్నావు?" అనడిగాడు.

    అర్చనే చెప్పింది-

    "సారీ ఫ్రెండ్! ఈ విషయంలో మాత్రం నేను మీ అమ్మగారి పక్షమే" రామకృష్ణ అన్నాడు గాంభీర్యాన్ని అభినయిస్తూ.

    "ఇది చాలా అన్యాయం మిత్రమా?"

    "ఏంకాదు. ఎప్పటికయినా న్యాయమే గెలుస్తుంది కాబట్టి తెలివైన వాడు న్యాయం వున్న పక్షంలోనే చేరిపోతాడు. కురుక్షేత్ర యుద్దంలో కృష్ణుడు చేసిన పని అదేకదా?"

    "ఇదేదో మామూలు తగాదా అనుకుంటే దీనికి ఒక్కసారే 'కురుక్షేత్ర యుద్ధం, అని పేరు పెట్టారే!"

    "నీకిది మామూలు తగాదానా? ఇది జీవన్మరణ సమస్య. మీ అమ్మ గారి ప్రాణాలతో ముడిపడివున్న సమస్య. బెంగతో ఆవిడ మంచం పట్టినా నువ్వు చలించలేదంటే నువ్వేం కొడుకువనాలి? మళ్ళీ అమ్మా నాన్నలంటే గొప్ప భయభక్తులంటావు?"   

 Previous Page Next Page