"ఎలాంటి పిల్ల వస్తుందోనన్న భయం అట? తన అభిరుచులకీ, అభిప్రాయాలకీ సరిపోని పిల్ల వస్తే జీవితమంతా అశాంతికదా అని అంటాడట."
"అలా అనుకొని ముదిరిన బెండకాయలా ముప్పయ్ అయిదేళ్ళు తెచ్చుకున్నాడన్నమాట."
"మీ దగ్గర చనువుగా వుంటాడుకదా? ఓ మాట చెప్పి చూడక పోయారూ? మా మామయ్య కూతురు కాంచన బాటనీ లెక్చరర్ గా చేస్తోంది! చాలా బాగుంటుంది కూడా! రీసెర్చని అదనీ ఇదనీ తనకీముప్పయ్ వచ్చాయి కూడా! ఇద్దరికీ ఈడూ జోడూ సరిపోతుంది. మంచి సంబంధం చూడమని మా మామయ్యా ఎప్పుడు చెబుతుంటారు కూడా."
"ఐవిల్ ట్రై! కానీ ఇలాంటివి రాసిపెట్టి వుండాలి."
కాస్త చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలమీద ఎందరి కళ్ళో పడతాయి! ముఖ్యంగా ఆడవాళ్ళ కళ్ళు.
* * * *
ఇంటికి వెళ్ళిన అరవింద్ కి తల్లికిబదులుగా తండ్రి తలుపు తెరిచాడు.
సోఫాలో కూర్చొని షూస్ విప్పుతూ, "అమ్మ ఏదీ?" అని అడిగాడు అరవింద్.
"అమ్మకి సుస్తీ చేసింది. మాత్ర ఇచ్చి పడుకోమన్నాను."
"అరే! నేను వెళ్ళేప్పుడు బాగానే వుందే!" పాదాలకి సాక్స్ వుండగానే తల్లికోసం గాబరాగా కదలబోయాడు.
"ఇప్పుడు లేపకు! లేస్తే ఏడుపే కదా?"
"ఏడుపా? దేనికి?"
"నీ పెళ్ళి కోసం"
తిరిగి సోఫాలో నీరసంగా కూలబడ్డాడు అరవింద్. "మళ్ళీ మొదలు పెట్టిందా?"
"ఆపిందెప్పుడు? పదేళ్ళనుండి ఒకటే పాట! నీ పెళ్ళి పాట."
"అమ్మకి ఎలా చెప్పాలో తెలీడంలేదు. మీరైనా..."
"అబ్బాయి మోడుగా మిగిలిపోవాలని సరదాపడుతున్నాడు. అతడి సరదా ఎందుకు కాదంటావని సర్దిచెప్పనా?" చిరాకుగా అన్నాడాయన.
"మీరంతా పెళ్ళికింక ప్రాధాన్యత ఎందుకిస్తారో నాకు అర్ధంకావడం లేదు. ముఖ్యంగా మగవాడికి. పెళ్ళి చేసుకోకపోతే జరిగే లోటేమిటో చెప్పండి."
కొడుకుతో వాదన కొనసాగించడం ఇష్టం లేనట్టుగా "రాత్రి చాలా అయ్యింది. భోంచేసి పడుకో! టేబుల్ మీద అన్నీ మూతపెట్టి వుంచింది మీ అమ్మ. హాట్ ప్యాక్ లో అన్నం వుందట" అనేసి ఆయన పడుకోదానికి వెళ్ళిపోయాడు.
భోజనానికి వెళ్ళడానికి ముందే తల్లి గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా ఆమె మంచం దగ్గర నిలబడ్డాడు అరవింద్.
ఆమె నిద్రపోతున్నట్టుగా నిశ్చలంగా పడుకుని వుంది.
కోడలు కావాలని ఒకటే ఆరాటం ఆమెకు. పిచ్చి అమ్మ. ఈ ప్రపంచంలో ఏ ఆడది అత్తతో సఖ్యతగా కాపురం చేసిందని? ఏ ఇంటినుండో వచ్చి ఇక్కడ తన సామ్రాజ్యం విస్తరించడం మొదలుపెడుతుంది. అంతవరకు తన సర్వస్వంగా చూసుకునే కొడుకును కోడలు తన కళ్ళముందే దోచి తనవాన్ని చేసుకుంటుంటే తల్లి గుండెలో భగ్గుమనే జ్వాల! ఇద్దరి మధ్య సంఘర్షణ చెలరేగి అంతవరకు ప్రశాంతంగా వున్న ఇల్లు నరకమై పోతుంది.
ముందుగా ఆ యుద్దకాండకి బలి అయ్యేది కొడుకు. ఇటు తల్లి మనసు నొప్పించలేక, అటు భార్యకు సర్దిచెప్పలేక వేగిపోయేది కొడుకే.
కోడలు కావాలని ఆమె కోరినప్పుడల్లా తను అదే చెబుతాడు. "ఇంతవరకు నువ్వు, నాన్న, నేను. ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా, ప్రశాంత సరోవరంలా మన ఇల్లు. 'కోడలు' అన్న పేరుతో ఎవరినో ఆహ్వానించామనుకో - పెద్ద బండరాయి దొర్లి వచ్చిపడ్డట్టుగా అవుతుంది. అల్లకల్లోలం అయిపోతుంది సరస్సు. హాయిగా సాగిపోతున్న మన జీవితాల లోకి ఎందుకమ్మా ఒక అపరిచితురాలిని ఆహ్వానించటం?"
"బండరాయి అని ఎందుకు అనుకుంటావు? పూలతెప్ప కావచ్చు కదా? కోడలు అంటే ఏదో బ్రహ్మరాక్షసి అనుకునే ఆడదాన్ని కాదురా. ఇంతేనా నువ్వు అమ్మను అర్ధం చేసుకుంది? నా కొడుకు జీవితంలో కాళ్ళ పారాణితో అడుగుపెట్టిన పిల్లను నా కూతురిగా చూసుకునే సంస్కారం నాకుంది. ఆ పిల్ల ఎటువంటిదయినా నేను సర్దుకుపోగలను."
"గయ్యాళిపిల్లే వస్తుందనుకో?"
"ఏ పిల్ల అయినా నన్ను నాన్నమ్మను చేస్తుందికదా? నిశ్శబ్దంగా వుండే ఈ ఇంట్లో నవ్వుల పువ్వులు విరిసేలా చేస్తుందికదా? ఆ పిల్ల ఏం చేసినా నాకు ముద్దే అవుతుంది. ఏదో భయోత్పాతం జరుగుతుందని నువ్వు అనవసరంగా భయపడకు."
"చెప్పినంత తేలిక కాదమ్మా. ఏదయినా అనుభవంలోకి వస్తేగానీ తెలియదు."
"నీకంటే పెద్దదాన్ని. నిన్ను కన్నదాన్ని. నీకంటే నాకు బాగానే తెలుసు. చప్పుడు ఎప్పుడూ ఒక చెయ్యివలన రాదు."
"నన్ను ఆలోచించుకోనీ అమ్మా! పెళ్ళంటే నూరేళ్ళపంట కదా? తొందర పనికిరాదు."