"మీరు ఏవేవో రంగులు పూస్తే నేనేం మాట్లాడేది? అమ్మకి బి.పి. పెరిగింది. బెడ్ రెస్ట్ తీసుకోమన్నాను కొద్ది రోజులు. అంతేగానీ ఆవిడ బెంగతో మంచం పట్టలేదు"
"ఏదో ఒకటి. మంచం పట్టిందనేకదా అర్ధం."
"మీరన్నట్టు బెంగావలన కాదు."
"బెంగవలన కాకపోతే బి.పి. ఎందుకు పెరిగిందంటావు? ఏదైనా తీవ్రంగా ఆందోళన చెందితేనే బి.పి. పెరుగుతుంది. డాక్టర్ వి-నీకా మాత్రం తెలియదూ?"
"సరే! బెంగవల్లేమంచం పట్టిందనుకుందాం. కానీ ఆ బెంగా అర్ధం లేనిదికదా? ఈ ప్రపంచంలో పిల్లలు లేకపోతే బెంగపడతారు. పిల్లలకి ఏమయినా అయితే బెంగపడతారు. డబ్బు లేకపోతే బెంగపడతారు. తిండి లేకపోతే బెంగపడతారు. కానీ కొడుక్కి పెళ్ళి కాలేదని తల్లి బెంగపడటం విడ్డూరం కాదూ? జీవితంలో పెళ్ళి ఒక ముఖ్యావసరం అయితే అవొచ్చుగానీ పెళ్ళి లేకపోతే జీవితమే వ్యర్ధమంటే పిచ్చితనం కాదూ?"
"పెళ్ళి లేకపోతే జీవితేమే వ్యర్ధమంటే నేను కూడా ఒప్పుకోను. కానీ మనిషికి మాత్రం పెళ్ళి అత్యవసరమే! కానీ ఎవరికైనా ఒక తోడు నీడా కావాలి. అర్దేచ, కామేచ, ధర్మేచ, మోక్షేచ-అని ఆర్యోక్తి. తోడంటే అలా బజారులో వెళ్ళే ఏ ఆడదాన్నో ఇంట్లోకి తెచ్చి వుంచుకోలేంగా? మనకీ కొన్ని హద్దులు నియమాలు వున్నాయి కాబట్టి శాస్త్రీయంగా ఒక స్త్రీని పెళ్ళాడి తోడు చేసుకొంటామన్నమాట. పెళ్ళి లేకపోతే జీవితం వ్యర్ధం కాకపోవచ్చుగానీ పెళ్ళితోటే స్త్రీకైనా పురుషుడికైనా జీవితం పరిపూర్ణత్వం సంతరించుకొంటుందని నా ఉద్దేశం"
"తోడు అని తెచ్చుకొన్నది కాస్త రాక్షసి అయ్యి కాల్చుకుతింటే?"
"వీటిని అనవసర భయాలు అంటారు. అనవసర భయాలూ అనారోగ్య లక్షణం! ముందు నిన్ను సైక్రియాట్రిసుకు చూపాలి"
"ఇది అనారోగ్య లక్షణం అని మీకనిపిస్తుందేమోగానీ నిజానికి నేను పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ, నాన్న, నేను! నాన్న చాలా రిజర్వ్డ్. అమ్మకి నాలుగు కాన్పులు పోయాక బతికి బట్టకట్టింది నేనే! ఎంత అపురూపంగా పెరిగానో నువ్వే ఊహించు! మొన్న మొన్నటివరకు అమ్మ నాన్న తోడిదే నా లోకం. ఆ లోకంలోకి కొద్దిగా సంగీత సాహిత్యాలు అడుగుపెట్టాయేగానీ ఇంకెవరూ అడుగుపెట్టలేదు"
"ఒక్కమాట అడుగుతాను. ఏమీ అనుకోరుకదా?" అర్చన అడిగింది.
"అడగండి!"
"మేం అనుకోవడం భగ్న ప్రేమికులేమోనని! లేకపోతే ఇన్నేళ్ళొచ్చినా పెళ్ళెందుకు చేసుకోకుండా వుంటారని"
"చంపారు పొండి వదినగారూ!" పెద్దగా నవ్వాడు అరవింద్. "భగవంతుడి దయవల్ల అలాంటి ప్రమాదం ఎప్పుడూ సంభవించలేదు"
"ప్రేమలో పడ్డం అంటే ప్రమాదంలో పడడమనా నీ అభిప్రాయం? అందుకే నిన్ను సైక్రియాట్రిస్ట్ కు చూపాలనిపిస్తుంది" అన్నాడు రామకృష్ణ.
"నేనెందుకో నమ్మలేకపోతున్నాను. ఇన్నేళ్ళ జీవితంలో మీ మనసు తలుపును ఏ వలపు పాటా తట్టలేదా? అసలు మీకోసం ఎవరూ ట్రై చెయ్యలేదా?" అర్చన ఆశ్చర్యం.
"చేసినా అతడు గట్టిగా కళ్ళు మూసేసుకొని వుంటే ఏం తెలుస్తుంది?" అన్నాడు రామకృష్ణ.
"ఒకరిద్దరు ట్రై చేశారు. కానీ, నాకు వాళ్ళు నచ్చలేదు" నవ్వేశాడు అరవింద్.
"అందంగా లేరా?"
"చాలా అందంగా వున్నారు. మెడిసిన్ చేసేప్పుడు రాజీవ అనే అమ్మాయి చాలా బాగుండేది. ఆ అమ్మాయికోసం చాలామంది మగపిల్లలు ట్రై చేసేవాళ్ళు. కానీ, ఆ అమ్మాయి నా కోసం ట్రై చేసింది. కానీ, ఆ అమ్మాయి నా మనస్తత్వానికి సరిపోదనిపించింది, అందుకే ఆమెపట్ల ఆసక్తి పెంచుకోలేకపోయాను. అసలు, నా మనసు అందివ్వడానికి నాకు సరిపోయిన అమ్మాయి కనిపించలేదు. దాని విలువ తెలియక ఏ గాజుపెంకులాగానో విసిరేస్తుందేమోనని నా భయం!"
"నిన్ను నువ్వు చాలా ప్రత్యేకంగా, ఎక్కువగా అంచనా వేసుకోవడంవల్ల వచ్చిన చిక్కు ఇది! నీకేకాదు-అందరికీ మనస్సుంది! కొంచెం ఎక్కువగానో, తక్కువగానో మృదుమధుర భావాలు, కళాపిపాస, మంచి అభిరుచులూ వుంటాయి. నీకు పుస్తకాలు చదవడం అభిరుచి అయితే మరికొందరికి మంచి భోజనం అభిరుచిగా వుంటుంది. నీతో జతకోరే వాళ్ళకు నీకున్న అభిరుచులే వుండాలని లేదు. ఒకరి అభిరుచులు మరొకరు అభిమానించుకోవడంవల్లే ఇరువురి మధ్యా స్నేహం, ప్రేమ బలపడతాయి. అనుభవంలో సర్వసాధారణంగా ఇమిడిపోయేవి కొన్ని ఊహించుకొంటే విపరీతంగా కనబడి భయపెడతాయి. మనిషిని 'ఊహ' భయపెట్టినట్టుగా మరేదీ భయపెట్టలేదేమో!"
"ఆమె ఘటోత్కచుడిలా చుట్టూ వంటపాత్రలు పెట్టుకొని 'వివాహ భోజనంబు' అన్న మ్యూజిక్ తో ఆరగించేదైతే ఎలా అభిమానించగలను? ఎలా ప్రేమించగలను? నావల్ల కాదు బాబూ!" హాస్యంగా అన్నాడు అరవింద్.
"ప్రేమించే మనస్సుంటే అన్నీ సాధ్యమే భాయీ! పచ్చి దొంగల్నీ, నరహంతకుల్నీ ప్రేమించేవాళ్ళున్నారంటే అది ప్రేమకున్న శక్తి అనుకోవాలి!"
"ప్రేమా దోమా జాన్తానై! నేనిప్పుడు హాయిగానే వున్నాను. ఒంటరివాడిని కావడంవల్ల నా వృత్తికి సరైన న్యాయం చేయగలుగుతున్నాను. మనం డాక్టర్లం! ఏ అర్ధరాత్రో పక్కమీదినుండి లేచిపోవాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే భోజనం సగంలో చెయ్యి కడిగివెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆమధ్య ఒక సినిమా చూశాను. ఓ డాక్టరుగారి భార్య సరదాగా భర్తతో సినిమాకి వెడుతుంది. సినిమా చూస్తుండగానే హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు వచ్చిందని కబురొస్తుంది. వృత్తిని సిన్సియర్ గా ప్రేమించే ఆ డాక్టరు హడావిడిగా వెళ్ళిపోతాడు. ఆ తరువాతేముంది? యుద్దకాండ! పట్టుమని పది నిమిషాలైనా గడపడానికి లేదు అంటూ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. భార్యనీ సంతృప్తిపరచలేక, ఇటు వృత్తికీ అన్యాయం చెయ్యలేక నలిగిపోతాడు ఆ భర్త."