మర్నాడు ఆఫీసు కెళ్ళడంతో శ్రీకాంత్ ఆఫీసుకి ఫోన్ చేశాడు చలపతి. ఫోను ఎవ్వరూ ఎత్తకపోయేసరికి గుర్తుకొచ్చింది. ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ తెరవడానికి టైముంది. ఏ పనీ చేయబుద్దికాలేదతనికి. మరో అరగంట వరకూ గడియారం వంకే చూస్తూ కూర్చుని ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. ఎక్సేంజీ ఇంటర్ కమ్ నంబరు చెప్పాడు.
"శ్రీకాంత్ హియర్" అన్న గొంతు వినిపించింది.
"తెల్సులేవోయ్ నువ్వు శ్రీకాంత్ వని!" నవ్వుతూ అన్నాడు చలపతి.
"ఎవరది?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్.
'అంటేనేనెవరో గుర్తుపట్టడం కూడా కష్టమే నంటావ్?"
"ఫోన్ లో గొంతు మారుతుంది కదా! అందుకని గుర్తుపట్టలేకపోతున్నాను. ఇంతకూ ఎవరు మాట్లాడేది?"
"నేనేరా ! చలపతిని"
"చలపతా! ఎక్కడుంఛి ఊడిపడ్డావురా?"
"ఎక్కడునుంచీ పడలేదు. నేనూ ఇక్కడే వుంటున్నాను."
"ఈజిట్! ఎక్కడా?"
"సనత్ నగర్ లో ఉద్యోగం, మలక్ పేటలో నివాసం"
"మరి ఇన్ని రోజుల్నుంచీ ఎందుక్కలవలేదు?"
"బాగుందిరోయ్! నువ్వూ ఇక్కడే అఘోరిస్తున్నావని కలకన్నామా? నిన్న యాద్రుచ్చికంగా మన శ్రీరామ్మూర్తి గాడు కనబడబట్టి ఇప్పటికయినా తెలిసింది"
"సరే, నిన్నెలా కలుసుకోవడం?"
"సాయంత్రం నాలుగున్నరకి నాకు ఆఫీసు అయిపోతుంది. ఆ తరువాత ఎక్కడికి రమ్మంటే అక్కడకు వచ్చేస్తాను...."
"అలాగయితే ఓ పని చెయ్! నువ్వు వచ్చేవరకు నేను మా ఆఫీసులోనే కుర్చుంటాను. ఆఫీసు అవగానే సరాసరి ఇక్కడికే వచ్చేయ్."
"ఓ.కే. .....మరి వుండనా?"
"తప్పకుండా వస్తావ్ కదూ? మనం చాలా మాట్లాడుకోవాలి."
"వస్తాన్రా బాబూ! నాకు మాత్రం నిన్ను చూడాలని లేదూ?"
"అల్ రైట్ .....డిస్కనెక్ట్ చేస్తున్నాను ......."
ఫోన్ పెట్టేశాడతను.
సాయంత్రం సరిగా అయిదుంబావుకల్లా శ్రీకాంత్ ఆఫీసులో అడుగు పెట్టాడు చలపతి. అమాంతం సీట్లోంచి లేచి వచ్చి అతనిని కావలిచుకొన్నాడు శ్రీకాంత్.
"ఈ మధ్యనే మన శ్రీరామ్మూర్తిగాడు కనబడితే నీ గురించి అడిగాన్రా. ఎక్కడుందీ తెలియలేదు. ఇలా కాదని చెప్పి ఓ రోజు మీ ఊరు వద్దామని నిర్ణయించుకున్నాను."
ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. మాటలో తన పెళ్ళి గొడవంతా చెప్పాడు చలపతి.
"అరె! మరింకా ఇక్కడే కూర్చోడమెందుకూ? పాపం ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూంటుందేమో?" ఆదుర్దాతో అన్నాడు శ్రీకాంత్.
"మనిద్దరి కోసం ఎదురు చూస్తుంటుందిలే! ఇంటికొచ్చేటప్పుడు నిన్ను తీసుకొస్తానని చెప్పాను!"
ఇద్దరూ శ్రీకాంత్ కారులో చలపతి ఇల్లు చేరుకొన్నారు. సావిత్రి మంచం మీద పడుకుని వున్నదల్లా చటుక్కున లేచి నిలబడి ఇద్దరినీ లోనికి ఆహ్వానించింది.
శ్రీకాంత్ లోపలికొచ్చి మంచం మీద కూర్చున్నాడు.
"సావిత్రీ! ఇడుగో వీడే శ్రీకాంత్!"
అతనికి నమస్కరించింది సావిత్రి. ప్రతి నమస్కారం చేశాడు శ్రీకాంత్.
"బహుశా మా స్నేహం గురించి మీకు ఈపాటికి బాగా బోర్ కొట్టేసి వుంటాడనుకొంటాను!" నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్.
సావిత్రీ నవ్వేసింది. ఇద్దరకూ కాఫీ తీసుకొచ్చి అందించిందామే.
"అబ్బ....ఎంత కాలమయిందిరా, మంచి టిఫిన్ తిని. మా వంటవాడూ చేస్తాడు గానీ తినేప్పుడు కొంచెం జాగ్రత్తగా వుండాలి........!"
కాఫీ తాగాక ఇల్లంతా కలయజూస్తూ "లాభం లేదురా! ఇల్లు చాలా చిన్నదయిపోయింది. ఎలా సరిపోతుంది మీకు? ఎవరయినా అతిదులోస్తే, ఎక్కడ కూర్చుంటారు?" అడిగాడు శ్రీకాంత్.
"ఏం చేస్తాం! ఉన్నదాంట్లో ఎడ్జస్ట్ అవాలి కదా!" నవ్వుతూ అన్నాడు చలపతి.
"ఊహు, ఇదే బావుమ్డలేదు. పోనీ ఓ పని చేయకూడదూ> నేనున్నది చాలా పెద్ద ఇల్లు! మొత్తం అరుగదులు! నేను వాడుకోనేవి రెండే రెండు. మీరు అక్కడికే వచ్చేస్తే మిగతా ఇల్లంతా కూడా సద్వినియోగమవుతుందిగా! ఎమంటారండీ?" సావిత్రి వంక చూస్తూ అడిగాడు శ్రీకాంత్.
అ ఆలోచన బాగానే వుందనిపించింది చలపతికి. అదీగాక శ్రీకాంత్ దగ్గరుండడం తనకి అన్ని విధాలా ఉపయోగం! సావిత్రికి వంటకం తప్పుతుంది. శ్రీకాంత్ వంట మనిషితోనే అందరికీ వంట చేయించొచ్చు.
సావిత్రి ఏమీ మాట్లాడలేకపోయింది. చిరునవ్వు నవ్వి ఊరుకుంది.
"నువ్వేం అద్దె ఇవ్వక్కరాలేదు లేరా! అదంతా నేను చూసుకొంటాలే!"
"సమ్ హౌ - ఈ ఇల్లు, ఇక్కడి వాతావరణం నాకు ఎంచేతో నచ్చలేదు" అన్నాడు శ్రీకాంత్. చలపతి ఒప్పుకునే వరకూ వదిలి పెట్టలేదతనిని.
"రేపే ఉదయం రెండు రిక్షల్లో సామానంతా వేయించుకొచ్చేసేయ్. భోజనాల ఏర్పాటు నేను చూసుకుంటానులే - ఏమంటావు? మరి నే వెళ్ళిరానా ఇక?"
"సరే" జవాబిచ్చాడు చలపతి.
శ్రీకాంత్ కార్లో వెళ్ళిపోయాడు.
"అలా ఒప్పేసుకుంటారెందుకు! అయన రమ్మనగానే వెళ్ళిపోవటం ఏం బాగుంటుంది?" అడిగింది సావిత్రి.
"భలేదానివే! రానంటే ఊరుకుంటాడనుకున్నావేమిటి? బలవంతంగా నయినా సరే వప్పించి లాక్కేళతాడు. అదీగాక మనకి అక్కడ ఉంటేనే బాగుంటుంది. డబ్బు మిగలటం అలా ఉంచు. ఈ పాడు ఇంటిలో లేని సౌకర్యాలు అనేకం ఉంటాయక్కడ! అందుకే ఒప్పేసుకున్నాను. అదీగాక వాడెం పరాయివాడు కాదుగా, నా బెస్ట్ ఫ్రెండ్, వాడి దగ్గర నాకు మొహమాటమేముంది?"
మర్నాడు ఇల్లు ఖాళీ చేసేశారు వాళ్ళు. శ్రీకాంత్ ఉదయమే కార్లో వచ్చి వాళ్ళిద్దర్నీ తీసుకెళ్ళిపోయాడు తనింటికి!
ఆ ఇల్లు చూస్తూనే ఆశ్చర్యపోయాడు చలపతి. తను ఊహించినంత అందంగా వుంది సరికొత్త కట్టడం. సావిత్రి కూడా ఉప్పొంగిపోయిందా ఇల్లు చూసి. సామానంతా కుడివేపు ఉన్న మూడు గదుల్లోకి సర్దింది. అయినా సరయిన సామాను లేక ఇల్లు ఇంకా బోసిపోతున్నట్లే వుంది.
చలపటికీ, శ్రీకాంత్ కి వంటవాడే భోజనాలు వడ్డించేశాడు.
"నిన్ను రోజూ మీ ఆఫీసు దగ్గర డ్రాప్ చేసి నేను మా ఆఫీస్ కేళతాను సరేనా?" అన్నాడు శ్రీకాంత్.
"రోజూ ఎందుకురా. నీకు ఇబ్బంది కదూ?"
"ఏం ఇబ్బంది లేదు! లేకపోతే నీకు మాత్రం కష్టం కదూ! బస్ లో వెళ్ళి రావాలంటే అంతగా కావాలంటే వచ్చేటప్పుడు పోనీ నువ్వే బస్ లో వచ్చేద్దువు గానిలే! ఎందుకంటె సాయంత్రం సమయాల్లో ఎప్పుడు ఆఫీసు వదుల్తానో నాకే తెలీదు.........!"
చలపతి వాళ్ళ ఆఫీసు దగ్గర వదిలి వెళ్ళిపోయాడతను.