"అయినా అంత ముసలిదాన్ని ఎలా ప్రేమించాడా కే.యల్. కనకారావ్?"
"కే.ఎల్.కాదు. కే.ఎస్."
"అదే కే.యస్. కనకారావ్"
"అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఆమె తన పదహారవ ఏట దిగిన ఫోటో పబ్లిష్ చేయించిందా పత్రికలో"
సింహాద్రి నీళ్ళు కారిపోయాడు.
"వెరీ బాడ్" అన్నాడు దిగులుగా.
"అవును! పాపం- కె.యస్? కనకారావ్ కూడా అదే అనుకుంటుండొచ్చు- ఆ ఇన్సిడెంట్ తల్చుకున్నప్పుడల్లా"
"ఇప్పుడేం చేస్తున్నాడతను?"
"ఆ రచయిత్రికి కళ్ళుకూడా సరిగ్గా కనిపించవుకదా! అందుకని ఆమె బెడ్ పక్కనే కూర్చుని ఆమె డిక్టేట్ చేసే నవలలు, కథలు రాసి పెడుతూంటాడు"
"హారిబుల్"
"చాలా హారిబుల్"
"అంటే- ఇప్పుడు శ్రీదేవి కేసు కూడా ఆ బాపతే నంటావ్?"
"అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయ్!"
"కానీ ఆమె ఆ రచయిత్రిలా చిన్నప్పటి ఫోటో ఎందుకు పంపుతుంది? తనను గుర్తించడానికేగా ఆ ఫోటో పంపింది?"
చిరంజీవి ఓ క్షణం ఆలోచించాడు.
"గుర్తించడం ఏమిటి? ఎవరు గుర్తించాలి? ఎలా, ఎక్కడ గుర్తించాలి?"
"ఆమెనే రచయిత ధనుంజయ్ గుర్తించాలని ఆమె అభిప్రాయం. ఎందుకంటే ఆమె రేపు శుక్రవారం ఇక్కడి కొస్తోంది"
"ఇక్కడికా?"
"అవును"
"ఎందుకు?"
"తన అభిమాన రచయిత ధనుంజయ్ ని కలుసుకోవడానికి!"
"ఓహో"
"కనుక ఆమె రూపం ఫోటోలోలాగానే ఉంటుందని తేలిగ్గా చెప్పేయవచ్చు"
"ఆ పాయింట్ నిజమేగానీ ఇంకో పాయింట్ ఉంది"
"ఏమిటది?"
"ఆమెక్కూడా భర్తా, పిల్లలూ లేరని నమ్మకం ఏమిటి?"
"అలా మాట్లాడకురా! నేనిప్పుడే చచ్చి ఊరుకుంటాను. అయినా ఆమెకు పెళ్ళి కాలేదురా! నాకు తెలుసు"
"ఎలా తెలుసు?"
"తను వాళ్ళ డాడీతో ఈ ఊరుకొస్తున్నాననీ, అప్పుడు ఈ ఇంటికొస్తాననీ రాసింది. పెళ్ళయితే మరి మా ఆయన్తో వస్తున్నాని రాసేది కదా"
"అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులున్నాయన్నమాట!"
"ఒరేయ్! ముందు నేను ఈ మావయ్య ఫ్రెండ్ భావయ్య తలూకు మగ కూతురి బారినుండి తప్పించుకోవాలి. ఆ తరువాత శ్రీదేవిని పెళ్ళి ఎలా చేసుకోవాలి. ఎలా? ఎలా? ఎలా? ఎలా....."
"ష్ ష్" అరచాడు చిరంజీవి "ఏమిటా కాకిగోల?"
"రీ సౌండింగ్ ఎఫెక్ట్! మన సినిమాల్లో వాడతారు గదా- చాలా బరువైన సన్నివేశాల్లో హీరోయిన్ భర్తని డాక్టర్లు ఆపరేషన్ చేయాలనుకుంటారు. లక్షరూపాయలో, ముఫ్ఫయ్ ఆరువేలో ఎంతో కావాలంటారు. అప్పుడు హీరోయిన్ ఇలా అనుకుంటుందన్నమాట! లక్షో ముఫ్ఫయ్ ఆరువేలో కావాలి- కావాలి - కావాలి- కావాలి...."
"ష్ ష్ ష్" మళ్ళీ అరచాడు చిరంజీవి. సింహాద్రి 'ష్' అయిపోయాడు.
"ఊహు కుదరదురా! ఆ పిల్ల ఇలా హఠాత్తుగా ముక్కు మొఖం తెలీని నిన్ను ప్రేమించడం ఇంపాజిబుల్"
"అలా ప్రేమించిన కేసులు లేవంటావా?"
"పాపం- ఎక్కడో ఒకటి ఉంటే ఉండవచ్చు"
"రేపు శుక్రవారం శ్రీదేవి వచ్చినప్పుడు నా ప్రేమను తెలియజేస్తే ఒప్పుకోదంటావా?"
"పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది"
"అదేమిట్రా- మధ్యలో వాళ్ళకెందుకు చెప్పటం?" కంగారుగా అడిగాడు సింహాద్రి.
"అవును మరి! నీలాంటి ట్రాఫిక్ ని త్వరగా క్లియర్ చేయాలంటే అదొక్కటే ఛాయిస్"
"ఒరేయ్ చిరంజీవి! ఆపదలోవున్న స్నేహితుడిని ఆదుకోవటం ఇదేనట్రా?"
"నన్నేం చేయమంటావ్ రా?"
"ఏదొక ఉపాయం చెప్పు! ఆరోజు మనిద్దరం కాలేజ్ ఎలక్షన్స్ గొడవల్లో ఇరుక్కున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడానికొస్తే అద్భుతమైన ఉపాయం ఆలోచించావ్ నువ్వు గుర్తులేదూ? ఆ ఉపాయం వల్లనేగా మనంతట మనమే వెళ్లి వాళ్ళకు దొరికిపోయాం"
"అవుననుకో - అయితే ఓ పనిచెయ్"
"ఏమిటది?" ఉత్సాహంగా అడుగాడు సింహాద్రి.
"ఇంత విషం రడీగా ఉంచుకో! రేపు ఆమె గదికి రాగానే "మీరు నన్ను ప్రేమిస్తారా? లేకపోతే ఈ విషం మింగమంటారా' అని అడుగు. దాంతో దెబ్బకి ఒప్పుకుంటుంది"
"ఒకవేళ విషమే మింగమంటే?"
"మింగేసెయ్? ఎలాగూ ఈ బర్త్ కాన్సిల్ చేసుకుంటానన్నావుగా ఆమె వప్పుకోకపోతే"
"ఇంతకంటే మంచి ఉపాయమేమీ లేదా?"
"ఎందుకు? దీనికేమయింది?"
"అంత బావుందలేదురా?"
"మంచి ఉపాయాలు ఎవడికీ నచ్చవ్. అది మామూలే"
"బాబ్బాబు ఇంకోటేదయినా చెప్పరా"
చిరంజీవికి సింహాద్రిని చూస్తే జాలివేసింది. ఫోటోలు చూసి ప్రేమించే అమాయకపు వెధవాయిలకు ఆమాత్రం సహాయం చేయడం తన ధర్మం అనిపించింది.
"సరే అయితే ఓ పనిచెయ్! నీకు ధైర్యం ఉందా?"
"కేవలం శ్రీదేవి కోసం అయితే బోలెడుంది"
"నీకు స్టేజి ఫియర్ లేదుగా?"
"కాలేజీలో సెకండ్ బెస్ట్ యాక్టర్' కొంచెంలోనేగా మిస్సయిందీ? ఇంతకూ నన్నేం చేయమంటావో చెప్పరా?"
"మరేం లేదు. రేపు శ్రీదేవి మన రూమ్ కొస్తుంది. అంతేనా?"
"అవును"
"వచ్చి ధనుంజయ్ గారు మీరేనా అనడుగుతుంది అవునా?"
"అవును"
"అప్పుడు నువ్వేమంటావ్?"
"నేను కాదండీ... నా పేరు సింహాద్రి. ధనుంజయ్ గారు వేరే ఇంటికి మారిపోయారు. మీరు ఇలా కూర్చోండి. కూల్ డ్రింక్ తాగుతారా, కాఫీ తాగుతారా అంటాను"
"అక్కడే దెబ్బతిన్నావ్ నువ్వు"
"ఏం? ఎందుకని?"
"నేనేం ధనుంజయ్ ని అనాలి నువ్వు"
"నేనా?"