Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 14


    వసంత కళ్ళతో వారిస్తోంది.
    అప్పటికే లక్ష్మి ముఖం ఎరుపు చేసుకుంది.
    "వస్తావు కదూ తప్పక" అన్నాడు రాఘవ.
    "రేపు నీ ఆఫీసు?"
    "సెలవు పెట్టాను?"
    ఇంతలో అక్కడికి మూర్తి కొడుకు- పన్నెండేళ్ళ వాడు వచ్చి "అమ్మా!" అని ఏదో చెప్పబోతున్నాడు.
    మూర్తి "యిప్పుడు కాదు బాబు! వెళ్ళి ఆడుకో. యింటికి గెస్టు వచ్చినప్పుడు అలా డిస్టర్బ్ చెయ్యకూడదు?" అన్నాడు.
    ఆ కుర్రాడు తల ఊపి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
    లక్ష్మి ఆ యింటి శుభ్రతను, వస్తువులు తీర్చిదిద్దినట్లు అమర్చిన తీరునూ మార్చి మార్చి చూస్తోంది. మనసులో ఏమూలో బాధ కలిగింది. మళ్ళీ నిర్దాక్షిణ్యంగా ఆ బాధను అణిచి పెట్టేస్తోంది.
    కాఫీలు అయాక "ఇహ వస్తాం. ఇంకా చాలా ఇళ్ళు పిలవాలి" అంటూ లేచారు.
    "పేరంటానికి భోజనానికి తప్పకుండా రావాలి లేకపోతే మీతో మాట్లాడను సుమండీ" అందామె.
    "మీరు దానికీ, దీనికీ ముడిపెట్టకండి. ఇలాంటి వాటికి ఎప్పుడయినా రాకపోవటానికి అనేక కారణాలుంటాయి వాటిని అర్ధం చేసుకోగల ఓర్పు వుండాలి... అని మూర్తి" యింకేదో అనబోతున్నాడు.
    వసంత అతన్ని మళ్ళీ కళ్ళతో వారించింది.
    వాళ్ళు వెళ్ళిపోయాక "అబ్బ! మీకు నోరు క్షణం వూరుకోదేమండీ వాళ్ళ అలవాట్లకొద్దీ, సంప్రదాయంకొద్దీ పిలవటానికి వచ్చారు. సరే అనేస్తేపోయే వాదనలు దేనికి?" అంది భర్తను మందలిస్తూ.
    "నే ననుకున్నది బయటకు చెప్పవద్దా"
    "కొన్ని విషయాలు బయటకు చెప్పటంవల్ల అపార్ధాలూ, అనర్ధకాలే ఎక్కువవుతాయి? ఆమాత్రం తెలియదూమీకు? పెద్ద ఎడిటర్ నని చెప్పుకుంటారు"
    "అంతేనంటావా" అన్నాడు చిలిపిగా.
    ఆమె అతని కళ్ళలోకి చూసింది.
    "వేళాకోళం చేస్తున్నారా?"
    "అంతేనంటావా?"
    "ఛీ మీతో మాట్లాడకూడదు పొండి" అని వెక్కిరించి లోపలకు వెళ్ళిపోయింది.
    
                                    * * *
    
    వయసులు పైబడుతున్నాయి.
    "అబ్బ! ఎన్ని బాధ్యతలు! ఎన్ని బరువులు అని రాఘవ ఆశ్చర్యపోతున్నాడు.
    పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళ చదువులు, పరీక్షలు, పైచదువులు, సీట్లు...
    పరీక్షలొస్తే వాళ్ళతోబాటు రాత్రంతా మెలకువగా వుండేవాడు. వాళ్ళతో టీలు త్రాగించి దగ్గరుండి చదివించేవాడు. ఎగ్జామినేషన్ హాలుదాకా వాళ్ళను తీసుకెళ్ళిదింపేవాడు. పరీక్ష పూర్తయేదాకా బయట చెట్లక్రింద తారట్లాడేవాడు. వాళ్ళు బాగా రాస్తే ఎగిరి గంతేసే వాడు. బాగా రాయకపోతే బాధతో మెలికలు తిరిగిపోయేవాడు.
    అతనితో పాటు చేరిన వాళ్ళంతా డిప్యూటీ తాశిల్దార్లయిపోయారు. అతనికింకా గుమాస్తోగానే వుండిపోయాడు.
    ఎప్పుడూ సమస్యలు, సెలవు పెట్టడం; పై అధికారి కెప్పుడూ సదభిప్రాయం వుండదు.
    అనంతమూర్తి చీఫ్ ఎడిటరయ్యాడు. వారంవారం లక్ష కాపీలమీద 'ఎడిటర్ - అనంతమూర్తి' అని అచ్చవుతోంది.
    రఘురామయ్యగారు పెద్దవారయిపోయారు. ఆరోగ్యమంతగా దిగజారిపోలేదుగాని బాధ్యతంతా అనంతమూర్తికి అప్పచెప్పి, యిష్టమున్నప్పుడు ఆఫీసుకి వస్తున్నారు, లేనప్పుడు యింట్లోనే వుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూచుకోవటానికి దిట్టమైన మేనేజరు వుండనే వున్నాడు. అనంతమూర్తికి యింట్లో ఫోను, ఆఫీసుకు వెళ్ళి రావటానికి కారు-యీ సౌకర్యాలన్నీ అమరాయి.
    ఓ రోజు మూర్తి స్నేహితుడికి కబురుచేశాడు. "సూర్యకళా,మందిర్ లో యీ సాయంత్రం గొప్ప ఫ్లూట్ కచేరీ వుంది. రవిబాబు పేరు వినేవుంటారు. చిన్న వయసు లోనే ఫ్లూట్ వాద్యంలో చాలా ప్రఖ్యాతి సంపాదించి విదేశాలు కూడా పర్యటించి వచ్చాడు. నీకు చిన్నప్పట్నుంచే వేణువంటే ఇష్టం కదా. అందుకని ప్యాసులు పంపుతున్నాను. తప్పకుండా యింట్లో అందర్నీ తీసుకురా!"
    రాఘవకు వెళ్ళాలని ఎంతో కుతూహలం కలిగింది. రవిబాబు పేరు పేపర్లలో చూస్తూనే వున్నాడు. రేడియోలో అతని వాద్యం విన్నాడు. అతని ఖ్యాతి గురించి అలకిస్తూనే వున్నాడు...లక్ష్మి ఏ కళనుందో అలవాటయిన 'నెగెటివ్ రిప్లయి' ఇవ్వకుండా రావటానికి ఒప్పుకుంది. పిల్లలు కూడా మేం వస్తామని బయల్దేరారు.
    అందరూ రోడ్డుమీద నడుస్తున్నారు.
    ఎందుకో మధ్యలో ఆమెవంక చూశాడు. లక్ష్మికి బాగా వళ్ళు వచ్చింది. చేతులు దండలదగ్గర లావుగా, గుండ్రంగా వున్నాయి. పొత్తికడుపు బాగా పెరిగి ఎత్తుగా కనబడుతోంది. వెనకభాగమూ పెరిగింది. నడుస్తుంటే ఆయాసపడుతోంది.
    "పాపం లక్ష్మిబాగా లావయిపోతోంది. డయటింగ్ చేస్తే బాగుండును. చెబితే వినదు" అని మనసులో బాధపడ్డాడు.
    వెళ్ళేసరికి హాల్లో జనమంతా చాలా వరకూ నిండిపోయి వున్నారు. ముందుసీట్లు ఖాళీలేవు. మధ్యలో ఎక్కడో కూర్చోవాల్సి వచ్చింది. అనంతమూర్తి ముందువరుసలో ఎక్కడో కూర్చుని ఉంటాడు. కనబడలేదు.
    రవిబాబు వాద్య కచేరీ మొదలయింది.
    రాఘవ ఎంతో ఆసక్తిగా అతని వంక చూస్తున్నాడు. ఇంచుమించు తన యీడే వుంటుంది. కాని ఆరోగ్యంగా, నిండుగా....గిరజాల జుట్టు, నునుపైన చెంపలు, చురుగ్గా మెరిసే పెద్ద పెద్ద కళ్ళు....ఎంతో చిన్నవాడిలా కనబడుతున్నాడు. మురళి అతని పెదవులమీదనుంచి అమృత ధారలు వర్షిస్తోంది. ఆ ధ్వని తరంగాలు, వాతావరణమంతా సమ్మోహనాస్త్రంలా వ్యాపించి, శ్రోతల్ని ముగ్ధుల్ని చేస్తూన్నాయి. జనం చలించిపోతున్నారు. ఆహా ఆహా అంటున్నారు ఆనందాతిరేకంతో కరతాళధ్వనులు చేస్తున్నారు.
    రాఘవకు తన బాల్యం గుర్తు వస్తోంది. సముద్రతీరం గుర్తు వస్తోంది. ఏవేవో సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. సీత గుర్తు వస్తోంది.
    కళ్ళు చమరుస్తున్నాయి.
    రెండున్నరగంటలు ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలీదు.
    కచేరీ ముగిసింది.
    తన్మయావస్థలొ, మధురానుభూతిలో మునిగిపోయి వున్న మనుషులకు ఏదో లోకంనుంచి యివతలకు వచ్చినట్లయింది.
    సంగీత సభను నిర్వహించిన కళాసమితి కార్యదర్శి వేదికమీదకు వచ్చి 'యిప్పుడు రవిబాబుగారికి సన్మానం జరుగుతుందనీ, సన్మాన సభకు ప్రఖ్యాత సంపాదకుడు రచయిత అనంతమూర్తిగారు అధ్యక్షత వహిస్తారనీ చెప్పి అనంత మూర్తిని వేదికపైకి ఆహ్వానించాడు.

 Previous Page Next Page