Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 14

    కాబట్టి తను డబ్బు ఖర్చు చేసిన విషయం అతడికి తెలిసే అవకాశం లేదు.    
    ఇంటికి వచ్చాక బెడ్ రూంలో అడుగుపెడుతూనే రేక్ లోని ఓ డైరీలాంటి పుస్తకాన్ని తీసింది. బోర్లా పడుకుని అరమోడ్పులుగా చూస్తూ వుండిపోయింది. నిజానికి అది డైరీ కాదు.    
    చాలా అపురూపమైన ఆలోచనల్ని మాత్రం రాసుకునే ఓ పుస్తకం...   
    తిలక్ నీ, కృష్ణశాస్త్రినీ ఎంత చదివిందో కేవలం ఆమెకి మాత్రమే తెలుసు. ఏ దేశంలో చదివినా, ఎ స్థాయిలో పెరిగినా ఆమె ఎంతటి భావుకత్వం కలదో చెప్పగలిగే ఉదాహరణ ఆమె రాసిన వాక్యాలు. రాసింది ఏకాగ్రత...   
    "నేనొక గాయపడ్డ తరంగాన్ని. స్వప్నంలా కరిగిన గతాన్ని చారికలా మార్చుకుని ఎప్పుడో విరిగి మహార్ణవంలో కలిసిన ఆడపిల్లని అయినా ఓ అంతరంగ విహంగంలా ప్రత్యక్షమయ్యాడు - పిలవని పిలుపుకీ, తలవని తలపుకీ తొలి సాక్ష్యంలా, మనో గ్రహాంతరంలో చొరబడి ఆలోచనల పొగ మంచుతో కప్పి ఉక్కిరి బిక్కిరి చేశాడు ఎవరితను....వెలుగే వద్దనుకున్న చీకటి కోనలో కాంతుల తూణీరాల్ని సంధించే ఈ మనిషి నాకు మిత్రుడా లేక ఆర్ద్ర సంగీత ఝరిలా అనిపిస్తూ సైతం హాని చేయగల శత్రువా."    
    రాస్తున్న కృషి ఆగింది అరక్షణం పాటు.    
    ఏమిటిది....అతడి గురించి ఎందుకింతలా ఆలోచిస్తూంది...    
    "ఎందుకమ్మా కాలమా - అతనెక్కడ నేనెక్కడ అనుకుంటూనే ఇక్కడున్న నేను మరెక్కడో వున్న అతడి గురించి యింతగా స్పందించే లిప్తల్ని నాకెందుకిస్తున్నావు. అతడి పరిచయాన్ని చీకటిలో కనుసైగగా భావించగల శక్తిని హరించేస్తూ వున్న చోట వుండనివ్వక వెన్నెల్ని నా కన్నుల నింపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్."    
    రాస్తూ ఆలోచిస్తూ ఆలోచనలకి అక్షర రూపం ఇస్తూ అలాగే నిద్రలోకి జారిపోయింది.    
                                       *    *    *    *    
    "రంగధాం ఇది సామాన్యురాలు కాదు".    
    తన పర్సనల్ ఛాంబర్ లో చాలా అసహనంగా పచార్లు చేస్తున్నాడు రామనాథ్ చౌదరి.    
    ఓ మూల నిలబడ్డ రంగధాం ఉదయాన్నే చౌదరి దగ్గరికి వచ్చింది ఎమ్మెల్యే రాజారావుతో కాదు....ఓ దినపత్రికతో.    
    అసలు చౌదరి ఫోన్ చేసి రమ్మంది ఒంటరిగా కాదు. ఆ రోజు దిన పత్రికతో - అప్పటికే పేపరులో పడిన ప్రెస్ కాన్ఫరెన్స్ వివరాల్ని చదివిన రంగధాంకి బోధపడి పోయింది అతడెందుకు రమ్మన్నదీ.    
    కృషి చాలా సులభంగా తమ ఎత్తుని చిత్తు చేసింది.    
    "పేపరులో న్యూస్ చదివావు కదూ"    
    "చదివేను"    
    "ఏ న్యూస్"    
    "రాజేంద్ర క్విజ్ కాంపిటీషన్ లో ఓడిపోయిన న్యూస్"    
    "కాని అది ఓటమి ఎలా అవుతుంది"    
    జవాబు చెప్పలేదు రంగధాం.    
    "అసలు పోటీయే పూర్తికానప్పుడు ఓడేస సమస్యెక్కడ"
    ఉక్రోషాన్ని తర్కంగా మార్చి అడిగాడు చౌదరి.    
    "లాభం లేదు - నా కొడుకు ఓడాడూ అని పత్రికలో పడడం నేను ఓడేనని చెప్పటం లాంటిది. మనం వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి."    
    ఇబ్బందిగా కదిలిన రంగధాం అన్నాడు "లాభం లేదనుకుంటాను"
    "ఎందుకని"    
    "క్విజ్ మాస్టరు సత్యేంద్రబసు విజేత విశ్వనాథ్ అని తేల్చి చెప్పేశాడు కాబట్టి"    
    "వాడు చెబితే సరిపోతుందా"   
    "మామూలుగా అయితే నేనూ వదిలిపెట్టే వాడ్ని కాదు. కాని లాజికల్ గా నిరూపించాడు. ... అవును సర్....మొదటి సెషన్ లో విస్సుకి వచ్చిన మార్కులు నూట తొంభై. రాజేంద్ర స్కోర్ చేసింది నూరు మాత్రమే. మిగతా సెషన్ లో రాజేంద్రకి మిగిలింది పది ప్రశ్నలు అంటే ఏభై మార్కులు. అంటే రాజేంద్ర అన్నీ కరెక్టుగా చెప్పినా మొత్తం  స్కోర్ చేయగలిగేది నూట ఏభై మార్కులేగా. ఆ మొత్తం అప్పటికే విస్సు స్కోర్ చేసిన నూట తొంభైకన్నా తక్కువేగా...అంచేత మనం ప్రోగ్రాంని మధ్యలో ఆపించినా రూలు ప్రకారం విజేత విస్సు..."    
    "నో...అలా జరగటానికి వీల్లేదు." గొంతు చించుకున్నాడు చౌదరి. "జరగనివ్వను. వెంటనే నేను ఏదో చేయాలి....ఓటమిని అంగీకరించలేను."
    ఏం చేసినా ఇక లాభం లేదని చెప్పలేక రంగధాం సందిగ్ధంలో వుండగానే ఫోన్ రింగయింది.    
    ఉద్విగ్నంగా అందుకున్నాడు చౌదరి. "యస్"    
    "నేను" వినిపించింది కృషి కంఠం.    
    "ఎందుకు" మొన్నలానే ఈ రోజు కూడ పని గట్టుకుని ఎగతాళి చేయటానికి ఫోన్ చేసిందనిపించడంతో నిభాయించుకోలేకపోయాడు. "ఎందుకే నీకేమైంది"    
    "నీకేమైందో తెలుసుకోవాలనిపించింది" వ్యంగ్యంగా జవాబు చెప్పింది కృషి. "నాకు తెలుసు చౌదరీ...పబ్లిక్ ఫిగర్సు అనుకుంటున్న వాళ్ళ దిన చర్య మొదలయ్యేది పేపరు పఠనంతోనే అని నాకు తెలుసు కాబట్టి పనిగట్టుకుని నీ మూడేమిటో తెలుసుకుందామని ఫోన్ చేశాను."   
    "నీకు మూడింది"    
    ఫకాల్న నవ్వు వినిపించింది "అర్ధమైంది"    
    "ఏమని"    
    "ఓ చిన్న ఓటమికే తట్టుకోలేక నువ్వు ఇలాంటి మరో ఓటమి ఎదురయితే గుండె ఆగి చస్తానని..."    
    "ఒసేవ్...నేను చావను....చంపుతాను"    
    "తెలుసు చౌదరీ. కాబట్టే ఓటమికి భయపడి విశ్వనాథ్ పై అఘాయిత్యం చేయించావనీ తెలుసు...కాని చూసేవా....టైం నీకు అనుకూలంగా లేదు. అందుకే కాంపిటీషన్ కి పోలీసుల్ని ఆలస్యంగా పంపావు. ఫలితం అప్పటికే నిర్ణయమైపోయింది కాబట్టి నీ ఆలోచనలకి కౌంటర్ లా నేను అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నీ కొడుకుని పరాజితుడిగా నిలబెట్టాను..."    
    క్షణం నిశ్శబ్దం.    
    "ఏమిటి చౌదరీ. నిశ్శబ్దంగా వుండిపోయావేం."    
    తోడేలులా నవ్వాడు. "నా ఓటమి గురించి కాదు కృషీ...    
    ఆడపిల్లగా నువ్వెంత ఓడే అవకాశమున్నదీ ఆలోచిస్తున్నాను."    
    "నన్ను ఓడించడానికి నీ శక్తి చాలదు చౌదరీ...గూండాలతో దళారీలతో పెంచుకునే శక్తి మేధస్సు కన్నా చాలా తక్కువ."    
    "నాకు మేధస్సు కూడా వుంది"    
    "కాని నా మేధస్సు ని జయించగలిగేటంతగా కాదు"    
    "చూస్తావా"    
    "చూడటానికి సిద్దపడే నీకు తొలిసారి ఓటమిని రుచి చూపించాను చౌదరీ... ఇంతకాలం నువ్వెలా బ్రతికినా నాకు అనవసరం. ఇక ముందు మా ఎంపైర్ కేసి కన్నెత్తి చూడకు. చూస్తే...."   
    "చెప్పు"    
    "ఇప్పుడు నీకు ప్రత్యర్ధిగా వున్నది వృద్దుడైన ఉపాధ్యాయ కాదు. ఈ సామ్రాజ్యానికి వారసురాలైన కృషి అని గుర్తుంచుకో"    
    "కృషీ..." ఓ ఆక్రోశంలా అరిచాడు చౌదరి. "నేనంటే ఏమనుకుంటున్నావ్."    
    "ఎదుటి మనిషి ఎదుగుదలని భోంచేయాలనుకునే పేర సైట్ వనుకుంటున్నాను.... ఆ పదానికి అర్ధం తెలీకపోతే నీ పక్కనున్న నీ భ్రుత్యుడు అదే నీకు ఉచిత సలహాలనిచ్చే ఆ రంగధాని అడుగు....ఓ.కే." క్షణం ఆగి అంది "చివరిగా ఒక్క మాట....నేను పోటీ ఏర్పాటు చేసింది రెండు లక్షలు నీ దగ్గర నుంచి గెలవాలని కాదు కాబట్టి ఇప్పుడు నువ్వా డబ్బు ఇచ్చినా తీసుకోను- నేను కోరింది నీ మీద గెలుపు. తొలి గెలుపు...కాబట్టి గెలిచిన నా శక్తికి జోహార్లు అంటూ నన్ను అభినందించి తలవంచు లేదూ అంటే నీ సామ్రాజ్యం పునాదులు కదిలిపోతాయ్. బై మిస్టర్ చౌదరీ... మరోసారి నేనిలా ఫోన్ చేసే అవకాశం కలిగించుకోకు. ఉంటా."   
    ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.

 Previous Page Next Page