సీత , రామచంద్రమూర్తి ఆసక్తిగా చూశాడతనివేపు.
"తొందరపడి తీసుకోకండి సార్! అదే చిట్ ఫండ్ కంపెని వాడిదో కోర్టు నోటీస్ అయ్యుంటుంది!" అరిచాడు నటరాజ్.
పోస్ట్' మెన్ నవ్వాడు.
"ఇదా బాపతు కాదులే ! వారపత్రిక ఆఫీస్ నుంచి వచ్చింది" అంటూ కవర్ రామచంద్రమూర్తి కిచ్చాడు. రామచంద్రమూర్తి ఆత్రుతగా లోపలి లెటర్ తీసి చదివాడు. చదువుతూనే ఆనందంగా గాల్లోకి చేతులు లేపి "సక్సెస్" అంటూ అరిచాడు.
సీత ఆశ్చర్యపోయింది.
"ఏమిటండీ అది.'
"అదేనే! మనం పంపిన క్రాస్ వర్డ్ ఫజిల్ ! ఒకే ఒక్క తప్పుతో గెలిచాం. అందుకని పదమూడు రూపాయల డెబ్బై పైసలకి డ్రాప్ట్ పంపిచారు.'
సీత నిరుత్సాహ పడింది.
"ఒక్క తప్పుతో గెలుస్తే కేవలం పదమూడు రూపాయలా?"
"వాళ్ళు మాత్రమేం చేస్తారు? మొత్తం పద్నాలుగు వందలమంది ఒక్క తప్పుతో నెగ్గారట, అందరికి డబ్బులు పంచి పంపుతున్నారు."
పోస్ట్ మాన్ వెళ్ళిపోయాడు.
"చూశావా! ఆ ఒక్క తప్పు కూడా నీ వల్లే పడింది. స్రీకి నగలు ఎక్కువ అందాన్నిస్తాయి అన్నావు. కానీ కరెక్ట్ వర్డ్ ఏమిటో తెలుసా? వగలట."
"అది కరెక్ట్ అంటే అర్ధం ఉమాదేవి లాంటి వాళ్ళు ఎక్కువయి పోయారన్న మాట" నవ్వుతూ అంది.
రామచంద్రమూర్తి ఆ డ్రాప్ట్ తీసుకెళ్ళి సీతకి యిచ్చాడు.
"ఇప్పుడే మంటావ్?"
"మీరు చాలా గ్రేట్ అని వప్పుకుంటున్నాలెండి."
లోపలకు బిలబిల మంటూ జనం వచ్చేశారు.
"రామచంద్రమూర్తి ..........జిందాబాద్."
మస్తాన్రావ్ చిరునవ్వుతో ముందుకొచ్చాడు.
"మన వీధిలో కుర్రాళ్ళే! మన తరపున ప్రచారం చేస్తా మంటున్నారు. అందుకని తీసుకొచ్చాను."
రామచంద్రమూర్తి పజిలయ్యాడు.
వీళ్ళంతా ఆ వీధిలో గ్యాంగే."
ఎప్పుడూ బస్ స్టాప్ దగ్గరా, ఇరానీ హోటల్ లోనూ కూర్చుని వుంటారు.
"మస్తాన్రావ్ సాబ్ చెప్పిండు సార్. నువ్ కార్పొరేటర్ గా పోటీ జేస్తున్నానని! మేమంతా నీకే ప్రచారం జేయాల్నని వచ్చినాం."
"నిజం చెప్పాలంటే నేనింకా ఖచ్చితంగా నిర్ణయించుకోలేదు" అన్నాడు.
వాళ్ళలో ఒకడు "ఇంకా నిర్ణయించుకొనేదేమున్నది సార్ నువ్ బరా బర్ పోటీ జేయాలా! నీకాన పైసలు గూడా ఎక్కువ అడగం మేము."
అతనికి అనుమానం కలిగింది.
"అంటే?"
ఎలక్షనయ్యే వరకూ మేమే సంబానించుకుంటాం సార్! మేము పదిమంది వున్నామన్నట్లు లక్ష రూపాయలిచ్చినారంటే చాలు."
"లక్ష రూపాయలు నేను మీకివ్వాలా?"
"చాల్తాక్కువ జెప్పినాం సార్! మా గురించి మీ కెరుక లేనట్లున్నది. ఒక్కక్కళ్ళం రెండు వందలు దొంగవోట్లేస్తాం. అసెంబ్లీ ఎలక్షన్ల బాల్రాజ్ గెలిచింది మా దిక్కు వల్లే గడ్సార్."
"ఒకవేళ నేను ఎలక్షన్స్ లో నిలబడ్డా నాకు మీరేవ్వరి సహాయం అవసరం లేదు. నేను కావాలనుకుంటే జనం ఒట్లేస్తారు. అక్కరలేదంటే మానేస్తారు. మీకు నాలుగు పైసలిచ్చే కాండిడేట్ ఇంకేవర్నయినా చూసుకోండి. రాంగ్ నెంబర్ దగ్గర కొచ్చారు."
అతను చిరాగ్గా మస్తాన్రావ్ వేపు చూశాడు.
"ఏమన్నా! ఇట్ల జేస్తివి! రామచంద్రమూర్తి మంచోడు. వాని తరపున పనిచేయ మంటివన్నా."
"థూ! నీయవ్వ పొద్దుటే యిసాంటి గిరాక్ తగిలింది భయ్" అనుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు.
సీత తల్చుకుని తల్చుకుని మరీ నవ్వుతోంది ఓ మూల నిలబడి.
"తిక్క కుదిరిందా! లేకపోతే ఎలక్షన్స్ లో నిలబడతారంట.ఈయనకి ఆ పిచ్చోడు ఎడ్వయిజరంట.
"ఎవర్ని పిచ్చాడంటున్నావ్?" అనుమానంగా అడిగాడు మస్తాన్రావ్.
"మిమ్మల్ని కాదులెండి.........నటరాజ్ ని."
నటరాజ్ కి కూడా కోపం వచ్చింది, కానీ ఏమి అనలేక వూరుకుండిపోయాడు.
ఆ మర్నాడే మస్తాన్రావ్, నటరాజ్, ఉమాదేవి కలిసి రామచంద్రమూర్తితో నామినేషన్ వేయించారు. అందుకవసరమయిన ఖర్చంతా మస్తాన్రావే భరించాడు.