Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 14


    నటరాజ్ తమకి తెలీకుండానే తామిద్దరికీ ఆప్తుడయిపోయాడు. తను కుటుంబ సభ్యుడయిపోయాడు. సరితను కోల్పోయిన దుఃఖంలో, జీవితమే హటాత్తుగా అంధకారం అయిపోయిన సమయంలో అతను వంటమనిషి ఉద్యోగం కోసం తను ఇంటి కొచ్చాడు. తన స్నేహితుడు సారధి పంపించాడతన్ని. అతనితో మాట్లాడిన కొద్ది సేపట్లోనే అతను తమతో పాటే వుంటే తామున్న మానసిక సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చన్న ఆలోచన కలిగింది. అతనికున్న రికార్డ్ డాన్స్ ట్రూప్ బాక్ గ్రౌండ్, సరదాగా, మాట్లాడే తీరు తమను రోజూ రోజుకి అల్లుకుపోతున్న సరిత స్మృతుల్నుంచి మళ్ళించగలడన్నా ఆశ.
    తన ఆశ వమ్ము కాలేదు.
    అతను యింట్లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే తామిద్దరూ ఆ షాక్ నుంచి చాలావరకూ కోలుకోగలిగారు. ఎన్నో రకాలుగా కరువయిపోయిన నవ్వు మళ్ళీ పెదాల మీద కొచ్చింది. దుమ్ము పేరుకుపోయిన గ్రామ ఫోన్ రికార్డులో మళ్ళీ పాటలు వినిపించసాగినాయి.
    ఒకవేళ ఎప్పుడయినా సరిత స్మృతులతో మనసు పాడయిపోతే వెంటనే ఆ విషయం గ్రహించి పాత తెలుగు సినిమాల్లోని రికార్డ్ డాన్స్ లు వేస్తూ తామిద్దరినీ మళ్ళీ నవ్వుల లోకంలోకి లాక్కెళ్ళీవాడు.
    అతను తమ యింటికి ఆ సమయంలో రాకపోతే తామిద్దరి గతి ఏమయ్యేదో ఉహించుకోవడానికి కూడా భయమే.
    ముఖ్యంగా సీత!
    ఆమెకు మతిస్థిమితం పోతుందేమో అనే భయం కూడా కలిగింది తనకు. ఆ విధంగా ఇద్దరూ అతని కెంతో ఋణపడి వున్నారు..
    అతను నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే జీవితం మళ్ళీ నిస్సార మయిపోతుంది.
    నటరాజ్ అతని వేపు చూశాడు.
    "కోపంలో ఏదో అన్నంతమాత్రాన నిజంగానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా?' దీనంగా అడిగాడు.
    నటరాజ్ ని ఆ ప్రశ్న కదిలించి వేసింది. గిల్టిగా చూసి తల దించుకున్నాడు.
    అతని కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. అంతలోనే గలగల నవ్వేశాడు.
    "భలేవారే సార్ మీరు. సీతమ్మ డబాయిస్తోంటే నేనూ బెదిరించాను అంతే! నేనెక్కడికి వెళతాను సార్! మీరు మెడపెట్టి బయటకు గెంటినా చురూ పట్టుకుని వేలాడే రకాన్ని. ఓసారి మా మామగారు నా రికార్డ్ డాన్స్ లు మీద కోపమొచ్చి ఇంటి నుంచి బయటకు గెంటాడు. నేనేం వెళ్ళిపోయాననుకున్నారా? వీధి దీపం పక్కనే కూర్చున్నాను చలికి వణుకుతూ. అంతా నిద్రపోయాక రాత్రి రెండింటికి మా ఆవిడ పెరటి తలుపు తెరచి లోపలకు తీసుకెళ్ళింది. అది బ్రతికుంటే నేనిలా ఎవరి పంచనో పడుండే ఖర్మ వుండేది కద్సార్" అంటూ తన సామాను తీసుకెళ్ళి లోపల గదిలో పెట్టాడు మళ్ళీ. తను తిన్నగా కిచెన్ లో కెళ్ళి వంటపని ప్రారంభించాడు.
    "సీతమ్మగారూ! ఉప్మా ఈసారి జాగ్రత్తగా చేస్తాను. పది నిముషాలు ఓపిక పట్టండి! అంతే!" సీత హృదయం తేలిక పడింది.
    అతనిని అంతేసి మాటలన్నందుకు పశ్చాత్తాపం కలిగింది.
    "అది సరే గాని సీతా! పొద్దున్నుంచీ తేలి చావటం లేదు. స్త్రీ లకు యిది చాలా ఇష్టం. మాట్లాడటం, పోట్లాడటం. ఏది కరెక్టో చెప్పు చూద్దాం" అడిగాడు రామచంద్రమూర్తి.
    "పత్రికలవాళ్ళూ , సినిమాల వాళ్ళే అనుకుంటే ఈ క్రాస్ వర్డ్ ఫజిల్స్ వాళ్ళ క్కూడా ఆడది అలుసయిపోయిందన్నమాట. నేను దీనికి సమాధానం చెప్పను."
    "నన్ను చెప్పమంటారా సార్?" సంశయిస్తూనే వంటింట్లో నుంచి అడిగాడు నటరాజ్.
    "చెప్పు"
    "సీతమ్మ గారు లేనప్పుడు చెప్తాల్లెండి.'
    సీత నవ్వింది.
    నువ్వేం చెప్తావో నాకు తెలుసులే! నేను అస్తమానం అందరితో పేచి పడుతుంటాను కాబట్టి పోట్లాడటమే కరెక్ట్ అంటావ్."
    "అవునండీ! ఎప్పుడూ నిజం మాట్లాడటం నా వీక్ నెస్."
    అతను ఉప్మా తీసుకొచ్చి ఇద్దరికీ ప్లేట్లలో యిచ్చాడు.
    'ఆహా! నిజంగా నీ చేయి గోల్డెన్ చేయి నటరాజ్!"
    "మామూలు గోల్డ్ కూడా కాదండీ! స్మగుల్ద్ గోల్డ్."
    నవ్వుతూ 'పోట్లాడటం' దగ్గర టిక్ చేశాడు రామచంద్రమూర్తి.
    "ఎందుకొచ్చిన ఫజిల్స్ అవి! ఏ నాడయిన ఒక్క పైసా సంపాదించారా దానిమీద?" టీజింగ్ గా అడిగింది సీత.
    "రాన్రాను తప్పులు తగ్గిపోతున్నాయ్యే! ఈ లెక్కన అల్ కరెక్ట్ కొట్టడం ఎంతో దూరం లేదు.'
    అంటుండగానే పోస్ట్ మెన్ వచ్చాడు హడావుడిగా.
    "నమస్కారం సార్! మీకు రిజిస్టర్ లెటర్ వచ్చింది. నిన్న సాయింత్రమే వచ్చింది గానీ నేను సెలవు తీసుకోవటం వాళ్ళ డెలివరీ యివ్వలేదు."

 Previous Page Next Page