"నా పెన్షన్ రాగానే ఆ డబ్బంతా యిచ్చేస్తాను" అన్నాడు రామచంద్రమూర్తి.
"ఏమీ అక్కర్లేదు . నువ్ గెలుస్తే నాకీ కమీషన్ల గొడవ తగ్గిపోతుంది కదా! అదే చాలు."
అందరూ ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం కనిపించింది.
శాంతి పరుగుతో వచ్చి తాళం చెవి యిచ్చింది.
"అంటీ ఆ చివరింట్లో పేరంటాని కెళ్ళిందంకుల్."
"ఇంకా నయం వద్దంటే నామినేషన్ వేశానని ఇల్లు వదిలి వెళ్ళి పోయిందేమో అనుకున్నాను" అన్నాడు మస్తాన్రావ్.నటరాజ్ మళ్ళి బ్రాకెట్ చార్ట్ ముందు పెట్టుకున్నాడు.
రామచంద్రమూర్తి గ్రామ ఫోన్ పెట్టాడు. "అందమే అనందం' పాట అతనికి ఎక్కడలేని ఆనందాన్నీ యిస్తోంది. ఎన్నిసార్లు విన్నా విసుగుపుట్టకపోవటం, తీయదనం తగ్గకపోవటం- ఆ పాటకేలా సాధ్యమైందో అతనికర్ధం కావటం లేదు. ఆ రికార్డ్ చాలా వరకు అరిగిపోయినా కూడా ఆ పాట తనకు వినడానికి బాగానే వుంటుంది.
పాట మధ్యలో కొచ్చేసరికి హటాత్తుగా ఆగిపోయింది.
చప్పున లేచి చూశాడు నటరాజ్.
"అనుకున్నంతా అయ్యింది సార్! ఆ రికార్డ్ చనిపోయింది! అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిందే!" ఆ రికార్డ్ తీసుకొచ్చి రామచంద్రమూర్తి కిచ్చాడతను.
రామచంద్రమూర్తి పగులిచ్చిన ఆ రికార్డ్ చూసేసరికి ఎందుకో అప్రయత్నంగా కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయి. ఎన్నేళ్ళ అనుబంధం తనకూ ఆ రికార్డ్ కీ.
ఇవాల్టితో ఆ అనుబంధం తీరిపోయినట్లే.
అంతలోనే ఎక్కడలేని దిగులూ, భయం కలిగినాయి.
ఈ పాట వినకుండా ఇక ముందు ఎలా రోజులు గడపటం?
ఎలాంటి విపత్తు వచ్చినా ఈ పాటలో తనకు మనశ్శాంతి లభించేది.
సరిత ప్రాణాలు తన కళ్ళేదురుగానే పోయినప్పుడూ, తనను ఆఫీసులో అన్యాయంగా సస్పెండ్ చేసినప్పుడూ, తనమీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడూ........
సీత లోపలికోస్తూనే విరిగిన ఆ రికార్డ్ ని చూసి కలవరపడింది.
"పగిలిపోయిందా?" ఆతృతగా అడిగింది.
"అవును!"
"అయ్యే" ఆ రికార్డ్ ని తన చేతుల్లోకి తీసుకుంది.
రామచంద్రమూర్తి ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. చూడకపోయినా అతనికి తెలుసు.
ఆమె హృదయం ఎంత వేదన అనుభవిస్తోందో.
"ఇంకోటి కొనుక్కుందాంలెండి!" ఊరడింపుగా అంది.
తామున్న పరిస్థితుల్లో అది అసాధ్యమని ఇద్దరికీ తెలుసు.
"అవును! కొనాలి!" తనూ అన్నాడు.
ఆ రోజంతా అతనికి అశాంతిగానే వుంది.
ఇంట్లో ఎవరో చనిపోయినంత ఫీలింగ్.
ఇన్ని రోజులు సీత కళ్ళజోడూ ఒక్కటే తనకు ప్రధాన సమస్యగా వుండేది. ఆ కళ్ళజోడుంటే ఆమె ఇంటిలో వున్న పాత నవలలూ, బయట అద్దెకు తెచ్చుకునే మాగజైన్లు చదువుకుంటూ అశాంతి కలిగించే ఆలోచనల నుంచి తప్పించుకునేది.
ఎలగయినా ఆమెకు ఆ కళ్ళజోడు కొనాలన్న తన ఆశ నెరవేరలేదు.......ఇప్పుడు ఈ రికార్డ్ తో సమస్య వచ్చిపడింది.
ఏదేమైనా సరే ఆ మర్నాడు తమ పెళ్ళి రోజు కాబట్టి ఆమెకు కొత్త కళ్ళజోడు బహుమతిగా యివ్వాలి, ఎలా?
ఎంత ఆలోచించినా ఎటూ తోచటం లేదు.
మధ్యాహ్నం సీత గది గడపలో కూర్చుని డైరీ రాసుకోడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తనేం రాస్తుందో కనిపించకపోయినా నానా తంటాలు పడీ డైరీ రాయిందే మాత్రం ఉండలేదు.
హటాత్తుగా ఓ ఆలోచన వచ్చింది రామచంద్రమూర్తికి.
ఎలాగూ తనకు ప్రాణప్రదమైన గ్రామఫోన్ రికార్డ్ విరిగిపోయింది. ఇప్పటిలో అది కొనటం సాధ్యమయ్యే పనికాదు. కనుక ఎంతకొంతకు ఆ గ్రామ ఫోను అమ్మిపారేస్తే?
సీత వంటింటిలో బిజీగా ఉన్నప్పుడు నటరాజ్ ని పిలిచి ఆ గ్రామ ఫోన్ ని రహస్యంగా బయటకు తీసుకుపదమని చెప్పాడు. అతను బయటకు వెళ్ళగానే తనూ అతనిని వెంబడించి గ్రామఫోన్లు రిపేర్ చేసే షాప్ దగ్గరకు చేరుకున్నారు. చాలాసార్లు అతని దగ్గరే దానిని రిపేర్ చేయించాడు.
"ఏమిటి సార్! మళ్ళీ ఖరాబయిందా?" అడిగాడతను.
"ఖరబవలేదు కానీ అర్జెంటుగా డబ్బవసరమైంది. నువ్వు ఎంతో కొంతకు కొనేసుకుని ఎవరికయినా అమ్ముకోగాలవా?' అడిగాడు రామచంద్రమూర్తి.