డాక్టరులో ఆ మాటలు సంచలనం కలిగించినాయ్. వెంటనే లేచి ఆమెను స్క్రీన్ పక్కకు పిలిచి పరేక్షించి ఆపరేషన్ థియేటర్ కు పంపించాడు అర్జంటుగా.
భవానీశంకర్ థియేటర్ బయట కూర్చున్నాడు. అతని మనసంతా తన ఆర్ధిక పరిస్థితి మీదకు మళ్ళిందిప్పుడు.
"కేవలం పదిరూపాయల బాలెన్స్ ఉందింకా! దాంతో మహా అయితే ఇంకొక్కరోజు గడుస్తుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. ఆపరేషన్ అయ్యాక ఆమె తిరిగి ఇంటికి రావటానికి రెండు రోజులు పడుతుంది. అంతవరకూ ఆమె పిల్లల్ని కూడా తనే పోషించాలి. ఆమె భర్త తాగుబోతు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళతాడో వాడికే తెలీదు.
డాక్టరు బయటికొచ్చాడు. వెనుకే స్ట్రెచర్ మీద పేషెంట్ ! ఇంకా మత్తులోనే ఉందామె.
"ఒరే! కిట్టూ! ఈ అయిదు రూపాయలు నీ దగ్గరుంచుకుని ఆమె బెడ్ పక్కనే కూర్చో! నేను తర్వాత మళ్ళీ వస్తాను ఓ.కే.!"
"ఓ.కె." అన్నాడు కిట్టూ.
భవానీశంకర్ మళ్ళీ తన రూమ్ కి చేరుకున్నాడు.
రూమ్ బయటే నిలబడి ఉన్నడొకడు. ఫుల్ సూట్ లో వున్న అతడిని చూసేసరికి భవానీశంకర్ కి ఎక్కడలేని అనందం కలిగింది.
తప్పకుండా అతనేదో పత్రికకు ఎడిటర్ గానీ, యజమాని గానీ అయుంటాడు. బహుశా తన ఫోటోగ్రఫీ ప్రావీణ్యత గురించి విని తనను వాళ్ళ పత్రికలో ప్రెస్ ఫోటో గ్రాఫర్ గా ఉద్యోగం చేయమని అడగటానికి వచ్చి వుంటాడు.
తలుపు తాళం తీస్తుంటే రాజేశ్వరీ వచ్చింది.
"అంకుల్ - ఆయనెవరో మీ కోసం వచ్చారంకుల్"
భవానీ శంకర్ అతనివేపు చూశాడు.
"మీరు భవానీ శంకర్ కదూ?" అడిగాడతను.
"యస్ కామ్రేడ్! కమిన్ - కమిన్ " అతనిని లోపలకు ఆహ్వానించాడతను.
అతను గదిలో కొచ్చాడు.
భవానీశంకర్ ఫోల్డింగ్ చైర్ తీసి అతని కోసం వేశాడు.
"నా పేరు భూషణ్! "పురానా పూల్" దగ్గర మా అఫీసుంది. ఈ మధ్యే అత్యంత ఆధునికంగా ఓ స్టూడియో తెరిచాము. మొత్తం ఎక్విప్ మెంట్ అంతా డైరెక్టుగా జపాను నుంచి తెప్పించాము. ఇన్ స్టెంట్ ఫొటోస్ కంప్యుటరైజ్ద్ ప్రింటింగ్, త్రీ డైమెన్షన్ ఎఫెక్ట్ - ఇలా ఇండియాలో ఎవరూ చేయలేని పని మేము చేస్తున్నాము. మీరు మాకు సహాయం చేయాలి!
"చెప్పండి కామ్రేడ్ - ఏం కావాలి!"
4
"మా స్టుడియోలో అందమయిన అమ్మాయిల లైఫ్ సైజ్ ఫోటోలు కొన్ని కట్ అవుట్స్ గ ఏర్పాటు చేయదల్చుకున్నాం! చాలా మంది ఫోటో గ్రాఫర్స్ ని కాంటాక్ట్ చేశాం గానీ వాళ్ళు చూపిన మెడల్ ఫోటోలు మాకే మాత్రం సంతృప్తి కలిగించలేదు. అందుకని నగరమంతా తిరిగి మేమే కొంతమంది అందమైన అమ్మాయిలను సెలక్టు చేసుకున్నాం" ఈ ప్రాంతంలో కనిపించిన ఓ అమ్మాయి ఫోటో మా కందజేసే బాధ్యత మీ కిస్తున్నాం. ఇందుగ్గాను మీకు రెండువేల రూపాయలు ఇస్తాం!"
భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు.
"ఒక్క ఫోటోకి రెండు వేల రూపాయలా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"యస్ - మాది చాలా ప్రెస్టేజియస్ షాపు అని ముందే మీకు చెప్పాను. మాకు క్వాలిటీ కావాలి! మీరు బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేసినట్లు కూడా చెప్పారు ."
భవానీ శంకర్ కళ్ళల్లో గర్వం తొణికిసిసలాడింది.
"ఓ.కే. కామ్రేడ్! నో ప్రాబ్లం! రేపు ఉదయానికల్లా ఫోటో తెచ్చిస్తాను! కాకపోతే మీరు సెలక్టు చేసుకున్న అమ్మాయ్ తనను ఫోటో తీసేందుకు ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నాను."
"మీకు రెండు వేల రూపాయలు ఇస్తోంది అందుకే మిస్టర్ భవానీ శంకర్? ఒకవేళ ఆ అమ్మాయి డబ్బెమయినా అడిగేట్లయితే అది కూడా మేమే ఇస్తాము. డబ్బుకి లొంగని రకమైతే అప్పుడు మీ పత్రికా ఫోటోగ్రాపర్ అనుభవాన్ని ఉపయోగించాలి! ఆమెకు తెలీకుండా రహస్యంగా ఆమె ఫోటో తీసేయాలి. మీరు ఆంధ్రదేశం పత్రికలో ప్రెస్ ఫోటో గ్రాఫర్ గా పనిచేసేటప్పుడు చాలా రిస్క్ తీసుకుని కొన్ని విలువయిన ఫోటోలు రహస్యంగా తీసి, మీ పత్రికలో ప్రచురించి కొంతమంది ఘరానా పెద్ద మనుషులను బజారుపాలు చేసిన విషయం కూడా మాకు తెలిసింది-----"
భవానీ శంకర్ లో ఆ దినపత్రికలో పని చేస్తున్నప్పటి ఉత్సాహం మళ్ళీ పొంగి పొరలింది.
"ఓ.కే. కామ్రేడ్! డన్!" అన్నాడు ఉత్తేజంతో.
అతను తన జేబులోంచి ఓ నోట్ల కట్ట తీసి అందులో నుండి వెయ్యి రూపాయలు లెక్కపెట్టి భవానీశంకర్ కిచ్చాడు.
"ఇది అడ్వాన్స్! రేపు ఆ అమ్మాయి నెగటివ్ లు తెచ్చిస్తే మిగతా డబ్బు అక్కడే ఇచ్చేస్తాము -"
భవానీశంకర్ తన చేతిలోని డబ్బువేపు చూసుకున్నాడు. ఈమధ్య కాలంలో ఇంతడబ్బు ఒకేసారి ఎప్పుడూ సంపాదించలేదు.
సూట్ వాలా తన చేతిలో వున్న బాగ్ లోనుంచి ఓ అందమైన కెమెరా బయటకు తీశాడు.