Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 14


    "మొగాళ్ళకి అనేక పన్లుంటాయి. మనకర్ధంకాని ఎన్నో సమస్యలవల్ల వాళ్ళు టైం మెయిన్ టెయిన్ చెయ్యలేకపోతూ వుంటారు."
    
    "అలా అని మనం వూరుకోకూడదు. ఎప్పటికప్పుడు నిలదీసి అడుగుతూ వుండాలి. వాళ్ళని కంట్రోల్ లో పెడుతూ వుండాలి. లేకపోతే మనల్ని ఒక ఆట ఆడించేస్తారు."    

    చిన్మయి మాట్లాడలేదు.
    
    "అసలు ఈ మొగాళ్ళు చెప్పేవాటిలో నూటికి తొంభయి అబద్దాలేనను కోండి! ఈ మొగాళ్ళంతా ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని పరాయి ఆడదానితో కులకటం లేదంటే నేన్నమ్మను."
    
    చిన్మయి ఈ కంకర్రాళ్ళ మోత భరించలేకపోతోంది.
    
    "కులికితే కులికారు. ఇతఃరుల సంగతి మీకెందుకూ?" అనాలనుకుంది. మొహమాటం అడ్డొచ్చి ఊరుకుంది.
    
    "మనం లొంగినట్లు కనబడితే మరీ రెచ్చిపోతారు యీ మొగాళ్ళు అందుకని ప్రతిక్షణం అనుమానంగా చూస్తూ ప్రతిఘటిస్తూ వుండాలి."
    
    ప్రతిఘటన! ఒళ్ళు గగుర్పొడిచింది!
    
    కాసేపటివరకూ గడగడా మాట్లాడి ఆనంద వెళ్లిపోయింది. అప్పటికి ఊపిరాడినట్లయింది.
    
    మరో అరగంట పోయాకగాని రాజీవ్ ఇంటికి రాలేదు. అతను స్కూటర్ దిగి లోపలకి అడుగుపెడుతూనే చిన్మయి అతనికెదురుగా వెళ్ళింది.
    
    "ఇప్పటిదాకా ఎవతెతో కులికి ఇంటికి వస్తున్నారు?" సరాసరి గుండెల్లో దిగబడేటట్లు అడిగింది.
    
    అతను ఉలికిపడి ఆమెకళ్ళలోకి చూశాడు. "ఆఫీసులో డివిజనల్ మేనేజర్ వచ్చి అవీ యివీ డిస్కస్ చేస్తోంటే ఆలస్యమైపోయింది" అన్నాడు కొంచెం తడబడుతూ.
    
    "ఎందుకండీ పచ్చి అబద్దాలాడతారు? మీ మాటలు నమ్ముతానను కున్నారా? ఇప్పటిదాకా ఏ వగలాడితో కులికి..."
    
    "నిజం చిన్మయీ! ఒట్టు" అంటూ నెత్తిమీద చెయ్యి పెట్టుకోబోతున్నాడు.
    
    చిన్మయి కిలకిల నవ్వేసి ఆ చేతిని పట్టుకుని ప్రక్కకి లాగేసింది.
    
    "ఎందుకండీ అలా కంగారుపడతారు? ఆ ఆనందలేదూ? మొగాళ్ళని..... ఊహు కాదు మొగుళ్ళని ఇలా అడగాలని ఇంతవరకూ నూరిపోసి వెళ్ళింది. మీరు నాకు సంజాయిషీ చెప్పాలండీ" అంది.
    
    ఆ క్షణంలో ఆమె ఎంతో ముగ్ధమోహనంగా కనిపించింది. అతని చెయ్యింకా ఆమెచేతిలోనే వుంది. అటూ యిటూ చూసి రెండోచేతిని ఆమె భుజంమీద వేసి దగ్గరకు లాక్కుని పెదవులమీద ముద్దుపెట్టుకున్నాడు.
    
    కాని ఆమెతో అబద్దం చెప్పానన్న బాధ అతని మనసులో తొలుస్తూనే వుంది.
    
                                                                   * * *
    
    ఆ రాత్రి...
    
    ఇద్దరూ నిద్రపట్టక బాధపడుతున్నారు.
    
    ఎంత నిర్మలంగా వుందామన్నా ఏదో అశాంతి ఎక్కడ్నుంచి పొటమరిస్తోందది? ఓ దుష్టశక్తిలా, మహమ్మారిలా, భయంకరమైన వ్యాధులు కలిగించే వైరస్ లా ఎక్కడ్నించి వ్యాపిస్తోందది?
    
    "ఏమండీ?" అంది.
    
    "ఊఁ"
    
    "నిద్రపట్టటంలేదా?"
    
    "లేదు."
    
    "ఏం?"
    
    "తెలీదు."
    
    రెండు నిముషాలు మూగబాధలాంటి నిశ్శబ్దంలో గడిచాయి.
    
    "ఏమండీ!" అంది మళ్ళీ.
    
    "ఊఁ"
    
    "ఈ లొకాలిటీ నాకు నచ్చలేదండీ ఇక్కడ్నింఛి వేరేచోటికి మారిపోదాం"
    
    "చిన్మయా! ఆ వేరేచోటు ఇంతకన్నా చికాకు పెట్టేదిగా వుండవచ్చుగా?"
    
    "అయినా ప్రయత్నించి చూస్తే తప్పులేదుగా?"
    
    "తప్పులేదు చిన్మయీ! ప్రస్తుతం వున్న జీవన విధానాన్ని బట్టి నా దృష్టిలో మంచి చోటెక్కడా వుండదు. మంచి అనే పదానికి అర్ధం, నిర్వచనం లేకుండా పోయాయి. చెయ్యవలసిందల్లా పరిస్థితిని ఎదుర్కొని నిలద్రొక్కుకోవటమే."
    
    "నిలద్రొక్కుకోలేకపోతే?"
    
    "అది పిరికివాళ్ళు చేసేపని. మనోధైర్యం, నిగ్రహం యీ రెండూ వుంటే చుట్టూ వుండే వాతావరణం బాధ కలిగిస్తే కలిగించవచ్చుగానీ మనిషి పడిపోవటం జరుగదు."
    
    "ఏమైనా... ఈ లొకాలిటీలో వుండటం నాకిష్టంలేదు" అంది చిన్మయి కొంచెం ఆలోచించి.
    
    "నీ యిష్టం వేరే ఇల్లు వెదుకుతాను" అన్నాడు రాజీవ్ ఆమె తలమీద చెయ్యివేసి నిమురుతూ.
    
                                            2
    
    ఉదయం రాజీవ్ నిద్ర లేచేసరికి కిచెన్ లోంచి ఓ మృదు మధుర గానం వినిపిస్తోంది!
    
    లావణ్య రామ కన్నులార చూడవే అతి
    శ్రీ వనితా చిత్రకుముది! సీతకరశతా సన్యజా
    తామన మత దైవమేల త్యాగరాజ సుత దివ్య
    అది చిన్మయి గొంతే!
    
    ఏమిటి? చిన్మయి యింత అద్భుతంగా పాడుతుందా? తన ముందెప్పుడూ పాడలేదే? ఆమెగొంతులో శ్రావ్యత, గుండెల్లోకి దూసుకువెళ్ళే తియ్యదనంతో బాటు వీణ, సితార యింకేదో వాద్యాల నాదాలు కలిసివున్న భ్రాంతిని కలగజేస్తూ గొప్ప అనుభూతి నిస్తున్నాయి.
    
    రాజీవ్ లేచి నిలబడి వంటింటి గుమ్మం దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.
    
    ఆమె అతన్ని గమనించలేదు. స్టవ్ దగ్గర నిలబడి పనిచేసుకొంటూ తన్మయంగా అలాగే పాడుకుంటోంది.

 Previous Page Next Page